నంద్యాల, న్యూస్‌లైన్: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారవుతోంది కాంగ్రెస్ పరిస్థితి. కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం ఆ పార్టీ నేతలను ఇప్పటికే ఇరుకున పడేసింది. తాజాగా నేతల్లోని అనైక్యత ఆ పార్టీ మూలాలను కుదిపేస్తోంది. కీలక ప్రాంతమైన నంద్యాల నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారడంతో కింది స్థాయి కేడర్ కలవరపడుతోంది. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా మోహనరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తుతున్న విభేదాలే ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు నంద్యాల మార్కెట్ యార్డు పాలక మండలి కార్యవర్గం నియామకం, నంద్యాలలో శిల్పా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఏరాసు వర్గీయుల ‘మార్కెట్ మంట’
తాజాగా ఏర్పాటైన నంద్యాల మార్కెట్ యార్డు పాలక వర్గంలో మంత్రి ఏరాసు మద్దతుదారులు ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో అంతా ఎమ్మెల్యే శిల్పామోహనరెడ్డి వర్గీయులే ఉండటంతో ఇది ఎంత వరకు సమంజసమనీ.. ఆయన సమైక్య ఉద్యమానికి మద్దతు పేరిట తమ అధినేత్రి సోనియా గాంధీనే ధిక్కరించారని ఏరాసు మద్ధతుదారుల వాదన.
దీంతో శ్రీశైలం నియోజకవర్గంలోని కాంగ్రెసు కేడర్ మండి పడుతోంది. ఈ మార్కెట్ యార్డు పరిధిలోకి మహానంది, బండిఆత్మకూరు.. పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల, పాణ్యం మండలాలు కూడా వస్తాయి. మొత్తం 15 మంది సభ్యులతో పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పాణ్యం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు, నంద్యాల నియోజకవర్గానికి చెందిన 12 మందితో కలిపి పాలక మండలిని నియమించారు. శిల్పా అనుచరుడు న్యాయవాది సిద్ధం శివరాం యార్డు చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ నియామకం మంత్రి వర్గీయుల ఆగ్రహానికి కారణమవుతోంది.
కాగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి కూడా ఈ పదవి కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఎమ్మెల్యే కాటసాని అనుచరుడిగా ఆయన ఈ పదవికి ప్రయత్నం చేశారు. అయితే చైర్మన్ పదవి ఇవ్వడానికి శిల్పా, ఏరాసులు సానుకూలంగా స్పందించకపోవడంతో పదవి దక్కలేదని తెలుస్తోంది. మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన వారిపేర్లు అందకపోవడం వల్లే వారికి పాలక మండలిలో అవకాశం కల్పించలేక పోయామని ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి విలేకరుల వద్ద వెల్లడించడం గమనార్హం.
ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో సైతం...
మరోవైపు మంత్రి ఏరాసుకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎమ్మెల్యేలు శిల్పామోహనరెడ్డి, కాటసానిల మధ్య కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. శిల్పా ఆధ్వర్యంలో జరిగిన వృషభ ప్రదర్శనలకు రాంభూపాల్ రెడ్డి మొహం చాటేయడమే దీనికి ఉదాహరణని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాటసాని అదే సమయంలో ఓ తన సన్నిహితుని వివాహానికి హాజరైనా పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.
అయితే ఆయనను రప్పించేందుకు శిల్పా తన సమీప వ్యక్తుల ద్వారా ప్రయత్నించినా వ్యక్తిగతంగా ఆయన పిలవ లేదన్న కారణంగా కాటసాని పోటీలకు దూరంగా ఉన్నట్లు భోగట్టా. ఈ విషయంలో కాటసాని హాజరయ్యేలా చూసేందుకు కొందరు కార్యకర్తలు యత్నించినా ఆయన వారి ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
ఇలా వీరి విభేదాలు బయటపడడంతో కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. మొత్తం మీద మంత్రి ఏరాసుకు వ్యతిరేకంగా జతకట్టిన శిల్పా, కాటసానిల మధ్య కూడా ఇటీవల విభేదాలు తలెత్తాయా అనే అనుమానం వృషభ ప్రదర్శకుల మధ్య చర్చ సాగింది. అంతేగాక రెండు మాసాల క్రితం సమైక్యాంధ్ర కోసం కర్నూలులో కాటసాని రాంభూపాల్‌రెడ్డి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర దీక్ష కొనసాగించిన సమయంలో శిల్పా అటువైపు కన్నెత్తి చూడలేదని.. ఇది కూడా కాటసాని ఆగ్రహానికి కారణం కావచ్చని భావిస్తున్నారు.
అంతే కాకుండా అప్పటిలోనే నంద్యాల పట్టణంలో శిల్పా నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో కాటసానికి ఆయన ఫోన్ చేసి శిబిరం దగ్గరికి రావాలని కోరారని.. ఆయన దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించారనీ.. ఈ విభేదాల నేపథ్యంలోనే వృషభ ప్రదర్శనలకు కాటసాని దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఇలా ఈ నేతల వివాదం కాంగ్రెస్‌ను మరింత కుంగదీసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కల్లోల కాంగ్రెస్
Published Thu, Dec 5 2013 3:25 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement