Pulihora
-
మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులుసిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
మన పులిహోర.. చద్దన్నం అదుర్స్
సాక్షి, అమరావతి: రాత్రి మిగిలిన అన్నంలో గంజిపోసి పులియబెట్టి పొద్దున్నే పచి్చమిరపకాయ లేదా ఉల్లిపాయ నంజుకుంటూ పొలం గట్లపై రైతులు, కూలీలు తినే చద్దన్నం ఇప్పుడు అంతర్జాతీయ డిష్ అయింది. ‘రాత్రి మిగిలిపోయిన ఈ అన్నం ఎవరు తింటారు?..’ అంటూ ఈ కాలం యువత తక్కువచేసి చూసే చద్దన్నాన్ని ఇప్పుడు స్టార్ హోటళ్లలో పంటాబాత్ పేరుతో స్పెషల్‌గా చేయించుకుని లొట్టలేస్తూ మరీ తింటున్నారు.అంతేనా మనం ఇంట్లో ఇష్టంగా చేసుకునే పులిహోర కూడా అంతర్జాతీయ ఫేవరెట్ వంటకంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల్లో ప్రజలు ఇష్టంగా తినే వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, ఏయే ప్రాంతాల్లో వాటిని ఇష్టపడుతున్నారు, వాటికి ఇచి్చన రేటింగ్ వంటి అంశాలను ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇటీవల టేస్ట్ అట్లాస్ ప్రకటించిన 83 శాకాహార వంటకాల్లో తొలిసారి ఆంధ్రా స్పెషల్ పులిహోర, పప్పుచారు, మిరపకాయ బజ్జీలు చోటు దక్కించుకున్నాయి.4 స్టార్ రేటింగ్‌తో పులిహోర పండగలు, ప్రత్యేక పర్వదినాల్లోను, అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లోను తప్పనిసరిగా చేసే పులిహోర టేస్ట్ అట్లాస్ రేటింగ్ 19వ స్థానంలో నిలిచింది. హిందూ ప్రపంచంలో ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ఏపీకి చెందిన ప్రత్యేక వంటకమని, అయితే.. తమిళనాడులో దీనిని పులిసాదం అని, కర్ణాటకలో పులియోగారే అని పిలుస్తారని నివేదిక పేర్కొంది. అత్యధికమంది ఆహారప్రియులు ఆంధ్రప్రదేశ్‌లో చేసే చింతపండు పులిహోరనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు రేటింగ్ ఇచ్చారు. మన రాష్ట్రం నుంచి మిరపకాయ బజ్జీ 40వ స్థానంలోను, పప్పుచారు 50వ స్థానంలోను నిలిచాయి. ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే ఆరోగ్యకరమైన వంటకంగా పప్పుచారును పేర్కొంది. టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ఈ ర్యాంకింగ్స్ వివిధ ప్రాంతాల ఆహార ప్రియుల నుంచి తీసుకున్నట్లు పేర్కొంది. టాప్ 83 భారతీయ శాఖాహార వంటకాల జాబితా కోసం ఈ నెల మే 15వ తేదీ వరకు 2,251 మంది ఇచి్చన రేటింగ్స్ ఆధారంగా ఈ జాబితాను ప్రకటించినట్టు తెలిపింది. మన గ్రామాల్లో ఇప్పటికీ రైతులు, కూలీల అల్పాహారంగా ఉన్న చద్దన్నం బంగ్లాదేశ్ సంప్రదాయ వంటకంగా గుర్తింపు పొందింది.టాప్ రేటింగ్‌తో పప్పు కూర ఎక్కువమంది ప్రజలు ఇష్టపడే వంటకాల జాబితాలో చేరింది. అంతర్జాతీయ ఫుడ్గైడ్గా గుర్తింపుపొందిన టేస్ట్ అట్లాస్ ఇప్పటివరకు 10 వేలకుపైగా వంటకాలను, 9 వేల రెస్టారెంట్లను తన అంతర్జాతీయ జాబితాలో చేర్చింది. ఇప్పుడు మన ఆంధ్రా స్పెషల్స్‌కు చోటుదక్కడం, అందులోను అందరూ ఇష్టపడే పులిహోర, పప్పుచారు, మిరపకాయ బజ్జీ, చద్దన్నం ఉండడం విశేషం. ఏపీ, ఈశాన్య భారత్, బంగ్లాదేశ్‌లలో చద్దన్నం స్పెషల్ ఈ జాబితాలో 36వ స్థానంలో ఉన్న చద్దన్నం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో తరాలుగా సంప్రదాయ అల్పాహారంగా ఉంది. ఇంట్లో టిఫిన్స్ ఉన్నా చద్దన్నం తినేవారు కోట్లలో ఉన్నారు. అయితే.. ఈశాన్య భారతదేశంతో పాటు మన పక్కనున్న బంగ్లాదేశ్‌లో చద్దన్నం వారి దేశ సంప్రదాయ అల్పాహారంగా ఉంది. ప్రోబ్యాక్టీరియా (ఆరోగ్యానికి మేలుచేసే బ్యాక్టీరియా), కొద్దిగా పర్మెంటేషన్తో ఎంతో రుచిగా ఉండే ఈ చద్దన్నాన్ని భారత్, బంగ్లాతో పాటు పలు దేశాల్లో ఇప్పుడు ఈ ఫుడ్‌ను ఎంతో ఇష్టపడుతున్నారని, ఇష్టంగా తింటున్నారని టేస్ట్ అట్లాస్ నివేదిక పేర్కొంది.బెంగాల్లో ‘పంటాబాత్’గా పేరున్న చద్దన్నం బెంగాలీ నూతన సంవత్సరం వేడుకలు, పహేలా బైషాఖీ పండుగ వంటి ప్రత్యేక సందర్భాల్లో చద్దన్నం ఉండాల్సిందేనని పలువురు ఈశాన్య, బంగ్లా, బెంగాలీ ప్రజలు పేర్కొనడం గమనార్హం. ఈ వంటకం సాధారణంగా తాజా పచ్చి మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలతో ఏపీ ప్రజలు తింటే.. వేయించిన చేపలతో బంగ్లా ప్రజలు తినడం ప్రత్యేకతగా పేర్కొంది. తొలిస్థానంలో నిలిచిన దాల్ తడ్కా టేస్ట్ అట్లాస్ ప్రకటించిన శాకాహార వంటకాల్లో ఉత్తర భారతదేశానికి చెందిన దాల్ తడ్కా తొలిస్థానంలో నిలిచింది. దక్షిణాదిన పప్పు కూరగా పిలిచే ఈ వంటకం ఉత్తర భారతదేశంలో దాల్ తడ్కాగా మారింది. ఆంధ్రాలో పప్పు కూరను పెసలు, బొబ్బర్లు, కంది, శనగ వంటి పలురకాల పప్పు దినుసులతో వండితే.. దాల్ తడ్కా మాత్రం కందిపప్పు, మసాలాతో చేస్తారు. రోటీ లేదా జీరా రైస్‌తో కలిపి ఎంతో ఇష్టంగా తింటారని చెబుతూనే ఈ వంటకానికి 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.దీనితర్వాత రెండో స్థానంలో పంజాబీ వంటకం షాహీ పన్నీర్, మూడోస్థానంలో మహారాష్ట్ర వంటకం మిసల్ (పలురకాల కూరగాయలతో కలిపి చేసేది), నాలుగోస్థానంలో మిసల్ పావ్ నిలిస్తే, ఐదోస్థానంలో 4.3 స్టార్ రేటింగ్‌తో ఆంధ్రా స్పెషల్ పెపరపప్పు కూర చోటు దక్కించుకుంది. మాంసాహార రుచుల కంటే భారతదేశపు సంప్రదాయ శాకాహార వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారని, 7, 5 స్టార్ హోటళ్లలోను ఈ రుచులకు ప్రత్యేక అభిమానులున్నారని నివేదిక పేర్కొంది. -
చింత చిగురు పులిహోర.. అద్భుతమైన రుచి
చింతపండుతోపాటు చింత చిగురు లేదా చింతాకు కూడా చాలా వంటకాల్లో ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్‌కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యంకప్పు సన్నగా తరిగిన లేత చిగురు టేబుల్ స్పూన్లు నూనె 3 - 4 పెద్ద పచ్చిమిర్చి 5, 6 ఎండు మిరపకాయలు కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు పసుపు, ఇంగువ పోపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు, కరివేపాకు తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. (క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ. -
Ugadi 2024 : సుమ ‘ఘమ’ల పులిహోర!
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు. ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్‌లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
సమ్మర్ స్పెషల్ : మ్యాంగో పులిహోర అదరిపోయేలా!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలు నోరూరిస్తాయి. వగరు.. పులుపు కలయికతో లేత మామిడి తొక్కు పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడి కాయ పప్పు ఇలా ఒకటేమిటి రకరకాల వంటకాలు ఘుమ ఘుమ లాడి పోవాల్సిందే. అసలు మామిడికాయతో ఏమి చేసినా ఆ రుచే వేరు కదా. మరి సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా! మామిడికాయ పులిహోర చేసిపెడితే. పిల్లలు,పెద్దా అంతా ఇష్టంగా తింటారు. ఇది చదువుతుంటేనే మీకూ నోరు ఊరుతోంది కదా. మరింకెందుకు ఆలస్యం ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కావల్సి పదార్థాలు: తోలు తీసేసి సన్నగా తురిమిన పచ్చిమామిడికాయ తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు, లేదా వేరుశెనగలు నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కరివేపాకు ఎండు మిర్చి, పచ్చి మిర్చి తురిమిన అల్లం ఇంగువ పసుపు ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడే వరకూ వేయించుకోవాలి. ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగా, మధ్యకు చీల్చి పెట్టుకన్న పచ్చిముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం వేయాలి. పసుపు ,ఇంగువ వేసి ఇంకొంచెం సేపు వేగించు కోవాలి. పోపు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. అపుడు ముందుగానే తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు, జీడిపప్పు వేయాలి. ముందుగా వండి పెట్టుకొన్న అన్నం పోపులో వేసి, అందులోనే ఉప్పుకూడా వేసి అన్నం చితికి పోకుండా బాగా కలపాలి. పులుపు, ఉప్పు సరిచూసుకుంటే..నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం పూటగానీ, లంచ్‌లోగానీ దీన్ని తీసుకోవచ్చు. -
Recipe: ఇడియప్పం పులిహోర తయారీ ఇలా!
పండుగ సీజన్లో ఇలా ఇడియప్పం పులిహోర తయారు చేసుకోండి! కావలసినవి: ►బియ్యప్పిండి – రెండున్నర కప్పులు ►నీళ్లు – కొద్దిగా ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►నెయ్యి – 1 టీ స్పూన్ ►ఆవాలు, ధనియాలు, మినపగుళ్లు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, వేరుశనగలు – కొన్నికొన్ని చొప్పున ►ఎండు మిర్చి – 1 (రెండు ముక్కలు అడ్డంగా తుంచి) ►పచ్చిమిర్చి – 3 (మధ్యలోకి చీరి) ►నూనె – సరిపడా ►ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు ►కరివేపాకు – 2 రెమ్మలు, నిమ్మకాయ – 1 తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ►తర్వాత ఇడ్లీ పాన్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకుని, మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చాలి ►అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని, ప్రతి ఇడ్లీ గుంతలో.. గుండ్రంగా తిప్పుతూ, గట్టిగా ఒత్తితే నూడుల్స్‌లా వస్తాయి. ►వాటిని ఆవిరిపై ఉడికించి, చల్లారాక.. ఒక్కో ఇడ్లీ ఇడియప్పాన్ని నాలుగైదు ముక్కలుగా విడదీసుకోవాలి. ►అనంతరం స్టవ్‌పైన కళాయి పెట్టి.. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ►తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్లు, పసుపు, ధనియాలు, జీడిపప్పు, వేరుశనగలు, ఎండు మిర్చి.. పచ్చిమిర్చి.. కరివేపాకు ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ►అందులో నిమ్మరసం వేసి కాసేపు తిప్పాలి. ►అనంతరం ఇడియప్పం మిశ్రమాన్ని వేసుకుని.. గరిటెతో కలియదిప్పుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Paneer Vegetable Idli Recipe: పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ తయారు చేసుకోండిలా! Surnali Dosa Recipe: సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి! -
Kitchen Tips: ఇనుప బాణలి, కళాయి తుప్పు పడితే ఇలా చేయండి!
ఇనుప బాణలి, కళాయి, పెనం, ఇతర ఇనుముతో చేసిన కిచెన్ వస్తువులు తుప్పు పట్టి ఇబ్బంది పెడుతుంటాయి. తుప్పు పట్టిన ఇనుప బాణలిలో కొద్దిగా హార్పిక్ వేసి బాణలి అంతా రాసి గంటపాటు నానబెట్టాలి. తరువాత స్టీల్ పీచుతో గట్టిగా రుద్దిన తరవాత డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసి మరోసారి మెత్తటి పీచుతో రుద్ది కడగాలి. ఇలా కడిగిన బాణలిని తడిలేకుండా తుడిచి, నూనె రాసి ఆరనివ్వాలి. ఇలా చేస్తే ఇనుప వస్తువులు తుప్పు రాకుండా వాడుకోవడానికి చక్కగా పనికొస్తాయి. ఇక పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. మరిన్ని టిప్స్ బంగాళదుంప ముక్కలను పదినిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టి, తరువాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి. అదే విధంగా... డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే... కాగిన నూనెలో ముందుగా కొద్ది చింతపండు వేయాలి. తరువాత డీప్ ఫ్రై చేసుకుంటే నూనె పొంగదు. పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. చదవండి: Veduru Kanji- Health Benefits: వెదురు కంజి.. టేస్టు అదుర్స్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! -
రారండోయ్ వంటలు చేద్దాం
ఇరుగమ్మా పొరుగమ్మా రండి. పిన్నిగారూ బామ్మగారూ రండి. చిన్నారి పొన్నారి రారండి. సంక్రాంతి వస్తోంది. సంబరాలు తెస్తోంది. బంధువులు వస్తారు. సందడి చేస్తారు. పొయ్యి వెలిగిద్దాము. సాయం పడదాము. వంటలు చేద్దాము. విందారగిద్దాము. రారండోయ్ వంటలు చేద్దాం... నువ్వుల బొబ్బట్లు కావలసినవి: నువ్వులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; గోధుమ పిండి – అర కప్పు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకులు – 2 తయారీ: ►స్టౌ మీద బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►ఏలకులు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►బెల్లం పొడి జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ►ఒక పాత్రలో మైదాపిండి, గోధుమపిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జతచేస్తూ మెత్తగా చపాతీపిండిలా కలుపుకోవాలి ►రెండు టీ స్పూన్ల నెయ్యి జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి, పది నిమిషాలపాటు పక్కన ఉంచాలి ►పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండ ను చిన్న సైజు పూరీలా ఒత్తి, అందులో నువ్వులు బెల్లం మిశ్రమం ఉంచి, అంచులు మూసేసి, చపాతీలా వత్తాలి ►ఇలా అన్నీ తయారు చేసుకోవాలి ►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, ఒక్కో బొబ్బట్టుకు, నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి ►వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి. దబ్బకాయ పులిహోర కావలసినవి: బియ్యం – అర కేజీ; నూనె – 100 గ్రా.; దబ్బకాయ రసం – అర కప్పు, పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చిమిర్చి – 5 (సన్నగా పొడవుగా తరగాలి); కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; పల్లీలు – 100 గ్రా; జీడిపప్పులు – 10 గ్రా. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ►వేడిగా ఉండగానే అన్నాన్ని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, ఉప్పు పసుపు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు, జీడిపప్పు జత చేసి దోరగా వేయించాలి ►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాక, అన్నం మీద వేసి కలియబెట్టాలి ►దబ్బకాయ రసం వేసి మరోమారు బాగా కలిపి, ఒక గంట సేపు బాగా ఊరిన తరవాత తింటే రుచిగా ఉంటుంది. పాకం గారెలు కావలసినవి: మినప్పప్పు – అర కేజీ; బెల్లం/పంచదార – అర కేజీ; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ►మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి ►స్టౌ మీద నూనె కాగాక, పిండిని గారెల మాదిరిగా వేసుకుని, రెండువైపులా ఎర్రగా కాలిన తరవాత కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ►ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము/పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ►ఏలకుల పొడి, నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ►వేయించి ఉంచుకున్న గారెలను ఈ పాకంలో వేసి సుమారు అరగంట సేపు తరవాత తింటే, రుచిగా ఉంటాయి. నువ్వుల పులగం కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం తురుము – ఒక కప్పు; వేయించిన నువ్వుల పొడి – అర కప్పు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మరుగుతున్న నీళ్లలో వేసి బాగా కలియబెట్టి, నువ్వుల పొడి కూడా జతచేసి మరోమారు కలిపి, మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత బెల్లం తురుము జత చేయాలి ►శొంఠి పొడి, ఏలకుల పొడి, నెయ్యి జత చేసి కలియబెట్టాలి ►పైన నెయ్యి, ఎండు కొబ్బరి తురుము వేసి వేడివేడిగా అందించాలి. నువ్వుల పచ్చడి కావలసినవి: నువ్వులు – 100 గ్రా.; చింత పండు – 100 గ్రా.; బెల్లం పొడి – 100 గ్రా.; ఎండు మిర్చి – 50 గ్రా.; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 50 గ్రా.; ఉప్పు – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి ►ఒక గిన్నెలో చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి, ఉడికించి, చల్లారాక మెత్తగా గుజ్జు తీసి పక్కన ఉంచాలి ►వేయించి పెట్టుకున్న మినప్పప్పు మిశ్రమం మిక్సీలో ముందుగా వేసి మెత్తగా చేయాలి ►నువ్వులు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చింత పండు గుజ్జు, బెల్లం తురుము, ఉప్పు జత చేసి అన్నీ బాగా కలిసేలా మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►వేయించి ఉంచుకున్న ఆవాలు మిశ్రమం జత చేసి బాగా కలపాలి ►గారెలలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
పాచిపోయిన పులిహోర.. 51 వేలు ఫైన్
రాజేంద్రనగర్: పాచిపోయిన పులిహోరను వినియోగదారులకు అందించిన ఓ హోటల్‌కు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. 51 వేల జరిమానాను విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్ నిర్వహకులు శుక్రవారం పాడైపోయిన పులిహోరాను వినియోగదారులకు అందించారు. ఈ విషయమై వినియోగదారులు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రమేశ్‌కు ఫిర్యాదు చేయడంతో హోటల్ తనిఖీలు నిర్వహించారు. పాచిపోయిన పులిహోరాతో పాటు ఇతర పదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వహకుడికి రూ. 51 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించామ న్నారు. మున్సిపల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం ఉడిపి హోటల్‌కు రావడంతో విషయం వెలుగుచూసిందని తెలిపారు. తనిఖీ చేస్తున్న కార్పొరేషన్ అధికారులు -
తిరుప్రసాదం
అదివో అల్లదివో... అని హరివాసానికి చేరుకుంటాం.గోవిందా గోవిందా... అని స్వామి ఎదుట కన్నీటితో కైమోడ్పులు అర్పిస్తాం.కోర్కెలు కోరుతాం... మొక్కులు చెల్లిస్తాం.అప్పటికి చేసే పని? ప్రసాదాన్ని కళ్లకద్దుకోవడమే!ఇది బ్రహ్మోత్సవాల సమయం.కొండకు వెళ్లలేనప్పుడు ఇంట్లోనే స్వామి దర్శనం.వంటిల్లే శ్రీవారి పోటు! ఆవు నెయ్యి, మిరియాల పొడి, నువ్వుల పొడి, పచ్చకర్పూరం... వీటిని అందుకోండి. ప్రసాదాలు చేయండి. కొండదర్శనం లభించింది అన్నంత పవిత్రంగా ఆరగించండి. తిరుపతి లడ్డూ కావలసినవి: సెనగ పిండి – 100 గ్రా.; పంచదార – 200 గ్రా.; జీడి పప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 4; మిశ్రీ (పటిక బెల్లం చిప్స్) – 50 గ్రా.; పచ్చ కర్పూరం – 2 బిళ్లలు తయారీ: ∙ఒక పాత్రలో సెనగ పిండి వేసి, తగినన్ని నీళ్లు పోసి బూందీ తయారుచేయడానికి అనువుగా ఉండేలా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగపిండిని బూందీ చట్రంలో వేసి దూయాలి ∙బాగా వేగిన తరవాత ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆ నేతిలోనే జీడిపప్పులు, కిస్మిస్ వేసి బాగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పాన్‌లో పంచదార, ఒక కప్పు నీళ్లు వేసి కరిగించి, ఉడకగానే ఆ పాకాన్ని బూందీ మీద వేయాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙ఈ లోగా ఏలకులు, పచ్చ కర్పూరాన్ని చిన్న రోట్లో వేసి నలపాలి (మొత్తం పొడి కాకుండా చూడాలి). ∙దీనిని బూందీలో వేసి బాగా కలిపాక, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు జత చేసి బాగా కలపాలి ∙చేతితో లడ్డూలు తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టాలి ∙ఈ లడ్డూ రుచి ఇంచుమించు తిరుపతి లడ్డూ రుచిని పోలి ఉంటుంది. తిరుపతి వడ కావలసినవి: మినుములు (పొట్టుతో) – ఒకటిన్నర కప్పులు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి – పావు కప్పు తయారీ: ∙ముందుగా మినప్పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లలో సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాక, నీటిని శుభ్రంగా ఒంపేసి, మిగిలిన నీరు కూడా పోయేలా రంధ్రాలున్న పాత్రలో పోసి పావు గంటసేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి ∙మినప్పప్పును జత చేసి (రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే జత చేయాలి) ∙మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙రుబ్బుకున్న మిశ్రమం గట్టిగా, జిగురుగా ఉండాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాచాలి ∙అరటి ఆకుకి కొద్దిగా నెయ్యి పూయాలి ∙చేతిని నీటిలో ముంచి, కొద్దిగా పిండి తీసుకుని అరటి ఆకు మీద చేతితో బాగా పల్చగా ఒత్తి, నేతిలో వేసి వేయించాలి ∙మందంగా ఒత్తితే నేతిలో వేగడానికి చాలా సమయం పడుతుంది ∙మంటను మధ్యస్థంగా ఉంచాలి ∙వడలు బంగారు రంగులోకి మారేవరకు వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ∙(నెయ్యి ఎక్కువగా పీల్చుకున్నట్టు అనిపిస్తే, వడలను రెండు గరిటెల మధ్య ఉంచి గట్టిగా నొక్కి నూనె తీసేయాలి) ∙దేవుడికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా తీసుకోవాలి. దేవాలయం తరహా మిరియాల పులిహోర కావలసినవి: బియ్యం – అర కేజీ (తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, అన్నం పక్కన ఉంచాలి); పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; చింత పండు – పెద్ద నిమ్మకాయంత; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; మెంతులు – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; నల్ల మిరియాలు – 20; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నువ్వుల నూనె – 3 టేబుల్ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను (ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; చాయ మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; వేయించిన పల్లీలు – 5 టేబుల్ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాక, చింతపండు వేసి దింపేయాలి ∙బాగా చల్లారాక రసం తీసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక మెంతులు వేసి వేయించాక, ధనియాలు జత చేసి (నూనె వేయకూడదు) మరోమారు వేయించాలి ∙మిరియాలు కూడా వేసి బాగా వేయించాలి ∙నువ్వులు జత చేసి దోరగా వేయించి దింపేసి చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పోపు దినుసులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగపప్పు వేసి కొద్దిసేపు వేయించాక, మినప్పప్పు వేసి కలపాలి. వేయించిన పల్లీలు వేసి గరిటెతో బాగా కలిపాక, ఎండు మిర్చి వేసి మరోమారు కలిపి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కరివేపాకు వేయాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపాక, చింతపండు రసం వేసి కొద్దిసేపు ఉడికిన తరవాత, రాళ్ల ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాల పాటు చింత పండు రసాన్ని ఉడికించాలి ∙చింత పండు రసం బాగా చిక్కబడ్డాక బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి ∙ఒక పెద్ద పళ్లెంలో అన్నం, పసుపు, చింతపండు పులుసు + పోపు మిశ్రమం వేసి పులిహోర కలియబెట్టాలి ∙మెత్తగా పొడి చేసి ఉంచుకున్న మిరియాలు + ధనియాల పొడిని చివరగా జత చేసి కలియబెట్టి అరగంటసేపు మూత పెట్టి ఉంచాలి ∙దేవునికి నివేదన చేసి అందరికీ ప్రసాదం అందించాలి. సీరా (రవ్వకేసరి) కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; పంచదార – 2 కప్పులు; నీళ్లు – మూడున్నర కప్పులు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా, ముద్ద చేయాలి); జీడి పప్పు పలుకులు – 20; కిస్ మిస్ – కొద్దిగా; ఏలకుల పొడి – అర టీ స్పూను; ఆవు నెయ్యి – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఆ బాణలిలోనే మూడున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి ∙ఆ తరవాత వేయించి ఉంచుకున్న బొంబాయి రవ్వ వేయాలి ∙రవ్వ వేస్తున్నంత సేపు ఆపకుండా కలపాలి, లేదంటే ఉండలు ఉండలుగా అవుతుంది ∙బొంబాయి రవ్వ బాగా ఉడికిన తరవాత, బాదం పప్పు ముద్ద, ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙కరిగించిన నెయ్యి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి బాగా కలియబెట్టాలి ∙చివరగా కుంకుమ పువ్వు వేసి కలిపి దింపేయాలి ∙స్వామి వారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. అమృత కలశం కావలసినవి: పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙పొట్టు పెసర పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి ∙ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బెల్లం వేసి కరిగించి, వడగట్టాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, వడబోసిన బెల్లం నీళ్లు పోసి పచ్చి వాసన పోయేవరకు మరిగించాలి ∙బెల్లం పాకంలో ఏలకుల పొడి, పెసర పప్పు ముద్ద వేసి ఉండ కట్టకుండా బాగా కలపాలి ∙నెయ్యి జత చేసి మిశ్రమం దగ్గరపడే వరకు బాగా కలిపి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక కలశం ఆకారంలో ఉండలు తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ రేకులలో అమర్చి, కుకర్‌లో (విజిల్ పెట్టకూడదు) ఉంచి, స్టౌ మీద పెట్టి, పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙అమృతకలశం ప్రసాదాన్ని దేవునికి నివేదన చేసి స్వీకరించాలి. -
పండుగ రోజు పులిహోర.. ఎవరైనా వస్తున్నారా ?
సాక్షి, హైదారాబాద్ : టీవీ వ్యాఖ్యాత సుమ పరిచయం అవసరం లేని పేరు. ప్రతిరోజు పలు టీవీ చానళ్లలో సందడి చేస్తూనే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరిస్తారు. ఇటీవల సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి సోషల్ మీడియా అభిమానులను ఆనందిపచేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ రోజు కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. సుమ పులిహోర కలుపుతున్న వీడియోని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోలో సుమ ఏమన్నారంటే.. ‘‘ పులిహోర.. చింతపండుతో పులిహోర చేస్తున్నాను. ఇదిగో చింతపండు గుజ్జు. ఇదిగో పులిహోర (అదే సమయంలో అక్కడికి తన పెంపుడు కుక్క రావడంతో.. ఏయ్.. నువ్ ఇటు రావద్దు అంటారు). ఎవరైనా వస్తున్నారా పులిహోర టేస్ట్ చేయడానికి..’’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
పులిహోర.. చింతపండుతో పులిహోర
-
సత్యదేవుని భక్తులకు కొత్త కానుక
అన్నవరం : గత నవంబర్ నుంచి మూత పడిన సబ్ క్యాంటీన్ భవనం వద్ద సత్యదేవుని భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీని అన్నవరం దేవస్థానం సోమవారం ప్రారంభించింది. పులిహోర పంపిణీని దేవస్థానం పాలక మండలి సభ్యులు కొత్త వేంకటేశ్వరరావు(కొండబాబు), యడ్ల బేతాళుడు, ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావులు ఉదయం తొమ్మిది గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. నిర్వాహకునికి, దేవస్థానానికి ఏర్పడిన వివాదం నేపథ్యంలో సబ్ క్యాంటీన్‌ను మూసివేశారు. దీంతో సబ్ క్యాంటీన్ సమీపంలోని ఐదు సత్రాల్లోని 300 గదుల్లో బస చేసే భక్తులకు ఫలహారాలు, భోజనం లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవస్థానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఏడు నెలలుగా భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫలహారాలు కావాలన్నా, భోజనం కావాలన్నా అర కిలోమీటరు దూరంలో ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్ క్యాంటీన్ వద్దకు రావాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 16న జరిగిన దేవస్థానం పాలక మండలి సమావేశంలో సబ్ క్యాంటీన్ వద్ద ఉదయం పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయాలని తీర్మానించారు. సాధారణ రోజుల్లో రోజుకు వెయ్యిమందికి, పర్వదినాల్లో రెండు వేల మందికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిని సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా, పగటి వేళ పులిహోర, దద్ధోజనం పంపిణీ చేసినా రాత్రి వేళల్లో మాత్రం ఫలహారాలు కావాలంటే భక్తులు మెయిన్ క్యాంటీన్ వరకూ రావల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు సబ్ క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. -
శ్రీరాముడికి సంప్రదాయ ప్రసాదాలు కనుమరుగు
-
గోంగూర పులిహోర
కుకింగ్ తయారి సమయం: 45 నిమిషాలు కావలసినవి: గోంగూర ఆకులు – రెండు కప్పులు బియ్యం – 2 కప్పులు (వండి చల్లార్చుకోవాలి) పసుపు – అర టీ స్పూన్ కరివేపాకు – రెండు రెబ్బలు ఉప్పు – రుచికి సరిపడినంత వేరుశెనగ గుళ్లు – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్ ఎండుమిర్చి – 3, నూనె – 3 టేబుల్ స్పూన్లు పోపు కోసం: శనగపప్పు – టేబుల్ స్పూన్, మినప్పప్పు – టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 4, ఇంగువ – పావు టీ స్పూన్, పల్లీలు – గుప్పెడు, తయారి: పాత్రలో టీ స్పూన్ నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి దింపి చల్లార్చాలి అర టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి గోంగూర వేసి పచ్చివాసన పోయేలా 8 నిమిషాల పాటు వేయించి దింపేసి చల్లార్చాలి ముందుగా వేయించిన దినుసులు గ్రైండ్ చేసిన తర్వాత గోంగూర వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. (నీరు కలపకూడదు) పాత్రలో మిగతా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాక, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి వేసి అర నిమిషం పాటు వేయించాలి. శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, మినప్పప్పు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఇంగువ, కరివేపాకు వేసి నిమిషం వేయించి దింపేయాలి చల్లారిన అన్నంలో ముందుగా గోంగూర పేస్ట్ వేసి కలపాలి. తర్వాత చల్లార్చిన పోపు, ఉప్పు వేసి కలపాలి అప్పడం కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది. -
విష్ణు ప్రీతి
మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసం. సహస్రనామాలు, పూజలు, పాశురాలు... ఆ ఆధ్యాత్మిక వైభవమే వేరు అమ్మాయిలు బద్దకాన్ని అటకెక్కించి చలిని లెక్క చేయకుండా ముచ్చటగా ముగ్గులు వేస్తుంటే... హరిదాసులు ముంగిటలో నిలబడి హరిలో రంగ హరీ ఆలపిస్తుంటే... వంట గదిలో బామ్మలు, అమ్మమ్మలు ఘుమఘుమలాడే రకరకాల ప్రసాదాలు తయారు చేస్తుంటే... ఆ ఆనందం వేరు. మరో నెలరోజులలో సంక్రాంతి. ఇవన్నీ టీజర్లు... ఫస్ట్ లుక్‌లు... ఆ వైకుంఠునికి ప్రణమిల్లి ప్రసాదం సమర్పించి పెద్ద పండగకు సిద్ధమవుదాం పదండి. చక్ర పొంగలి కావలసినవి బియ్యం - గ్లాసు, పాలు - 2 గ్లాసులు, పెసర పప్పు - అర గ్లాసు, బెల్లం తురుము - కప్పున్నర, పచ్చి కొబ్బరి ముక్కలు - కప్పు, జీడిపప్పు - 10, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు తయారీ బియ్యం, పెసరపప్పులను విడివిడిగా వేయించాలి ఒక పాత్రలో వేయించిన బియ్యం, పెసర పప్పులకు, మూడు గ్లాసుల నీళ్లు, పాలు జత చేసి ఉడికించాలి బెల్లం తురుము జత చేసి బాగా చిక్కబడే వరకు ఉడికించాలి బాణలిలో నెయ్యి కరిగాక, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసేసి, పొంగలిలో వేసి కలపాలి. (తగినంత నెయ్యి వేస్తేనే చక్కెర పొంగలి రుచిగా ఉంటుంది) బెంగళూరు పులిహోర కావలసినవి: చింతపండు - నిమ్మకాయంత, పసుపు - అర టీ స్పూను, బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత పొడి కోసం: నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు - అర కప్పు, ఎండు మిర్చి - 10, ఇంగువ - అర టీ స్పూను, మిరియాలు - అర కప్పు, జీలకర్ర - అర కప్పు, మెంతులు - అరకప్పు, ఆవాలు - పావు కప్పు. పులిహోర అన్నం కోసం: బాస్మతి బియ్యం - కప్పు, చింతపండు గుజ్జు -4 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత. గార్నిషింగ్ కోసం: నువ్వుల నూనె - 6 టేబుల్ స్పూన్లు, ఆవాలు - టీ స్పూన్లు డ్రై గార్నిష్ కోసం: నువ్వులు - అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు. ఫ్రైడ్ గార్నిషింగ్ కోసం: నువ్వుల నూనె - 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు - టీ స్పూన్లు, సెనగ పప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఇంగువ - అర టీ స్పూను, పల్లీలు - పావుకప్పు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: చింతపండును కప్పు నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి కరిగాక మసాలా దినుసులను విడివిడిగా వేయించి, విడివిడిగా పొడులు చేసి పక్కన ఉంచాలి బాణలిలో 6 టేబుల్ స్పూన్ల నువ్వులనూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాక, చింతపండు రసం, ఉప్పు, పసుపు, బెల్లం పొడి వేసి బాగా కలిపి, మిశ్రమం చిక్కపడేవరకు కలపాలి తయారుచేసి ఉంచుకున్న పొడులు వేసి మరోమారు కలపాలి బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి బియ్యం ఉడికించి, ఒక పళ్లెంలో అన్నం విడివిడిలాడేలా పరిచి చల్లార్చాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, గార్నిషింగ్ కోసం తీసుకున్న వస్తువులు (కరివేపాకు తప్ప) వేసి వేయించాలి పల్లీలు బాగా వేగాక దింపేసి, కరివేపాకు, చింతపండు గుజ్జు జత చేసి, పులిహోరలో వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. ఆవ దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం - అర కప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - కప్పు, పాలు - పావు కప్పు (కాచి చల్లార్చాలి), ఆవాలు - టీ స్పూను (కొద్దిగా నీళ్లు జత చేసి పది నిమిషాలు నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేయాలి), ఆవాలు - అర టీ స్పూను, సెనగ పప్పు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, పచ్చి మిర్చి - 3, ఎండు మిర్చి - 3, కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు తయారీ: బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి విజిల్ తీశాక, అన్నాన్ని మెత్తగా అయ్యేలా గరిటెతో మెదిపి బాగా చల్లారాక పాలు జత చేసి మరోమారు కలపాలి పెరుగు, ఆవాల ముద్ద, ఉప్పు జత చేసి గరిటెతో బాగా కలపాలి బాణలిలో నూనె కాగాక, ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న అన్నంలో వేసి బాగా కలపాలి సుమారు అరగంట తర్వాత అల్లం పచ్చడితే సర్వ్ చేయాలి. నేతి పులిహోర కావలసినవి: బియ్యం - 2 కప్పులు (మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి), చింతపండు రసం - 3 టేబుల్ స్పూన్లు (చిక్కగా ఉండాలి) పసుపు - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, నువ్వులు - టేబుల్ స్పూను, ఎండు మిర్చి - 4 (ముక్కలు చేయాలి), మినప్పప్పు - టీ స్పూను, సెనగ పప్పు - టీ స్పూను, పల్లీలు - గుప్పెడు, జీడిపప్పు - 10 గ్రా., ఇంగువ - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, కరివేపాకు - 3 రెమ్మలు, నెయ్యి - 10 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత. తయారీ: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి, నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి కాగాక ఇంగువ, ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు, సెనగ పప్పు, పచ్చి మిర్చి వేసి వేయించాలి చింతపండు పులుసు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి ఉడికించాలి బాగా ఉడికిన తర్వాత నువ్వుల పొడి జత చేసి మిశ్రమమంతా ముద్దలా అయ్యేవరకు సుమారు రెండు నిమిషాలు ఉడికించాలి పెద్ద పాత్రలో అన్నం వేసి పొడిపొడిలాడేలా పరిచి, చల్లారాక, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి వేయించిన పల్లీలు జత చేసి మరోమారు కలిపి సుమారు గంటసేపయ్యాక తింటే రుచిగా ఉంటుంది. కట్ పొంగల్ కావలసినవి: బియ్యం - కప్పు, పెసర పప్పు - కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 25 గ్రా., మిరియాల పొడి - 2 టీ స్పూన్లు తయారీ: బియ్యం, పెసరపప్పులను శుభ్రంగా కడిగి, ఆరు కప్పుల నీరు జత చేసి కుకర్‌లో నాలుగు విజిల్ వచ్చేవరకు ఉంచి దించేయాలి విజిల్, తీసి ఉడికిన అన్నానికి తగినంత ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు గరిటెతో మెదిపి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి కాగాక, మిరియాల పొడి వేసి దోరగా వేయించాలి జీడి పప్పులు జత చేసి దోరగా వేయించి తీసేసి, పొంగల్‌లో వేసి బాగా కలపాలి. (నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తే పొంగల్ రుచిగా ఉంటుంది) -
ఇంటి చిట్కాలు
పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి.పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత
* పులిహోర తినడంతో 16 మందికి కడుపునొప్పి * ఆస్పత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది మైలవరం : హాస్టల్లో వండిన పులిహోర తిన్న విద్యార్థినులు 16 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహానికి చెందిన దాదాపు 40 మంది విద్యార్థినులు రాజాపేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థినులకు సోమవారం ఉదయం హాస్టల్లో మెనూ ప్రకారం పులిహోర చేసి వడ్డించారు. అదే పులిహోరను వారి టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టి పాఠశాలకు పంపించారు. మధ్యాహ్నం పాఠశాలలో పులిహోర తిన్న విద్యార్థినులు కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని స్థానిక ప్రభుతాస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యాధికారులు సహనం, ప్రతాప్‌లు సిబ్బందితో కలిసి వారికి చికిత్స అందించారు. పులిహోర సరిగా ఉడక్కపోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. పాఠశాలలో మరికొంతమంది విద్యార్థినులు పులిహోర తినకుండా పారవేసినట్లు తోటి విద్యార్థినులు వివరించారు. ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న విద్యార్థినులను ఎంపీడీవో వై.హరిహరనాథ్, ఎంపీపీ బి.లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు దొండపాటి రాము, ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ రహీం తదితరులు పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి హాస్టల్ వెల్ఫేర్ అధికారిణి ఈ ఘటన గురించి తెలిసినా స్పందించకపోవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అవసరం లేదు... అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థినుల్లో ఇద్దరికి చికిత్స పంపించామని, మరో 14 మందిని తమ పరిశీలనలో ఉంచామని ఎస్పీహెచ్ఓ డాక్టర్ రవి తెలిపారు. ఉడకని అన్నంతో పులిహోర తయారు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని చెప్పారు. విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.