Nandayala
-
జయసూర్య Vs బైరెడ్డి: నందికొట్కూరు టీడీపీలో రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గమన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య సవాల్ విసిరారు.బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి కాదని.. బైరెడ్డి టీడీపీ కండువా కప్పుకోలేదు.. నందికొట్కూరు రాజకీయంలో తలదూర్చి పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోం’’ అంటూ జయసూర్య హెచ్చరించారు. నా ఓటమికి కృషి చేసిన వ్యక్తులలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరు. ఎంపీ తండ్రిగా నియోజకవర్గంలో పెత్తనం చేయాలంటే కుదరదు. నియోజకవర్గ పరిధిలోని నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ బైరెడ్డికి జయసూర్య సవాల్ విసిరారు. -
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
సాక్షి, నంద్యాల: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. బయటపడిన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు.గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం బయటపడింది. గతంలో పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో పలు తామ్ర శాసనాలు బయటపడ్డాయి. -
అఖిల ప్రియVs ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌పై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిల ప్రియ ర్యాలీగా బయలుదేరగా, ర్యాలీలో వెళ్తుండగా ఏవీ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్, రిలయన్స్ మార్ట్ పై అఖిల ప్రియ అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాల విషయం తెలిసిందే. గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇటీవల ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డుపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. -
ముస్లిం యువకులపై టీడీపీ సర్కార్ కన్నెర్ర
-
ఎంసెట్ పైనే గురి
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంసెట్-2014 పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించాలనేది గురివిరెడ్డి టార్గెట్. అయితే అప్పులు తీర్చడానికి వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలను ఎన్నుకున్నట్లు తెలిసింది. ఇతని ముఠాలోని మరో నల్గురు సభ్యులను గురువారం నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బ్లూటూత్ సామగ్రి, రూ.90వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు చెందిన గురివిరెడ్డి ఇంటర్ పూర్తయ్యాక, మూడేళ్లకు 2005లో మెడిసిన్ సీటును సంపాదించాడు. అప్పట్లోనే మాస్ కాపీయింగ్‌కు పాల్పడి సీటు సంపాదించాడని పోలీసులు అనుమానం. శాంతిరాం మెడికల్ కాలేజీలో చదివిన గురివిరెడ్డి క్లాసులకు వెళ్లేవాడు కాదు. మెడిసిన్ విద్య చదువుతున్నా ఆధునిక టెక్నాలజీపై ఆసక్తి. టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను కొనేవాడు. 2010లో అతని విద్యాసంవత్సరంలో పూర్తయినా, కొన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. 2010లో బ్లూటూత్ టెక్నాలజీతో మెడికల్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడానికి యత్నించాడు. తర్వాత 2012లో చండీఘడ్ మెడికల్ వర్సిటీలో పీజీ కోర్సులు ప్రశ్నాపత్రం లీకేజీకి విఫల యత్నం చేసి, కటకటాల పాలయ్యాడు. ఈ కేసుతో శాంతిరాం మెడికల్ కాలేజీ యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది. 2014 మెడికల్ పరీక్ష టార్గెట్... ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-2014ను గురివిరెడ్డి టార్గెట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2010లో ఆయన మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీకి, మాస్ కాపీయింగ్‌కు విఫలయత్నం చేశారు. ఇదే రీతిలో మెడికల్ ఎంట్రెన్స్ 2014 ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడానికి పథకం వేశాడు. కాని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడటంతో రూ.లక్షల్లో అప్పులయ్యారు. అప్పులు అధికం కావడంతో ఏదో ఒకటి చేసి వాటిని తీర్చాలని నిర్ణయించాడు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్ఓ పరీక్షలు షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఈ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడి, అప్పులు తీర్చాలని నిర్ణయించినట్లు తెలసింది. అత్యాశనే కొంపముంచింది.... వీఆర్ఓ, వీఆర్ఏ ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌కు గురివిరెడ్డి అతని స్నేహితుడు, ప్రముఖ న్యాయవాది కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్యాంగ్‌తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి కడప, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల్లోని స్నేహితుల ద్వారా అభ్యర్థులకు ఎరవేశారు. ఒక్క అభ్యర్థితో రూ.3లక్షల మేరకు ఒప్పందం కుదుర్చుకొని, రూ.20వేల నుంచి రూ.50వేల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. పద్మావతినగర్‌లోని నాగిరెడ్డి అపార్ట్‌మెంట్స్‌లో ప్రశ్నపత్రం లీకేజీ, మాస్ కాపీయింగ్ బ్లూటూత్ ఉపయోగించడం గురించి అభ్యర్థులను వివరించడం ప్రారంభించారు. అప్పులు తీర్చేందుకు డబ్బు ఎక్కువ కావాలనే అత్యాశతో దాదాపు 50మంది అభ్యర్థుల నుంచి అడ్వాన్స్ తీసుకోవడంతో పథకం లీకై పోలీసులు వరకు వెళ్లింది. డబ్బు ఆశతో కటకటాలపాటు.. ప్రదీప్‌రెడ్డి కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఎస్బీఐ కాలనీకిచెందిన కంసాలి కిరణ్‌కుమార్ ప్రదీప్‌రెడ్డికి స్నేహితుడు, తిరుపతికి చెందిన దత్తలూరి రాకేష్ చౌదరి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా, ఇతని నెల్లూరుకు చెందిన కొమ్మి కిరణ్‌కుమార్ స్నేహితుడు.. వీరిద్దరూ గురివిరెడ్డి అనుంగు మిత్రులు. డబ్బుపై ఆశతో అతన్ని నమ్మి కటకటాల పాలయ్యాడు. అయితే ఘరానా మోసగాడైన గురివిరెడ్డికి చత్వారం. కంటి అద్దాలను తీసివేస్తే ఎదుటి వ్యక్తిని సరిగ్గా గుర్తు పట్టకపోవడం విశేషం. -
ఆకలవుతోంది.. లేమ్మా..!
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: చందమామ కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తేనే కాని తినసి పసి కూనలు వారు. ఈ ఐదుగురికి అమ్మే ప్రపంచం. అయితే ఆ అమ్మ ఇకలేదని వారికి తెలియదు. ఆమె మృతదేహంపై వారు .. అమ్మా.. ఆకలవుతుంది.. అంటూ రోదిస్తుంటే స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. డోన్‌కు చెందిన వరలక్ష్మికి, దేవనగర్‌కు చెందిన రంగస్వామికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రంగస్వామి బీరువాల తయారీ సంస్థలో కూలీగా పని చేసేవాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానంకాగా అందరూ ఆరేళ్లలోపు చిన్నారులు. వరలక్ష్మి వీరిని అల్లారుముద్దుగా పెంచేది. అయితే మూడేళ్ల క్రితం ఆమె ఆడపడుచు లక్ష్మిదేవి మృతి చెందడంతో, ఇద్దరు కుమారులు అనాథలయ్యాయి. వీరిద్దరినీ వరలక్ష్మి అక్కున చేర్చుకొని ప్రేమాభిమానాలను పంచిపెట్టింది. బిడ్డలకు ఏలోటు లేకుండా చూసుకునేది. శుక్రవారం రాత్రి ఇంటి వ్యవహారాల్లో వరలక్ష్మి, రంగస్వామిల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో వీరిద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి తొలగించారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. అయితే ఈవిషయం తెలియని చిన్నారులు లే అమ్మా.. పాలు ఇవ్వు.. ఆకలవుతుంది.. అంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. త్రీటౌన్ సీఐ దైవప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నేను మోనార్క్‌ని..!
* నంద్యాలలో ఓ అధికారి వింత ప్రవర్తన * ఆలయానికి వెళ్తే భక్తులెవరూ ఉండకూడదట..! * సినిమాకెళ్తే ఇరువైపులా 20కుర్చీలు ఖాళీ * పనిచేయాలంటే..పర్సెంటేజీలు ఇవాల్సిందే..! * ఎమ్మెల్యే అనుచరుడిగా మంచి గుర్తింపు నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: అన్న నడిచొస్తే మాస్.. అన్న నిల్చుంటే మాస్ అని ఓ సినిమా పాట. దీనిని నంద్యాల ప్రజలు తిప్పిపాడుకుంటున్నారు.. ఆ అధికారి నడిచొస్తే హడల్.. నిల్చుంటే బెదుర్.. అంటూ రాగం తీసుకున్నారు. ప్రజా సమస్యలు వింటూ..వాటిని పరిష్కరించాల్సిన అధికారి ఆయన.. అయితే ఆయన వద్దకు వెళ్లేందుకు ప్రజలే కాదు కిందిస్థాయి సిబ్బంది సైతం జంకుతున్నారు. తన రూటను సప‘రేటు’గా మార్చుకున్న ఆ అధికారి వ్యవహారం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆలయానికి వెళ్తే ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకాలి, పూజలు చేసేటప్పుడు పూజారి తప్ప ఎవరూ ఉండకూడదు. లేకపోతే సిబ్బందికి చీవాట్లు తప్పవు. సినిమాకు వెళ్తే, ఆయన పక్కన ప్రేక్షకులు ఎవరూ కూర్చోరాదు. ఇరువైపులా ఇరువై కుర్చీలు ఖాళీగా ఉండాలి. మోనార్క్‌లా వింత ప్రవర్తనతో ఈ అధికారి సిబ్బందికి నరకం చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఈ అధికారి పొరుగు జిల్లాకు చెందిన వారు. గతంలో నంద్యాలలో పని చేసి, అవినీతి అరోపణలు ఎదుర్కొని బదిలీ అయిన ఒక అధికారి ఈయనకు గురువు. ఆయన సలహా మేరకు, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ పైరవీలు చేసి, ఏడాది క్రితం తనకు ఎలాంటి అనుభవం లేని శాఖకు అధికారిగా వచ్చారు. కేవలం నాలుగు గోడలకే పరిమితమై, అంతో ఇంతో మామూళ్లతో సంతృప్తి పొందుతున్న ఈ అధికారికి నంద్యాల కామధేనువు, కల్పవృక్షంలా కనిపించింది. ఒక్కసారిగా పట్టణ ప్రముఖ అధికారిగా గుర్తింపు రావడం, మీడియాలో మంచి పబ్లిసిటీ రావడంతో ఆయనలో అహం పెరిగి, వింత ప్రవర్తనకు దారి తీసింది. వేదికలపై మంచి సూక్తులను చెప్పే ఈ అధికారి ప్రవర్తన వింతగా ఉంది. ఇటీవల ఆయన నందవరం చౌడేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆయన లోపలికి వెళ్లాక, ఎవరూ పూర్ణకుంభంతో స్వాగతం చెప్పలేదని, కార్య నిర్వహణాధికారిని పిలిపించమని తన శాఖ సిబ్బందిపై ఆగ్రహం చెందారు. అమ్మవారి గర్భగుడి వద్ద ఆయనతో పాటు మరికొందరు భక్తులు పూజలు చేస్తుంటే అధికారికి కోపం వచ్చింది. తాను పూజ చేసేటప్పడు పూజారి తప్ప ఎవరూ ఉండకూడదని, బయటకు పంపివేయమని తన సిబ్బందిని చౌడేశ్వరీ మాత సమక్షంలోనే పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషించారు. ఒక ప్రముఖ హీరో చిత్రం రిలీజైన నాల్గో ఆయన థియేటర్‌కు వెళ్లాడు. ఆయన అడుగులకు మడుగులలొత్తే సిబ్బంది అడ్వాన్స్ బుకింగ్ చేశారు. కాని అధికారి థియేటర్లోకి వచ్చి.. ‘‘నేను ప్రేక్షకుల మధ్య కూర్చోనడం ఏమిటి, మీకు బుద్ధి ఉందా, నేను ఎవరో, నా స్థాయిలో ఎవరో తెలియదా..’’ అంటూ శివాలెత్తారు. ఆయన కుర్చీకి ఇదరువైపులా ఇరువైసీట్లను ఖాళీ చేయించడంతో ఆయన శాంతించి సినిమా చూశారు. ఈ అధికారి వింత ప్రవర్తన చూసే సిబ్బంది తలపట్టుకుంటున్నారు. సిబ్బంది ఇతని తిట్లను భరించలేక, లోపలు దాచుకోలేక, బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. హైదరాబాద్‌కు కూరగాయలు, మాంసం... ఈ అధికారి నంద్యాలలో విధులు నిర్వహిస్తుండగా కుటుంబం హైదరాబాద్‌లో ఉంది. ప్రతిరోజూ ఉదయం నంద్యాల పట్టణంలో రోడ్ల పక్కన రూ.2 దోశెలను తింటున్నారు. కేవలం ధనార్జన కోసమే హైదరాబాద్ నుంచి ఇక్కడి వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఇటీవల రహస్యంగా ఇద్దరు సిబ్బంది ద్వారా 20 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను గుట్టుచప్పుడు కాకుండా నియమించారు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ.75వేల వసూలు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే శిల్పామోమన్రెడ్డికి ఈ అధికారి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఈ అధికారి హైదరాబాద్ వెళ్లేటప్పుడు కూరగాయలు, బియ్యం, నిత్యావర వస్తువులు, మాంసంను ఒక విభాగం సిబ్బంది పంపుతున్నట్లు సమాచారం. ఈ అధికారి వేధింపులు భరించలేక, మాముళ్లను సమర్పించుకోలేక డిప్యూటేషన్ గడువు ఎప్పుడు పూర్తవుతుందో, ఆయన తిరిగి హైదరాబాద్‌కు ఎప్పుడు వెళ్తారోనని సిబ్బంది దేవుళ్ల మొక్కుకుంటున్నారు. కాని నంద్యాలను వదల్లేని ఈ అధికారి మరో ఏడాది డిప్యూటేషన్‌ను కొనసాగించుకోవడానికి పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. -
ఉచిత వైద్యం.. ఉపాధికి ప్రాధాన్యం
నంద్యాల, న్యూస్‌లైన్: అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమానాగిరెడ్డి తెలిపారు. ఇందుకోసం పలు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ వివరాలను విలేకరులకు వివరించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీ ప్రణాళికను అమలులోకి తెస్తారన్నారు. దానితోపాటు నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నికల మ్యానిఫెస్టోను తాను రూపొందించినట్లు భూమా తెలిపారు. వార్డు పర్యటనలో వచ్చిన సమస్యలను కూడా ఇందులో చేరుస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. వార్డుకు 200 నుంచి 300 మధ్యన నిరుపేదలను ఎన్నుకొని పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో పదివేల మందికి నివాస గృహాలను అపార్ట్మెంట్ పద్ధతి నిర్మిస్తామని భూమా నాగిరెడ్డి చెప్పారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లోని అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బొమ్మలసత్రం, ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్, నూనెపల్లె, ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీచౌక్‌లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. అందులో ప్రయాణీకులకు, ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా మీటింగ్ హాల్, క్యాంటిన్, ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ, ఫోన్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఫోన్‌కాల్‌తో ఆటో ఇంటి ముందు వాలే విధంగా చూస్తామన్నారు. పట్టణంలోని మురుగునీటిని కుందూనది ఒడ్డుకు చేర్చి అక్కడే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదలందరికీ ఇంటి వద్దకే ఉచితంగా మినరల్ వాటర్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులందరూ ఇంటి వద్దనే పింఛన్లు అందుకునేలా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను, రైతులకు కల్తీలేని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందజేస్తామన్నారు. గాంధీచౌక్‌లోని కూరగాయల మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పూలు, పండ్లు, కూరగాయలకు ప్రత్యేక మార్కెట్ వసతిని కల్పిస్తామన్నారు. ైబె ర్మల్వీధి, కల్పనాసెంటర్, మెయిన్ బజార్లను వాక్స్ట్రీట్లుగా ప్రకటించి వాహనదారులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాక్స్ట్రీట్లలో వాహనాలకు అనుమతిస్తామన్నారు. ఇళ్లపై వేలాడే హైపర్‌టెన్షన్ తీగలను తొలగిస్తామన్నారు. ఆటోనగర్‌తోపాటు పట్టణంలోను, గ్రామాల్లోని ప్రతి వీధిలో సిమెంట్ రహదారి, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామన్నారు. చేతి వృత్తుదారులు.. వివిధ వర్గాల వారికి ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి గడపగడపకు వైఎస్ఆర్సీపీ.. వచ్చేనెల 5వ తేదీ నుంచి పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రతివార్డులో పర్యటించాలని నిర్ణయించినట్లు భూమా తెలిపారు. వచ్చేనెల 2వ తేదీన డయల్ యువర్ భూమా కార్యక్రమంలో ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తానన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. -
కల్లోల కాంగ్రెస్
నంద్యాల, న్యూస్‌లైన్: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారవుతోంది కాంగ్రెస్ పరిస్థితి. కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం ఆ పార్టీ నేతలను ఇప్పటికే ఇరుకున పడేసింది. తాజాగా నేతల్లోని అనైక్యత ఆ పార్టీ మూలాలను కుదిపేస్తోంది. కీలక ప్రాంతమైన నంద్యాల నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారడంతో కింది స్థాయి కేడర్ కలవరపడుతోంది. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా మోహనరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తుతున్న విభేదాలే ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు నంద్యాల మార్కెట్ యార్డు పాలక మండలి కార్యవర్గం నియామకం, నంద్యాలలో శిల్పా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏరాసు వర్గీయుల ‘మార్కెట్ మంట’ తాజాగా ఏర్పాటైన నంద్యాల మార్కెట్ యార్డు పాలక వర్గంలో మంత్రి ఏరాసు మద్దతుదారులు ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో అంతా ఎమ్మెల్యే శిల్పామోహనరెడ్డి వర్గీయులే ఉండటంతో ఇది ఎంత వరకు సమంజసమనీ.. ఆయన సమైక్య ఉద్యమానికి మద్దతు పేరిట తమ అధినేత్రి సోనియా గాంధీనే ధిక్కరించారని ఏరాసు మద్ధతుదారుల వాదన. దీంతో శ్రీశైలం నియోజకవర్గంలోని కాంగ్రెసు కేడర్ మండి పడుతోంది. ఈ మార్కెట్ యార్డు పరిధిలోకి మహానంది, బండిఆత్మకూరు.. పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల, పాణ్యం మండలాలు కూడా వస్తాయి. మొత్తం 15 మంది సభ్యులతో పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పాణ్యం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు, నంద్యాల నియోజకవర్గానికి చెందిన 12 మందితో కలిపి పాలక మండలిని నియమించారు. శిల్పా అనుచరుడు న్యాయవాది సిద్ధం శివరాం యార్డు చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ నియామకం మంత్రి వర్గీయుల ఆగ్రహానికి కారణమవుతోంది. కాగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి కూడా ఈ పదవి కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఎమ్మెల్యే కాటసాని అనుచరుడిగా ఆయన ఈ పదవికి ప్రయత్నం చేశారు. అయితే చైర్మన్ పదవి ఇవ్వడానికి శిల్పా, ఏరాసులు సానుకూలంగా స్పందించకపోవడంతో పదవి దక్కలేదని తెలుస్తోంది. మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన వారిపేర్లు అందకపోవడం వల్లే వారికి పాలక మండలిలో అవకాశం కల్పించలేక పోయామని ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి విలేకరుల వద్ద వెల్లడించడం గమనార్హం. ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో సైతం... మరోవైపు మంత్రి ఏరాసుకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎమ్మెల్యేలు శిల్పామోహనరెడ్డి, కాటసానిల మధ్య కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. శిల్పా ఆధ్వర్యంలో జరిగిన వృషభ ప్రదర్శనలకు రాంభూపాల్ రెడ్డి మొహం చాటేయడమే దీనికి ఉదాహరణని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాటసాని అదే సమయంలో ఓ తన సన్నిహితుని వివాహానికి హాజరైనా పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే ఆయనను రప్పించేందుకు శిల్పా తన సమీప వ్యక్తుల ద్వారా ప్రయత్నించినా వ్యక్తిగతంగా ఆయన పిలవ లేదన్న కారణంగా కాటసాని పోటీలకు దూరంగా ఉన్నట్లు భోగట్టా. ఈ విషయంలో కాటసాని హాజరయ్యేలా చూసేందుకు కొందరు కార్యకర్తలు యత్నించినా ఆయన వారి ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇలా వీరి విభేదాలు బయటపడడంతో కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. మొత్తం మీద మంత్రి ఏరాసుకు వ్యతిరేకంగా జతకట్టిన శిల్పా, కాటసానిల మధ్య కూడా ఇటీవల విభేదాలు తలెత్తాయా అనే అనుమానం వృషభ ప్రదర్శకుల మధ్య చర్చ సాగింది. అంతేగాక రెండు మాసాల క్రితం సమైక్యాంధ్ర కోసం కర్నూలులో కాటసాని రాంభూపాల్‌రెడ్డి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర దీక్ష కొనసాగించిన సమయంలో శిల్పా అటువైపు కన్నెత్తి చూడలేదని.. ఇది కూడా కాటసాని ఆగ్రహానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా అప్పటిలోనే నంద్యాల పట్టణంలో శిల్పా నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో కాటసానికి ఆయన ఫోన్ చేసి శిబిరం దగ్గరికి రావాలని కోరారని.. ఆయన దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించారనీ.. ఈ విభేదాల నేపథ్యంలోనే వృషభ ప్రదర్శనలకు కాటసాని దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఇలా ఈ నేతల వివాదం కాంగ్రెస్‌ను మరింత కుంగదీసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అవయవదానంపై చైతన్యం తెస్తాం
నంద్యాల, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందిని అవయవదానానికి ఒప్పించే లక్ష్యంతో సాగుతున్నట్లు సెట్కూరు పీడీ రమణయ్య తెలిపారు. నంద్యాలలో మంగళవారం నిర్వహించిన యువజన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువకులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారోత్సవాలకు హాజరయ్యే వారిని అవయవదానానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 600 మంది ముందుకు వచ్చారని చెప్పిన పీడీ ఈ జాబితాలోకి ఐదువేల మంది చేరేలా కృషి చేస్తున్నామన్నారు. రక్తదాన కార్యక్రమాల ద్వారా 15వందల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అవయవలోపాలు, రక్తం లేకపోవడం కారణంగా మరణానికి దగ్గరవుతున ్న వారికి ఊపిరి పోసే ఈ కార్యక్రమానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు. రాజీవ్ యువశక్తి యూనిట్లు మంజూరు... రాజీవ్ యువశక్తి పథకం కింద జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 510 యూనిట్లు మంజూరైనట్లు పీడీ రమణ తెలిపారు. ఇందుకోసం రూ. 5.01 కోట్లు కేటాయించారని, ఇందులో రూ. 1.55 లక్షల సబ్సిడీ ఉంటుందని తెలిపారు. 30 శాతం మించి సబ్సిడీ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. గత ఏడాది రూ. 4.5 కోట్లతో 450 యూనిట్లు కేటాయించగా 526 యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ సారి కూడా 510 యూనిట్ల కంటే అధికంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఈ ప్రక్రియ ముగిస్తామన్నారు. మార్చిలో ఆర్మీ రిక్రూర్ట్మెంట్లు.. సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగుల కోసం వచ్చే ఏడాది మార్చి 15 నుంచి 22వతేది వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగ జరుగుతుందన్నారు. ఇప్పటికే ర్యాలీలు, ఇతర చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నదని, అయితే సమైక్యాంధ్ర ఆందోళనలతో దీనిని వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటి నుంచే సైన్యానికి ఎంపికయ్యే అంశాలపై శిక్షణను పొందడానికి ప్రయత్నం చేస్తామని రమణయ్య తెలిపారు.