ఇసుక వినియోగదారులకు 20 రోజులు ఇబ్బందులు తప్పవు. ఇసుక నూతన విధానం అమలులో భాగంగా ప్రభుత్వం శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని రీచ్‌లను మూసివేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త విధానంలో ఇసుక కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూపొందించిన విధివిధానాల మేరకు రీచ్‌లను వేలం నిర్వహించనున్నారు. ఎక్కువ మొత్తం చెల్లించిన వ్యాపారులకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధరలను వ్యాపారులు పెంచేశారు.
గుంటూరు: ఫిబ్రవరి ఒకటి నుంచి ఇసుక నూతన విధానం అమలులోకి రానున్న దృష్ట్యా విక్రయాల కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి చలానాలు కట్టించుకోవద్దని రాష్ట్ర గనుల శాఖ డెరైక్టర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విక్రయాలను పర్యవేక్షిస్తున్న సెర్ఫ్ సీఈవో ఆరోగ్యరాజు కూడా చలానాలు కట్టించుకోవద్దని అన్ని మీ-సేవ కేంద్రాలను ఆదేశించారు. ఇప్పటికే చలానాలు కట్టిన కొనుగోలుదారులకు ఈనెలాఖరు వరకు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న రీచ్‌లను ఫిబ్రవరి 1 నుంచి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చే ఇసుక వ్యాపారులకు అప్పగించనున్నారు.
తిరిగి భూగర్భగనుల శాఖకు...
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఇసుక అమ్మకాల బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్)కు అప్పగించింది. తిరిగి ఈ నెల 2న ఇసుక అమ్మకాలు, పర్యవేక్షణ బాధ్యతలను భూగర్భగనుల శాఖకు అప్పగిస్తూ నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలు చేపట్టినా, తెర వెనుక టీడీపీ నాయకులే దందా నిర్వహిస్తుండడంతోప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది గమనించిన ప్రభుత్వం పాత విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసి కొన్ని మార్పులు, చేర్పులు చేసింది.
గతంలో రీచ్‌లకు బహిరంగ వేలం నిర్వహించడం, నదీ తీరంలో ఇసుక మేటలు వేసిన భూముల్లో వాటి యజమానులు లేదా ఇసుక వ్యాపారులు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఇసుక విక్రయాలు సాగించేవారు. తాజాగా భూముల్లో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం భూ యజమానికి, 75 శాతం ప్రభుత్వానికి వచ్చేలా ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఈ రెండు విధానాలను ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు.
ఇసుక అమ్మకాలు నిలిపివేత ...
ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి, ఉండవల్లి, అమరావతి, దుగ్గిరాల మండల గొడవర్రు సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్‌లను మూసివేశారు.
ఇసుక బంద్!
Published Sat, Jan 9 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement
Advertisement