కాసులు రాల్చుతున్న ఇసుక | sand mafia | Sakshi
Sakshi News home page

కాసులు రాల్చుతున్న ఇసుక

Published Tue, Nov 24 2015 11:15 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

కాసులు రాల్చుతున్న ఇసుక - Sakshi

కాసులు రాల్చుతున్న ఇసుక

జోరుగా అమ్మకాలు
రికార్డు స్థాయిలో ఖజానాకు పాతిక కోట్లు ఆదాయం
బడాబాబులు కోరుకున్నంత
సామాన్యులకు అందనంత
సంఘాలకు దక్కింది అంతంత

 
ఇసుక.. ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. వేలం పాటలు నిర్వహించిన ప్పుడు కూడా ఇంత  ఆదాయం రాలేదు. గతంలో ఏనాడు నాలుగైదుకోట్లే మించి ఆదాయం వచ్చిన దాఖలాలులేవు. కేవలం పది నెలల కాలం ఒక్క విశాఖ జిల్లా నుంచే ఏకంగా పాతిక కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
 
 విశాఖపట్నం: ఇసుక రీచ్‌ల నిర్వహణ..అమ్మకాలను డ్వామా నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించి రెండేళ్లు కావస్తోంది. జిల్లాలో పదేళ్ల తర్వాత రీచ్‌లకు డీనోటిఫై చేసి ఏడాది కావస్తోంది. ప్రారంభించిన 25 రీచ్‌లలో 20 రీచ్‌ల్లో ఇసుక నిల్వలు అడుగంటాయి. మరో పక్క డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పొరుగు జిల్లాల నుంచి ఇసుకను ప్రత్యేకంగా రప్పించి మరీ డిపోల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక పక్క ఇసుక కొరత.. మరో పక్క కొండెక్కిన ధరలతో సామాన్యులకు అందనంత దూరంలో ఇసుక రేణువులుంటే.. ఆరంభం నుంచి సిఫార్సులుంటేచాలు బడాబాబులకు కోరుకున్నంత ఇసుకవారి చెంతకు చేరుతూనే ఉంది. ఇలా వివాదాల నడుమ ఇసుక అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇసుక అమ్మకాల ద్వారా ఖజానాకు రూ. పాతిక కోట్ల ఆదాయం వచ్చి చేరింది.
     
జిల్లాలో డీనోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 4,47,605 క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉంటుందని అంచనా వేశారు. ప్లెయిన్ ఏరియాలో 20 రీచ్‌ల ద్వారా 2,46,465 క్యూ.మీ. ఇసుకను వెలికి తీశారు. ఏజెన్సీ పరిధిలోని నాలుగు ప్రధాన రీచ్ ల  ద్వారా 2,23, 818 క్యూ.మీ ఇసుకను వెలికి తీశారు. వీటి అమ్మకాల ద్వారా 13.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా ప్లెయిన్ ఏరియాలో రీచ్‌ల వద్ద 27,621 క్యూ.మీ, ఏజెన్సీ ప్రాంత రీచ్‌ల వద్ద 36,492 క్యూ.మీ. ఇసుక కోసం పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఆరిలోవ డిపో ద్వారా ఇప్పటివరకు 65వేల క్యూ.మీ, ఆనంద పురంలోని జిల్లా సమైక్య డిపో  ద్వారా మరో 75వేల క్యూ.మీ. ఇసుకను విక్రయించారు. ఇక సీజ్ చేసిన ఇసుకను పద్మనాభం వద్ద డిపో ద్వారా 8,995 క్యూ.మీ, కశింకోట వద్ద 48 క్యూ.మీ  స్టీల్‌ప్లాంట్ డిపో వద్ద 8వేల క్యూ.మీ. మేర అమ్మకాలు సాగించారు. ఈ అమ్మకాల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది.

అందుబాటులో 1.79 లక్షల క్యూ.మీ.ఇసుక
రీచ్‌లు, డిపోల వద్ద కలుపుకుంటే మొత్తం 5,26,939 క్యూ.మీ ఇసుక అందుబాటులో ఉంటుందని అంచనా వేయగా, 3,47,193 క్యూ.మీ ఇసుక కోసం ఆర్డర్లు రాగా ఇప్పటివరకు 3,09,733 క్యూ.మీ ఇసుక అమ్మకాలు జరిగాయి. మరో 37,460 క్యూ.మీ ఇసుకను విక్రయించాల్సి ఉంది.  ప్రస్తుతం రీచ్‌లు, డిపోల వద్ద ఉన్న నిల్వలన్నీ కలిపి మరో 1,79,746 క్యూ.మీ. ఇసుక ప్రస్తుతం అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా ఏజెన్సీ పరిధిలో మంగబంద శాండ్ మైనింగ్ రీచ్ వద్ద 1.07లక్షల క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉంది. సగరం రీచ్‌లో మరో 53 వేలు, కాశీపట్నం, సోమిదేవులపల్లి రీచ్‌లో 12వేల చొప్పున, జుత్తాడ రీచ్‌లో 10వేలు, ఎరుకువాడ, దిబ్బపాలెం రీచ్‌లలో వెయ్యేసి క్యూ.మీ. చొప్పున ఇసుక  అందుబాటులో ఉంది. మంగబంద రీచ్‌లో ఉన్న 1.05 లక్షల క్యూ.మీ. ఇసుకను పూర్తిగా ఏజెన్సీ అవసరాలకే వినియోగించనున్నారు.   ఇక డిపోల విషయానికొస్తే ఆరిలోవ డిపో వద్ద సుమారు 10వేల క్యూ.మీ. స్టీల్‌ప్లాంట్ డిపో వద్ద మరో 42 వేల క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉంది.
 
పొరుగు జిల్లాల నుంచి..
 నిర్మాణ రంగం ఊపందుకోవడంతో జిల్లాకు 11లక్షల క్యూ.మీ. ఇసుక అవసరమనే అంచనాతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి రప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 65వేల క్యూ.మీ. ఇసుకను రప్పించి పెండింగ్ ఆర్డర్లకు అనుగుణంగా విక్రయాలు జరిపారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement