నంద్యాల, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందిని అవయవదానానికి ఒప్పించే లక్ష్యంతో సాగుతున్నట్లు సెట్కూరు పీడీ రమణయ్య తెలిపారు. నంద్యాలలో మంగళవారం నిర్వహించిన యువజన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు.
వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువకులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారోత్సవాలకు హాజరయ్యే వారిని అవయవదానానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 600 మంది ముందుకు వచ్చారని చెప్పిన పీడీ ఈ జాబితాలోకి ఐదువేల మంది చేరేలా కృషి చేస్తున్నామన్నారు. రక్తదాన కార్యక్రమాల ద్వారా 15వందల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అవయవలోపాలు, రక్తం లేకపోవడం కారణంగా మరణానికి దగ్గరవుతున ్న వారికి ఊపిరి పోసే ఈ కార్యక్రమానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.
రాజీవ్ యువశక్తి యూనిట్లు మంజూరు...
రాజీవ్ యువశక్తి పథకం కింద జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 510 యూనిట్లు మంజూరైనట్లు పీడీ రమణ తెలిపారు. ఇందుకోసం రూ. 5.01 కోట్లు కేటాయించారని, ఇందులో రూ. 1.55 లక్షల సబ్సిడీ ఉంటుందని తెలిపారు. 30 శాతం మించి సబ్సిడీ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. గత ఏడాది రూ. 4.5 కోట్లతో 450 యూనిట్లు కేటాయించగా 526 యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ సారి కూడా 510 యూనిట్ల కంటే అధికంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఈ ప్రక్రియ ముగిస్తామన్నారు.
మార్చిలో ఆర్మీ రిక్రూర్ట్‌మెంట్లు..
సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగుల కోసం వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 22వతేది వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగ జరుగుతుందన్నారు. ఇప్పటికే ర్యాలీలు, ఇతర చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నదని, అయితే సమైక్యాంధ్ర ఆందోళనలతో దీనిని వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటి నుంచే సైన్యానికి ఎంపికయ్యే అంశాలపై శిక్షణను పొందడానికి ప్రయత్నం చేస్తామని రమణయ్య తెలిపారు.
అవయవదానంపై చైతన్యం తెస్తాం
Published Wed, Nov 20 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement