ఎంసెట్ పైనే గురి | Eamcet 2014 exams | Sakshi
Sakshi News home page

ఎంసెట్ పైనే గురి

Published Fri, Feb 7 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

Eamcet 2014 exams

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంసెట్-2014 పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించాలనేది గురివిరెడ్డి టార్గెట్. అయితే అప్పులు తీర్చడానికి వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలను ఎన్నుకున్నట్లు తెలిసింది. ఇతని ముఠాలోని మరో నల్గురు సభ్యులను  గురువారం నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బ్లూటూత్ సామగ్రి, రూ.90వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు చెందిన గురివిరెడ్డి ఇంటర్ పూర్తయ్యాక, మూడేళ్లకు 2005లో మెడిసిన్ సీటును సంపాదించాడు. అప్పట్లోనే మాస్ కాపీయింగ్‌కు పాల్పడి సీటు సంపాదించాడని పోలీసులు అనుమానం. శాంతిరాం మెడికల్ కాలేజీలో చదివిన గురివిరెడ్డి క్లాసులకు వెళ్లేవాడు కాదు. మెడిసిన్ విద్య చదువుతున్నా ఆధునిక టెక్నాలజీపై ఆసక్తి. టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను కొనేవాడు. 2010లో అతని విద్యాసంవత్సరంలో పూర్తయినా, కొన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. 2010లో బ్లూటూత్ టెక్నాలజీతో మెడికల్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడానికి యత్నించాడు. తర్వాత 2012లో చండీఘడ్ మెడికల్ వర్సిటీలో పీజీ కోర్సులు ప్రశ్నాపత్రం లీకేజీకి విఫల యత్నం చేసి, కటకటాల పాలయ్యాడు. ఈ కేసుతో శాంతిరాం మెడికల్ కాలేజీ యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది.
 
 2014 మెడికల్ పరీక్ష టార్గెట్...
 ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-2014ను గురివిరెడ్డి టార్గెట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2010లో ఆయన మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీకి, మాస్ కాపీయింగ్‌కు విఫలయత్నం చేశారు. ఇదే రీతిలో మెడికల్ ఎంట్రెన్స్ 2014 ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడానికి పథకం వేశాడు. కాని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడటంతో రూ.లక్షల్లో అప్పులయ్యారు. అప్పులు అధికం కావడంతో ఏదో ఒకటి చేసి వాటిని తీర్చాలని నిర్ణయించాడు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్‌ఓ పరీక్షలు షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఈ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడి, అప్పులు తీర్చాలని నిర్ణయించినట్లు తెలసింది.
 
 అత్యాశనే కొంపముంచింది....
 వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌కు గురివిరెడ్డి అతని స్నేహితుడు, ప్రముఖ న్యాయవాది కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్యాంగ్‌తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి కడప, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల్లోని స్నేహితుల ద్వారా అభ్యర్థులకు ఎరవేశారు. ఒక్క అభ్యర్థితో రూ.3లక్షల మేరకు ఒప్పందం కుదుర్చుకొని, రూ.20వేల నుంచి రూ.50వేల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. పద్మావతినగర్‌లోని నాగిరెడ్డి అపార్ట్‌మెంట్స్‌లో ప్రశ్నపత్రం లీకేజీ, మాస్ కాపీయింగ్ బ్లూటూత్ ఉపయోగించడం గురించి అభ్యర్థులను వివరించడం ప్రారంభించారు. అప్పులు తీర్చేందుకు డబ్బు ఎక్కువ కావాలనే అత్యాశతో దాదాపు 50మంది అభ్యర్థుల నుంచి అడ్వాన్స్ తీసుకోవడంతో పథకం లీకై పోలీసులు వరకు వెళ్లింది.
 
 డబ్బు ఆశతో కటకటాలపాటు..
 ప్రదీప్‌రెడ్డి కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఎస్‌బీఐ కాలనీకిచెందిన కంసాలి కిరణ్‌కుమార్ ప్రదీప్‌రెడ్డికి స్నేహితుడు, తిరుపతికి చెందిన దత్తలూరి రాకేష్ చౌదరి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా, ఇతని నెల్లూరుకు చెందిన కొమ్మి కిరణ్‌కుమార్ స్నేహితుడు.. వీరిద్దరూ గురివిరెడ్డి అనుంగు మిత్రులు. డబ్బుపై ఆశతో అతన్ని నమ్మి కటకటాల పాలయ్యాడు. అయితే ఘరానా మోసగాడైన గురివిరెడ్డికి చత్వారం. కంటి అద్దాలను తీసివేస్తే ఎదుటి వ్యక్తిని సరిగ్గా గుర్తు పట్టకపోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement