‘ఆకేరు’లో అక్రమార్కులు
యథేచ్ఛగా ఇసుక దందా...
‘మామూలు’గా వదిలేస్తున్న అధికారులు
బోసిపోతున్న ఆకేరువాగు
సమీప ప్రాంతాల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు
వర్ధన్నపేట : తేరగా రూ.లక్షల్లో ఆదాయం వస్తుంటే ఎవరు వద్దనుకుంటారు? అందినకాడికి దోచుకోవడమంటే మహా ఆసక్తి చూపే పలువురి ‘దాహార్తి’ని ఆకేరు వాగు తీరుస్తోంది. ఎలాంటి అనుమతి లేకపోగా.. నిషేధాజ్ఞలు పట్టించుకోకుండా వందల కొద్దీ ట్రాక్టర్లలో రోజుల తరబడి ఇసుక తరలిస్తున్నా అధికారులు ‘మామూలు’గా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. అక్రమార్కుల దోపిడీ, అధికారుల పట్టింపు లేని తనాన్ని చూడలేకే.. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ నిలిచిపోతే.. రాత్రివేళలో దహనం చేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆకేరు పరివాహక ప్రాంత ప్రజలు కన్నెర్ర జేయకముందే అధికారులు మేల్కొని ఇసుకాసురుల భరతం పట్టాలని పలువురు కోరుతున్నారు.
అడ్డుకుంటే దాడులే...
స్టేషన్ ఘన్‌పూర్ మండలం నష్కల్ నుంచి మొదలయ్యే ఆకేరు వాగు జఫర్‌గఢ్, వర్ధన్నపేట, పాలకుర్తి మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తూ పాలేరు నదిలో కలుస్తుంది. ఈ మేరకు ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో పలువురు ఇసుకాసురులు కాసులు దోచుకుంటున్నారు. అధికారులు పట్టుకుంటే ఆమ్యామ్యాలతో సమాధానం చెబుతూ, రైతులు అడ్డుకుంటే దాడులు చేస్తూ తమ దందా సాగిస్తున్నారు. ఇలా ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నా ఎవరికీ పట్టకపోవడం గమనార్హం.
జేసీబీలు, ట్రాక్టర్లు..
ఆకేరు వాగు పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలించే క్రమంలో నిత్యం రూ.లక్షల్లో దందా సాగుతోంది. జఫరగఢ్ మండలం ఉప్పుగల్లులో ప్రారంభమయ్యే ఈ దందా కొత్తపెల్లి, ల్యాబర్తి వరకు విస్తరించింది. జేసీబీలు, ట్రాక్టర్లతో పాటు భారీ యంత్రాలను వినియోగిస్తూ ఇసుక రవాణా చేస్తున్నారు. వర్ధన్నపేట నుంచి వరంగల్ నగరానికి సులువుగా ప్రయాణం కొనసాగించే అవకాశం ఉండడంతో ‘అడ్డదారులు’ వెతుకుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిధ్రమవుతున్న రోడ్లు
ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు, జేసీబీల రాకపోకలతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రజల సౌకర్యార్థం రూ.కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్న అధికారులు ఇసుక రవాణాను నియంత్రించకపోవడంతో కొన్ని రోజులకే రోడ్లు దెబ్బతింటున్నాయి. నందనం, కక్కిరాలపెల్లి, ఇల్లంద, కొత్తపెల్లి, ల్యాబర్తి రహదారులు ఇసుక రవాణా చేసే వాహనాల కారణంగా గుంతలు పడుతున్నాయి. ఏళ్ల తరబడి వాగు పరివాహక ప్రాతం నుంచి భారీగా ఇసుకను తరలించడంతో పచ్చని చెట్లు నేలమట్టం కావడంతో పాటు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇక సమీప ప్రాంతంలోని బోరు, వ్యవసాయ బావులు వట్టిపోతున్నాయి.
అధికారులకు పట్టదా?
ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో ఇసుక క్వారీల వద్ద ప్రమాదాలు జరుగుతున్న చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ల్యాబర్తి గ్రామంలో ఇసుక తోడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కొత్తపెల్లిలోనూ ఇసుక తీస్తున్న కూలీ ప్రమాదంలో గాయపడ్డాడు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు. ఇసుక అక్రమ దందా కిందిస్థాయి రెవెన్యూ సిబ్బందికి కాసుల పంటగా మారడంతోనే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రతీ ట్రాక్టరు నుంచి అందినంత దండుకుంటున్న రెవెన్యూ సిబ్బందికి అక్రమ రవాణాకు పచ్చ జెండా ఊపుతున్నట్లు సమాచారం. ఇకనైనా ఇసుక దందాపై ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే అకేరువాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని వాగు పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.