shift Policy
-
‘షిఫ్ట్’లో డిగ్రీ క్లాస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూ దృష్టి సారించాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ ప్రత్యక్ష విద్యా బోధనపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. అందరికీ ఒకేసారి కష్టమే: రాష్ట్రంలో వేయికి పైగా డిగ్రీ కాలేజీల్లో దాదాపు 7 లక్షలమంది చదువుతున్నారు. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు 4.65 లక్షల మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు 2.35 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా శానిటైజేషన్ వంటి కోవిడ్ నిబంధనలను పాటించడం, భౌతిక దూరం నిబంధనను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ ఒకేసారి అనుమతించి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే భౌతిక దూరం పాటించడం కష్టంగా మారనుంది. అందుకే షిఫ్ట్ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన విధానం అమలు చేయాలని భావిస్తోంది. దీని ప్రకారం బీఏ, బీకాం వంటి కోర్సుల విద్యార్థులకు ఉదయం సమయంలో తరగతులను నిర్వహించడం, బీఎస్సీ, బీబీఏ, వొకేషనల్, ఇతర కోర్సుల వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్ష బోధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అందుకు అనుగుణంగా టైం టేబుల్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్‌కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల మేరకు యూనివర్సిటీలు, హాస్టళ్ల ప్రారంభంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. బీటెక్ ఫస్టియర్‌కు ఫిబ్రవరి 15 నుంచి.. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తరగతుల నిర్వహణపై జేఎన్టీయూ కసరత్తు ప్రారంభించింది. అయితే దశల వారీగా ఇంజనీరింగ్‌లో (బీటెక్), బీ ఫార్మసీ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముందుగా బీటెక్ తృతీయ, నాలుగో సంవత్సరాల తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని భావిస్తోంది. బీటెక్‌లోనూ షిఫ్ట్ పద్ధతిలో బోధనపైనా జేఎన్టీయూ ఆలోచనలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తే, తృతీయ, నాలుగో సంవత్సరం వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. వీటిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. తద్వారా మే నెలాఖరు నాటికి అన్ని సంవత్సరాల వారి బోధనను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక్కో సంవత్సరంలో రెండు సెమిస్టర్ల పరీక్షల్లో ఒక సెమిస్టర్ పరీక్షలను మార్చి నెలలో, తదుపరి సెమిస్టర్ పరీక్షలను జూన్‌లో నిర్వíßహించేలా కసరత్తు చేస్తోంది. ఇక ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే సమయంలో విద్యార్థులకు ల్యాబ్ సంబంధిత బోధన చేపట్టనుంది. మిగతా థియరీని ఆన్లైన్లో వినేలా ఏర్పాట్లు చేస్తోంది. వేసవి ఎండలు మొదలవుతాయి కనుక పరిస్థితిని బట్టి మార్చి ఒకటో తేదీ నుంచి మాత్రం అన్ని తరగతుల వారికి ప్రత్యక్ష బోధనను కొనసాగించేలా కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇక ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తరగతులకు సంబంధించి నిర్ణయం తీసుకునే బాధ్యతలను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకే అప్పగించింది. నేడు రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీ.. డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటించడం, షిఫ్ట్ పద్ధతిని అమలు చేయడం, ఇతరత్రా అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు సోమవారం (18న) ఉదయం యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌లో రెండు విధానాలు.. ఇంజనీరింగ్, ఫార్మసీలో ఆన్లైన్/ఆఫ్‌లైన్ రెండు విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులను వింటారని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో తరగతులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుందని వివరించారు. -
షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. 1952 తర్వాత ఇదే ప్రథమం..! రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. భారీ డిస్ప్లే స్క్రీన్లు రాజ్యసభ చాంబర్లో 4 భారీ డిస్ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్‌తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. సీట్ల అమరిక ఇలా... వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్‌సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిమితంగానే అధికారులకు అవకాశం రాజ్యసభలోకి సెక్రటేరియట్‌కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్‌లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆ శాఖలో స్సందన కరువైతే ఏం చేశారో తెలుసా?
► రిజిస్ట్రేషన్ శాఖలో షిఫ్టు పద్ధతికి మంగళం! ► స్పందన లేకపోవడం వల్లే... త్వరలో నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో షిఫ్టు పద్దతికి త్వరలో మంగళం పాడేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సంస్కరణల్లో భాగంగా నగర పరిధిలో ప్రయోగాత్మకంగా రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో షిఫ్టు విధానం ప్రవేశపెట్టారు.అయితే ఊహించినంత స్పందన లేకుండా పోయింది. ఇప్పటికే ఇతర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు షిఫ్ట్ పద్ధతి విస్తరణ కార్యక్రమాన్ని విరమించుకోగా తాజాగా అమలవుతున్న ఆఫీసుల్లో సైతం నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహా నగరంలో స్థిరాస్తి రంగం ఊపందు కోవడంతో రిజిస్ట్రేషన్ శాఖకు పెరుగుతున్న దస్తావేజుల తాకిడిని అధిగమించేందుకు ఒకే జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని ఒకే ప్రాంతంలో దగ్గర దగ్గరగా గల రెండు వేర్వేరు కార్యాలయాలు వేర్వేరు సమయాల్లో రెండు షిఫ్టుల పద్ధతిలో పనిచేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయోగాత్మకంగా బోయిన్పల్లి–మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఎంపిక చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ఒక షిఫ్టులో ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మరొక షిఫ్టులో మరో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలు అందించే విధంగా నిర్ణయించారు. ఆయితే ఇతర రిజిస్ట్రార్ ఆఫీసులతో పోల్చితే పెద్దగా దస్తావేజుల నమోదుకు స్పందన కనిపించలేదు. అయినప్పటికీ ఉద్యోగులు, ఇతరత్రా పనుల్లో బీజీగా ఉండే వారికి వెసులుబాటుగా ఉంటుందని కొనసాగిస్తూ వచ్చారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. శివారు ప్రాంతంలో అధికంగా దస్తావేజులు నమోదవుతున్న చంపాపేట–సరూర్‌నగర్, కూకట్పల్లి–బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా షిఫ్టు పద్ధతి ప్రవేశపెట్టాలని పది నెలల క్రితం నిర్ణయించారు. కానీ ఆచరణలో ముందుకు వెళ్లలేదు. త్వరలో ప్రస్తుతం అమలవుతున్న రెండు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం నిర్ణయం తీసుకొని కొనసాగించాలా..? నిలిపివేయాలా? దానిపై నిర్ణయం తీసుకొనున్నారు.