eamcet 2014
-
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
-
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఎంసెట్-2014 కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యం లో ఏర్పడిన వివాదాలతో పెండింగ్‌లో పడిన కౌన్సెలింగ్ నిర్వహణకు సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గం సుగమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం బాలుర పాలిటెక్నిక్, దర్గామిట్టలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద యం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్ విధానంలో జరిగే కౌన్సెలింగ్‌కు మొదటి రోజు ఒకటి నుంచి 5 వేలు ర్యాంకు సాధించిన విద్యార్థులను అనుమతిస్తారు. కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వై.రామ్మోహన్ తెలిపారు. -
ఎదురులేని ‘ఎన్ఆర్ఐ’
ఇంటర్ విద్యలో నాణ్యమైన బోధనకు చిరునామాగా నిలిచిన ‘ఎన్ఆర్ఐ అకాడమి’ ఎంసెట్ 2014 ఫలితాలలోనూ స్టేట్ టాప్ ర్యాంకులతో దూసుకెళ్లింది. మెడికల్, ఇంజనీరింగ్‌లో రికార్డు స్థాయిలో వందలోపు, వెయ్యిలోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించింది. మెడికల్‌లో 360 మందికిపైగా ఎన్నారై విద్యార్థులు సీట్ గెట్టింగ్ ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్‌లో వెయ్యిలోపు బెస్ట్ ర్యాంకులతో 12,304 ఇంజనీరింగ్ సీట్ గెట్టింగ్ ర్యాంకులు ఎన్నారైకు దక్కాయి. గత ఆరేళ్లుగా విజయాల క్రమాన్ని పెంచుకుంటున్న తాము ఈ ఏడాది అత్యున్నత ర్యాంకులతోపాటు అత్యధిక సీట్ గెట్టింగ్ ర్యాంకులను సాధించామని ‘ఎన్నారై అకాడమి’ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్, డెరైక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య వివరించారు. ‘కేవలం కొందరికే కాదు.. అందరికీ అత్యుత్తమ ర్యాంకులు’ అన్న తమ విధానం ఈ ఫలితాలలో కూడా ప్రతిబింబించిందని చెప్పారు. ఎన్నారై డాక్టర్ల నేతృత్వంలో నడుస్తున్న ‘ఎన్నారై అకాడమి’లో డాక్టర్, ఇంజనీర్ కావాలనే లక్ష్యాన్ని చేరుకోవటం సులభ సాధ్యమని పేర్కొన్నారు. -
ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 ప్రాథమిక కీ శనివారం విడుదల చేశారు. ఈనెల 22న నిర్వహించిన ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రమణారావు వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ‘ఎ’ సిరీస్‌లో 104వ ప్రశ్నకు రెండు సమాధానాలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రశ్న ‘బి’ సిరీస్‌లో 107వ ప్రశ్నగా, ‘సి’ సిరీస్‌లో 96వ ప్రశ్నగా, ‘డి’ సిరీస్‌లో 87వ ప్రశ్నగా ఉన్నట్లు చెప్పారు. పరీక్ష కీని తమ వెబ్సైట్ (http://apeamcet.org)లో ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31వ తేదీ వరకు తెలియజేయవచ్చని సూచించారు. అభ్యంతరాలను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా ఈమెయిల్ (convenereamcet@gmail.com) ద్వారా కూడా పంపించవచ్చని వివరించారు. జూన్ 9న ర్యాంకులను వెల్లడిస్తామని కన్వీనర్ తెలిపారు. -
అందని ‘తెలుగు’ మెటీరియల్
22న ఎంసెట్ తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22న ఎంసెట్.. అంటే ఓ నెలా రెండు నెలల ముందుగానే స్టడీ మెటీరియల్ మార్కెట్లో ఉండాలి. కానీ తెలుగు మీడియం విద్యార్థులకు ఇప్పటికీ స్టడీ మెటీరియల్ అసలే రాకపోగా, ఇంగ్లిషు మీడియం మెటీరియల్ అరకొరగానే వచ్చింది. ముద్రణకు చర్యలు చేపడుతున్నామని తెలుగు అకాడమీ చెబుతున్నా.. పరీక్ష రోజునాటికి కూడా మార్కెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. తెలుగు మీడియంలో అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఎక్కు వ మంది గ్రామీణ ప్రాంతాల వారు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులే ఉన్నారు. వారు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు ఎక్కువగా ఆధారపడేది బిట్ బ్యాంకు వంటి స్టడీ మెటీరియల్‌పైనే. ఈ విషయం అధికారులకు తెలుసు. అయినా సకాలంలో అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు. దీంతో ఈసారి ఎంసెట్ రాయనున్న దాదాపు 2 లక్షల మంది తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఎంసెట్‌కు సిద్ధం అయ్యే తెలుగు మీడియం విద్యార్థులు స్టడీ మెటీరియల్ లేక పాఠ్య పుస్తకాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యే సరికే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరో 2 లక్షల మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు బోటనీ-1, కెమిస్ట్రీ-1, ఫిజిక్స్-1, మ్యాథ్స్ 1ఎ, మ్యాథ్స్ 1బీ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. జువాలజీ-1, 2, ఫిజిక్స్-2, కెమిస్ట్రీ-2, బోటనీ-2 స్టడీ మెటీరియల్ పుస్తకాలు మార్కెట్లోకి రాలేదు. ఇక వాటిని అనువదించి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ముద్రించేందుకు మరో నెల రోజులు పట్టనుంది.ఈలోగా ఎంసెట్ పరీక్షే పూర్తయిపోయే పరి స్థితి నెలకొనడంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు మరే ఇతర ప్రైవేటు పబ్లిషర్లు కూడా మార్కెట్లోకి స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తేకపోవడం తెలుగు మీడియం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. దీంతో ఈసారి ఎంసెట్‌లో ర్యాంకు సాధించడంపై ఆయా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి ఎంసెట్ ఉంటుందా? నీట్ ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఫిబ్రవరిలోనే ఇచ్చిన వెంటనే ఎంసెట్‌కు మెటీరియల్ రాయించే పని చేపట్టామని, ఒకవేళ నీట్ ఉంటే దానికే మెటీరియల్ సిద్ధం చేయాల్సి ఉండటంతో కోర్టు తీర్పు కోసం ఆగాల్సి వచ్చిందని, అందుకే ఈసారి ఆలస్యం అయిందని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది తప్పడం లేదు. 8 నుంచి హాల్‌టికెట్లు ఈ నెల 22న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సంబంధిత విద్యార్థులు ఈ నెల 8 నుంచి పొందవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత రోల్ నంబర్, పేరు ఆధారంగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ రమణరావు గురువారం స్పష్టం చేశారు. 8 నుంచి 19 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ఎంసెట్ పైనే గురి
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంసెట్-2014 పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించాలనేది గురివిరెడ్డి టార్గెట్. అయితే అప్పులు తీర్చడానికి వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలను ఎన్నుకున్నట్లు తెలిసింది. ఇతని ముఠాలోని మరో నల్గురు సభ్యులను గురువారం నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బ్లూటూత్ సామగ్రి, రూ.90వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు చెందిన గురివిరెడ్డి ఇంటర్ పూర్తయ్యాక, మూడేళ్లకు 2005లో మెడిసిన్ సీటును సంపాదించాడు. అప్పట్లోనే మాస్ కాపీయింగ్‌కు పాల్పడి సీటు సంపాదించాడని పోలీసులు అనుమానం. శాంతిరాం మెడికల్ కాలేజీలో చదివిన గురివిరెడ్డి క్లాసులకు వెళ్లేవాడు కాదు. మెడిసిన్ విద్య చదువుతున్నా ఆధునిక టెక్నాలజీపై ఆసక్తి. టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను కొనేవాడు. 2010లో అతని విద్యాసంవత్సరంలో పూర్తయినా, కొన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. 2010లో బ్లూటూత్ టెక్నాలజీతో మెడికల్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడానికి యత్నించాడు. తర్వాత 2012లో చండీఘడ్ మెడికల్ వర్సిటీలో పీజీ కోర్సులు ప్రశ్నాపత్రం లీకేజీకి విఫల యత్నం చేసి, కటకటాల పాలయ్యాడు. ఈ కేసుతో శాంతిరాం మెడికల్ కాలేజీ యాజమాన్యం అతన్ని డిస్మిస్ చేసింది. 2014 మెడికల్ పరీక్ష టార్గెట్... ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-2014ను గురివిరెడ్డి టార్గెట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2010లో ఆయన మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీకి, మాస్ కాపీయింగ్‌కు విఫలయత్నం చేశారు. ఇదే రీతిలో మెడికల్ ఎంట్రెన్స్ 2014 ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడానికి పథకం వేశాడు. కాని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడటంతో రూ.లక్షల్లో అప్పులయ్యారు. అప్పులు అధికం కావడంతో ఏదో ఒకటి చేసి వాటిని తీర్చాలని నిర్ణయించాడు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్ఓ పరీక్షలు షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఈ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడి, అప్పులు తీర్చాలని నిర్ణయించినట్లు తెలసింది. అత్యాశనే కొంపముంచింది.... వీఆర్ఓ, వీఆర్ఏ ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌కు గురివిరెడ్డి అతని స్నేహితుడు, ప్రముఖ న్యాయవాది కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్యాంగ్‌తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి కడప, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల్లోని స్నేహితుల ద్వారా అభ్యర్థులకు ఎరవేశారు. ఒక్క అభ్యర్థితో రూ.3లక్షల మేరకు ఒప్పందం కుదుర్చుకొని, రూ.20వేల నుంచి రూ.50వేల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. పద్మావతినగర్‌లోని నాగిరెడ్డి అపార్ట్‌మెంట్స్‌లో ప్రశ్నపత్రం లీకేజీ, మాస్ కాపీయింగ్ బ్లూటూత్ ఉపయోగించడం గురించి అభ్యర్థులను వివరించడం ప్రారంభించారు. అప్పులు తీర్చేందుకు డబ్బు ఎక్కువ కావాలనే అత్యాశతో దాదాపు 50మంది అభ్యర్థుల నుంచి అడ్వాన్స్ తీసుకోవడంతో పథకం లీకై పోలీసులు వరకు వెళ్లింది. డబ్బు ఆశతో కటకటాలపాటు.. ప్రదీప్‌రెడ్డి కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఎస్బీఐ కాలనీకిచెందిన కంసాలి కిరణ్‌కుమార్ ప్రదీప్‌రెడ్డికి స్నేహితుడు, తిరుపతికి చెందిన దత్తలూరి రాకేష్ చౌదరి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండగా, ఇతని నెల్లూరుకు చెందిన కొమ్మి కిరణ్‌కుమార్ స్నేహితుడు.. వీరిద్దరూ గురివిరెడ్డి అనుంగు మిత్రులు. డబ్బుపై ఆశతో అతన్ని నమ్మి కటకటాల పాలయ్యాడు. అయితే ఘరానా మోసగాడైన గురివిరెడ్డికి చత్వారం. కంటి అద్దాలను తీసివేస్తే ఎదుటి వ్యక్తిని సరిగ్గా గుర్తు పట్టకపోవడం విశేషం. -
మే 17న ఎంసెట్
హైదరాబాద్: ఈ ఏడాది ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు. మే 17న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20న ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది. జూన్ 2న ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తారు.