న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది.
1952 తర్వాత ఇదే ప్రథమం..!
రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్‌లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్‌లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి.
భారీ డిస్‌ప్లే స్క్రీన్లు
రాజ్యసభ చాంబర్‌లో 4 భారీ డిస్‌ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్‌తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది.
సీట్ల అమరిక ఇలా...
వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్‌సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్‌లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్‌లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్‌ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పరిమితంగానే అధికారులకు అవకాశం
రాజ్యసభలోకి సెక్రటేరియట్‌కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్‌లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment