సాక్షి, కొల్లిపర/ గుంటూరు: కృష్ణానదిలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు రాత్రివేళ చేపట్టారు. గమనించిన గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. పది రోజుల కిందట కృష్ణానదికి వరదలు రావడంతో నిన్నటి వరకు వరద ఉధృతి నెలకొంది. రెండు రోజుల నుంచి నీరు తగ్గి ఇసుక దిబ్బలు బయట పడ్డాయి. వాటిపై ఇసుక మాఫియ కన్నుపడింది. ఇక అంతే రాత్రి వేళల్లో ఇసుక తరలించటం మొదలు పెట్టారు. రెండు రోజుల నుంచి హన్‌మాన్‌పాలెంలో డంప్ చేసి, ఇసుకను చక్రాయపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అలాగే శనివారం రాత్రి కొల్లిపర గ్రామానికి చెందిన కొంత మంది కొత్తబొమ్మువానిపాలెం కృష్ణానది కరకట్ట పుష్కర ఘాట్ వద్ద జేసీబీ, కూలీల సాయంతో లారీ, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు.
అది గమనించిన హన్‌మాన్‌పాలెం, బొమ్మువానిపాలెం గ్రామస్తులు అక్కడకు వెళ్లారు. వారిని చూసిన అక్రమార్కులు జేసీబీని పక్కన ఉన్న పొలంలో నుంచి కరకట్టకు ఎక్కించారు. అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మీరు ఎవరు, ఏ అనుమతితో ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ స్పందించి మీరెవరు మమ్ములను ప్రశ్నించడానికి అంటూ ఎదురుదాడికి దిగాడు. ట్రాక్టర్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.గ్రామస్తులు బైకును ట్రాక్టర్‌కు అడ్డుగా పెట్టి అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు లారీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర, వాహన యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మూడు ఇసుక ట్రాక్టర్లపై కేసు
యర్రబాలెం(మంగళగిరి): యర్రబాలెం గ్రామంలోని రాజధాని రోడ్లలో నిల్వ ఉంచిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. మరో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment