సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు పూర్తవ్వడంతో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ప్రవేశాల ప్రక్రియను ముమ్మరం చేశాయి. నిబంధనల ప్రకారం ఇంటర్ బోర్డ్ నుంచి అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉన్నా, దీన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏకంగా బ్రిడ్జ్, క్రాష్ కోర్సులంటూ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి మాత్రమే అన్ని కాలేజీలూ ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చింది.
ఈలోపు అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మండువేసవిలో తరగతులు నిర్వహిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు కాలేజీలు ఈసారి ఫీజులు భారీగా పెంచాయి. ఐఐటీ, నీట్, ఇంటెన్సివ్ కోర్సులంటూ విభాగాల వారీగా ధరలు నిర్ణయించాయి. ఓ కార్పొరేట్ కాలేజీ గత ఏడాది సంవత్సరానికి రూ.1.25 లక్షలు తీసుకోగా, ఈసారి రూ.1.75 లక్షలు డిమాండ్ చేస్తోంది. జేఈఈ కోచింగ్‌తో కలిపితే రూ. 2.25 లక్షలు చెబుతోంది. సాధారణ కాలేజీలు కూడా ఏడాదికి రూ.75 వేల నుంచి రూ. 1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా 20 శాతం పెంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్ కోసం ఏటా రూ.1.25 లక్షలు అడుగుతున్నారు. మొత్తం మీద ఇంటర్ పూర్తయ్యే వరకూ రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
గుర్తింపు ఇవ్వకుండానే...?
రాష్ట్రవ్యాప్తంగా 3,111 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీలు తీసివేస్తే దాదాపు 1,516 ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీలు అన్నీ పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇస్తారు. గత ఏడాది 416 కాలేజీలకు పరీక్ష ఫీజు గడువు ప్రకటించే వరకూ గుర్తింపు ఇవ్వలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయని, అగ్రిప్రమాదాలను నివారించే వ్యవస్థ లేదనే అభ్యంతరాలున్నాయి. దీంతో లక్ష మంది విద్యార్థులు ఫీజు కట్టేందుకు ఆఖరి క్షణం వరకూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది మూడేళ్ల కాలపరిమితితో అఫ్లియేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీలు ఇంకా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే ఉన్నాయి. అయినా పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది.
టెన్త్ ఫలితాలొచ్చేలోగా గుర్తింపు పూర్తి: నవీన్ మిత్తల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి)
అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాతే బోర్డ్ నిర్దేశించిన మేరకు ఫస్టియర్ ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టినా, క్లాసులు నిర్వహించినా చర్యలుంటాయి. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి టెన్త్ ఫలితాలు వచ్చిన వెంటనే గుర్తింపు ప్రక్రియను పూర్తిచేస్తాం. ఆ తర్వాత అఫ్లియేషన్ ఇవ్వం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తింపు వచ్చిన తర్వాతే విద్యార్థులను కాలేజీల్లో చేర్చాలని కోరుతున్నాం.
ఉల్లంఘనులపై చర్యలుండాలి: మాచర్ల రామకృష్ణగౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్)
గుర్తింపు రాకుండా ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. అధికారులు ఇలాంటి కాలేజీలపై దృష్టి పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. టెన్త్ ఫలితాలు రాకుండా ఇంటర్ క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment