ఎంసెట్‌కు నాన్‌లోకల్‌ పోటీ  | Non Local Competition Increased Telangana EAMCET Exam | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌కు నాన్‌లోకల్‌ పోటీ 

Published Tue, Apr 5 2022 2:53 AM | Last Updated on Tue, Apr 5 2022 8:58 AM

Non Local Competition Increased Telangana EAMCET Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ రాసేవారి సంఖ్య ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ మంది టీఎస్‌ ఎంసెట్‌కు హాజరయ్యే వీలుందని చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, హాస్టళ్లు తెరవడంతో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించాయి. గత రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంసెట్‌కు దరఖాస్తు చేసినా పరీక్ష రాసే వారి సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిందని, ఇంజనీరింగ్‌లో చేరే వారి సంఖ్య కూడా 45 శాతం పడిపోయినట్టు ప్రైవేటు కాలే జీలు స్పష్టం చేస్తున్నాయి.

ఈసారి ఈ సమస్య లేకపోవడంతో ప్రమాణాలున్న కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లో సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడే వీలుందని చెబుతున్నారు. ఎంసెట్, జేఈఈ కోసం శిక్షణ పొందే వారు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఇక్కడ చదువుతూనే ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థిరపడిన వారి పిల్లలు సైతం హైదరాబాద్‌లోని కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముం దు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో ఏపీకి చెందిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇప్పుడూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఓ  కాలేజీ నిర్వాహకుడు తెలిపారు.

15 శాతం కోటాలో పోటీ...: తెలంగాణవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే అందులో 70 వేల వరకు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లలో 15 శాతం నాన్‌–లోకల్‌ కోటా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కోటాలోనే పోటీ పడాల్సి ఉం టుంది. దీంతో ఈసారి పోటీ ఎక్కువ ఉండే వీలుందని ఎంసెట్‌ వర్గాలు అంటు న్నాయి. కొన్ని కోర్సులకు నాన్‌లోకల్స్‌ పోటీ వల్ల మేనేజ్‌మెంట్‌ కోటా విషయంలో యాజమాన్యాలు భారీగా డిమాండ్‌ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

కరోనా వల్ల రెండేళ్ళుగా ఈసీఈ సహా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడలేదు. టాప్‌ టెన్‌ కాలేజీల్లోనూ ఈ సీట్లకు పెద్దగా డిమాండ్‌ కనిపించ లేదు. ఈసారి కూడా కంప్యూటర్‌ కోర్సులనే ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారు.  దీంతో ఏపీ నుంచి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో కంప్యూటర్‌ కోర్సులకే ప్రాధాన్యం ఉండే వీలుందని భావిస్తున్నారు. 2021 లో జరిగిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94, 550 మంది అర్హత సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement