The new policy
-
ఇసుక బంద్!
ఇసుక వినియోగదారులకు 20 రోజులు ఇబ్బందులు తప్పవు. ఇసుక నూతన విధానం అమలులో భాగంగా ప్రభుత్వం శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని రీచ్‌లను మూసివేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త విధానంలో ఇసుక కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూపొందించిన విధివిధానాల మేరకు రీచ్‌లను వేలం నిర్వహించనున్నారు. ఎక్కువ మొత్తం చెల్లించిన వ్యాపారులకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఇసుక ధరలను వ్యాపారులు పెంచేశారు. గుంటూరు: ఫిబ్రవరి ఒకటి నుంచి ఇసుక నూతన విధానం అమలులోకి రానున్న దృష్ట్యా విక్రయాల కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి చలానాలు కట్టించుకోవద్దని రాష్ట్ర గనుల శాఖ డెరైక్టర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విక్రయాలను పర్యవేక్షిస్తున్న సెర్ఫ్ సీఈవో ఆరోగ్యరాజు కూడా చలానాలు కట్టించుకోవద్దని అన్ని మీ-సేవ కేంద్రాలను ఆదేశించారు. ఇప్పటికే చలానాలు కట్టిన కొనుగోలుదారులకు ఈనెలాఖరు వరకు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న రీచ్‌లను ఫిబ్రవరి 1 నుంచి బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చే ఇసుక వ్యాపారులకు అప్పగించనున్నారు. తిరిగి భూగర్భగనుల శాఖకు... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఇసుక అమ్మకాల బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్)కు అప్పగించింది. తిరిగి ఈ నెల 2న ఇసుక అమ్మకాలు, పర్యవేక్షణ బాధ్యతలను భూగర్భగనుల శాఖకు అప్పగిస్తూ నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలు చేపట్టినా, తెర వెనుక టీడీపీ నాయకులే దందా నిర్వహిస్తుండడంతోప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది గమనించిన ప్రభుత్వం పాత విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసి కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. గతంలో రీచ్‌లకు బహిరంగ వేలం నిర్వహించడం, నదీ తీరంలో ఇసుక మేటలు వేసిన భూముల్లో వాటి యజమానులు లేదా ఇసుక వ్యాపారులు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఇసుక విక్రయాలు సాగించేవారు. తాజాగా భూముల్లో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం భూ యజమానికి, 75 శాతం ప్రభుత్వానికి వచ్చేలా ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఈ రెండు విధానాలను ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఇసుక అమ్మకాలు నిలిపివేత ... ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి, ఉండవల్లి, అమరావతి, దుగ్గిరాల మండల గొడవర్రు సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్‌లను మూసివేశారు. -
బార్ లెసైన్సుల కోసం పాట్లు
రేపటి నుంచి నూతన పాలసీ అమలు నిబంధనలకు అనుగుణంగా రెస్టారెంట్లలో మరమ్మతులు తిరస్కరణకు గురైన మొత్తం దరఖాస్తులు ఆందోళనలో వ్యాపారులు నరసరావుపేట టౌన్ : బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణలో ప్రభుత్వం కొత్తపాలసీ తీసుకురావడంతో వ్యాపారులు పడుతున్న పాట్లు అన్నీ.. ఇన్నీ.. కావు. ఇప్పటి వరకు నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వ్యాపారులు నూతన లెసైన్సులు పొందేందుకు రెస్టారెంట్ల రూపురేఖలను మార్చాల్సి వస్తోంది. కాగా లెసైన్సు పొందేందుకు పెటుకున్న అన్ని దరఖాస్తులను తిరస్కరించడంతో రెస్టారెంట్ల యాజమాన్యంలో కలవరం మొదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో 16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్ల లెసైన్సులో కొత్తపాలసీని ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ ఏడాదితో పాత లెసైన్సులు పూర్తిగా రద్దయి జనవరి 1 నుంచి కొత్త లెసైన్సుదారులు రానున్నారు. కాగా నూతన రెస్టారెంటుకు లెసైన్సు పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. రెస్టారెంట్లు బడి, గుడి, వైద్యశాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలి. అదే విధంగా 100 మీటర్ల ఆర్సీసీ డాబా, మొత్తం ప్రాంగణం 200 మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. సౌకర్యవంతమైన పార్కింగ్ కలిగి ఉండాలి. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల వీడియోను సీడీలో పొందుపరచడంతోపాటు పొందిన ట్రేడ్లెసైన్స్తో రూ.5వేల చలనాను జతచేసి హైదరాబాద్ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణకు వచ్చి నిబంధనలను పరిశీలించిన పిమ్మట లెసైన్సు మంజూరుకు చర్యలు తీసుకుంటారు. దీంతో పట్టణంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యం నిబంధనలకు అనుగుణంగా తమ రెస్టారెంట్లను మార్పు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి పాత స్టాకును విక్రయించేందుకు ఎన్నడూ లేని విధంగా ఎమ్మార్పీధరలకు అమ్మకాలు బార్ అండ్ రెస్టారెంట్లలో మొదలుపెట్టారు. కొన్ని బార్ల యాజమాన్యం రెస్టారెంట్ల ఎదుట క్లియరెన్స్ సేల్, ఎమ్మార్పీ ధరకే అమ్మకాలంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ముగిస్తే లెసైన్సులు ఉంటాయో లేదో అన్న ఆందోళనలో రెస్టారెంట్ల యాజమాన్యం క్లియరెన్స్ సేల్ విక్రయాలు కొనసాగిస్తున్నారని పట్టణంలో చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా 30 వేల మంది జనాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ చొప్పున ఉండాలన్నది నిబంధన. నరసరావుపేట పట్టణంలో సుమారు 1.4 లక్షల జనాభా ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అంటే నిబంధనల ప్రకారం 5 రెస్టారెంట్లకు మించరాదు. కాగా పట్టణంలో అత్యధికంగా 16 రెస్టారెంట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిల్లో కొన్ని తొలగిస్తారన్న ప్రచారం సాగుతున్నా, అధికారులు మాత్రం అవన్నీ అపోహలేనని తేల్చి చెబుతున్నారు. 16 దరఖాస్తులు తిరస్కరణ బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి కోరుతూ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న యాజమాన్యాలకు చుక్కెదురైంది. దరఖాస్తుతోపాటు దాఖలు చేసిన ట్రేడ్ లెసైన్సులో అవకతవకలు ఉన్నాయంటూ హైదరాబాద్ కమిషనర్ అన్ని దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ట్రేడ్ లెసైన్స్ సరైన పద్ధతిలో పొంది తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకునేందుకు 31వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుండటంతో బార్ యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఇన్ఛార్జిగా మున్సిపల్ ఇంజినీర్ ఓంప్రకాష్, ఫుల్ఛార్జి లేదనే సాకుతో ట్రేడ్ లెసైన్స్ అనుమతికి దూరంగా ఉండటంతో యాజమాన్యాల్లో కలవరం రేకెత్తింది. ఇదిలా ఉండగా ఇప్పటికే వైన్‌షాపుల నిర్వహణను తమ కంబంధ హస్తాల్లో ఉంచుకున్న అధికార పార్టీ బార్ అండ్ రెస్టారెంట్ల వ్యవహారంలో ఏవిధంగా ముందుకు సాగుతుందో వేచిచూడాల్సి ఉంది. -
ఇసుక కొత్తపాలసీ అమలుపై అధికారుల కసరత్తు
చిత్తూరు (టౌన్) : కొత్త ఇసుక పాల సీని జిల్లాలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్రమ రవాణాను నివారించేందుకు ఇసుక అమ్మకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. ఇసుక లభించే ప్రాంతాల్లోనే మండలానికోచోట నిల్వచేసి మహిళాసంఘాల నుంచి కొనే విధంగా ప్రణాళికలను రూపొందించారు. జిల్లాలో కుప్పం మండలంలో కంగుంది, పాలారు, నాగలాపురంలో సురుటుపల్లె, నగరిలో సత్రవాడ, నిండ్రలో కొప్పేడు, రామాపురం, చిత్తూరు రూరల్‌లో ఆనగల్లు, నీవానది, ఎన్ఆర్ పేట, చంద్రగిరిలో శానంబట్ల, నారాయణవనంలో పాల మంగళం, నయనార్ కండ్రిగలో ఇసుక రీచ్లున్నట్లు గుర్తించారు. యూనిట్ ధర రూ.850 కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఒక యూనిట్ (ట్రాక్టర్ లోడ్) 2.75 క్యూ బిక్ మీటర్ల ఇసుక ధరను రూ. 850గా అధికారులు నిర్ణరుుంచారు. ఇసుక అవసరం ఉన్నవారు తమ ప్రాంతంలోని మీ -సేవ కేంద్రాల్లో వినతిపత్రాలను సమర్పించి అనుమతి పొం దొచ్చు. డబ్బులు మాత్రం నేరుగా మహిళా సంఘాలకు చెల్లించాలి. ఇసుక అమ్మకాలపై ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పీడీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన అమ్మకాలను చేపట్టే అధికారాన్ని కల్పిస్తారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఒక సంఘానికి ఈ అధికారాన్ని కల్పిం చారు. ఖర్చులుపోను మిగిలిన ఆదాయంలో 25 శాతాన్ని అమ్మకాలు చేపట్టే సమాఖ్యల ఖాతాలకు జమచేస్తారు. మిగిలిన మొత్తంలో 50 శాతం మండల పరిషత్‌లకు, 25 శాతం జెడ్పీకి, మరో 25 శాతం గ్రామ పంచాయతీ ఖాతాకు జమవుతుంది. అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఇసుకను అక్రమంగా రవాణాచేస్తే ప్రభుత్వం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తొలిసారి పట్టుబడితే అపరాధం విధిస్తారు. రెండోసారైతే రెట్టింపు అపరాధం వేస్తారు. మూడోసారి వాహనాన్ని సీజ్ చేస్తారు. తహశీల్దార్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు ఈ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కృత్రిమ ఇసుక తయారీ యూనిట్లను ఏర్పాటుచేయండి జిల్లాలో ఇసుక క్వారీలు తక్కువగా ఉన్నందున ఔత్సాహికులు కృత్రిమ ఇసుక తయారీ (రోబో శాండ్) యూనిట్లను ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇసుక కొరతను అధిగమించాలంటే కృత్రిమ ఇసుక తయారీ యూ నిట్లను విరివిగా నెలకొల్పాలని కోరా రు. ఇప్పటికే కేవీబీ పురం మండలంలో ఏర్పాటు చేసిన ఒక యూని ట్లో ఇసుక తయారవుతోందని చెప్పారు. కార్యదర్శులు గ్రామాల్లోనే కాపురం ఉండాలి గ్రామ పంచాయతీ కార్యదర్శులు తా ము పనిచేసే గ్రామాల్లోనే కాపురం ఉం డాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు కోరారు. చాలామంది పంచాయతీ కార్యదర్శులు తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని చెప్పా రు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
కొత్త విధానంతో టెన్షన్
పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ టెన్త్ విద్యార్థులు టెన్షన్‌కు గురవడం సాధారణం. కానీ ఈ ఏడాది విద్యార్థుల్లో ఇప్పటికే ఆ ఆందోళన ప్రారంభమైంది. నూతన పరీక్షల విధానం వారిని గందరగోళంలోకి నెడుతోంది. పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయని వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసలే ఉపాధ్యాయుల కొరత, ఆపై మారిన పదో తరగతి సిలబస్. దీనికి తోడు కొత్త పాఠ్యాంశాల పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ....పాఠశాలలు ప్రారంభమయ్యాక మొదలు పెట్టారు. మరోవైపు పరీక్ష విధానంలో వినూత్న ప్రక్రియను అమలు చేయనున్నారు. ఈ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నాయి. పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన ప్రశ్నలకు పరీక్షల్లో సమాధానాలు రాయడానికే విద్యార్థులు ఇంతవరకూ పూర్తిగా అలవాటు పడి ఉన్నారు. కొత్త విధానంలో బోధనా విధానం పూర్తిగా మారిపోయిందని, విద్యార్థులు సొంతంగా సమాధానాలు రాయవలసి రావడం వల్లవారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. కొత్త విధానం వల్ల గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనీసం మూడేళ్ల ముందుగా తరగతులలో వరుసగా ఈ నూతన విధానాన్ని అమలు చేశాక పదో తరగతికి వర్తింపచేస్తే బాగుండేదని ఇటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నూతన పరీక్ష విధానం అమలు చేయడం వల్ల ప్రయోజనం కన్నా విద్యార్థుల నుంచి ప్రతిభను గుర్తించలేని పరిస్థితి ఎదుర వుతుందని ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాదికి అమలు చేయవద్దని ఇటీవల కొందరు విద్యార్థులు వేర్వేరుగా కోర్టులను కూడా ఆశ్రయించారు. తెలుగు మీడియం విద్యార్థుల ఆందోళన జిల్లాలో ప్రతి ఏడాదీ దాదాపు 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. వీరిలో 14 వేల మంది తెలుగు మీడియం విద్యార్థులు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ. నూతన పరీక్ష విధానం వీరిని కలవరపెడుతోంది. ఈ పరీక్షా విధానంలో తెలుగు, హిందీ, ఆంగ్లం సబ్జెక్టులకు ఒక్కొక్క ప్రశ్నపత్రం మాత్రమే కేటాయించారు. గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలకు రెండేసి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తెలుగు మీడియం విద్యార్థులు ఒకే పేపరు ద్వారా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టమే. రెండు పేపర్లు ఉన్నపుడే తెలుగు సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా పరీక్ష తప్పారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరో తరగతి నుంచి హిందీ సబ్జెక్టు ప్రారంభమవుతుంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మూడో తరగతి నుంచే బోధిస్తారు. నూతన విధానంలో హిందీ పరీక్షలో 35 మార్కులు సాధించడం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో కొందరికి ఇబ్బందే. కొత్త సిలబస్‌లో ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి ఒకటే పాఠ్యపుస్తకం ఉంటుంది. ఇది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అనుకూలిస్తుంది. ఈ సబ్జెక్టులో వీరు అత్యధిక మార్కులు తెచ్చుకునే అవకాశం ఎక్కువ. అదే తెలుగు మీడియం విద్యార్థులు ఉత్తీర్ణులవడం గగనమే అవుతుంది. గణితం, సామాన్య, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లోని రెండు పేపర్లకు విడి విడిగా ఉత్తీర్ణత సాధించాలి. దీంతో రెండు పేపర్లకు ప్రతి విద్యార్థీ హాజరు కావాల్సిందే. ప్రశ్నపత్రాల్లో సమూల మార్పులు టెన్త్ పరీక్షల పశ్నపత్రాల్లో సమూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పబ్లిక్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులు రానున్నాయి. ఇటీవల టెలి కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన శిక్షణలో పదోతరగతి ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రం తయారీపై ప్రభుత్వ మార్గదర్శకాలు తెలియజేశారు. ప్రశ్నపత్రాలకు మార్గదర్శకాలివే...! విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా సొంతంగా ఆలోచించి రాసే ప్రశ్నలుంటాయి. బట్టీపెట్టి సమాధానాలు రాసే ప్రశ్నలు ఉండవు. విద్యార్థులు సరిగా ఆలోచించేలా పశ్నలుంటాయి. పబ్లిక్ పరీక్షల్లో ఒకసారిచ్చిన ప్రశ్నలు మళ్లీమళ్లీ ఇవ్వరాదు.పాఠ్య పుస్తకంలోని పాఠాల్లో ఇచ్చిన ఎక్సర్‌సైజ్‌లను యథాతథంగా ఇవ్వరాదు. ప్రశ్నలు విద్యార్థుల విద్యాస్థాయి, సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉండాలి.విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన సామర్థ్యాలను ఇచ్చే ప్రాధాన్యానికి అనుగుణంగా ప్రశ్నపత్రాలుండాలి. సైన్స్, గణితం, సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘుసమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు, బహుళ సమాధాన ప్రశ్నలు ఇవ్వాలి. తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో రీడింగ్ కాంప్రెహేన్షన్ (ఇచ్చిన పేరాగ్రాఫ్ చదివి సమాధానాలు రాయడం), రైటింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఓకాబులరీ, గ్రామర్ ఉంటుంది. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో రీడింగ్ కాంప్రెహేన్షన్, ఒకాబులరీ, క్రియేటివ్ రైటింగ్, గ్రామర్, బహుళ సమాధాన తరహాలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రాల్లో కేవలం వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మిగతా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విద్యార్థులకు 2015లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నుంచి ఇంటర్మీడియెట్ తరహాలో సింగిల్ బుక్లెట్ సమాధాన పత్రం మాత్రమే ఇస్తారు. విద్యార్థుల పదో తరగతి మార్కుల జాబితాలో మూడు పార్టుల్లో వివరాలు నమోదు చేస్తారు. పార్ట్-1లో సాధారణ సమాచారం ఇస్తారు. పార్టు-2లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులను ధ్రువీకరించి గ్రేడ్లు ప్రకటిస్తారు. పార్టు-3లో సహపాఠ్యాంశాలకు సంబంధించిన గ్రేడ్లు నమోదు చేస్తారు. మార్కుల జాబితా వెనుక వైపు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల సగటుకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఆదేశాలు రావాల్సి ఉంది.. ఈ ఏడాది కొత్త విధానంలోనే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జీఓ విడుదల కావాల్సి ఉందని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు.