
కళాశాల ప్రిన్సిపాల్‌ను నిలదీస్తున్న విద్యార్థిని
- మాధ్యమం మార్పులో నిర్లక్ష్య వైఖరంటూ ఆరోపణ
- పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన వైనం
వేములవాడ : ఇంగ్లిష్ మీడియం విద్యనభ్యసించిన తమను తెలుగు మీడియంగా పరిగణించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని కె.వి డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మద్దతిచ్చిన ఏబీవీపీ విద్యార్థుల తరఫున యాజమాన్యాన్ని నిలదీసింది. మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. 2013-14 విద్యాసంవత్సరం ఓ గ్రూప్‌లో డిగ్రీ ఫస్టియర్‌లో 43 మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో అభ్యసించారు. పరీక్షల సమయంలో వీరికి తెలుగు మాధ్యమంలో ప్రశ్నపత్రాలు రావడంతో ఖంగుతిన్నారు.
ఈ విషయమై యాజమాన్యాన్ని నిలదీయగా యూనివర్సిటీ అధికారుల తప్పిదంతో ప్రశ్నపత్రాలు తెలుగులో వచ్చాయని మెమోల్లో ఇంగ్లిష్ మీడియంగా వస్తుందని విద్యార్థులకు నచ్చజెప్పడంతో పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లోనూ తెలుగు మీడియంగా రావడంతో ఏబీవీపీ నాయకులను ఆశ్రయించారు. అంతా కలిసి కళాశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయమై కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా జవాబివ్వడంతో మాటామాటా పెరిగి దాడికి దారితీసింది.
ఈ దాడిలో కళాశాల కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసమైంది. సమాచారమందుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం దాడికి కారణమైన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో విద్యార్థినులంతా పోలీసు జీపును అడ్డగించారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.