Intermediate Colleges
-
ప్రభుత్వ విద్య మిథ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్‌కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్‌లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం ⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. ⇒ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్‌ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. ⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. ⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం. ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! ⇒ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణను పైలట్‌గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు. ⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే మొదలు.. ⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. ⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్‌ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా రద్దు చేసింది. ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ⇒ ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ను మండలిలో నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. - ఇ.మహేష్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి -
ఇంటర్ ప్రవేశాలకు ‘ఆన్లైన్’ రద్దు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు కొత్తగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియెట్ స్ట్రీమ్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి పాత విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఆన్లైన్ ప్రవేశాలకు చట్టం చేసేందుకు, నిబంధనలు రూపొందించేందుకు ఈ తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదంది. ఇదే సమయంలో ఆన్లైన్ విధానం తేవాలంటే లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కొత్త విధానం గురించి ముందు విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు వెలువరించారు. ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఆన్లైన్ విధానాన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఆన్లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఎలాంటి చట్టపరమైన దన్ను లేదన్నారు. ఈ కొత్త విధానం లబ్ధిదారులందరి హక్కులను కాపాడటం లేదని చెప్పారు. కోవిడ్ వల్ల పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇంటర్ ప్రవేశాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారని ఇంటర్ బోర్డు చెబుతున్నప్పటికీ ఈ విధానాన్ని సమర్థించలేమని స్పష్టం చేశారు. ఆన్లైన్ ప్రవేశాల విషయంలో లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఉండాల్సిందన్నారు. ఆ అధికారాన్ని ఇంటర్ బోర్డుకు బదలాయించకుండా ఉండాల్సిందని చెప్పారు. ఈ అధికార బదలాయింపు చట్టప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదని పేర్కొన్నారు. కోవిడ్ నుంచి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కాపాడేందుకే ఆన్లైన్ విధానం తెచ్చామని ఇంటర్ బోర్డు చెబుతోందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేనప్పటికీ.. నోటిఫికేషన్లోనే ఈ విషయాన్ని పొందుపరచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. -
ఆన్ లైన్‌తో ‘ప్రయివేట్’ అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలకు ఇంటర్మీడియెట్ విద్యలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో అడ్డుకట్ట పడనుంది. ఇంతకాలం సరైన అనుమతులు, సదుపాయాలు లేకుండానే కాలేజీలను నిర్వహిస్తూ ప్రజల నుంచి రూ.కోట్లు ఫీజుల రూపేణా దండుకున్న కార్పొరేట్ సంస్థలకు ముకుతాడు పడుతోంది. ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లను ఆన్లైన్లో ఇంటర్మీడియెట్ బోర్డు పర్యవేక్షణలోనే నిర్వహిస్తోంది. ప్రయివేటు కాలేజీల్లో వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ఫీజులను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ నిర్ణయిస్తే, అనుమతులు, భవనాల ఫొటోల జియోట్యాగింగ్, ల్యాబ్‌లు, లైబ్రరీలు, సిబ్బంది తదితర సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచడం వంటి చర్యలను ఇంటర్ బోర్డు తీసుకుంది. ఈ ఆన్లైన్ ప్రక్రియ ఫలితాలు ఇప్పటికే కనబడుతున్నాయి. ఇప్పటివరకు తమకు లాభసాటిగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా అనుమతులు పొందిన కార్పొరేట్ సంస్థలు ఈసారి అనుమతుల కోసం దరఖాస్తు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు అందించే కాలేజీలు 3,158 ఉండగా వాటిలో 1,150 వరకు ప్రభుత్వ కాలేజీలు, తక్కినవన్నీ ప్రయివేటు కాలేజీలే. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ సంస్థల కాలేజీలు సంఖ్య పరంగా తక్కువగా ఉన్నా తక్కిన ప్రయివేట్ కాలేజీల్లో అనేకం అవి కొనసాగిస్తున్న బినామీ సంస్థలే. పకడ్బందీగా నిబంధనల అమలు ఎంపీసీ- బైపీసీ, హెచ్ఈసీ-సీఈసీ... రెండు గ్రూపులకు కలిపి సెక్షన్‌కు 88 మంది విద్యార్థులను చేర్చుకోవలసి ఉండగా కార్పొరేట్ కాలేజీలు గ్రూపునకు 88 మందిని చేర్చుకొని మాయ చేసేవి. హెచ్ఈసీ-సీఈసీ గ్రూపులను నిర్వహించేవి కావు. ఇప్పుడు సెక్షన్లో ఒక్కో గ్రూపునకు 40 మందికే అనుమతి. ప్రతి కాలేజీకి కనిష్టంగా 4 సెక్షన్లే. గరిష్టంగా 9 సెక్షన్ల వరకు ఆమోదం. ఎంపీసీ, బైపీసీలతో పాటు ఇతర గ్రూపులను నిర్వహించాలి. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌ల జియో ట్యాగింగ్ ఫోటోలు అప్లోడ్ చేయాలి. బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతలు, వేతనాలు, విద్యార్థుల ఫీజులు తదితర సమాచారాన్నీ డాక్యుమెంట్లతో సహా బోర్డుకు అందించాలి. ఆ మేరకు సదుపాయాలు లేకుంటే సంస్థలపై ఫిర్యాదుకు అవకాశం. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి. భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. అధిక ఫీజులపై క్రిమినల్ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారికి అప్పగించారు. అనధికారికంగా హాస్టళ్ల నిర్వహణ, సొంత సిలబస్ బోధన, కోచింగ్‌ల పేరిట రూ.లక్షల్లో ఫీజుల వసూలు వంటి వ్యవహారాలు ఇక సాగవు. ఆన్‌లైన్‌తో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ కాలేజీల్లోని మొత్తం సీట్లలో షెడ్యూల్డ్ తరగతులకు 15%, షెడ్యూల్డ్ తెగలకు 6% సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29%.. అందులో బీసీ-ఎకి 7%, బీసీ-బికి 10%, బీసీ-సికి 1%, బీసీ-డికి 7%, బీసీ-ఈకి 4% చొప్పున ఇవ్వాలి. దివ్యాంగులకు 3%, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5%, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3% సీట్లు కేటాయించాలి. ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% బాలికలకు కేటాయించాలి. ఇప్పటివరకు కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు తెరపడనుంది. కాలేజీల కోసం అనుమతులు పొంది ఇతర కోచింగ్ క్లాస్‌లు నిర్వహించకుండా బోర్డు నిర్ణయించిన పాఠ్యాంశాలను బోధించేలా నిబంధనలను పకడ్బందీ చేశారు. ఇప్పటికే ఆన్లైన్ అనుమతులు, అడ్మిషన్ల ప్రక్రియను ఇంటర్ బోర్డు వెబ్సైట్ ‘BIE.AP.GOV.IN’ ద్వారా చేపట్టారు. కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం, రెండు, మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో బోధన సాగించడం చేస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో ఇలాంటి అక్రమాలన్నిటికీ చెక్ పడనుంది. -
ఇంటర్ పనిదినాలు...182 రోజులే!
సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా విద్యా సంవత్సర ప్రారంభం ఆలస్యం కావడంతో ఆ ప్రభావం ఇంటర్మీడి యట్ తరగతులు, పరీక్షల నిర్వహణపైనా పడింది. సాధార ణంగా ఏటా మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించే ఇంటర్ బోర్డు ఈసారి కరోనాతో పనిదినాలు కోల్పోయిన నేపథ్యంలో 2021 మార్చిలో ఆలస్యంగా వార్షిక పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. 2021, మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్ తరగతులు (దూరదర్శన్, టీశాట్ ద్వారా వీడియో పాఠాలు) ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కాలేజీల పనిదినాలు, ఏయే నెలలో ఏయే రోజుల్లో కాలేజీలను కొనసాగించే అంశాలతో షెడ్యూల్ జారీ చేసింది. గత మార్చి 21 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాగా అదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ఆగస్టు 31 వరకు సెలవులు కొనసాగినట్లు పేర్కొంది. నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేస్తూ సెలవులను కూడా కుదించింది. సాధారణంగా 220 రోజులతో విద్యా సంవత్సరం ఉండనుండగా, ఈసారి 182 రోజుల పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. దసరా, సంక్రాంతి వంటి పండుగ సెలవులు, ఇతరత్రా సెలవు దినాలను కుదించింది. మరోవైపు తాము ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన తరువాతే కాలేజీలు ఇంటర్ ప్రథమ సంవత్స రంలో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ఎలాంటి ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని వెల్లడించింది. ఈ నిబంధనలను అతి క్రమించిన కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. -
ఆన్లైన్ క్లాసులు: చేదు నిజాలు
ఆన్లైన్ చదువులు నిరుపేదలకు అందని ద్రాక్షగా మిగులుతున్నాయని యూపీలో నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మాధ్యమంలో విద్యను పొందే సాధనాలు కొనే స్తోమత లేక పేద పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తేలింది. లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. లాక్డౌన్ అనంతరం కొన్ని రంగాలు పునఃప్రారంభమైనప్పటికీ ఇంకా థియేటర్లు, పార్కులు, విద్యా సంస్థలు మొదలైన రంగాలు నేటికీ ప్రారంభానికి నోచుకులేదు. మార్చిలో మూతపడిన విద్యా సంస్థల గేట్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అయితే చదువుకు ఆంటంకం కలగకుండా ఉండేందుకు అన్ని తరగతుల్లోని విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు యూట్యూబ్, స్వయం ప్రభ ద్వారా 24×7 విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డీఐఓఎస్) కార్యాలయం ఓ సర్వే చేపట్టింది. సంగం(అలహాబాద్) నగరంలోని వివిధ ఇంటర్మీడియట్ కళాశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు చేరిన దాదాపు 58,000 వేల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, కంపూట్యర్లు వంటివి అందుబాటులో లేవని ఈ సర్వేలో వెల్లడైంది. (ఆన్లైన్ పాఠాలా.. జర జాగ్రత్త.. ) ఈ విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ పాఠశాలల్లో చేరిన మొత్తం సంఖ్యలో 19% మంది ఉన్నారు. ఈ విద్యా సంస్థల్లో చేరిన అధిక మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులతోపాటు యూట్యూబ్, స్వయం ప్రభ ద్వారా ప్రసారం చేస్తున్న విద్యా కార్యక్రమాలను పొందలేకపోతున్నారని సర్వే ఫలితాల్లో తేలింది. కరోనా మహమ్మారి వచ్చిన గత నాలుగు నెలల నుంచి వివిధ మాధ్యమాల ద్వారా అందింస్తున్న విద్యా విషయాలను అంచనా వేయడానికి జిల్లాలో చేపట్టిన సర్వేలో ఈ ప్రాధమిక వాస్తవాలు వెలువడ్డాయని ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాధికారి ఆర్ఎన్ విశ్వకర్మ తెలిపారు. వివిధ విద్యా సంస్థల్లో చేరిన ప్రతి విద్యార్థికి ఆన్లైన్ క్లాసుల ద్వారా పూర్తి ప్రయోజనం పొందేగలిగేలా విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. (ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం) తమ సర్వేలో ప్రయాగరాజ్‌లోని 1057 పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో 33 ప్రభుత్వ, 181 ప్రభుత్వ సహాయం పొందేవి. 843 ప్రైవేటు సెంకడరీ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ సంస్థలలో ప్రస్తుతం 3,06,470 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరిలో 9వ తరగతిలో 77,163.. 10వ తరగతిలో 1,06,793.. 11వ తరగతిలో 51,324.. 12వ తరగతిలో 71,190 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో 9వ తరగతిలోని 61,590 మందికి, 10వ తరగతిలో 91,350 మందికి, 11వ తరగతిలో 43,365 మందికి, 12వ తరగతి 51,939 మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. -
‘ఇంటర్ ఫలితాలు ప్రచారం చేసిన కాలేజీలకు నోటీసులు’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఇంటర్ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తూ ప్రవేశాల కోసం విద్యార్థులను ఆకర్షిస్తున్నాయన్నారు. తమ కాలేజీ విద్యార్థులే పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి టాపర్లుగా, ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన కాలేజీలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు. -
ఆన్లైన్లోనే నూతన జూ.కళాశాలల అనుమతులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాని బోర్డు సూచించింది. ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీలు అఫిలియేషన్ గుర్తింపును పొడిగింపు కూడా ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపింది. నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసిన వాటిని మాత్రమే ఇకపై ఆన్లైన్లో జూనియర్ కళాశాల అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొంది. (కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం) జియో ట్యాగింగ్ ద్వారా కళాశాల క్రీడా స్థలం, తరగతి గదులు, లైబ్రరీ గుర్తింపు, ఇతర అనుమతులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు 10,500 ఫీజు, పట్టణ ప్రాంతాల్లో 27,500 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని తెలిపింది. మే 31 వరకు ఆన్లైన్లో జూనియర్ కళాశాలకు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 1 నుంచి అపరాధ రుసుం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. (‘రిపోర్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి’ ) -
గుర్తింపు లేని కాలేజీలు.. 1,338
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా తంటాలు తప్పడం లేదు. అనుబంధ గుర్తింపు కోసం ఏయే సర్టిఫికెట్లు అందజేయాలన్న విషయం కాలేజీ యాజమాన్యాలకు తెలిసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అత్యధిక ప్రైవేటు జూనియర్ కాలేజీలు వ్యవహరించడం లేదు. బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం గతేడాది డిసెంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించినా కాలేజీలన్నీ నిర్దేశిత సర్టిఫికెట్లను అందజేయలేదు. దీంతో రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు కూడా వాటిని ఇవ్వకపోవడంతో 1,338 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండా పోయింది. అయితే ఆయా కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. చివరకు విద్యార్థులు భవిష్యత్ పేరుతో అనుబంధ గుర్తింపు పొందేందుకు ఆయా యాజమాన్యాలు చర్యలు వేగవంతం చేశాయి. అందులో 75 కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అత్యధికంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు చెందినవే కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇంటర్ బోర్డు పరిధిలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కాకుండా పాఠశాల విద్యా శాఖ, సంక్షేమ శాఖల పరిధిలో మరో 558 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 492 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మరో 66 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల గుర్తింపు ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రైవేటు కాలేజీలు 2,155 ఉండగా, వాటిల్లో 1,699 కాలేజీలే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లో 361 కాలేజీలకు షరతులతో కూడిన అనుబంధ గుర్తింపును బోర్డు జారీ చేసింది. వాటిలోనూ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు లేరు. 3 నెలల్లో నియమించుకుంటామన్న షరతుతో వాటికి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. మిగతా 1,338 కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. చివరకు శానిటేషన్ సర్టిఫికెట్లూ లేవు.. రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలకు రిజిస్టర్ లీజ్ డీడ్, ఫిక్స్డ్ డిపాజిట్ రెన్యువల్, స్ట్రక్చరల్ సౌండ్ నె‹స్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, ఆట స్థలాలు లేవు. సరిగ్గా ఫ్యాకల్టీ లేరు. గతేడాది అంతకుముందు ఇచ్చి న అనుబంధ గుర్తింపు ఫీజులను చెల్లించలేదు. శానిటరీ, హైజీన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ కారణాలతో 1,338 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇందులో ఐదారు ఫ్లోర్లు కలిగిన భవనాల్లో నడుపుతున్న 75 కార్పొరేట్ కాలేజీలున్నా యి. వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందినవి 25, నారాయణ విద్యా సంస్థలకు చెందినవి 26, శ్రీగాయత్రి విద్యా సంస్థలకు చెందినవి 8, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందినవి 4, ఇతర విద్యా సంస్థలకు చెందినవి 12 ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కాలేజీలు అన్నింటికి అనుబంధ గుర్తింపు లేకపోవడం, విద్యార్థులను చేర్చుకున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. మరో వారం సమయం ఇస్తాం: అశోక్ అనుబంధ గుర్తింపు తీసుకోని విద్యా సంస్థలకు మరో వారం గడువు ఇస్తామని ఇంటర్ బోర్డు కార్యద ర్శి అశోక్ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుబంధ గుర్తిం పు ప్రక్రియను నిలిపివేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపారు. ఆయా విద్యా సంస్థలన్నీ తమకు కాలేజీలకు సంబంధించిన నిర్ధేశి త సర్టిఫికెట్లను అందజేసి అనుబంధ గుర్తింపు పొం దాలన్నారు. అలా గుర్తింపు పొందని విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అందులో 194 కాలేజీలకు అనుబందంగా హాస్టళ్లు ఉన్నాయని వివరించారు. హాస్టళ్ల గుర్తింపు విషయంలో కేసు కోర్టులో ఉన్నందు న ఆ విషయం జోలికి వెళ్లడం లేదన్నారు. -
కాలేజీలకు కొత్త ‘గుర్తింపు’
జనగామ అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల గుర్తింపు (అఫిలియేషన్) కోసం ప్రత్యేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అఫిలియేషన్ కోసం గతంలో మాదిరిగా హైదరాబాద్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గుర్తింపు అధికారాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న జిల్లా డీఐఈఓ వి.ఇంద్రాణి జిల్లాలోని 21 ప్రైవేట్ జూనియర్ కళాశాలతో పాటు 10 మోడల్, 04 సాంఘిక సంక్షేమ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని నిర్వహించి గుర్తింపు మార్గదర్శకాలను, విధివిధానాలను వివరించారు. మారిన ప్రక్రియ... ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి దాదాపు 14 పేజీలు ఉన్న ఒకే ఒక ఫారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లోడ్ చేసిన ఫారంతో ఇంటర్మీడియట్ అధికారులు సంబంధిత కళాశాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ పేర్కొన్న అంశాలు అన్నీంటిన్ని క్షుణంగా పరీశీలించిన అనంతరం గుర్తింపు ఫీజును ప్రభుత్వానికి కట్టడానికి అనుమతిస్తారు. గతంలో గుర్తింపు ఫీజును కట్టిన తరువాతే కళాశాలలను పర్యవేక్షించే విధానానికి ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికింది. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రతి సంవత్సరం లేని గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ కళాశాలలకు ఆపాదించడంపై కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ విడుదల... జిల్లాలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు (ఒకేషనల్ కళాశాలలతో సహా) గుర్తింపు కోసం చేసుకునే దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించారు. గుర్తింపు కోసం అపరాధ రుసుం లేకుండా 11 జనవరి 2018 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో 18 జనవరి వరకు, రూ.3 వేల ఆపరాధ రుసుముతో జనవరి 25 వరకు, రూ.5 వేలతో 1 ఫిబ్రవరి 2018 వరకు, రూ.10 వేలతో 08 ఫిబ్రవరి వరకు, రూ.15 వేల అపరాధ రుసుముతో 15 ఫిబ్రవరి వరకు, రూ.20 వేల అపరాధ రుసుముతో 22 ఫిబ్రవరి 2018 వరకు చెల్లించుకోవచ్చునని ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ ఫాంను నేరుగా ఇంటర్ బోర్డు కార్యాలయానికి తీసుకుని వస్తే తిరస్కరిస్తామని స్పష్టంగా హెచ్చరించింది. వసతి గృహాలు ఉన్న ప్రైవేట్ కళాశాలల వారు 2018–19 గుర్తింపు కోసం 5 జనవరి 2018 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పెర్కొన్నారు. నిబంధనల ప్రకారమే గుర్తింపు... జిల్లాలోని ఇంటర్ కళాశాలల గుర్తింపు (ఆఫిలియేషన్) ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి అన్నీ వసతులు ఉంటేనే ఆఫిలియేషన్ జారీ చేస్తాం. – వి.ఇంద్రాణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సంస్కరణలను స్వాగతిస్తున్నాం... ప్రైవేట్ కళాశాలల గుర్తింపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్‌షిప్‌ల విషయంలో కూడా చొరవ తీసుకుని విడుదల చేస్తే కళాశాలలకు ఆర్థిక భారం తగ్గుతుంది. – ఆర్.బ్రహ్మచారి, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజామాన్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
'ప్రభుత్వ కళాశాలల్లో సీసీ టీవీలు'
రామాయంపేట (మెదక్) : వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ టీవీలతోపాటు బయో మెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్ బోర్డ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) మల్హల్రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అసలు సహించబోమన్నారు. నిర్ణీత వేళలకు అనుగుణంగా సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్ ఫలితాల మెరుగు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. లెక్చరర్ల కొరత అధిగమించడానికి పార్ట్ టైం ఉద్యోగులకు నియమిస్తామన్నారు.