జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి) :వైద్య, ఆరోగ్య శాఖలో పాలనా సౌలభ్యం కోసం, సిబ్బంది పనితీరును మెరుగు పరిచేందుకు, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు క్లస్టర్ల వ్యవస్థ మళ్లీ రాబోతోంది. ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రప్పించుకుంటోంది. గతంలో ఉన్న 26 కస్టర్లు 18కి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్లస్టర్లు వస్తే జిల్లా కేంద్రంలోని కాకినాడ ప్రభుత్వ సర్వజన వైద్యశాలతోపాటు రాజమహేంద్రవరం, అమలాపురం, తుని ఆసుపత్రులపై భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన జీవో 2010లో జారీ అవగా జిల్లాలో 2011లో 24 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కోదాని కింద మూడు, నాలుగు పీహెచ్‌సీలు పని చేసేవి. ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్‌పీహెచ్‌వో పర్యవేక్షణ అధికారిగా ఉండేవారు. గత ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖలో పాలన గాడి తప్పింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 127 పీహెచ్‌సీలున్నాయి. గతంలో మాదిరిగా 24 క్లస్టర్లు కాకుండా 12 క్లస్టర్లు మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. అందులో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం ,కొత్తపేట, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, తుని, పిఠాపురం, రామచంద్రపురం, గోకవరం, అడ్డతీగల, రంపచోడవరం, ఎటపాక, కూనవరం, కడియం, మండపేట, పెద్దాపురం, అనపర్తిలను క్లస్టర్ కేంద్రాలుగా చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాన్ని బట్టి 8 నుంచి 10 పీహెచ్‌సీలకు చోటు కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రతి క్లస్టర్‌కు ఇద్దరేసి డిప్యూటీ సివిల్ సర్జన్లను నియమించే విధంగా ప్రతిపాదనలు పంపించారు.
ప్రతి క్లస్టర్‌కు ఒక వాహనం ఏర్పాటు చేయనున్నారు. సదరు అధికారి ఆ వాహనంలో సంబంధిత పీహెచ్‌సీలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఆయా పీహెచ్‌సీల పరిధిలో నయంకాని వ్యాధులుంటే అక్కడి వైద్యులు క్లస్టర్ సెంటర్‌కు రిఫర్ చేస్తారు. అక్కడ గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, అనెస్తిస్టులుంటారు. సాధారణ ప్రసవాలతోపాటు సిజేరియన్ కాన్పులూ జరిపించేలా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కూడా వ్యాధి నయం కాని, క్లిష్టమైన కేసులను మాత్రమే ఏరియా, జిల్లా ఆసుపత్రి, సర్వజన వైద్యశాలలకు రిఫర్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఆసుపత్రులపై అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. క్లస్టర్ వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో 18 క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో అవసరమైన వైద్యులు, సిబ్బంది వివరాలను నివేదించాం. క్లస్టర్ల వ్యవస్థ వల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెరిగి రోగులకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది.
– డాక్టర్ బి.సత్యసుశీల,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment