సీహెచ్‌సీఎన్‌లకు మంగళం
సీహెచ్‌సీఎన్‌లకు మంగళం
Published Mon, Jul 18 2016 3:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM
– ఇక ఆరోగ్య శాఖలో క్లస్టర్ వ్యవస్థ రద్దు
– నిధుల మిగులుకే కోత
– జీవో విడుదల చేసిన ప్రభుత్వం
ఒక్కో పథకాన్నీ రద్దు చేసుకుంటూ నిధులు మిగుల్చుకునేందుకు చూస్తున్న సర్కారు తాజాగా ఆరోగ్యశాఖలోని క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. సీహెచ్‌ఎన్‌సీ (కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్)ల నిర్వహణకు అయ్యే ఖర్చులు తగ్గించుకునేందుకు ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడింది. ఫలితంగా జిల్లాలో 18 సీహెచ్‌ఎన్‌సీలు మూతపడనున్నాయి.
కనిగిరి:
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశాఖలో సమన్వయాన్ని పెంపొందించి సత్వర సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు క్లస్టర్ వ్యవస్థను 2011లో ఏర్పాటు చేసింది. ఈక్రమంలో రాష్ట్రంలో 224 సీహెచ్‌ఎన్‌సీ (కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రì షన్ క్లస్టర్ ) కేంద్రాలను, జిల్లాలో 18 కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్లస్టర్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కమ్యునిటీ హెల్త్ అధికారి, డిప్యూటీ పారామెడికల్ అధికారి, ఆప్తామాలిక్ అధికారి, హెల్త్ ఎడ్యుకేటర్, సబ్ యూనిట్ అధికారి, సీనియర్ అసిస్టెంట్‌ల రెగ్యులర్ పోస్టులను, డేటీ ఎంట్రీ ఆపరేటర్‌ను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. క్లస్టర్ వ్యవస్థ ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలు, నూతన వ్యాక్సిన్‌పై ప్రచారం వంటి కార్యక్రమాలు చేశారు. జిల్లాలోని 18 క్లస్టర్ కేంద్రాల ద్వారా 90 పీహెచ్‌సీల పర్యవేక్షణ జరిగేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల వీటిపై త్రిమ్యాన్ కమిటీని నియమించి వారి ద్వారా సర్వే చేయించి నివేదిక తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు క్లస్టర్స్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈనెల 5న ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి జీవో నం 78ని విడుదల చేసింది. ఈమేరకు ఆ జీవోకు అమలుకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి సర్క్యులర్ శనివారం జారీ చేసింది.
బడ్డెట్ మిగుల్చుకునేందుకే క్లస్టర్ వ్యవస్థ రద్దు
ప్రజలకు క్లస్టర్ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందుతున్నా.. కేవలం బడ్జెట్‌లో నిధులు మిగుల్చుకోవడానికే సీహెచ్‌ఎన్‌సీలు ఎత్తివేస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. సీహెచ్‌ఎన్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌వోకు వాహన ఖర్చు కోసం నెలకు రూ.24 వేలు బడ్జెట్ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రం మొత్తంలో దీని ఖర్చు కోట్లల్లో ఉంటుంది. సీహెచ్ సీఎన్‌లను ఎత్తివేస్తే రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు మిగలనున్నాయి.
భవనాల సంగతేంటి..
కాగా ప్రభుత్వం గతంలో సీహెచ్‌సీఎన్ భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించింది. ఒక్కో కార్యాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. అయితే కొన్ని చోట్ల నూతన భవనాలు కట్టగా, మరి కొన్ని చోట్ల సీహెచ్‌సీ కేంద్రాల్లోని రూములను బాగు చేయించుకుని విధులు నిర్వహించారు. మరికొన్ని చోట్ల భవనాలు నిర్మాణం కాలేదు. అయితే నూతన భవనాలు నిర్మించిన చోట క్లస్టర్ వ్యవస్థ రద్దుతో భవనాలు నిరుపయోగం కానున్నాయి.
ఆందోళనలో డేటా ఆపరేటర్లు:
ప్రతి సీహెచ్‌ఎన్‌సీలో కాంట్రాక్ట్ పద్ధతిన ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించారు. ప్రభుత్వ చర్యలతో వారి పరిస్థితి గందరగోళంగా మారింది. రెగ్యులర్ పోస్టుల ఉద్యోగులు ఎక్కడో చోట ఉద్యోగం పొందినా.. కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన వారి ఉద్యోగాల పరిస్థితి ఏంటనే దానిపై ప్రభుత్వ నుంచి స్పష్టత రాలేదని ఆపరేటర్లు వాపోతున్నారు.
ఉద్యోగ సంఘాల నిరసన
ప్రభుత్వం క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి, వివిధ పోస్టుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిని రీబ్యాక్ చేయడంపై వైద్య శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలతో పాటు, వారి పిల్లల చదువుకు సంబంధించి ఆకస్మిక బదిలీలతో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. క్లస్టర్ వ్యవస్థను ప్రారంభించినప్పుడు 2011లో కౌన్సెలింగ్ ద్వారా సీహెచ్‌ఎన్‌సీ ఉద్యోగుల పోస్టుల్లో నియమించారు. తిరిగి ఇప్పడు కూడా కౌన్సెలింగ్ ద్వారానే ఆయా ఉద్యోగుల పోస్టుల్లో నియామకాలు చేయాలని ఉద్యోగ సంఘాలు, ఎన్జీవో నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement