సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వ్యవహారంలో మరో అక్రమానికి తెరలేచింది. అనేక లోపాల కారణంగా ‘గుర్తింపు’పొందని కాలేజీల్లో భారీగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగిపోతున్నాయి. ఇలా చేరిపోయిన ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే సాకుతో ఆయా కాలేజీలకు ‘గుర్తింపు’ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆయా కాలేజీల యాజమాన్యాలతో ఇంటర్మీడియట్ బోర్డులోని కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని... ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లోనూ కొన్నింటిలో లోపాలున్నా.. ముడుపులు పుచ్చుకుని అఫిలియేషన్ ఇచ్చినట్టుగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు బోర్డు కార్యదర్శికి ఉండాల్సిన అఫిలియేషన్ జారీ అధికారాన్ని ఇతర అధికారులకు కట్టబెట్టి మరీ అక్రమాలకు తెరతీసినట్టు బోర్డు వర్గాలే పేర్కొంటున్నాయి. అఫిలియేషన్ అధికారాలను పొందిన సదరు అధికారిని కలసి ముడుపులు ముట్టజెప్పితేనే ‘పని’జరుగుతోందని.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొంటుండటం గమనార్హం.
గడువు ముగిసిపోయినా..
రాష్ట్రంలో మొత్తం 1,640 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇంటర్ బోర్డు ఈసారి పలు సడలింపులతో 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటికి ఫిబ్రవరి 21వ తేదీ నాటికే అఫిలియేషన్లను పూర్తి చేయాల్సి ఉన్నా.. కాలేజీల విజ్ఞప్తి మేరకు అంటూ మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అయినా అనేక లోపాల కారణంగా 337 కాలేజీలకు గుర్తింపు లభించలేదు. గత నెల 21న ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నాటికి కూడా ఆయా కాలేజీలు సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో ‘గుర్తింపు’అవకాశం కోల్పోయాయి. కానీ తాజాగా ‘విద్యార్థుల భవిష్యత్తు’దెబ్బతింటుందనే పేరుతో ఆయా కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం.
మరో రెండు మూడు నెలల్లో లోపాలన్నీ సవరించుకుంటామంటూ కాలేజీలు అఫిడవిట్ ఇస్తే.. వాటికి ‘గుర్తింపు’ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు ఆయా కాలేజీలు కూడా ‘బోర్డు ఇచ్చిన సమయంలోగా లోపాలను సవరించుకోకున్నా పోయేదేమీ లేదని.. విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీలను మూసివేసే అవకాశం ఉండదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? అన్న సాకుతో యాజమాన్యాలు ఆందోళన చేయవచ్చని..’కొందరు అధికారులే కాలేజీల యాజమాన్యాలకు సూచిస్తూ అక్రమాలకు తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సగం వరకు కార్పొరేట్ కాలేజీలే..
అనుబంధ గుర్తింపు లభించని 337 కాలేజీల్లో సగం వరకు కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే ఉన్నట్టు తెలిసింది. దీంతో భారీగా సొమ్ము దండుకోవచ్చన్న ఆశతోనే అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కాలేజీలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డుకు చెందిన క్షేత్ర స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల దాకా భాగస్వామ్యం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అందువల్లే పలు కాలేజీలు తమకు అనుబంధ గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లు చేసుకోవడం మొదలుపెట్టాయని.. ఇది తెలిసినా అధికారులెవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ముందుగా ప్రారంభించినా.. అంతే!
ప్రైవేటు కాలేజీలు ఏటా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందాలి. ఇందుకోసం తొలుత ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇస్తే.. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుంటాయి. సాధారణంగా జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందన్నది తెలిసిందే. అయినా నాలుగైదేళ్లుగా అధికారులు ముందుగానే అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టకుండా జాప్యం చేశారు. కానీ ఈసారి మాత్రం మార్చి 31 నాటికే ‘గుర్తింపు’ప్రక్రియ పూర్తిచేసి.. గుర్తింపు పొందిన, గుర్తింపు రాని కాలేజీల జాబితాలను వెబ్‌సైట్‌లో పెడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతేడాది ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం కోసం గతేడాది డిసెంబర్‌లోనే అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన ఇంటర్ బోర్డు.. ఫిబ్రవరి నాటికే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ జాప్యం చేసింది.
‘గుర్తింపు’లేని జాబితా ఏదీ?
ఇంటర్ బోర్డు మార్చి 31 నాటికి 1,303 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వాటి జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కానీ గుర్తింపు పొందని కాలేజీల జాబితాను మాత్రం వెబ్‌సైట్లో పెట్టకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి.. ఈ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆ కాలేజీలకు గుర్తింపు రాకపోతే ఎలా?
అనుబంధ గుర్తింపు లభించని కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో వనస్థలిపురంలోని ఓ కాలేజీ విషయంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు.. గుర్తింపు లేకున్నా ఆ కాలేజీ ప్రవేశాలు చేపట్టడాన్ని చూసీ చూడనట్టు వదిలేశారు. చివరికి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చే సరికి.. అధికారులు చేతివాటం చూపారు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో తమ విద్యార్థుల వివరాలు అప్‌లోడ్ చేసేందుకు, ఫీజు చెల్లించేందుకు ఆ కాలేజీకి లాగిన్ ఐడీ ఇవ్వలేదు. దాంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. వారందరినీ హయత్‌నగర్ ప్రభుత్వ కాలేజీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించింది. దీనివల్ల ఆ విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్రంగా నష్టపోయారు కూడా. తాజాగా అనుబంధ గుర్తింపు పొందని 337 ఇంటర్మీడియట్ కాలేజీల్లోనూ వేల మంది విద్యార్థులు చేరినట్టు అంచనా. ఇప్పుడు వీరి భవిష్యత్తు ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment