Telugu medium students
-
‘తెలుగు’ కనుమరుగు..?
- గణనీయంగా పడిపోయిన తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య - చాలా పాఠశాలల్లో - రెండంకెలకు తగ్గుదల - పది వరకు ఉన్న స్కూల్ ఒక్కటే..! సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో తెలుగు విద్యార్థులతో కళకళలాడిన అనేక పాఠశాలల్లో నేడు విద్యార్థులు కరవయ్యారు. విద్యార్థులు తగ్గుతుండటంతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. తెలుగు విద్యార్థులకోసం ‘బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ (బీఎంసీ) అనేక సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, ఇలా 27 రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గతంలో బీఎంసీ తెలుగు పాఠశాలల్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం రెండు పాఠశాల్లో మినహా మిగతా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. గతంలో పాఠశాల్లో తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య 350కి పైగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 90కి చేరుకుంది. దీన్ని బట్టి తెలుగు పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి రెండు ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే తెలుగు మీడియంలో బోధిస్తున్నాయి. ముంబై వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) హైస్కూల్, తూర్పు బోరివలిలోని చైతన్య తెలుగు హైస్కూల్ ఉన్నాయి. ఆంధ్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైస్కూల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంది. చైతన్య తెలుగు హైస్కూల్లో పూర్తిగా తెలుగులోనే బోధిస్తున్నారు. చైతన్య స్కూల్లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉంది. మూతపడుతున్న పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో తెలుగు పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గతంలో బీఎంసీ పాఠశాలలు 60 నుంచి 45కు పడిపోయింది. ప్రభాదేవి, గోఖలే రోడ్డు తెలుగు మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులు కరువయ్యారు. గతంలో విద్యార్థులతో కళకళలాడిన వర్లీ అంబేద్కర్, లోయర్ పరేల్ జీకే మార్గ్, నాయిగావ్, గోరేగావ్ సిద్దార్థ్నగర్, సైన్ కోలివాడా కేడీ గైక్వాడ్, ఘాట్కోపర్ పంత్నగర్, కామాటిపూర సీవీబీ మార్గ్, ములూండ్ మున్సిపల్ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 2 అంకెలకు చేరుకుంది. తెలుగు మీడియం హైస్కూల్ ఒకే ఒక్కటి: నాయిని ఆదినారాయణ బీఎంసీకి చెందిన పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉన్న పాఠశాల ఒకటే ఉందని ములూండ్ తెలుగు మున్సిపల్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు నాయిని ఆదినారాయణ పేర్కొన్నా రు. తాను పాఠశాలలో ఆరేళ్ల కింద చేరినపుడు ఏడో తరగతి వరకే ఉండేదన్నారు. ఇక్బాల్ అనే సీనియర్ ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి ప్రారంభించి పదవీ విరమణ పొందారని చెప్పారు. పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో బోధించాలన్న లక్ష్యంతో సహచరులతో కలసి ప్రయత్నించానని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియం లోనే బోధిస్తున్నారని, బీఎంసీ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధించే ఒకే పాఠశాలగా గౌరవాన్ని పొం దామన్నారు. ప్రస్తుతం స్కూళ్లో ఎనిమిది నుంచి పది వరకు సెకండరీ సెక్షన్లో 90 మంది, 1 నుంచి 7 తరగతి వరకు 80 మంది విద్యార్థులున్నారని చెప్పారు. ప్రైమరీ సెక్షన్లో విద్యార్థుల సం ఖ్య పెరగలేదని, సెకండరీ సెక్షన్ స్కూల్ ఒక్కటే ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందరు ప్రయత్నించాలి: బడుగు విశ్వనాథ్ తెలుగు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలున్నప్పటికీ సంఖ్య పెంచేందుకు అందరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉందని శివ్డీ-వడాలా ఇస్టేట్లోని మున్సిపల్ పాఠశాల ఇన్చార్జ్ బడుగు విశ్వనాథ్ అన్నారు. మున్సిపల్ స్కూళ్లలో పిల్లలకు అన్ని సదుపాయాలున్నాయని, 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ కూడా ఉచితంగా ఇస్తున్నారు. -
కొత్త విధానంతో టెన్షన్
పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ టెన్త్ విద్యార్థులు టెన్షన్‌కు గురవడం సాధారణం. కానీ ఈ ఏడాది విద్యార్థుల్లో ఇప్పటికే ఆ ఆందోళన ప్రారంభమైంది. నూతన పరీక్షల విధానం వారిని గందరగోళంలోకి నెడుతోంది. పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయని వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసలే ఉపాధ్యాయుల కొరత, ఆపై మారిన పదో తరగతి సిలబస్. దీనికి తోడు కొత్త పాఠ్యాంశాల పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ....పాఠశాలలు ప్రారంభమయ్యాక మొదలు పెట్టారు. మరోవైపు పరీక్ష విధానంలో వినూత్న ప్రక్రియను అమలు చేయనున్నారు. ఈ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన ప్రశ్నలకు పరీక్షల్లో సమాధానాలు రాయడానికే విద్యార్థులు ఇంతవరకూ పూర్తిగా అలవాటు పడి ఉన్నారు. కొత్త విధానంలో బోధనా విధానం పూర్తిగా మారిపోయిందని, విద్యార్థులు సొంతంగా సమాధానాలు రాయవలసి రావడం వల్లవారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. కొత్త విధానం వల్ల గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనీసం మూడేళ్ల ముందుగా తరగతులలో వరుసగా ఈ నూతన విధానాన్ని అమలు చేశాక పదో తరగతికి వర్తింపచేస్తే బాగుండేదని ఇటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నూతన పరీక్ష విధానం అమలు చేయడం వల్ల ప్రయోజనం కన్నా విద్యార్థుల నుంచి ప్రతిభను గుర్తించలేని పరిస్థితి ఎదుర వుతుందని ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాదికి అమలు చేయవద్దని ఇటీవల కొందరు విద్యార్థులు వేర్వేరుగా కోర్టులను కూడా ఆశ్రయించారు. తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన జిల్లాలో ప్రతి ఏడాదీ దాదాపు 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. వీరిలో 14 వేల మంది తెలుగు మీడియం విద్యార్థులు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ. నూతన పరీక్ష విధానం వీరిని కలవరపెడుతోంది. ఈ పరీక్షా విధానంలో తెలుగు, హిందీ, ఆంగ్లం సబ్జెక్టులకు ఒక్కొక్క ప్రశ్నపత్రం మాత్రమే కేటాయించారు. గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలకు రెండేసి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తెలుగు మీడియం విద్యార్థులు ఒకే పేపరు ద్వారా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టమే. రెండు పేపర్లు ఉన్నపుడే తెలుగు సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా పరీక్ష తప్పారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరో తరగతి నుంచి హిందీ సబ్జెక్టు ప్రారంభమవుతుంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మూడో తరగతి నుంచే బోధిస్తారు. నూతన విధానంలో హిందీ పరీక్షలో 35 మార్కులు సాధించడం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో కొందరికి ఇబ్బందే. కొత్త సిలబస్‌లో ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి ఒకటే పాఠ్యపుస్తకం ఉంటుంది. ఇది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అనుకూలిస్తుంది. ఈ సబ్జెక్టులో వీరు అత్యధిక మార్కులు తెచ్చుకునే అవకాశం ఎక్కువ. అదే తెలుగు మీడియం విద్యార్థులు ఉత్తీర్ణులవడం గగనమే అవుతుంది. గణితం, సామాన్య, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లోని రెండు పేపర్లకు విడి విడిగా ఉత్తీర్ణత సాధించాలి. దీంతో రెండు పేపర్లకు ప్రతి విద్యార్థీ హాజరు కావాల్సిందే. ప్రశ్నపత్రాల్లో సమూల మార్పులు టెన్త్ పరీక్షల పశ్నపత్రాల్లో సమూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పబ్లిక్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులు రానున్నాయి. ఇటీవల టెలి కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన శిక్షణలో పదోతరగతి ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రం తయారీపై ప్రభుత్వ మార్గదర్శకాలు తెలియజేశారు. ప్రశ్నపత్రాలకు మార్గదర్శకాలివే...! విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా సొంతంగా ఆలోచించి రాసే ప్రశ్నలుంటాయి. బట్టీపెట్టి సమాధానాలు రాసే ప్రశ్నలు ఉండవు. విద్యార్థులు సరిగా ఆలోచించేలా పశ్నలుంటాయి. పబ్లిక్ పరీక్షల్లో ఒకసారిచ్చిన ప్రశ్నలు మళ్లీమళ్లీ ఇవ్వరాదు.పాఠ్య పుస్తకంలోని పాఠాల్లో ఇచ్చిన ఎక్సర్‌సైజ్‌లను యథాతథంగా ఇవ్వరాదు. ప్రశ్నలు విద్యార్థుల విద్యాస్థాయి, సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉండాలి.విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన సామర్థ్యాలను ఇచ్చే ప్రాధాన్యానికి అనుగుణంగా ప్రశ్నపత్రాలుండాలి. సైన్స్, గణితం, సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘుసమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు, బహుళ సమాధాన ప్రశ్నలు ఇవ్వాలి. తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో రీడింగ్ కాంప్రెహేన్షన్ (ఇచ్చిన పేరాగ్రాఫ్ చదివి సమాధానాలు రాయడం), రైటింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఓకాబులరీ, గ్రామర్ ఉంటుంది. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో రీడింగ్ కాంప్రెహేన్షన్, ఒకాబులరీ, క్రియేటివ్ రైటింగ్, గ్రామర్, బహుళ సమాధాన తరహాలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రాల్లో కేవలం వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మిగతా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విద్యార్థులకు 2015లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నుంచి ఇంటర్మీడియెట్ తరహాలో సింగిల్ బుక్లెట్ సమాధాన పత్రం మాత్రమే ఇస్తారు. విద్యార్థుల పదో తరగతి మార్కుల జాబితాలో మూడు పార్టుల్లో వివరాలు నమోదు చేస్తారు. పార్ట్-1లో సాధారణ సమాచారం ఇస్తారు. పార్టు-2లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులను ధ్రువీకరించి గ్రేడ్లు ప్రకటిస్తారు. పార్టు-3లో సహపాఠ్యాంశాలకు సంబంధించిన గ్రేడ్లు నమోదు చేస్తారు. మార్కుల జాబితా వెనుక వైపు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల సగటుకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఆదేశాలు రావాల్సి ఉంది.. ఈ ఏడాది కొత్త విధానంలోనే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జీఓ విడుదల కావాల్సి ఉందని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. -
అందని ‘తెలుగు’ మెటీరియల్
22న ఎంసెట్ తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22న ఎంసెట్.. అంటే ఓ నెలా రెండు నెలల ముందుగానే స్టడీ మెటీరియల్ మార్కెట్లో ఉండాలి. కానీ తెలుగు మీడియం విద్యార్థులకు ఇప్పటికీ స్టడీ మెటీరియల్ అసలే రాకపోగా, ఇంగ్లిషు మీడియం మెటీరియల్ అరకొరగానే వచ్చింది. ముద్రణకు చర్యలు చేపడుతున్నామని తెలుగు అకాడమీ చెబుతున్నా.. పరీక్ష రోజునాటికి కూడా మార్కెట్లోకి వచ్చే పరిస్థితి లేదు. తెలుగు మీడియంలో అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఎక్కు వ మంది గ్రామీణ ప్రాంతాల వారు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులే ఉన్నారు. వారు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు ఎక్కువగా ఆధారపడేది బిట్ బ్యాంకు వంటి స్టడీ మెటీరియల్‌పైనే. ఈ విషయం అధికారులకు తెలుసు. అయినా సకాలంలో అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు. దీంతో ఈసారి ఎంసెట్ రాయనున్న దాదాపు 2 లక్షల మంది తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఎంసెట్‌కు సిద్ధం అయ్యే తెలుగు మీడియం విద్యార్థులు స్టడీ మెటీరియల్ లేక పాఠ్య పుస్తకాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యే సరికే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరో 2 లక్షల మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు బోటనీ-1, కెమిస్ట్రీ-1, ఫిజిక్స్-1, మ్యాథ్స్ 1ఎ, మ్యాథ్స్ 1బీ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. జువాలజీ-1, 2, ఫిజిక్స్-2, కెమిస్ట్రీ-2, బోటనీ-2 స్టడీ మెటీరియల్ పుస్తకాలు మార్కెట్లోకి రాలేదు. ఇక వాటిని అనువదించి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ముద్రించేందుకు మరో నెల రోజులు పట్టనుంది.ఈలోగా ఎంసెట్ పరీక్షే పూర్తయిపోయే పరి స్థితి నెలకొనడంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు మరే ఇతర ప్రైవేటు పబ్లిషర్లు కూడా మార్కెట్లోకి స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తేకపోవడం తెలుగు మీడియం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. దీంతో ఈసారి ఎంసెట్‌లో ర్యాంకు సాధించడంపై ఆయా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి ఎంసెట్ ఉంటుందా? నీట్ ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఫిబ్రవరిలోనే ఇచ్చిన వెంటనే ఎంసెట్‌కు మెటీరియల్ రాయించే పని చేపట్టామని, ఒకవేళ నీట్ ఉంటే దానికే మెటీరియల్ సిద్ధం చేయాల్సి ఉండటంతో కోర్టు తీర్పు కోసం ఆగాల్సి వచ్చిందని, అందుకే ఈసారి ఆలస్యం అయిందని అధికారులు చెబుతున్నారు. కారణమేదైనా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది తప్పడం లేదు. 8 నుంచి హాల్‌టికెట్లు ఈ నెల 22న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సంబంధిత విద్యార్థులు ఈ నెల 8 నుంచి పొందవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత రోల్ నంబర్, పేరు ఆధారంగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ రమణరావు గురువారం స్పష్టం చేశారు. 8 నుంచి 19 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.