విశాఖలో భారీ స్టీల్‌ క్లస్టర్ | Heavy steel cluster in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీ స్టీల్‌ క్లస్టర్

Published Thu, Jan 14 2021 4:33 AM | Last Updated on Thu, Jan 14 2021 8:43 PM

Heavy steel cluster in Visakhapatnam - Sakshi

ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రసికా చౌబేతో పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం

సాక్షి, అమరావతి: తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే విధంగా విశాఖలో భారీ స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకోసం విశాఖ సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్‌ఐ) స్కీం కింద కీలకమైన పదిరంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ అధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో వివిధ శాఖల అధికారులతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రమణ్యం మీడియాకు చెప్పారు.

పీఎల్‌ఐ కింద విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సమీపంలో స్టీల్‌ క్లస్టర్‌ ఏర్పాటు ప్రతిపాదనలను ఉక్కు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రసికా చాబేకి వివరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద పరిశ్రమలశాఖ ప్రతిపాదించిన విశాఖలోని పూడిమడక వద్ద క్లస్టర్‌ ఏర్పాటుకు సహకరిస్తామని చౌబే హామీ ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు రెట్టింపవుతాయని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం సప్లై చైన్, ఎగుమతి వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిపారు. అనంతపురంలో అపెరల్‌ పార్కు, నగరిలో టెక్స్‌టైల్‌ పార్కులతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్‌ వంటి పదిరంగాల్లో థీమ్‌ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా అభివృద్ధి చేస్తున్న వివిధ నోడ్‌ల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉండటంపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమెషన్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మోహాపాత్ర రాష్ట్ర అధికారులను అభినందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలు, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడంపట్ల మన రాష్ట్ర కృషిని తైవాన్‌ ఇండియా ప్రతినిధి బాషన్‌ మెచ్చుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో తాజాగా అపాచీ పెట్టుబడులు పెట్టడమే తైవానీయులకు ఆంధ్రప్రదేశ్‌ పట్ల గల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎల్‌ఐ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా అందులో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు రవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement