ప్రకాశం, బేస్తవారిపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలతో డిగ్రీ కళాశాలల విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలో 6వ సెమిస్టర్‌కు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైనల్ ఇయర్‌లో 5, 6 సెమిస్టర్‌లు విద్యార్థులు రాయాల్సి ఉంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక.. అక్టోబర్‌లో 6వ సెమిస్టర్‌లో భాగంగా సీబీసీఎస్ (ఛాయిస్ బేస్‌డు క్రెడిట్ సిస్టమ్) క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తృతీయ సంవత్సరంలో ఆరు పేపర్లుంటాయి. సైన్స్ (బీఎస్సీ, బీజెడ్‌సీ) విద్యార్థులు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఎదైనా ఒక సబ్జెక్ట్‌లో మూడు పేపర్లను ఎంపిక చేసుకోవాలి, మిగిలిన మూడు పేపర్లు మూడు సబ్జెక్ట్‌ల్లో ఒక్కోటి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అందుబాటులో లేని పుస్తకాలు
ఆన్‌లైన్‌లో నవంబర్ నెలలో క్లస్టర్ పేపర్ల వివరాలు, సిలబస్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెట్టారు. సిలబస్ పూర్తిగా కొత్తగా, లోతైన టాపిక్‌లతో ఉంది. దీనిని బోధించేందుకు సరైన పుస్తకాలు లేకపోవడంతో అధ్యాపకులు కూడా తలలు పట్టుకున్నారు. అందుబాటులో ఉన్న టాపిక్‌లను చెప్పి పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. అకాడమీ పుస్తకాలు, ప్రైవేట్ పబ్లికేషన్స్ క్లస్టర్ సిలబస్ పుస్తకాలను నేటికీ విడుదల చేయలేదు.
యూనివర్సిటీ అనాలోచితన నిర్ణయం
ఏడాది ప్రారంభంలో కాని, వచ్చే ఏడాదికాని క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింటే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఫైనల్ ఇయర్ మధ్యలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో సిలబస్ చెప్పలేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల వ్యవధి గడిచిపోయింది. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో కనీసం సగం సిలబస్ పూర్తి చేసే పరిస్థితి లేదు.
విద్యార్థుల పరిస్థితి ఇలా..
యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న తృతీయ సంవత్సర విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి, రెండో సంవత్సరాల్లో సబ్జెక్ట్‌లు మిగిలినా పెద్ద నష్టం ఉండదు. కానీ ఫైనల్ ఇయర్‌లో సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయితే పట్టా కోల్పోవాల్సిన వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
మార్చిలో పరీక్షలు పెడితే తీవ్ర నష్టం
ఇప్పటికి కూడా పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు పెడితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రాక్టిల్స్ ఉంటాయి. ఈనెల చివరికి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలను మార్కెట్‌లోకి విడుదల చేసిన సిలబస్ పూర్తి చేసేందుకు సరైన సమయంలేదు. హడావుడిగా అధ్యాపకులు సిలబస్‌ను పూర్తిచేసిన విద్యార్థులు చదువుకునేందుకు సమయం ఉండదు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను మార్చిలో నిర్వహించకుండ వాయిదావేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment