ఆల్ ది బెస్ట్
♦ నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
♦ వికారాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలు
♦ హైదరాబాద్‌లోనే రాయనున్న శివారు విద్యార్థులు
విభాగం పరీక్ష సమయం
♦ ఇంజినీరింగ్ ఉ.10 గం. నుంచి ఒంటిగంట
♦ అగ్రికల్చర్, మెడికల్ మ.2.30గం. నుంచి సా.5.30
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎంసెట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రాలపై కొంతకాలంగా నెలకొన్న అస్పష్టతతో పరీక్ష ఇప్పటికే ఒకసారి వాయిదాపడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. తాజాగా సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేస్తూ.. ఈనెల 15న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఎంసెట్ పరీక్షలకు అధికారులు అన్నివిధాలా సన్నద్ధమయ్యారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వికారాబాద్‌లోని శ్రీ అనంత పద్మనాభస్వామి కళాశాల, సెయింట్ జ్యూడ్స్ పాఠశాలలో పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో 2,442 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు 1,358 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే అగ్రికల్చర్, మెడికల్ విభాగం పరీక్షకు 1,084 మంది హాజరుకానున్నారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎస్‌ఏపీ కాలేజీ వరకు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించారు.
హైదరాబాద్ డివిజన్లలో..
ఇదిలావుండగా.. నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, రాజేంద్రనగర్ డివిజన్లకు సంబంధించిన విద్యార్థులకు నగరంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు జిల్లాలో ని పశ్చిమ ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల విద్యార్థులకోసం ప్రత్యేకంగా 8 రీజియన్లుగా విభజించి దరఖాస్తులు స్వీకరించిన అధికారు లు.. ఆ మేరకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని ఎనిమిది రీజియన్ల పరిధిలో 146 పరీక్షా కేంద్రాలను గుర్తించగా.. ఇందులో ఇంజినీరింగ్‌కు సంబంధించి 94, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 52 సెంటర్లున్నాయి.
నగరంలో ఎంసెట్ రాసేం దుకు రెండు విభాగాల నుంచి 93,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 60,731, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 32,319 దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండు విభాగాల పరీక్షలకు హాజరయ్యేందుకు మరో 468 అందాయి. నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు జాగ్రత్తగా మెలగాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంసెట్ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.