* పులిహోర తినడంతో 16 మందికి కడుపునొప్పి
* ఆస్పత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది
మైలవరం : హాస్టల్లో వండిన పులిహోర తిన్న విద్యార్థినులు 16 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహానికి చెందిన దాదాపు 40 మంది విద్యార్థినులు రాజాపేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థినులకు సోమవారం ఉదయం హాస్టల్‌లో మెనూ ప్రకారం పులిహోర చేసి వడ్డించారు. అదే పులిహోరను వారి టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టి పాఠశాలకు పంపించారు. మధ్యాహ్నం పాఠశాలలో పులిహోర తిన్న విద్యార్థినులు కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని స్థానిక ప్రభుతాస్పత్రికి తరలించారు.
స్థానిక వైద్యాధికారులు సహనం, ప్రతాప్‌లు సిబ్బందితో కలిసి వారికి చికిత్స అందించారు. పులిహోర సరిగా ఉడక్కపోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. పాఠశాలలో మరికొంతమంది విద్యార్థినులు పులిహోర తినకుండా పారవేసినట్లు తోటి విద్యార్థినులు వివరించారు. ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న విద్యార్థినులను ఎంపీడీవో వై.హరిహరనాథ్, ఎంపీపీ బి.లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు దొండపాటి రాము, ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ రహీం తదితరులు పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి హాస్టల్ వెల్ఫేర్ అధికారిణి ఈ ఘటన గురించి తెలిసినా స్పందించకపోవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళన అవసరం లేదు...
అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థినుల్లో ఇద్దరికి చికిత్స పంపించామని, మరో 14 మందిని తమ పరిశీలనలో ఉంచామని ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ రవి తెలిపారు. ఉడకని అన్నంతో పులిహోర తయారు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని చెప్పారు. విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.
హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత
Published Tue, Nov 25 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement