ఇసుక సిరి | sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక సిరి

Published Fri, Mar 6 2015 12:51 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

ఇసుక సిరి - Sakshi

ఇసుక సిరి

రూ.5 కోట్లకు చేరిన అమ్మకాలు
రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం
16 రీచ్‌లలో కొనసాగుతున్న తవ్వకాలు
ఫలిస్తున్న గ్రామీణాభివృద్ధిశాఖ కృషి

 

 
విశాఖపట్నం:  జిల్లాలో 21 రీచ్‌లలో 3,17,848 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నవంబర్‌లో ఇసుక తవ్వకాలకు శ్రీకారం చుట్టినప్పటికీ డిసెంబర్‌లో ఊపందుకున్నాయి. జిల్లాలోని దార్లపూడి, జి.కోడూరు, గజపతినగరం రీచ్‌లలో అందుబాటులో ఉన్న సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వారు. ఇక మిగిలిన 16 రీచ్‌ల ద్వారా ఇప్పటి వరకు 53 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు సాగించారు. ఇప్పటి వరకు 4,500కు పైగా ఆర్డర్లు లభించాయి. వాటిలో సగానికి పైగా మీ-సేవ కేంద్రాల ద్వారానే వచ్చాయి. సుమారు 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను పూర్తిగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు విక్రయించగా, మిగిలిన 63 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డిఫెన్స్, నేవీ, ఎన్‌టీపీసీ, స్టీల్‌ప్లాంట్, అన్‌రాక్, సాన్‌వీరా, క్రెడాయ్‌లతో పాటు ప్రభుత్వ సివిల్ పనుల కోసం కేటాయించారు. వీటి అమ్మకాల ద్వారా 4.36 కోట్లు ఆదాయం రాగా, రవాణా ద్వారా జిల్లాకు మరో రూ.65 లక్షల ఆదాయం సమకూరినట్టు లెక్కతేల్చారు. ఈ లెక్కన ఇప్పటి వరకు జిల్లాకు రూ.5 కోట్ల ఆదాయం వచ్చింది.

 గతంలో ఏనాడు ఈ స్థాయిలో ఇసుక అమ్మకాల ద్వారా జిల్లాకు ఆదాయం వచ్చిన దాఖలాలులేవు. రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్యే అమ్మకాలుండేవి. పదేళ్ల తర్వాత డీనోటిఫై చేయడంతో జిల్లాలో నేడు పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులోకి వచ్చింది. మరొక పక్క రీచ్‌ల నుంచి కొనుగోలు చేసే ఇసుక పక్కదారి పట్టకుండా ఉండేందుకు సొంత ట్రాన్స్‌పోర్టేషన్‌కు శ్రీకారం చుట్టారు. సుమారు 750కు పైగా వాహనాల యజమానులు డీఆర్‌డీఏ వద్ద ఇసుక రవాణా కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏజెన్సీ పరిధిలో అందుబాటులో ఉన్న మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలు కోసం వినియోగించేలా చర్యలు చేపట్టారు.

మైదాన ప్రాంతాల్లో మరో లక్ష క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక అందుబాటులో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో నెలకొన్న ఇసుక కొరతను అధిగమించేందుకు రాష్ర్టంలో తొలిసారి ఆరిలోవలో ప్రత్యేకంగా శాండ్ డిపోను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిల్వ చేసే ఇసుక నాణ్యత విషయంలో తొలుత పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి ఈ డిపో ద్వారా కేవలం పది రోజుల వ్యవధిలోనే 1080 క్యూబిక్  మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించి రూ.16 లక్షల వ్యాపారం చేశారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ నగర పరిధిలో రోజుకు 500 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందన్న అంచనాతో ఆ మేరకు శ్రీకాకుళం రీచ్‌ల్లో కొనుగోలు చేసి రప్పిస్తున్నారు.

శ్రీకాకుళం నుంచి ఇసుకను తరలించే వాహనాలను తొలిసారి జీపీఆర్‌ఎస్‌కు కనెక్ట్ చేసి వాటిని పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. తొలిసారిగా ఈ సెంట్రల్ డిపోతో పాటు మేజర్ రీచ్‌లలో ఒకటైన పొట్నూరు రీచ్ నుంచి ఇసుక రవాణాకు పూర్తిగా హోలోగ్రామ్‌తో కూడిన ఈ వేబిల్లు జారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇసుక కొరత రానీయకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఇప్పటికే గుర్తించిన ఇసుక రీచ్‌లో తవ్వకాలు సాగించడం ద్వారా వచ్చే ఇసుకను పూర్తిగా సెంట్రల్ శాండ్ డిపోకు కేటాయించేలా ప్రతిపాదనలు పంపారు. మరొ పక్క జిల్లాలో రాంబిల్లి, అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేటలలో మరో 10 నుంచి 15 కొత్త రీచ్‌లను గుర్తించారు. ఈ రీచ్‌లలో మరో లక్షకు పైగాక్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement