‘షిఫ్ట్‌’లో డిగ్రీ క్లాస్‌లు | Degree College Classes Will Be Started Shift Oriented In Telangana | Sakshi
Sakshi News home page

‘షిఫ్ట్‌’లో డిగ్రీ క్లాస్‌లు

Published Mon, Jan 18 2021 2:05 AM | Last Updated on Mon, Jan 18 2021 8:26 AM

Degree College Classes Will Be Started Shift Oriented In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి, జేఎన్‌టీయూ దృష్టి సారించాయి. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ ప్రత్యక్ష విద్యా బోధనపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు జేఎన్‌టీయూ ఏర్పాట్లు చేస్తోంది.

అందరికీ ఒకేసారి కష్టమే: రాష్ట్రంలో వేయికి పైగా డిగ్రీ కాలేజీల్లో దాదాపు 7 లక్షలమంది చదువుతున్నారు. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు 4.65 లక్షల మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు 2.35 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా శానిటైజేషన్‌ వంటి కోవిడ్‌ నిబంధనలను పాటించడం, భౌతిక దూరం నిబంధనను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ ఒకేసారి అనుమతించి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే భౌతిక దూరం పాటించడం కష్టంగా మారనుంది.

అందుకే షిఫ్ట్‌ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన విధానం అమలు చేయాలని భావిస్తోంది. దీని ప్రకారం బీఏ, బీకాం వంటి కోర్సుల విద్యార్థులకు ఉదయం సమయంలో తరగతులను నిర్వహించడం, బీఎస్సీ, బీబీఏ, వొకేషనల్, ఇతర కోర్సుల వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్ష బోధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అందుకు అనుగుణంగా టైం టేబుల్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్‌కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాల మేరకు యూనివర్సిటీలు, హాస్టళ్ల ప్రారంభంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

బీటెక్‌ ఫస్టియర్‌కు ఫిబ్రవరి 15 నుంచి..
ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తరగతుల నిర్వహణపై జేఎన్‌టీయూ కసరత్తు ప్రారంభించింది. అయితే దశల వారీగా ఇంజనీరింగ్‌లో (బీటెక్‌), బీ ఫార్మసీ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముందుగా బీటెక్‌ తృతీయ, నాలుగో సంవత్సరాల తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ సిద్ధం చేస్తోంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని భావిస్తోంది. బీటెక్‌లోనూ షిఫ్ట్‌ పద్ధతిలో బోధనపైనా జేఎన్‌టీయూ ఆలోచనలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తే, తృతీయ, నాలుగో సంవత్సరం వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది.

వీటిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. తద్వారా మే నెలాఖరు నాటికి అన్ని సంవత్సరాల వారి బోధనను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక్కో సంవత్సరంలో రెండు సెమిస్టర్ల పరీక్షల్లో ఒక సెమిస్టర్‌ పరీక్షలను మార్చి నెలలో, తదుపరి సెమిస్టర్‌ పరీక్షలను జూన్‌లో నిర్వíßహించేలా కసరత్తు చేస్తోంది. ఇక ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే సమయంలో విద్యార్థులకు ల్యాబ్‌ సంబంధిత బోధన చేపట్టనుంది. మిగతా థియరీని ఆన్‌లైన్‌లో వినేలా ఏర్పాట్లు చేస్తోంది. వేసవి ఎండలు మొదలవుతాయి కనుక పరిస్థితిని బట్టి మార్చి ఒకటో తేదీ నుంచి మాత్రం అన్ని తరగతుల వారికి ప్రత్యక్ష బోధనను కొనసాగించేలా కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇక ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తరగతులకు సంబంధించి నిర్ణయం తీసుకునే బాధ్యతలను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకే అప్పగించింది.

నేడు రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీ..
డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను పాటించడం, షిఫ్ట్‌ పద్ధతిని అమలు చేయడం, ఇతరత్రా అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు సోమవారం (18న) ఉదయం యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

ఇంజనీరింగ్‌లో రెండు విధానాలు..
ఇంజనీరింగ్, ఫార్మసీలో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ రెండు విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ తరగతులను వింటారని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తరగతులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement