అందని ‘తెలుగు’ మెటీరియల్ | Students worried for Telugu medium study material | Sakshi
Sakshi News home page

అందని ‘తెలుగు’ మెటీరియల్

Published Fri, May 2 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

Students worried for Telugu medium study material

22న ఎంసెట్
 తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన

 
 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22న ఎంసెట్.. అంటే ఓ నెలా రెండు నెలల ముందుగానే స్టడీ మెటీరియల్ మార్కెట్‌లో ఉండాలి. కానీ తెలుగు మీడియం విద్యార్థులకు ఇప్పటికీ స్టడీ మెటీరియల్ అసలే రాకపోగా, ఇంగ్లిషు మీడియం మెటీరియల్ అరకొరగానే వచ్చింది. ముద్రణకు చర్యలు చేపడుతున్నామని తెలుగు అకాడమీ చెబుతున్నా.. పరీక్ష రోజునాటికి కూడా మార్కెట్‌లోకి వచ్చే పరిస్థితి లేదు. తెలుగు మీడియంలో అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఎక్కు వ మంది గ్రామీణ ప్రాంతాల వారు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులే ఉన్నారు. వారు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు ఎక్కువగా ఆధారపడేది బిట్ బ్యాంకు వంటి స్టడీ మెటీరియల్‌పైనే. ఈ విషయం అధికారులకు తెలుసు. అయినా సకాలంలో అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు. దీంతో ఈసారి ఎంసెట్ రాయనున్న దాదాపు 2 లక్షల మంది తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.
 
 ఎంసెట్‌కు సిద్ధం అయ్యే తెలుగు మీడియం విద్యార్థులు స్టడీ మెటీరియల్ లేక పాఠ్య పుస్తకాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యే సరికే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
 మరో 2 లక్షల మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు బోటనీ-1, కెమిస్ట్రీ-1, ఫిజిక్స్-1, మ్యాథ్స్ 1ఎ, మ్యాథ్స్ 1బీ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
 జువాలజీ-1, 2, ఫిజిక్స్-2, కెమిస్ట్రీ-2, బోటనీ-2 స్టడీ మెటీరియల్ పుస్తకాలు మార్కెట్‌లోకి రాలేదు.
 ఇక వాటిని అనువదించి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ముద్రించేందుకు మరో నెల రోజులు పట్టనుంది.ఈలోగా ఎంసెట్ పరీక్షే పూర్తయిపోయే పరి స్థితి నెలకొనడంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు.
 దీనికితోడు మరే ఇతర ప్రైవేటు పబ్లిషర్లు కూడా మార్కెట్‌లోకి స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తేకపోవడం తెలుగు మీడియం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. దీంతో ఈసారి ఎంసెట్‌లో ర్యాంకు సాధించడంపై ఆయా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
 అయితే ఈసారి ఎంసెట్ ఉంటుందా? నీట్ ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఫిబ్రవరిలోనే ఇచ్చిన వెంటనే ఎంసెట్‌కు మెటీరియల్ రాయించే పని చేపట్టామని, ఒకవేళ నీట్ ఉంటే దానికే మెటీరియల్ సిద్ధం చేయాల్సి ఉండటంతో కోర్టు తీర్పు కోసం ఆగాల్సి వచ్చిందని, అందుకే ఈసారి ఆలస్యం అయిందని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది తప్పడం లేదు.
 
 8 నుంచి హాల్‌టికెట్లు
 ఈ నెల 22న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సంబంధిత విద్యార్థులు ఈ నెల 8 నుంచి పొందవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత రోల్ నంబర్, పేరు ఆధారంగా వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ రమణరావు గురువారం స్పష్టం చేశారు. 8 నుంచి 19 వరకు  డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement