బార్ లెసైన్సుల కోసం పాట్లు
రేపటి నుంచి నూతన పాలసీ అమలు
నిబంధనలకు అనుగుణంగా రెస్టారెంట్లలో మరమ్మతులు
తిరస్కరణకు గురైన మొత్తం దరఖాస్తులు ఆందోళనలో వ్యాపారులు
నరసరావుపేట టౌన్ : బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణలో ప్రభుత్వం కొత్తపాలసీ తీసుకురావడంతో వ్యాపారులు పడుతున్న పాట్లు అన్నీ.. ఇన్నీ.. కావు. ఇప్పటి వరకు నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వ్యాపారులు నూతన లెసైన్సులు పొందేందుకు రెస్టారెంట్ల రూపురేఖలను మార్చాల్సి వస్తోంది. కాగా లెసైన్సు పొందేందుకు పెటుకున్న అన్ని దరఖాస్తులను తిరస్కరించడంతో రెస్టారెంట్ల యాజమాన్యంలో కలవరం మొదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.
డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో 16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్ల లెసైన్సులో కొత్తపాలసీని ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ ఏడాదితో పాత లెసైన్సులు పూర్తిగా రద్దయి జనవరి 1 నుంచి కొత్త లెసైన్సుదారులు రానున్నారు. కాగా నూతన రెస్టారెంటుకు లెసైన్సు పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. రెస్టారెంట్లు బడి, గుడి, వైద్యశాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలి. అదే విధంగా 100 మీటర్ల ఆర్‌సీసీ డాబా, మొత్తం ప్రాంగణం 200 మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. సౌకర్యవంతమైన పార్కింగ్ కలిగి ఉండాలి. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల వీడియోను సీడీలో పొందుపరచడంతోపాటు పొందిన ట్రేడ్‌లెసైన్స్‌తో రూ.5వేల చలనాను జతచేసి హైదరాబాద్ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణకు వచ్చి నిబంధనలను పరిశీలించిన పిమ్మట లెసైన్సు మంజూరుకు చర్యలు తీసుకుంటారు.
దీంతో పట్టణంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యం నిబంధనలకు అనుగుణంగా తమ రెస్టారెంట్లను మార్పు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి పాత స్టాకును విక్రయించేందుకు ఎన్నడూ లేని విధంగా ఎమ్మార్పీధరలకు అమ్మకాలు బార్ అండ్ రెస్టారెంట్లలో మొదలుపెట్టారు. కొన్ని బార్ల యాజమాన్యం రెస్టారెంట్ల ఎదుట క్లియరెన్స్ సేల్, ఎమ్మార్పీ ధరకే అమ్మకాలంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ముగిస్తే లెసైన్సులు ఉంటాయో లేదో అన్న ఆందోళనలో రెస్టారెంట్ల యాజమాన్యం క్లియరెన్స్ సేల్ విక్రయాలు కొనసాగిస్తున్నారని పట్టణంలో చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా 30 వేల మంది జనాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ చొప్పున ఉండాలన్నది నిబంధన. నరసరావుపేట పట్టణంలో సుమారు 1.4 లక్షల జనాభా ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అంటే నిబంధనల ప్రకారం 5 రెస్టారెంట్లకు మించరాదు. కాగా పట్టణంలో అత్యధికంగా 16 రెస్టారెంట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిల్లో కొన్ని తొలగిస్తారన్న ప్రచారం సాగుతున్నా, అధికారులు మాత్రం అవన్నీ అపోహలేనని తేల్చి చెబుతున్నారు.
16 దరఖాస్తులు తిరస్కరణ
బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి కోరుతూ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న యాజమాన్యాలకు చుక్కెదురైంది. దరఖాస్తుతోపాటు దాఖలు చేసిన ట్రేడ్ లెసైన్సులో అవకతవకలు ఉన్నాయంటూ హైదరాబాద్ కమిషనర్ అన్ని దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ట్రేడ్ లెసైన్స్ సరైన పద్ధతిలో పొంది తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకునేందుకు 31వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుండటంతో బార్ యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఇన్‌ఛార్జిగా మున్సిపల్ ఇంజినీర్ ఓంప్రకాష్, ఫుల్‌ఛార్జి లేదనే సాకుతో ట్రేడ్ లెసైన్స్ అనుమతికి దూరంగా ఉండటంతో యాజమాన్యాల్లో కలవరం రేకెత్తింది. ఇదిలా ఉండగా ఇప్పటికే వైన్‌షాపుల నిర్వహణను తమ కంబంధ హస్తాల్లో ఉంచుకున్న అధికార పార్టీ బార్ అండ్ రెస్టారెంట్ల వ్యవహారంలో ఏవిధంగా ముందుకు సాగుతుందో వేచిచూడాల్సి ఉంది.