సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 ప్రాథమిక కీ శనివారం విడుదల చేశారు. ఈనెల 22న నిర్వహించిన ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రమణారావు వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ‘ఎ’ సిరీస్‌లో 104వ ప్రశ్నకు రెండు సమాధానాలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రశ్న ‘బి’ సిరీస్‌లో 107వ ప్రశ్నగా, ‘సి’ సిరీస్‌లో 96వ ప్రశ్నగా, ‘డి’ సిరీస్‌లో 87వ ప్రశ్నగా ఉన్నట్లు చెప్పారు. పరీక్ష కీని తమ వెబ్‌సైట్ (http://apeamcet.org)లో ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31వ తేదీ వరకు తెలియజేయవచ్చని సూచించారు. అభ్యంతరాలను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా ఈమెయిల్ (convenereamcet@gmail.com) ద్వారా కూడా పంపించవచ్చని వివరించారు. జూన్ 9న ర్యాంకులను వెల్లడిస్తామని కన్వీనర్ తెలిపారు.