
దూసుకొచ్చిన మృత్యువు
జహీరాబాద్, న్యూస్‌లైన్: పుట్టిన రోజును జరుపుకునేందుకు మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు ఆటోలో వెళుతున్న విద్యార్థుల బృందానికి మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులో తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జహీరాబాద్‌లోని ఆచార్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న జేమ్స్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని తొమ్మిది మంది సహచర విద్యార్థులతో కలసి మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు ఆటోలో బయలుదేరారు.
ఆటో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారుకు రాగానే ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో విఠల్ (21), జేమ్స్ (21) అక్కడికక్కడే మృతి చెందగా, యాదగిరి (21) జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేఘమాల(20), ఆటో డ్రైవర్ జహీరుద్దీన్ (40)లు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిరారు.