ఆ శాఖలో స్సందన కరువైతే ఏం చేశారో తెలుసా?
► రిజిస్ట్రేషన్ శాఖలో షిఫ్టు పద్ధతికి మంగళం!
► స్పందన లేకపోవడం వల్లే... త్వరలో నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో షిఫ్టు పద్దతికి త్వరలో మంగళం పాడేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సంస్కరణల్లో భాగంగా నగర పరిధిలో ప్రయోగాత్మకంగా రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో షిఫ్టు విధానం ప్రవేశపెట్టారు.అయితే ఊహించినంత స్పందన లేకుండా పోయింది. ఇప్పటికే ఇతర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు షిఫ్ట్ పద్ధతి విస్తరణ కార్యక్రమాన్ని విరమించుకోగా తాజాగా అమలవుతున్న ఆఫీసుల్లో సైతం నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహా నగరంలో స్థిరాస్తి రంగం ఊపందు కోవడంతో రిజిస్ట్రేషన్ శాఖకు పెరుగుతున్న దస్తావేజుల తాకిడిని అధిగమించేందుకు ఒకే జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని ఒకే ప్రాంతంలో దగ్గర దగ్గరగా గల రెండు వేర్వేరు కార్యాలయాలు వేర్వేరు సమయాల్లో రెండు షిఫ్టుల పద్ధతిలో పనిచేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయోగాత్మకంగా బోయిన్‌పల్లి–మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఎంపిక చేసి అమలుకు శ్రీకారం చుట్టారు.
ఒక షిఫ్టులో ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మరొక షిఫ్టులో మరో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలు అందించే విధంగా నిర్ణయించారు. ఆయితే ఇతర రిజిస్ట్రార్ ఆఫీసులతో పోల్చితే పెద్దగా దస్తావేజుల నమోదుకు స్పందన కనిపించలేదు. అయినప్పటికీ ఉద్యోగులు, ఇతరత్రా పనుల్లో బీజీగా ఉండే వారికి వెసులుబాటుగా ఉంటుందని కొనసాగిస్తూ వచ్చారు.
అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. శివారు ప్రాంతంలో అధికంగా దస్తావేజులు నమోదవుతున్న చంపాపేట–సరూర్‌నగర్, కూకట్‌పల్లి–బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా షిఫ్టు పద్ధతి ప్రవేశపెట్టాలని పది నెలల క్రితం నిర్ణయించారు. కానీ ఆచరణలో ముందుకు వెళ్లలేదు. త్వరలో ప్రస్తుతం అమలవుతున్న రెండు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం నిర్ణయం తీసుకొని కొనసాగించాలా..? నిలిపివేయాలా? దానిపై నిర్ణయం తీసుకొనున్నారు.