జనగామ అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల గుర్తింపు (అఫిలియేషన్) కోసం ప్రత్యేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అఫిలియేషన్ కోసం గతంలో మాదిరిగా హైదరాబాద్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గుర్తింపు అధికారాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న జిల్లా డీఐఈఓ వి.ఇంద్రాణి జిల్లాలోని 21 ప్రైవేట్ జూనియర్ కళాశాలతో పాటు 10 మోడల్, 04 సాంఘిక సంక్షేమ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని నిర్వహించి గుర్తింపు మార్గదర్శకాలను, విధివిధానాలను వివరించారు.
మారిన ప్రక్రియ...
ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి దాదాపు 14 పేజీలు ఉన్న ఒకే ఒక ఫారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అప్‌లోడ్ చేసిన ఫారంతో ఇంటర్మీడియట్ అధికారులు సంబంధిత కళాశాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ పేర్కొన్న అంశాలు అన్నీంటిన్ని క్షుణంగా పరీశీలించిన అనంతరం గుర్తింపు ఫీజును ప్రభుత్వానికి కట్టడానికి అనుమతిస్తారు. గతంలో గుర్తింపు ఫీజును కట్టిన తరువాతే కళాశాలలను పర్యవేక్షించే విధానానికి ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికింది. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రతి సంవత్సరం లేని గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ కళాశాలలకు ఆపాదించడంపై కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ విడుదల...
జిల్లాలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు (ఒకేషనల్ కళాశాలలతో సహా) గుర్తింపు కోసం చేసుకునే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించారు. గుర్తింపు కోసం అపరాధ రుసుం లేకుండా 11 జనవరి 2018 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో 18 జనవరి వరకు, రూ.3 వేల ఆపరాధ రుసుముతో జనవరి 25 వరకు, రూ.5 వేలతో 1 ఫిబ్రవరి 2018 వరకు, రూ.10 వేలతో 08 ఫిబ్రవరి వరకు, రూ.15 వేల అపరాధ రుసుముతో 15 ఫిబ్రవరి వరకు, రూ.20 వేల అపరాధ రుసుముతో 22 ఫిబ్రవరి 2018 వరకు చెల్లించుకోవచ్చునని ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ ఫాంను నేరుగా ఇంటర్ బోర్డు కార్యాలయానికి తీసుకుని వస్తే తిరస్కరిస్తామని స్పష్టంగా హెచ్చరించింది. వసతి గృహాలు ఉన్న ప్రైవేట్ కళాశాలల వారు 2018–19 గుర్తింపు కోసం 5 జనవరి 2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పెర్కొన్నారు.
నిబంధనల ప్రకారమే గుర్తింపు...
జిల్లాలోని ఇంటర్ కళాశాలల గుర్తింపు (ఆఫిలియేషన్) ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి అన్నీ వసతులు ఉంటేనే ఆఫిలియేషన్ జారీ చేస్తాం.
– వి.ఇంద్రాణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
సంస్కరణలను స్వాగతిస్తున్నాం...
ప్రైవేట్ కళాశాలల గుర్తింపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్‌షిప్‌ల విషయంలో కూడా చొరవ తీసుకుని విడుదల చేస్తే కళాశాలలకు ఆర్థిక భారం తగ్గుతుంది.
– ఆర్.బ్రహ్మచారి, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజామాన్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment