83 శాకాహార వంటకాల్లో వీటికి ‘ఫోర్ స్టార్’ రేటింగ్
ప్రపంచ ఫుడ్‌గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: రాత్రి మిగిలిన అన్నంలో గంజిపోసి పులియబెట్టి పొద్దున్నే పచి్చమిరపకాయ లేదా ఉల్లిపాయ నంజుకుంటూ పొలం గట్లపై రైతులు, కూలీలు తినే చద్దన్నం ఇప్పుడు అంతర్జాతీయ డిష్ అయింది. ‘రాత్రి మిగిలిపోయిన ఈ అన్నం ఎవరు తింటారు?..’ అంటూ ఈ కాలం యువత తక్కువచేసి చూసే చద్దన్నాన్ని ఇప్పుడు స్టార్ హోటళ్లలో పంటాబాత్ పేరుతో స్పెషల్‌గా చేయించుకుని లొట్టలేస్తూ మరీ తింటున్నారు.
అంతేనా మనం ఇంట్లో ఇష్టంగా చేసుకునే పులిహోర కూడా అంతర్జాతీయ ఫేవరెట్ వంటకంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల్లో ప్రజలు ఇష్టంగా తినే వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, ఏయే ప్రాంతాల్లో వాటిని ఇష్టపడుతున్నారు, వాటికి ఇచి్చన రేటింగ్ వంటి అంశాలను ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇటీవల టేస్ట్ అట్లాస్ ప్రకటించిన 83 శాకాహార వంటకాల్లో తొలిసారి ఆంధ్రా స్పెషల్ పులిహోర, పప్పుచారు, మిరపకాయ బజ్జీలు చోటు దక్కించుకున్నాయి.
4 స్టార్ రేటింగ్‌తో పులిహోర
పండగలు, ప్రత్యేక పర్వదినాల్లోను, అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లోను తప్పనిసరిగా చేసే పులిహోర టేస్ట్ అట్లాస్ రేటింగ్ 19వ స్థానంలో నిలిచింది. హిందూ ప్రపంచంలో ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ఏపీకి చెందిన ప్రత్యేక వంటకమని, అయితే..
తమిళనాడులో దీనిని పులిసాదం అని, కర్ణాటకలో పులియోగారే అని పిలుస్తారని నివేదిక పేర్కొంది. అత్యధికమంది ఆహారప్రియులు ఆంధ్రప్రదేశ్‌లో చేసే చింతపండు పులిహోరనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు రేటింగ్ ఇచ్చారు. మన రాష్ట్రం నుంచి మిరపకాయ బజ్జీ 40వ స్థానంలోను, పప్పుచారు 50వ స్థానంలోను నిలిచాయి. ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే ఆరోగ్యకరమైన వంటకంగా పప్పుచారును పేర్కొంది.
టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ఈ ర్యాంకింగ్స్ వివిధ ప్రాంతాల ఆహార ప్రియుల నుంచి తీసుకున్నట్లు పేర్కొంది. టాప్ 83 భారతీయ శాఖాహార వంటకాల జాబితా కోసం ఈ నెల మే 15వ తేదీ వరకు 2,251 మంది ఇచి్చన రేటింగ్స్ ఆధారంగా ఈ జాబితాను ప్రకటించినట్టు తెలిపింది. మన గ్రామాల్లో ఇప్పటికీ రైతులు, కూలీల అల్పాహారంగా ఉన్న చద్దన్నం బంగ్లాదేశ్ సంప్రదాయ వంటకంగా గుర్తింపు పొందింది.
టాప్ రేటింగ్‌తో పప్పు కూర ఎక్కువమంది ప్రజలు ఇష్టపడే వంటకాల జాబితాలో చేరింది. అంతర్జాతీయ ఫుడ్‌గైడ్‌గా గుర్తింపుపొందిన టేస్ట్ అట్లాస్ ఇప్పటివరకు 10 వేలకుపైగా వంటకాలను, 9 వేల రెస్టారెంట్లను తన అంతర్జాతీయ జాబితాలో చేర్చింది. ఇప్పుడు మన ఆంధ్రా స్పెషల్స్‌కు చోటుదక్కడం, అందులోను అందరూ ఇష్టపడే పులిహోర, పప్పుచారు, మిరపకాయ బజ్జీ, చద్దన్నం ఉండడం విశేషం.
ఏపీ, ఈశాన్య భారత్, బంగ్లాదేశ్‌లలో చద్దన్నం స్పెషల్
ఈ జాబితాలో 36వ స్థానంలో ఉన్న చద్దన్నం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో తరాలుగా సంప్రదాయ అల్పాహారంగా ఉంది. ఇంట్లో టిఫిన్స్ ఉన్నా చద్దన్నం తినేవారు కోట్లలో ఉన్నారు. అయితే.. ఈశాన్య భారతదేశంతో పాటు మన పక్కనున్న బంగ్లాదేశ్‌లో చద్దన్నం వారి దేశ సంప్రదాయ అల్పాహారంగా ఉంది. ప్రోబ్యాక్టీరియా (ఆరోగ్యానికి మేలుచేసే బ్యాక్టీరియా), కొద్దిగా పర్మెంటేషన్‌తో ఎంతో రుచిగా ఉండే ఈ చద్దన్నాన్ని భారత్, బంగ్లాతో పాటు పలు దేశాల్లో ఇప్పుడు ఈ ఫుడ్‌ను ఎంతో ఇష్టపడుతున్నారని, ఇష్టంగా తింటున్నారని టేస్ట్ అట్లాస్ నివేదిక పేర్కొంది.
బెంగాల్‌లో ‘పంటాబాత్’గా పేరున్న చద్దన్నం బెంగాలీ నూతన సంవత్సరం వేడుకలు, పహేలా బైషాఖీ పండుగ వంటి ప్రత్యేక సందర్భాల్లో చద్దన్నం ఉండాల్సిందేనని పలువురు ఈశాన్య, బంగ్లా, బెంగాలీ ప్రజలు పేర్కొనడం గమనార్హం. ఈ వంటకం సాధారణంగా తాజా పచ్చి మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలతో ఏపీ ప్రజలు తింటే.. వేయించిన చేపలతో బంగ్లా ప్రజలు తినడం ప్రత్యేకతగా పేర్కొంది.
తొలిస్థానంలో నిలిచిన దాల్ తడ్కా
టేస్ట్ అట్లాస్ ప్రకటించిన శాకాహార వంటకాల్లో ఉత్తర భారతదేశానికి చెందిన దాల్ తడ్కా తొలిస్థానంలో నిలిచింది. దక్షిణాదిన పప్పు కూరగా పిలిచే ఈ వంటకం ఉత్తర భారతదేశంలో దాల్ తడ్కాగా మారింది. ఆంధ్రాలో పప్పు కూరను పెసలు, బొబ్బర్లు, కంది, శనగ వంటి పలురకాల పప్పు దినుసులతో వండితే.. దాల్ తడ్కా మాత్రం కందిపప్పు, మసాలాతో చేస్తారు. రోటీ లేదా జీరా రైస్‌తో కలిపి ఎంతో ఇష్టంగా తింటారని చెబుతూనే ఈ వంటకానికి 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
దీనితర్వాత రెండో స్థానంలో పంజాబీ వంటకం షాహీ పన్నీర్, మూడోస్థానంలో మహారాష్ట్ర వంటకం మిసల్ (పలురకాల కూరగాయలతో కలిపి చేసేది), నాలుగోస్థానంలో మిసల్ పావ్ నిలిస్తే, ఐదోస్థానంలో 4.3 స్టార్ రేటింగ్‌తో ఆంధ్రా స్పెషల్ పెపరపప్పు కూర చోటు దక్కించుకుంది. మాంసాహార రుచుల కంటే భారతదేశపు సంప్రదాయ శాకాహార వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారని, 7, 5 స్టార్ హోటళ్లలోను ఈ రుచులకు ప్రత్యేక అభిమానులున్నారని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment