నంద్యాల, న్యూస్‌లైన్: అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమానాగిరెడ్డి తెలిపారు. ఇందుకోసం పలు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ వివరాలను విలేకరులకు వివరించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీ ప్రణాళికను అమలులోకి తెస్తారన్నారు. దానితోపాటు నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నికల మ్యానిఫెస్టోను తాను రూపొందించినట్లు భూమా తెలిపారు. వార్డు పర్యటనలో వచ్చిన సమస్యలను కూడా ఇందులో చేరుస్తామన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే..
వార్డుకు 200 నుంచి 300 మధ్యన నిరుపేదలను ఎన్నుకొని పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో పదివేల మందికి నివాస గృహాలను అపార్ట్‌మెంట్ పద్ధతి నిర్మిస్తామని భూమా నాగిరెడ్డి చెప్పారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లోని అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బొమ్మలసత్రం, ఎన్‌టీఆర్ కాంప్లెక్స్, ఆర్‌టీసీ బస్టాండ్, నూనెపల్లె, ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీచౌక్‌లలో ఆటో స్టాండ్‌లను ఏర్పాటు చేస్తామని వివరించారు. అందులో ప్రయాణీకులకు, ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా మీటింగ్ హాల్, క్యాంటిన్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టీవీ, ఫోన్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఫోన్‌కాల్‌తో ఆటో ఇంటి ముందు వాలే విధంగా చూస్తామన్నారు. పట్టణంలోని మురుగునీటిని కుందూనది ఒడ్డుకు చేర్చి అక్కడే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదలందరికీ ఇంటి వద్దకే ఉచితంగా మినరల్ వాటర్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులందరూ ఇంటి వద్దనే పింఛన్లు అందుకునేలా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను, రైతులకు కల్తీలేని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందజేస్తామన్నారు. గాంధీచౌక్‌లోని కూరగాయల మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
పూలు, పండ్లు, కూరగాయలకు ప్రత్యేక మార్కెట్ వసతిని కల్పిస్తామన్నారు. ైబె ర్‌మల్‌వీధి, కల్పనాసెంటర్, మెయిన్ బజార్‌లను వాక్‌స్ట్రీట్‌లుగా ప్రకటించి వాహనదారులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాక్‌స్ట్రీట్‌లలో వాహనాలకు అనుమతిస్తామన్నారు. ఇళ్లపై వేలాడే హైపర్‌టెన్షన్ తీగలను తొలగిస్తామన్నారు. ఆటోనగర్‌తోపాటు పట్టణంలోను, గ్రామాల్లోని ప్రతి వీధిలో సిమెంట్ రహదారి, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామన్నారు. చేతి వృత్తుదారులు.. వివిధ వర్గాల వారికి ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఫిబ్రవరి 5 నుంచి గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ..
వచ్చేనెల 5వ తేదీ నుంచి పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రతివార్డులో పర్యటించాలని నిర్ణయించినట్లు భూమా తెలిపారు. వచ్చేనెల 2వ తేదీన డయల్ యువర్ భూమా కార్యక్రమంలో ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తానన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
ఉచిత వైద్యం.. ఉపాధికి ప్రాధాన్యం
Published Wed, Jan 29 2014 3:25 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement