సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యుత్ అంతరాయంతో పలు కేంద్రాల్లో అధికారులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యుత్ లేకపోవడంతో పరీక్ష 10 నిమిషాలు ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం నాటి గాలి కారణంగా అధికారులు నిర్వహణ కోసం సరఫరాను నిలిపివేశారు. దీంతో పలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. చివరకు ఎంసెట్ కమిటీ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు. దీంతో 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను ప్రారంభించాల్సి వచ్చింది. హైదరాబాద్ శివారులోని మరో కేంద్రంలో (నోమా ఫంక్షన్ హాల్) విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొంత ఇబ్బంది కలిగింది. అయితే అధికారులు జనరేటర్ల ఏర్పాటుతో పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.
44,445 మంది హాజరు..
బుధవారం నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షకు 48,551 మంది విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టగా, 44,445 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలోని 67 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జరిగిన మొదటి సెషన్‌కు 23,808 మందికి 21,774 మంది (91.46 శాతం) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 24,743 మందికి ఏర్పాట్లు చేయగా, 22,671 మంది (91.63 శాతం) హాజరయ్యారు. ఆన్‌లైన్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తదితరులు పర్యవేక్షించారు.
సులువైన ప్రశ్నలు..
ఇక ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు సులువుగానే వచ్చాయని విద్యార్థులు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని వెల్లడించారు. మరోవైపు ఈ నెల 3న కూడా అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష జరుగనుంది. 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. వేర్వేరు సెషన్లలో వేర్వేరు ప్రశ్నలు వస్తాయి కనుక చివరకు అన్నింటిని నార్మలైజ్ చేసి మార్కులను కేటాయిస్తారు. వాటికి ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ కలిపి తుది ర్యాంకులను ఖరారు చేస్తారు.
‘ఎంసెట్’కు విద్యుత్ ఇబ్బందులు!
Published Thu, May 3 2018 1:20 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment