సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలకు ఇంటర్మీడియెట్ విద్యలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో అడ్డుకట్ట పడనుంది. ఇంతకాలం సరైన అనుమతులు, సదుపాయాలు లేకుండానే కాలేజీలను నిర్వహిస్తూ ప్రజల నుంచి రూ.కోట్లు ఫీజుల రూపేణా దండుకున్న కార్పొరేట్ సంస్థలకు ముకుతాడు పడుతోంది. ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియెట్ బోర్డు పర్యవేక్షణలోనే నిర్వహిస్తోంది.
- ప్రయివేటు కాలేజీల్లో వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ఫీజులను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ నిర్ణయిస్తే, అనుమతులు, భవనాల ఫొటోల జియోట్యాగింగ్, ల్యాబ్‌లు, లైబ్రరీలు, సిబ్బంది తదితర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచడం వంటి చర్యలను ఇంటర్ బోర్డు తీసుకుంది. ఈ ఆన్‌లైన్ ప్రక్రియ ఫలితాలు ఇప్పటికే కనబడుతున్నాయి.
- ఇప్పటివరకు తమకు లాభసాటిగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా అనుమతులు పొందిన కార్పొరేట్ సంస్థలు ఈసారి అనుమతుల కోసం దరఖాస్తు చేయకపోవడం గమనార్హం.
- రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు అందించే కాలేజీలు 3,158 ఉండగా వాటిలో 1,150 వరకు ప్రభుత్వ కాలేజీలు, తక్కినవన్నీ ప్రయివేటు కాలేజీలే. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ సంస్థల కాలేజీలు సంఖ్య పరంగా తక్కువగా ఉన్నా తక్కిన ప్రయివేట్ కాలేజీల్లో అనేకం అవి కొనసాగిస్తున్న బినామీ సంస్థలే.
- పకడ్బందీగా నిబంధనల అమలు
- ఎంపీసీ- బైపీసీ, హెచ్‌ఈసీ-సీఈసీ... రెండు గ్రూపులకు కలిపి సెక‌్షన్‌కు 88 మంది విద్యార్థులను చేర్చుకోవలసి ఉండగా కార్పొరేట్ కాలేజీలు గ్రూపునకు 88 మందిని చేర్చుకొని మాయ చేసేవి. హెచ్‌ఈసీ-సీఈసీ గ్రూపులను నిర్వహించేవి కావు.
- ఇప్పుడు సెక‌్షన్‌లో ఒక్కో గ్రూపునకు 40 మందికే అనుమతి. ప్రతి కాలేజీకి కనిష్టంగా 4 సెక‌్షన్లే. గరిష్టంగా 9 సెక‌్షన్ల వరకు ఆమోదం. ఎంపీసీ, బైపీసీలతో పాటు ఇతర గ్రూపులను నిర్వహించాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌ల జియో ట్యాగింగ్ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి.
- బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతలు, వేతనాలు, విద్యార్థుల ఫీజులు తదితర సమాచారాన్నీ డాక్యుమెంట్లతో సహా బోర్డుకు అందించాలి. ఆ మేరకు సదుపాయాలు లేకుంటే సంస్థలపై ఫిర్యాదుకు అవకాశం. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది.
- భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి. భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్‌లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి.
- అధిక ఫీజులపై క్రిమినల్ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారికి అప్పగించారు.
- అనధికారికంగా హాస్టళ్ల నిర్వహణ, సొంత సిలబస్ బోధన, కోచింగ్‌ల పేరిట రూ.లక్షల్లో ఫీజుల వసూలు వంటి వ్యవహారాలు ఇక సాగవు.
ఆన్‌లైన్‌తో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ
- కాలేజీల్లోని మొత్తం సీట్లలో షెడ్యూల్డ్ తరగతులకు 15%, షెడ్యూల్డ్ తెగలకు 6% సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29%.. అందులో బీసీ-ఎకి 7%, బీసీ-బికి 10%, బీసీ-సికి 1%, బీసీ-డికి 7%, బీసీ-ఈకి 4% చొప్పున ఇవ్వాలి. దివ్యాంగులకు 3%, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5%, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3% సీట్లు కేటాయించాలి. ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% బాలికలకు కేటాయించాలి. ఇప్పటివరకు కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు తెరపడనుంది.
- కాలేజీల కోసం అనుమతులు పొంది ఇతర కోచింగ్ క్లాస్‌లు నిర్వహించకుండా బోర్డు నిర్ణయించిన పాఠ్యాంశాలను బోధించేలా నిబంధనలను పకడ్బందీ చేశారు.
- ఇప్పటికే ఆన్‌లైన్ అనుమతులు, అడ్మిషన్ల ప్రక్రియను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ‘BIE.AP.GOV.IN’ ద్వారా చేపట్టారు.
- కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం, రెండు, మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో బోధన సాగించడం చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్రక్రియతో ఇలాంటి అక్రమాలన్నిటికీ చెక్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment