నేటి నుంచి ఆర్‌యూ పీజీసెట్
► పదిరోజుల్లో ఫలితాలు
► జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్
► కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాయలసీమ యూనివర్సిటీ పీజీసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలను నేటి నుంచి నాలుగురోజులపాటు పకడ్బందీగా నిర్వహిస్తామని పీజీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 19, 20, 21, 22 తేదీల్లో కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, నంద్యాల పీఎస్‌సీ అండ్ కేవీఎస్‌సీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10.30 వరకు, 11.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు.
పరీక్ష సమయానికి రాకుంటే అనుమతించబోమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందుగానే ఆయా కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కాకపోతే పరీక్షకు రెండు గంటల ముందు కేంద్రం సూపరిటెండెంట్‌కు గుర్తింపు కార్డు, ఇతర ఆధారాలు చూపి తీసుకోవచ్చన్నారు. పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, సెల్‌ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. పది రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని చెప్పిన ఆయన జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.