పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ టెన్త్ విద్యార్థులు టెన్షన్‌కు గురవడం సాధారణం. కానీ ఈ ఏడాది విద్యార్థుల్లో ఇప్పటికే ఆ ఆందోళన ప్రారంభమైంది. నూతన పరీక్షల విధానం వారిని గందరగోళంలోకి నెడుతోంది. పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయని వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి.
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసలే ఉపాధ్యాయుల కొరత, ఆపై మారిన పదో తరగతి సిలబస్. దీనికి తోడు కొత్త పాఠ్యాంశాల పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ....పాఠశాలలు ప్రారంభమయ్యాక మొదలు పెట్టారు. మరోవైపు పరీక్ష విధానంలో వినూత్న ప్రక్రియను అమలు చేయనున్నారు. ఈ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన ప్రశ్నలకు పరీక్షల్లో సమాధానాలు రాయడానికే విద్యార్థులు ఇంతవరకూ పూర్తిగా అలవాటు పడి ఉన్నారు. కొత్త విధానంలో బోధనా విధానం పూర్తిగా మారిపోయిందని, విద్యార్థులు సొంతంగా సమాధానాలు రాయవలసి రావడం వల్లవారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు.
కొత్త విధానం వల్ల గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనీసం మూడేళ్ల ముందుగా తరగతులలో వరుసగా ఈ నూతన విధానాన్ని అమలు చేశాక పదో తరగతికి వర్తింపచేస్తే బాగుండేదని ఇటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నూతన పరీక్ష విధానం అమలు చేయడం వల్ల ప్రయోజనం కన్నా విద్యార్థుల నుంచి ప్రతిభను గుర్తించలేని పరిస్థితి ఎదుర వుతుందని ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాదికి అమలు చేయవద్దని ఇటీవల కొందరు విద్యార్థులు వేర్వేరుగా కోర్టులను కూడా ఆశ్రయించారు.
తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన
జిల్లాలో ప్రతి ఏడాదీ దాదాపు 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. వీరిలో 14 వేల మంది తెలుగు మీడియం విద్యార్థులు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ. నూతన పరీక్ష విధానం వీరిని కలవరపెడుతోంది. ఈ పరీక్షా విధానంలో తెలుగు, హిందీ, ఆంగ్లం సబ్జెక్టులకు ఒక్కొక్క ప్రశ్నపత్రం మాత్రమే కేటాయించారు. గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలకు రెండేసి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తెలుగు మీడియం విద్యార్థులు ఒకే పేపరు ద్వారా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టమే. రెండు పేపర్లు ఉన్నపుడే తెలుగు సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా పరీక్ష తప్పారు.
దీనికితోడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరో తరగతి నుంచి హిందీ సబ్జెక్టు ప్రారంభమవుతుంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మూడో తరగతి నుంచే బోధిస్తారు. నూతన విధానంలో హిందీ పరీక్షలో 35 మార్కులు సాధించడం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో కొందరికి ఇబ్బందే. కొత్త సిలబస్‌లో ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి ఒకటే పాఠ్యపుస్తకం ఉంటుంది. ఇది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అనుకూలిస్తుంది. ఈ సబ్జెక్టులో వీరు అత్యధిక మార్కులు తెచ్చుకునే అవకాశం ఎక్కువ. అదే తెలుగు మీడియం విద్యార్థులు ఉత్తీర్ణులవడం గగనమే అవుతుంది. గణితం, సామాన్య, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లోని రెండు పేపర్లకు విడి విడిగా ఉత్తీర్ణత సాధించాలి. దీంతో రెండు పేపర్లకు ప్రతి విద్యార్థీ హాజరు కావాల్సిందే.
ప్రశ్నపత్రాల్లో సమూల మార్పులు
టెన్త్ పరీక్షల పశ్నపత్రాల్లో సమూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పబ్లిక్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులు రానున్నాయి. ఇటీవల టెలి కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన శిక్షణలో పదోతరగతి ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రం తయారీపై ప్రభుత్వ మార్గదర్శకాలు తెలియజేశారు.
ప్రశ్నపత్రాలకు మార్గదర్శకాలివే...!
విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా సొంతంగా ఆలోచించి రాసే ప్రశ్నలుంటాయి.
బట్టీపెట్టి సమాధానాలు రాసే ప్రశ్నలు ఉండవు. విద్యార్థులు సరిగా ఆలోచించేలా పశ్నలుంటాయి.
పబ్లిక్ పరీక్షల్లో ఒకసారిచ్చిన ప్రశ్నలు మళ్లీమళ్లీ ఇవ్వరాదు.పాఠ్య పుస్తకంలోని పాఠాల్లో ఇచ్చిన ఎక్సర్‌సైజ్‌లను యథాతథంగా ఇవ్వరాదు.
ప్రశ్నలు విద్యార్థుల విద్యాస్థాయి, సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉండాలి.విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన సామర్థ్యాలను ఇచ్చే ప్రాధాన్యానికి అనుగుణంగా ప్రశ్నపత్రాలుండాలి.
సైన్స్, గణితం, సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘుసమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు, బహుళ సమాధాన ప్రశ్నలు ఇవ్వాలి.
తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో రీడింగ్ కాంప్రెహేన్షన్ (ఇచ్చిన పేరాగ్రాఫ్ చదివి సమాధానాలు రాయడం), రైటింగ్, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్, ఓకాబులరీ, గ్రామర్ ఉంటుంది.
ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో రీడింగ్ కాంప్రెహేన్షన్, ఒకాబులరీ, క్రియేటివ్ రైటింగ్, గ్రామర్, బహుళ సమాధాన తరహాలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నపత్రాల్లో కేవలం వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మిగతా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
విద్యార్థులకు 2015లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నుంచి ఇంటర్మీడియెట్ తరహాలో సింగిల్ బుక్‌లెట్ సమాధాన పత్రం మాత్రమే ఇస్తారు.
విద్యార్థుల పదో తరగతి మార్కుల జాబితాలో మూడు పార్టుల్లో వివరాలు నమోదు చేస్తారు. పార్ట్-1లో సాధారణ సమాచారం ఇస్తారు. పార్టు-2లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కులను ధ్రువీకరించి గ్రేడ్లు ప్రకటిస్తారు. పార్టు-3లో సహపాఠ్యాంశాలకు సంబంధించిన గ్రేడ్లు నమోదు చేస్తారు. మార్కుల జాబితా వెనుక వైపు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల సగటుకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు.
ఆదేశాలు రావాల్సి ఉంది..
ఈ ఏడాది కొత్త విధానంలోనే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జీఓ విడుదల కావాల్సి ఉందని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు.
కొత్త విధానంతో టెన్‌షన్
Published Sat, Jul 12 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement
Advertisement