cluster system
-
ఏ కాలేజీలో చేరినా.. మీకిష్టమైన కాలేజీలో క్లాసులు వినొచ్చు!
సాక్షి, హైదరాబాద్: పలు కారణాలతో ఒక విద్యార్థి తనకు ఇష్టమైన కళాశాలలో చేరలేకపోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో కాలేజీలో చేరినా... తనకిష్టమైన కాలేజీలో చేరలేదన్న అసంతృప్తి ఆ విద్యార్థిని వెన్నాడుతుంటుంది. అందుకే అటువంటి విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసి, తద నంతరం పూర్తిస్థాయిలో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ సహా పలువురు వీసీలతో కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీలను కలుపుతూ పైలట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బోధనాసిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్న వారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకమైన అంశం. -
విశాఖలో భారీ స్టీల్ క్లస్టర్
సాక్షి, అమరావతి: తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే విధంగా విశాఖలో భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకోసం విశాఖ సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్ఐ) స్కీం కింద కీలకమైన పదిరంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ అధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో వివిధ శాఖల అధికారులతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం మీడియాకు చెప్పారు. పీఎల్ఐ కింద విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సమీపంలో స్టీల్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలను ఉక్కు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రసికా చాబేకి వివరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద పరిశ్రమలశాఖ ప్రతిపాదించిన విశాఖలోని పూడిమడక వద్ద క్లస్టర్ ఏర్పాటుకు సహకరిస్తామని చౌబే హామీ ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు రెట్టింపవుతాయని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం సప్లై చైన్, ఎగుమతి వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిపారు. అనంతపురంలో అపెరల్ పార్కు, నగరిలో టెక్స్టైల్ పార్కులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ వంటి పదిరంగాల్లో థీమ్ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా అభివృద్ధి చేస్తున్న వివిధ నోడ్ల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉండటంపై డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమెషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మోహాపాత్ర రాష్ట్ర అధికారులను అభినందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలు, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడంపట్ల మన రాష్ట్ర కృషిని తైవాన్ ఇండియా ప్రతినిధి బాషన్ మెచ్చుకున్నారని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లాలో తాజాగా అపాచీ పెట్టుబడులు పెట్టడమే తైవానీయులకు ఆంధ్రప్రదేశ్ పట్ల గల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎల్ఐ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా అందులో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు రవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
వైద్య, ఆరోగ్య శాఖలో మళ్లీ క్లస్టర్ల వ్యవస్థ.
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి) :వైద్య, ఆరోగ్య శాఖలో పాలనా సౌలభ్యం కోసం, సిబ్బంది పనితీరును మెరుగు పరిచేందుకు, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు క్లస్టర్ల వ్యవస్థ మళ్లీ రాబోతోంది. ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రప్పించుకుంటోంది. గతంలో ఉన్న 26 కస్టర్లు 18కి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్లస్టర్లు వస్తే జిల్లా కేంద్రంలోని కాకినాడ ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోపాటు రాజమహేంద్రవరం, అమలాపురం, తుని ఆసుపత్రులపై భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన జీవో 2010లో జారీ అవగా జిల్లాలో 2011లో 24 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కోదాని కింద మూడు, నాలుగు పీహెచ్‌సీలు పని చేసేవి. ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్పీహెచ్వో పర్యవేక్షణ అధికారిగా ఉండేవారు. గత ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖలో పాలన గాడి తప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 127 పీహెచ్‌సీలున్నాయి. గతంలో మాదిరిగా 24 క్లస్టర్లు కాకుండా 12 క్లస్టర్లు మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. అందులో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం ,కొత్తపేట, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, తుని, పిఠాపురం, రామచంద్రపురం, గోకవరం, అడ్డతీగల, రంపచోడవరం, ఎటపాక, కూనవరం, కడియం, మండపేట, పెద్దాపురం, అనపర్తిలను క్లస్టర్ కేంద్రాలుగా చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాన్ని బట్టి 8 నుంచి 10 పీహెచ్‌సీలకు చోటు కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రతి క్లస్టర్‌కు ఇద్దరేసి డిప్యూటీ సివిల్ సర్జన్లను నియమించే విధంగా ప్రతిపాదనలు పంపించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక వాహనం ఏర్పాటు చేయనున్నారు. సదరు అధికారి ఆ వాహనంలో సంబంధిత పీహెచ్‌సీలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఆయా పీహెచ్‌సీల పరిధిలో నయంకాని వ్యాధులుంటే అక్కడి వైద్యులు క్లస్టర్ సెంటర్‌కు రిఫర్ చేస్తారు. అక్కడ గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, అనెస్తిస్టులుంటారు. సాధారణ ప్రసవాలతోపాటు సిజేరియన్ కాన్పులూ జరిపించేలా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కూడా వ్యాధి నయం కాని, క్లిష్టమైన కేసులను మాత్రమే ఏరియా, జిల్లా ఆసుపత్రి, సర్వజన వైద్యశాలలకు రిఫర్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఆసుపత్రులపై అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. క్లస్టర్ వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో 18 క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో అవసరమైన వైద్యులు, సిబ్బంది వివరాలను నివేదించాం. క్లస్టర్ల వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెరిగి రోగులకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. – డాక్టర్ బి.సత్యసుశీల,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
రైతు వేదికకు.. స్థలం కొరత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు సత్వర, మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయదలచిన రైతు వేదికలకు గ్రహణం వీడటం లేదు. నెలలు గడుస్తున్నా భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. వేదిక నిర్మాణానికి కావాల్సిన స్థల లభ్యత గగనంగా మారింది. ముఖ్యంగా మహానగర శివారు ప్రాంత మండలాల పరిధిలో భూమి అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలో మొత్తం 83 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్లో ఒక రైతు వేదికను ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాల్సిన బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి 20 గుంటల (అర ఎకరం) భూమి అవసరం. ఇప్పటివరకు 50 చోట్ల స్థలాలను గుర్తించి.. ఈ జాబితాను వ్యవసాయ శాఖకు పంపించారు. మిగిలిన 33 చోట్ల స్థలం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. క్లస్టర్ పరిధిలో రైతులందరికీ అనువైన ప్రాంతంలో స్థలం ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్నది ప్రభుత్వ భావన. అయితే అటువంటి ప్రాంతాల్లో జాగ దొరకడం లేదు. అంతేగాక హయత్‌నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో స్థల లభ్యత లేదు. దీంతో ఈ మండలాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందం గా తయారైంది. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సమన్వయ లోపం.. వ్యవసాయ శాఖలో సమన్వయం లోపం కూడా నిధుల విడుదలకు కాస్త అడ్డంకిగా మారింది. స్థలాలు గుర్తించిన చోట రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు.. వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే వీటిని కమిషనరేట్ తిరస్కరించినట్లు తెలిసిందే. రెవెన్యూ శాఖ గుర్తించిన స్థలాలను వ్యవసాయశాఖకు అప్పగిస్తేనే నిధులు విడుదల చేస్తామని కమిషనరేట్ స్పష్టం చేసింది. తొలుతే ఈ విషయాన్ని వెల్లడించి ఉంటే.. ఈ పాటికి ఆయా చోట్ల రైతు వేదికల నిర్మాణం మొదలయ్యేది. గుర్తించిన స్థలాలను తమకు అప్పగించాలని రెవెన్యూశాఖకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లేఖలు పంపారు. త్వరలో స్థలాలను స్వాధీనం చేసుకోనున్నారు. వేదికలతో మేలు.. 20 గుంటల విస్తీర్ణంలో రైతు వేదికను ఏర్పాటు చేస్తారు. ఒక్కో దానికి నిర్మాణానికి రూ.12 నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఈ భవనంలో మినీ భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పా టు చేస్తారు. అలాగే వ్యవసాయశాఖ విస్తరణాధికారికి (ఏఈఓ) ప్రత్యేక చాంబర్, రైతులు సమావేశాలు నిర్వహించడానికి వీలుగా మీటింగ్ హాల్, విశాలమైన పార్కింగ్ స్థలం, శిక్షణ తరగతులకు మరో హాల్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నది లక్ష్యం. తద్వారా స్థానికంగానే తమకు అవసరమైన పనులను అన్నదాతలు చక్కబెట్టుకోవచ్చు. -
డిగ్రీకి క్లస్టర్ పజిల్!
ప్రకాశం, బేస్తవారిపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలతో డిగ్రీ కళాశాలల విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలో 6వ సెమిస్టర్‌కు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైనల్ ఇయర్లో 5, 6 సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక.. అక్టోబర్‌లో 6వ సెమిస్టర్లో భాగంగా సీబీసీఎస్ (ఛాయిస్ బేస్డు క్రెడిట్ సిస్టమ్) క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తృతీయ సంవత్సరంలో ఆరు పేపర్లుంటాయి. సైన్స్ (బీఎస్సీ, బీజెడ్సీ) విద్యార్థులు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఎదైనా ఒక సబ్జెక్ట్‌లో మూడు పేపర్లను ఎంపిక చేసుకోవాలి, మిగిలిన మూడు పేపర్లు మూడు సబ్జెక్ట్‌ల్లో ఒక్కోటి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో లేని పుస్తకాలు ఆన్లైన్లో నవంబర్ నెలలో క్లస్టర్ పేపర్ల వివరాలు, సిలబస్‌ను యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. సిలబస్ పూర్తిగా కొత్తగా, లోతైన టాపిక్లతో ఉంది. దీనిని బోధించేందుకు సరైన పుస్తకాలు లేకపోవడంతో అధ్యాపకులు కూడా తలలు పట్టుకున్నారు. అందుబాటులో ఉన్న టాపిక్‌లను చెప్పి పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. అకాడమీ పుస్తకాలు, ప్రైవేట్ పబ్లికేషన్స్ క్లస్టర్ సిలబస్ పుస్తకాలను నేటికీ విడుదల చేయలేదు. యూనివర్సిటీ అనాలోచితన నిర్ణయం ఏడాది ప్రారంభంలో కాని, వచ్చే ఏడాదికాని క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింటే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఫైనల్ ఇయర్ మధ్యలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో సిలబస్ చెప్పలేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల వ్యవధి గడిచిపోయింది. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో కనీసం సగం సిలబస్ పూర్తి చేసే పరిస్థితి లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా.. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న తృతీయ సంవత్సర విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి, రెండో సంవత్సరాల్లో సబ్జెక్ట్‌లు మిగిలినా పెద్ద నష్టం ఉండదు. కానీ ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయితే పట్టా కోల్పోవాల్సిన వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్చిలో పరీక్షలు పెడితే తీవ్ర నష్టం ఇప్పటికి కూడా పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు పెడితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రాక్టిల్స్ ఉంటాయి. ఈనెల చివరికి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేసిన సిలబస్ పూర్తి చేసేందుకు సరైన సమయంలేదు. హడావుడిగా అధ్యాపకులు సిలబస్‌ను పూర్తిచేసిన విద్యార్థులు చదువుకునేందుకు సమయం ఉండదు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను మార్చిలో నిర్వహించకుండ వాయిదావేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. -
సీహెచ్సీఎన్లకు మంగళం
– ఇక ఆరోగ్య శాఖలో క్లస్టర్ వ్యవస్థ రద్దు – నిధుల మిగులుకే కోత – జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఒక్కో పథకాన్నీ రద్దు చేసుకుంటూ నిధులు మిగుల్చుకునేందుకు చూస్తున్న సర్కారు తాజాగా ఆరోగ్యశాఖలోని క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. సీహెచ్ఎన్సీ (కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్)ల నిర్వహణకు అయ్యే ఖర్చులు తగ్గించుకునేందుకు ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడింది. ఫలితంగా జిల్లాలో 18 సీహెచ్‌ఎన్‌సీలు మూతపడనున్నాయి. కనిగిరి: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశాఖలో సమన్వయాన్ని పెంపొందించి సత్వర సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు క్లస్టర్ వ్యవస్థను 2011లో ఏర్పాటు చేసింది. ఈక్రమంలో రాష్ట్రంలో 224 సీహెచ్ఎన్సీ (కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రì షన్ క్లస్టర్ ) కేంద్రాలను, జిల్లాలో 18 కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్లస్టర్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు డిప్యూటీ డీఎంహెచ్ఓ, కమ్యునిటీ హెల్త్ అధికారి, డిప్యూటీ పారామెడికల్ అధికారి, ఆప్తామాలిక్ అధికారి, హెల్త్ ఎడ్యుకేటర్, సబ్ యూనిట్ అధికారి, సీనియర్ అసిస్టెంట్ల రెగ్యులర్ పోస్టులను, డేటీ ఎంట్రీ ఆపరేటర్‌ను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. క్లస్టర్ వ్యవస్థ ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలు, నూతన వ్యాక్సిన్‌పై ప్రచారం వంటి కార్యక్రమాలు చేశారు. జిల్లాలోని 18 క్లస్టర్ కేంద్రాల ద్వారా 90 పీహెచ్‌సీల పర్యవేక్షణ జరిగేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల వీటిపై త్రిమ్యాన్ కమిటీని నియమించి వారి ద్వారా సర్వే చేయించి నివేదిక తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు క్లస్టర్స్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈనెల 5న ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి జీవో నం 78ని విడుదల చేసింది. ఈమేరకు ఆ జీవోకు అమలుకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి సర్క్యులర్ శనివారం జారీ చేసింది. బడ్డెట్ మిగుల్చుకునేందుకే క్లస్టర్ వ్యవస్థ రద్దు ప్రజలకు క్లస్టర్ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందుతున్నా.. కేవలం బడ్జెట్లో నిధులు మిగుల్చుకోవడానికే సీహెచ్‌ఎన్‌సీలు ఎత్తివేస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. సీహెచ్‌ఎన్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌వోకు వాహన ఖర్చు కోసం నెలకు రూ.24 వేలు బడ్జెట్ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రం మొత్తంలో దీని ఖర్చు కోట్లల్లో ఉంటుంది. సీహెచ్ సీఎన్లను ఎత్తివేస్తే రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు మిగలనున్నాయి. భవనాల సంగతేంటి.. కాగా ప్రభుత్వం గతంలో సీహెచ్సీఎన్ భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించింది. ఒక్కో కార్యాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. అయితే కొన్ని చోట్ల నూతన భవనాలు కట్టగా, మరి కొన్ని చోట్ల సీహెచ్‌సీ కేంద్రాల్లోని రూములను బాగు చేయించుకుని విధులు నిర్వహించారు. మరికొన్ని చోట్ల భవనాలు నిర్మాణం కాలేదు. అయితే నూతన భవనాలు నిర్మించిన చోట క్లస్టర్ వ్యవస్థ రద్దుతో భవనాలు నిరుపయోగం కానున్నాయి. ఆందోళనలో డేటా ఆపరేటర్లు: ప్రతి సీహెచ్‌ఎన్‌సీలో కాంట్రాక్ట్ పద్ధతిన ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించారు. ప్రభుత్వ చర్యలతో వారి పరిస్థితి గందరగోళంగా మారింది. రెగ్యులర్ పోస్టుల ఉద్యోగులు ఎక్కడో చోట ఉద్యోగం పొందినా.. కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన వారి ఉద్యోగాల పరిస్థితి ఏంటనే దానిపై ప్రభుత్వ నుంచి స్పష్టత రాలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఉద్యోగ సంఘాల నిరసన ప్రభుత్వం క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి, వివిధ పోస్టుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిని రీబ్యాక్ చేయడంపై వైద్య శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలతో పాటు, వారి పిల్లల చదువుకు సంబంధించి ఆకస్మిక బదిలీలతో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. క్లస్టర్ వ్యవస్థను ప్రారంభించినప్పుడు 2011లో కౌన్సెలింగ్ ద్వారా సీహెచ్ఎన్సీ ఉద్యోగుల పోస్టుల్లో నియమించారు. తిరిగి ఇప్పడు కూడా కౌన్సెలింగ్ ద్వారానే ఆయా ఉద్యోగుల పోస్టుల్లో నియామకాలు చేయాలని ఉద్యోగ సంఘాలు, ఎన్జీవో నాయకులు డిమాండ్ చేస్తున్నారు.