
మా ఇష్టం
► నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ కళాశాలల నిర్వహణ
► రెండు రోజుల క్రితం 25 కళాశాలలకు నోటీసుల జారీ
► 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న ఉన్నత విద్యాశాఖ
► గుర్తింపు ఇవ్వొద్దని వీఎస్‌యూ అధికారులకు ఆదేశం
జిల్లాలో డిగ్రీ కళాశాలల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. కాలేజీలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకున్నా యథేచ్ఛగా కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఎర వేస్తున్నారు. చిన్న చిన్న అద్దె భవనాల్లో బోర్డులు పెట్టి కార్పొరేట్ పేరుతో కళాశాలలను నడుపుతున్నారు. విద్యార్థుల నుంచి అందినకాడికి ఫీజులు దండుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు.
నెల్లూరు (టౌన్): డిగ్రీ కళాశాలలపై పర్యవేక్షణ యూనివర్సిటీ అధికారులకు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఏడాదీ కొంత మొత్తాన్ని వర్సిటీ అధికారులకు సమర్పించుకుని కళాశాల యజమానులు తమ పని చేసుకుంటున్నారు. అయితే డిగ్రీ కళాశాలల నిర్వహణపై ప్రక్షాళన చేసేందుకు ఉన్నత విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
అద్దె భవనాల నుంచి సొంత భవనాల్లోకి మార్చని, పూర్తిస్థాయిలో వసతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 25 డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఉన్నత విద్యాశాఖాధికారులు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఈ కళాశాలలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వొద్దని విక్రమ సింహపురి యూనివర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న కళాశాలల యాజ మాన్యాల్లో ఆందోళన మొదలైంది.
జిల్లాలో 81 డిగ్రీ కళాశాలలు
జిల్లాలో మొత్తం 81 డిగ్రీ కళాశాలలున్నాయి. వాటిలో తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 7 ఎయిడెడ్, 65 కార్పొరేట్, ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో 32 వేలమందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీలో బీఎస్సీ, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీబీఏ, బీసీసీఏ తదితర కోర్సుల్లో విద్యార్థులు అధిక మొత్తంలో చేరుతున్నారు. డిగ్రీలోనే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలను పొందుతున్నారు. దీనిని ఆసరా‡గా తీసుకున్న యాజమాన్యం ఇష్టారాజ్యంగా డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తోంది.
అయితే కార్పొరేట్ డిగ్రీ కళాశాలలు ఒక చోట అనుమతి పొంది మరొక ప్రాంతంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. అదికూడా అద్దె భవనం చూపించి రెండేళ్లల్లో సొంత భవనంలోకి మారుతామని ఉన్నత విద్యాశాఖకు లేఖలు ఇచ్చారు. అయితే వీఎస్‌యూ అధికారులను లోబర్చుకుని సరిగా గాలి, వెలుతురు లేని చిన్నచిన్న భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నారు. జిల్లాలో చాలా కళాశాలలకు లీజ్‌డీడ్ ముగిసింది.
ఫైర్, శానిటరీ, స్ట్రక్చరల్ తదితర సర్టిఫికెట్లు లేకుండానే కళాశాలలను నిర్వహిస్తున్నారు. అయితే వీఎస్‌యూ అధికారులకు ప్రతి ఏడాదీ లంచం రూపంలో రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పైగా అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో డిగ్రీ కళాశాలల నిర్వహణ ఏ విధంగా ఉన్నా వాటిపై వీఎస్‌యూ అధికారులు కన్నెత్తి చూడటంలేదని విమర్శలున్నాయి.
నోటీసులు అందుకున్న కళాశాలలు ఇవే
డిగ్రీ కళాశాలలలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేని, నిబంధనలు అతిక్రమించిన 25 డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఉన్నత విద్యాశాఖ రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఐదేళ్లలోపు, ఐదు సంవత్సరాల నుంచి 15 ఏళ్లు పైబడి అద్దె భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్న కళాశాలలకు నోటీసులు అందజేశారు. దీనిపై 15 రోజులలోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
వీటికి ఎలాంటి గుర్తింపు జారీ చేయవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఆనం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాల (ఏఎస్.పేట), శాస్త్ర డిగ్రీ కళాశాల (వరిగొండ), చైతన్య డిగ్రీ కళాశాల (కావలి), విశ్వం డిగ్రీ కళాశాల (నాయుడుపేట), ఎస్.ఎస్.డిగ్రీ కళాశాల (అగ్రహార్‌పేట), సంజీవని డిగ్రీ కళాశాల (వెంకటాచలం), వైష్ణవి డిగ్రీ కళాశాల (వెంకటగిరి), వీఆర్‌జేసీ డిగ్రీ కళాశాల (వెంకటగిరి), ఎంఎస్సార్ డిగ్రీ కళాశాల (వింజమూరు), శ్రీసాయి డిగ్రీ కళాశాల (వింజమూరు), పి.వెంకటసబ్బమ్మ డిగ్రీ కళాశాల (ఏఎస్‌పేట), విజేత డిగ్రీ కళాశాల (జలదంకి), సి.సి.ఆర్ డిగ్రీ కళాశాల (సైదాపురం), స్వాతి డిగ్రీ కళాశాల (వెంకటాచలం), విద్యాలయ డిగ్రీ కళాళాల (గూడూరు), సీతారామ డిగ్రీ కళాశాల (సీతారామపురం), విశ్వశాంతి డిగ్రీ కళాశాల (కావలి), శ్రీ ప్రగతి డిగ్రీ కళాశాల (కోట), విజ్ఞాన డిగ్రీ కళాశాల (పొదలకూరు), విద్యాంజలి కాలేజి ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (సూళ్లూరుపేట), ఎస్‌పీబీవీడీ డిగ్రీ కళాశాల (పొదలకూరు), శ్రీ కరుణామయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (గూడూరు), స్వర్ణనాందభారతి డిగ్రీ కళాశాల (గూడూరు), సీవీ రామన్ డిగ్రీ కళాశాల (నాయుడుపేట), వేమ డిగ్రీ కళాశాల (నాయుడుపేట)లకు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే
జిల్లాలో 25 కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు వారు వివరణ పంపాల్సి ఉంది. నోటీసులు అందుకున్న కళాశాలలకు గుర్తింపు ఇవ్వొద్దని ఆదేశాలున్నాయి. – చంద్రయ్య, రిజిస్ట్రార్, విక్రమ సింహపురి యూనివర్సిటీ