online admissions
-
‘డీల్ క్యాన్సిల్’.. టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్!
ప్రముఖ దేశీయ టెక్నాలజీ సంస్థ టీసీఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రద్దు చేసుకుంది. విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏడాది ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహిస్తుంది. ఆ ప్రాజెక్ట్‌ను ఆక్స్ఫర్డ్.. టీసీఎస్‌కు అప్పగిచ్చింది. అయితే, ఇటీవల యూనివర్సిటీ ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీల్ క్యాన్సిల్ దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీసీఎస్‌తో కుదుర్చున్న డీల్‌ను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారిక ప్రకటన చేసింది. ఇకపై ఆక్స్ఫర్డ్ నిర్వహించే అడ్మిషన్ టెస్ట్‌లకు టీసీఎస్‌కు సంబంధం లేదని తెలిపింది. టీసీఎస్‌పై ఫిర్యాదుల వెల్లువ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకేలోని సుమారు 30 కాలేజీల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అందిస్తుంది. సంబంధిత కాలేజీల్లో అర్హులైన విద్యార్ధుల్ని ఎంపిక చేసేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే గత ఏడాది ఏప్రిల్ నెలలో అడ్మిషన్ టెస్ట్‌లను నిర్వహించడం కోసం టీసీఎస్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఫోకస్డ్ యూనిట్ టీసీఎస్ ఐఓఎన్ని ఎంపిక చేసింది. ఈ ఆన్లైన్ టెస్ట్ జరిగే సమయంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అంశంపై యూనిటీకి సైతం ఫిర్యాదు చేశారు. తప్పదు మరి కొద్ది రోజులకే ఆన్లైన్ టెస్ట్ జరిగే సమయంలో తలెత్తిన ఆయా సమస్యలను, అలాగే అభ్యర్థులు, ఉపాధ్యాయులు, పరీక్షా కేంద్రాల నుండి వచ్చిన అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘విద్యార్ధల భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే మా అంతిమ లక్ష్యం. ఈ ప్రక్రియలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. తదుపరి అడ్మీషన్లు ఎప్పుడనేది త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని’ ఆక్స్ఫర్డ్ తెలిపింది. -
భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు
న్యూఢిల్లీ: తమ యువజన విభాగం భజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో భజరంగ్ దళ్ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్సైట్ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని గురువారం వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే మీడియాతో అన్నారు. కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్ 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. -
Andhra University: ఏయూ దూరవిద్య.. మరింత చేరువ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): దూరవిద్య విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పనిచేస్తోంది. విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఆన్లైన్లో బీకామ్, ఎంఏ సోషియాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ దూరవిద్య కేంద్రం మరిన్ని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలకు దరఖాస్తు, ఫీజుల చెల్లించడం వంటి వాటిని ఆన్లైన్లోనే చేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సెప్టెంబర్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్లైన్లో 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 25 వరకు దరఖాస్తుకు అవకాశముంది. ఈ దూర విద్యా కోర్సులకు రెగ్యులర్ కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం ఉంటుంది. అదేవిధంగా గ్రేడింగ్ విధానం కూడా ప్రవేశపెట్టారు. విద్యార్థుల ముంగిటకే సేవలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్లైన్లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయూ కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు andhrauniversity.edu.inలో నిర్దేశిత లింక్‌ను క్లిక్ చేయాలి. అనంతరం లెర్నర్ ఎన్రోల్మెంట్పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థులు తమ వ్యక్తిగత, సామాజిక, విద్యా సంబంధ వివరాలు సమర్పించాలి. అలాగే పదో తరగతి, కులధ్రువీకరణ, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. దీంతో దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. ఆ తర్వాత కోర్సుల వారీగా నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వర్సిటీ అధికారులు.. విద్యార్థుల దరఖాస్తు, తదితర వివరాలను పరిశీలించి.. అర్హత ఉన్నట్లయితే ప్రవేశాన్ని ధ్రువీకరిస్తారు. ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి దూరవిద్యా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. -
ఇంటర్ ప్రవేశాలకు ‘ఆన్లైన్’ రద్దు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు కొత్తగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియెట్ స్ట్రీమ్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి పాత విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఆన్లైన్ ప్రవేశాలకు చట్టం చేసేందుకు, నిబంధనలు రూపొందించేందుకు ఈ తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదంది. ఇదే సమయంలో ఆన్లైన్ విధానం తేవాలంటే లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కొత్త విధానం గురించి ముందు విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు వెలువరించారు. ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఆన్లైన్ విధానాన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఆన్లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఎలాంటి చట్టపరమైన దన్ను లేదన్నారు. ఈ కొత్త విధానం లబ్ధిదారులందరి హక్కులను కాపాడటం లేదని చెప్పారు. కోవిడ్ వల్ల పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇంటర్ ప్రవేశాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారని ఇంటర్ బోర్డు చెబుతున్నప్పటికీ ఈ విధానాన్ని సమర్థించలేమని స్పష్టం చేశారు. ఆన్లైన్ ప్రవేశాల విషయంలో లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఉండాల్సిందన్నారు. ఆ అధికారాన్ని ఇంటర్ బోర్డుకు బదలాయించకుండా ఉండాల్సిందని చెప్పారు. ఈ అధికార బదలాయింపు చట్టప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదని పేర్కొన్నారు. కోవిడ్ నుంచి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కాపాడేందుకే ఆన్లైన్ విధానం తెచ్చామని ఇంటర్ బోర్డు చెబుతోందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేనప్పటికీ.. నోటిఫికేషన్లోనే ఈ విషయాన్ని పొందుపరచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. -
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఆన్లైన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌కు తొలిసారిగా ఆన్లైన్ అడ్మిషన్లను చేపట్టిన బోర్డు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు తేదీలను ప్రకటించింది. అయితే గడువు పొడిగించాలని అనేకమంది విన్నవించడంతో దరఖాస్తు గడువును 27 వరకు పొడిగించింది. మార్చి పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరికీ హాల్‌టికెట్లు కాగా, తమ మార్కులను పెంచుకునేందుకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకునే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు తెలిపింది. ఈ విషయంలో సబ్జెక్టులను నిర్ధారించుకునేందుకు విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించనక్కర్లేదని వివరించింది. ఇంటర్ – మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులు వారి అనుకూలతను బట్టి ఒకటి లేదా అంతకు మించిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది. ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజులు చెల్లించని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలనుకుంటే నేరుగా ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించింది. దీనికోసం ప్రిన్సిపాళ్లను సంప్రదించాల్సిన అవసరం లేదని వివరించింది. -
ఏపీ: ఇంట్లో నుంచే ఇంటర్ సీటు.. తొలిసారి ఆన్లైన్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నానికి చెందిన ఎస్సీ విద్యార్థి హరీశ్ టెన్త్‌లో 10 జీపీఏ సాధించాడు. కానీ దగ్గరలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలో అతడికి సీటు లభించలేదు. కారణం కాలేజీ అడిగిన ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడమే. హరీశ్ లాంటి విద్యార్థులకు ఇక ఇలాంటి సమస్యలుండవు. వారు కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో సీటు పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్, లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉంటే ఇంట్లో నుంచే ఇంటర్మీడియెట్ కోర్సులో చేరవచ్చు. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశానికి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకు చెక్ పెడుతూ ఇంటర్ బోర్డు ఆన్లైన్ అడ్మిషన్ల విధానానికి శ్రీకారం చుట్టింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభిస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ జూనియర్ కాలేజీల్లోని జనరల్, ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానంలోనే కొనసాగనున్నాయి. సమస్యలకు స్వస్తి టెన్త్ పాసయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరటం ఇప్పటివరకు పెద్ద ప్రహసనంలా ఉండేది. ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో ప్రవేశాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు మాత్రం అడిగిన మేర రూ.లక్షల్లో ఫీజు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తున్నాయి. మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్ల విధానం ప్రారంభమవడంతో ఈ సమస్యలు తీరడమేగాక విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి మెరిట్‌ను బట్టి తనకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. ‘డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో కొంత ప్రాథమిక సమాచారం ఇవ్వడం ద్వారా ఎటువంటి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాలేజీలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు నచ్చిన కాలేజీలో ఆశించిన గ్రూపులో సీటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ను అనుసరించి బోర్డు ఆయా విద్యార్థుల ఆప్షన్ ప్రకారం సీట్లు కేటాయిస్తుంది. అది పూర్తికాగానే అభ్యర్థి వెబ్‌సైట్‌లోని అడ్మిన్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా కాలేజీలో ఫీజు చెల్లించి చేరవచ్చు. గతంలో ప్రైవేట్ కాలేజీల్లో సదుపాయాలు, బోధన సిబ్బంది సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ విధానంలో ఆయా కాలేజీల్లోని సదుపాయాలు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, భవనాలు, సిబ్బంది సమాచారం కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని పరిశీలించుకుని కాలేజీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. రిజర్వేషన్ల అమలు ఇప్పటివరకు రిజర్వేషన్లను ప్రభుత్వ కాలేజీలు తప్ప ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ విధానంలో అన్ని కాలేజీల్లోనూ రిజర్వేషన్ల కోటా ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు నిర్దేశించిన కోటా ప్రకారం ఆయా కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలో మహిళలకు 33.33 శాతం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీ సీట్లకు అర్హులు లేకపోతే జనరల్ కోటాలో భర్తీచేస్తారు. బీసీ కోటా సీట్లను ఆయా ఉపవర్గాల వారీగా అభ్యర్థులు లేకపోతే వేరే ఉపవర్గానికి కేటాయిస్తారు. వారూ లేనిపక్షంలో జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. లోకల్, నాన్ లోకల్ వారీగా సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్)–1974 ప్రకారం లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, నాన్ లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు ఆయా కాలేజీల్లో కేటాయిస్తారు. అభ్యర్థులకు వారికి టెన్త్‌లో వచ్చిన గ్రేడ్లు, మార్కుల ఆధారంగా మెరిట్‌ను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. నార్మలైజేషన్ పద్ధతిలో ఆయా అభ్యర్థులకు గ్రేడ్ల వారీగా ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల మెరిట్‌ను అనుసరించి ఆయా గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు. జనరల్ సెక్షన్లో 88 సీట్లు ప్రతి కాలేజీలో ఆయా గ్రూపుల్లో జనరల్ సెక్షన్‌కు 88, ఒకేషనల్ పారా మెడికల్‌లో 30, నాన్ పారా మెడికల్‌లో 40 సీట్లు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు ఓసీ, బీసీలైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ అడ్మిషన్లను సజావుగా నిర్వహించడానికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అడ్మిషన్ కమిటీలను బోర్డు ఏర్పాటు చేసింది. ఇవిగాకుండా ప్రతి జిల్లాలో జిల్లా హెల్ప్‌లైన్ కేంద్రాలతోపాటు కాలేజీ స్థాయిలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేయాలో పలు సూచనలతో సవివరంగా యూజర్ మాన్యువల్‌ను బోర్డు అందుబాటులో ఉంచింది. 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు సెప్టెంబర్ 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్త్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో ఫస్టియర్ ఇంటర్మీడియెట్ చదివిన విద్యార్థులు ఏపీలో చదవాలనుకుంటే మళ్లీ ఫస్టియర్‌లో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. -
ఇంటర్ అడ్మిషన్ @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ 2021 – 22 ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ విధానాన్ని బోర్డు అమల్లోకి తెస్తోంది. మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో ఆశించిన సీటును దక్కించుకునేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆన్లైన్ విధానాన్ని గత ఏడాది అమల్లోకి తెచ్చిన బోర్డు దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. 3 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు కూడా సమర్పించారు. అయితే న్యాయస్థానం ఆదేశాలతో అప్పట్లో ఆన్లైన్ అడ్మిషన్ల విధానం నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు కోర్టు అనుమతించడంతో బోర్డు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అనుమతులు, ప్రవేశాలు ఆన్లైన్లోనే.. ఆన్లైన్ అడ్మిషన్లకు వీలుగా ఇంటర్ బోర్డు కాలేజీలకు అనుమతుల ప్రక్రియలో పలు సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీలకు అనుమతులు, రెన్యువల్‌కు ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీలో నిర్వహించే కోర్సులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది వైశాల్యం తదితరాలపై ప్రమాణాలు నిర్దేశించింది. గదులతో సహా భవనాల ఫొటోలను కాలేజీల యాజమాన్యాలు బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకుంది. ఆ ఫొటోలను కాలేజీలవారీగా విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించేలా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? లాంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అయితే సెక్షన్‌కు 40 మందిని మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను న్యాయస్థానం నిలిపివేయడంతో ఈ ఏడాది పాత జీవో ప్రకారం సెక్షన్‌కు 88 మంది విద్యార్థుల చొప్పున గరిష్టంగా 9 సెక్షన్లుండేలా కాలేజీలకు సీట్లు కేటాయింపు చేయనున్నారు. సర్టిఫికెట్లను సమర్పించే పనిలేదు.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజును సంబంధిత కాలేజీకి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించాలి. అయితే ఫీజులకు సంబంధించి కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త విధానం వల్ల విద్యార్థి తన సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులోనే సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసుకుని ఇంటర్ బోర్డు పరిశీలన చేసి సీట్లు కేటాయిస్తున్నందున విద్యార్థి ఒరిజినల్ ధ్రువపత్రాలను కాలేజీలకు సమర్పించాల్సిన అవసరం ఉండదు. రిజర్వేషన్లు పక్కాగా అమలు.. ఆన్లైన్ అడ్మిషన్లతో ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, క్రీడాకారులు, బాలికలకు సంబంధించిన కోటా సీట్లు ఆయా విభాగాల వారితోనే భర్తీ కానున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను పక్కాగా రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం చొప్పున ఇవ్వాలి. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలి. అభిప్రాయాలు తెలుసుకున్న బోర్డు కార్యదర్శి ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్లో అడ్మిషన్లను చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ బుధవారం జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి అందిన సూచనలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరిస్తూ ఆన్లైన్ విధానంలో అవసరమైన మార్పులు చేస్తామని వారికి వివరించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే కొన్ని ప్రైవేట్ కాలేజీలు నిర్వహించిన అడ్మిషన్లు చెల్లుబాటు కావని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. తిరగాల్సిన అవసరం లేకుండా.. ఆన్లైన్ అడ్మిషన్ల విధానం ద్వారా విద్యార్థులకు ఇంటర్ బోర్డు పలు వెసులుబాట్లు కల్పించింది. గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బోర్డు ఏర్పాటు చేసిన పోర్టల్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్ నెంబర్, పాసైన సంవత్సరం, బోర్డు పేరు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూలు, కులం, ఆధార్ నంబర్ తదితర వివరాలతో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలు, కాలేజీ, మాధ్యమాల వారీగా కోర్సులతో కూడిన వివరాలు పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. తమకు నచ్చిన కోర్సు, కాలేజీని ఎంపిక చేసుకుని ప్రాధాన్యత క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. రిజర్వేషన్లు, టెన్త్ మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. నోటిఫికేషన్ రాకుండానే ఇంటర్ అడ్మిషన్లా? రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
ఏపీ: ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తాం: ఇంటర్ బోర్డు
సాక్షి, అమరావతి: ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆఫ్‌లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణించదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందాలని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది. -
ఆన్లైన్ క్లాసుల ఫీజుల దోపిడీపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జనవరి 31 వరకు జరిగే పరిణామాలను పరిశీలిస్తామని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పాఠశాలలు తెరిచాక ఇతర ఫీజుల పేరుతో అధిక వసూళ్లు చేయరాదని స్కూలు యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆన్లైన్ విద్య పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఫీజుల వసూలుపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు జీవో 46 ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది: ఏపీ జేఎంసీ
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 23కు ఏపీ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ మద్దతు పలికింది. తొమ్మిది సెక్షన్లతో పాటు సెక్షన్‌కు 40 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై ఏపీ జేఎంసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తదితరులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామకృష్ణను కలిశారు. అనంతరం ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని వినతి చేశారు. ఈ సందర్భంగా గుండా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 23కు రాష్డ్ర వ్యాప్తంగా నాన్ కార్పోరేట్ జూనియర్ కళాశాలల తరపున మద్దతు పలుకుతున్నామన్నారు. జీఓ 23ను యధావిధిగా ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. చదవండి: ఆన్ లైన్‌తో ‘ప్రయివేట్’ అక్రమాలకు అడ్డుకట్ట ‘జీఓ నెంబర్ 23 అమలుచేయాలని హైకోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. కొన్ని కార్పోరేట్ కళాశాలలు జీఓ23నుని అడ్డుకోవడానికి కుట్రలతో కోర్టుని ఆశ్రయించాయి. ఇంటర్ విద్యలో కార్పోరేట్ ఆధిపత్యం తొలగిపోవాలి. విద్యార్థుల తల్లితండ్రులు కార్పొరేట్ కళాశాలల మాయమాటలు నుంచి బయటపడాలి. జీ+3 జూనియర్ కళాశాలల భవనాలకి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం 60 రోజుల సమయమివ్వడానికి కమిషనర్ ఒప్పుకున్నారు. ఇదే సమయంలో ఆయా కళాశాలలు అడ్మిషన్లు నిర్వహించుకోవడానికి ఇంటర్ మీడియట్ బోర్డు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇంటర్ ఫీజు 3119 రూపాయిలు మాత్రమే ఉంది. ఈ ఫీజుని సవరించాలని కోరాం. కనీసం 25 వేల నుంచి 40 వేల వరకు పెంచాలని కోరాం. ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యలో సమూల మార్పులకి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. అని పేర్కొన్నారు. చదవండి: అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే -
ఆన్ లైన్‌తో ‘ప్రయివేట్’ అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలకు ఇంటర్మీడియెట్ విద్యలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో అడ్డుకట్ట పడనుంది. ఇంతకాలం సరైన అనుమతులు, సదుపాయాలు లేకుండానే కాలేజీలను నిర్వహిస్తూ ప్రజల నుంచి రూ.కోట్లు ఫీజుల రూపేణా దండుకున్న కార్పొరేట్ సంస్థలకు ముకుతాడు పడుతోంది. ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లను ఆన్లైన్లో ఇంటర్మీడియెట్ బోర్డు పర్యవేక్షణలోనే నిర్వహిస్తోంది. ప్రయివేటు కాలేజీల్లో వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ఫీజులను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ నిర్ణయిస్తే, అనుమతులు, భవనాల ఫొటోల జియోట్యాగింగ్, ల్యాబ్‌లు, లైబ్రరీలు, సిబ్బంది తదితర సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచడం వంటి చర్యలను ఇంటర్ బోర్డు తీసుకుంది. ఈ ఆన్లైన్ ప్రక్రియ ఫలితాలు ఇప్పటికే కనబడుతున్నాయి. ఇప్పటివరకు తమకు లాభసాటిగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా అనుమతులు పొందిన కార్పొరేట్ సంస్థలు ఈసారి అనుమతుల కోసం దరఖాస్తు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు అందించే కాలేజీలు 3,158 ఉండగా వాటిలో 1,150 వరకు ప్రభుత్వ కాలేజీలు, తక్కినవన్నీ ప్రయివేటు కాలేజీలే. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ సంస్థల కాలేజీలు సంఖ్య పరంగా తక్కువగా ఉన్నా తక్కిన ప్రయివేట్ కాలేజీల్లో అనేకం అవి కొనసాగిస్తున్న బినామీ సంస్థలే. పకడ్బందీగా నిబంధనల అమలు ఎంపీసీ- బైపీసీ, హెచ్ఈసీ-సీఈసీ... రెండు గ్రూపులకు కలిపి సెక్షన్‌కు 88 మంది విద్యార్థులను చేర్చుకోవలసి ఉండగా కార్పొరేట్ కాలేజీలు గ్రూపునకు 88 మందిని చేర్చుకొని మాయ చేసేవి. హెచ్ఈసీ-సీఈసీ గ్రూపులను నిర్వహించేవి కావు. ఇప్పుడు సెక్షన్లో ఒక్కో గ్రూపునకు 40 మందికే అనుమతి. ప్రతి కాలేజీకి కనిష్టంగా 4 సెక్షన్లే. గరిష్టంగా 9 సెక్షన్ల వరకు ఆమోదం. ఎంపీసీ, బైపీసీలతో పాటు ఇతర గ్రూపులను నిర్వహించాలి. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌ల జియో ట్యాగింగ్ ఫోటోలు అప్లోడ్ చేయాలి. బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతలు, వేతనాలు, విద్యార్థుల ఫీజులు తదితర సమాచారాన్నీ డాక్యుమెంట్లతో సహా బోర్డుకు అందించాలి. ఆ మేరకు సదుపాయాలు లేకుంటే సంస్థలపై ఫిర్యాదుకు అవకాశం. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి. భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. అధిక ఫీజులపై క్రిమినల్ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారికి అప్పగించారు. అనధికారికంగా హాస్టళ్ల నిర్వహణ, సొంత సిలబస్ బోధన, కోచింగ్‌ల పేరిట రూ.లక్షల్లో ఫీజుల వసూలు వంటి వ్యవహారాలు ఇక సాగవు. ఆన్‌లైన్‌తో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ కాలేజీల్లోని మొత్తం సీట్లలో షెడ్యూల్డ్ తరగతులకు 15%, షెడ్యూల్డ్ తెగలకు 6% సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29%.. అందులో బీసీ-ఎకి 7%, బీసీ-బికి 10%, బీసీ-సికి 1%, బీసీ-డికి 7%, బీసీ-ఈకి 4% చొప్పున ఇవ్వాలి. దివ్యాంగులకు 3%, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5%, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3% సీట్లు కేటాయించాలి. ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% బాలికలకు కేటాయించాలి. ఇప్పటివరకు కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు తెరపడనుంది. కాలేజీల కోసం అనుమతులు పొంది ఇతర కోచింగ్ క్లాస్‌లు నిర్వహించకుండా బోర్డు నిర్ణయించిన పాఠ్యాంశాలను బోధించేలా నిబంధనలను పకడ్బందీ చేశారు. ఇప్పటికే ఆన్లైన్ అనుమతులు, అడ్మిషన్ల ప్రక్రియను ఇంటర్ బోర్డు వెబ్సైట్ ‘BIE.AP.GOV.IN’ ద్వారా చేపట్టారు. కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం, రెండు, మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో బోధన సాగించడం చేస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో ఇలాంటి అక్రమాలన్నిటికీ చెక్ పడనుంది. -
కార్పొరేట్ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట..
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్ ప్రామాణికం కావడంతో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్‌లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ♦జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్డబ్ల్యూఆర్కు చెందిన కళాశాలలు ఉన్నాయి. ♦వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. ♦అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ♦ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. ♦మెజార్టీ కళాశాలలు అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, ఫైర్ అనుమతులు లేవు. ♦కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. ♦అయితే క్వాలిఫైడ్ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. ♦విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ♦ర్యాంక్‌ల కోసం ఓ పది మంది మెరిట్ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు. వసతులపై జియో ట్యాగింగ్ ఈ ఏడాది నుంచి కార్పొరేట్ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్‌లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. ♦వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది. ♦ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్సైట్లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ♦వెబ్సైట్లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్ చేయాలని నిర్దేశించింది. ♦కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు సూచించిన వెబ్సైట్లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్‌గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్ ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. వివరాలు పంపించాం వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్ చేయాల్సిందే. సెక్షన్‌కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. – మాల్యాద్రి చౌదరి, ఆర్ఐఓ -
అనుమతులు, ప్రవేశాలు అన్నీ ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: నిబంధనలను గాలికొదిలేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. కాలేజీలకు అనుమతులు, కోర్సులు, సీట్లు, ప్రవేశాలు, ఫీజులు, బుక్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న కార్పొరేట్ యాజమాన్యాలకు చెక్ పెడుతూ.. అడ్మిషన్లు, అనుమతులను ఆన్లైన్లో నిర్వహించనుంది. వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ప్రవేశాలు, ఫీజుల వివరాలను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ (ఏపీఎస్ఈఎంఆర్సీ) నిర్ణయిస్తుంది. ఇంటర్ బోర్డు కూడా పలు సంస్కరణలు చేపట్టింది. తాజాగా వచ్చే ఏడాది (2020–21 విద్యాసంవత్సరం) నుంచి కాలేజీలకు ఈ–ప్రవేశాలు (ఆన్లైన్ అడ్మిషన్లకు) నిర్ణయించింది. ప్రయివేటు జూనియర్ కాలేజీలకు అనుమతులను కూడా ఆన్లైన్ చేసింది. ► కాలేజీలు పలు రకాల ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ఇంటర్మీడియెట్‌బోర్డుకు అధికారాలు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. ► అధిక ఫీజులపై క్రిమినల్ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి ఉంటుంది. ► కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను కూడా పాఠశాల విద్య, పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వెబ్సైట్లోనే పొందుపర్చనుంది. ► 2020–21 విద్యా సంవత్సరం నుండి ఈ–ప్రవేశాలు (ఆన్లైన్) అమలు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్లు కల్పించనున్నారు. ► ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలోనే ఈ– ప్రవేశాల్లోనూ కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం. ► వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు కోర్సుల వారీగా అనుమతులకు ఇంటర్మీడియెట్‌బోర్డు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ జాబితాను బోర్డ్ వెబ్సైట్లో కాలేజీలో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలతో అప్లోడ్ చేయనుంది. ► విద్యార్థులు ఆప్షన్ల ప్రకారం ఆన్లైన్లో అనుమతులు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు ఇస్తారు. ► కొత్త కాలేజీల ఏర్పాటుకు కూడా ఆన్లైన్ దరఖాస్తులనే ఆహ్వానించింది. ► ఏఏ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీల అవసరముందో బోర్డ్ అధ్యయనం చేసింది. ఆయా మండలాలు, పట్టణాలకే కొత్త కాలేజీలకు అనుమతి. ► విద్యార్థుల అన్ని ధ్రువీకరణ పత్రాలను బోర్డు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేయనుంది. ఈ మేరకు టెన్త్ ఫలితాల వివరాలను ఎస్సెస్సీ బోర్డునుంచి, కుల, ఆదాయ, నివాస ప్రాంతాల ధ్రువీకరణకు సంబంధించి మీసేవ వివరాలను వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనుంది. ► ఈ ఏడాది నుంచి ప్రాక్టికల్ పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ప్రత్యేక బృందాలతో తనిఖీ. -
ఇంటర్లో ఈ–అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2020–21) నుంచి ఆన్లైన్ ప్రవేశాల (ఈ–అడ్మిషన్లు) విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ సహా అన్ని యాజమాన్య కళాశాలల్లో ఆటోమేటెడ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ (ఈ–అడ్మిషన్స్) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మే, జూన్ నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ముకుతాడు ఆన్లైన్లోనే ప్రవేశాలు కల్పిస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిర్దేశించిన రిజర్వేషన్లను ఈ కాలేజీలు అమలు చేయడం లేదు. బోర్డు అనుమతించిన సెక్షన్లకు మించి విద్యార్థులను చేర్చుకుం టున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డే స్వయంగా ఈ –అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించనుంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాలేజీల వారీగా నిర్ణయించే ఫీజులనూ ఈ ఆన్లైన్ అడ్మిషన్లకే అనుసంధానించి, విద్యార్థులు ఆ మేరకే చెల్లించేలా ఇంటర్ బోర్డు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇంటర్ బోర్డు పుస్తకాలను బోధించాల్సిందే కొన్ని కాలేజీలు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిన పాఠ్య పుస్తకాలను పట్టించుకోవడం లేదు. జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. ఇందుకోసం రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డు రూపొందించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు బోధించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
80 సీట్లు.. 8113 దరఖాస్తులు
కాగజ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ విద్యావిధానం అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ఈసారి గతంలో పోల్చితే కాస్త తక్కువ పోటీ ఉంది. 2019– 20 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 80 సీట్లు ఉండగా ఏకంగా 8113 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో సీటుకు 101 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. నవోదయలో ఒక్కసారి సీటు సాధించారంటే చాలు 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య, సంస్కృతి, సాంప్రదాయ విలువలు, సాహసోపేత కృత్యాలు, క్రీడలు, పౌష్టికాహారంతోపాటు సమున్నత శిక్షణ లభిస్తాయి. ఈ నేపథ్యంలో సాధారణంగానే పోటీ అధికంగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే సీబీఎస్ఈలో విద్యార్థుల ఎంపిక జరుగుతోంది. గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం.. కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు 25 బ్యాచ్‌లు నిర్వహించారు. ప్రస్తుతం 26వ బ్యాచ్ కొనసాగుతుండగా 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా నవోదయలో ప్రవేశానికి గ్రామీణ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందులో 75 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు, 3 శాతం దివ్యాంగులకు రిజర్వు చేశారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, మిగతా ఖాళీలు ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేస్తారు. బాలికలు 33 శాతం, బాలురు 77 శాతం రిజర్వేషన్‌తో ఎంపిక జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ, నేపాలీగారో భాషలలో పరీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. తగ్గిన దరఖాస్తులు.. నవోదయలో 6వ తరగతిలో 80 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా 8113 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 101 మంది పోటీ పడుతున్నా దరఖాస్తులు ఈసారి తక్కువగానే వచ్చాయి. 2018– 19 సంవత్సరానికి 12,421 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దాదాపు 4వేల దరఖాస్తులు తగ్గాయి. అప్పుడు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించగా ఈసారి కేవలం ఆన్లైన్ ద్వారానే స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆన్లైన్ సెంటర్లు లేకపోవడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి వచ్చిన 8113 దరఖాస్తుల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి 1998, నిర్మల్ నుంచి 2046 మంది, మంచిర్యాల నుంచి 2094 మంది, కుమురం భీం జిల్లా నుంచి 1995 దరఖాస్తులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు.. ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్ బ్లాక్‌లలో 8 కేంద్రాలు, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి బ్లాక్‌లలో 8 కేంద్రాలు, కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) బ్లాక్‌లలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మార్కుల పరీక్షలో 50 ప్రశ్నలు, 50 మార్కులు మెంటల్ ఎబిలిటీపై, 25 ప్రశ్నలు, 25 మార్కులు, అర్థమెటిక్‌పై, 25 ప్రశ్నలు, 25 మార్కులు భాషా నైపుణ్యంపై పరీక్ష ఉంటుంది. 2న 9వ తరగతికి పరీక్ష.. కాగజ్‌నగర్ నవోదయలో 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సైతం తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 2న విద్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే నవోదయ విద్యాయంలో ప్రవేశాలకు ఎంపిక జరుగుతోంది. ప్రవేశ పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అపోహలను నమ్మవద్దు. విద్యార్థుల ఎంపిక ఢిల్లీలోని విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే గతేడాదికంటే ఈసారి దరఖాస్తులు చాలా తగ్గాయి. ఈఏడాది కేవలం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో వేలల్లో సంఖ్య తగ్గింది. – చక్రపాణి, ప్రిన్సిపల్ -
ప్రయివేట్ కళాశాలలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
ప్రయివేట్ కళాశాలలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్ : ఎంసెట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. యాజమాన్య కోటా సీట్లను ఈ ఏడాది ఆన్లైన్లోనే భర్తీ చేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 66,67లను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే ఉన్నత విద్యా మండలిని ఆశ్రయించాలని న్యాయస్థానం సూచనలు చేసింది. గత ఏడాదే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించినా.... యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించిడం వల్ల అమలు కాలేదు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తుది తీర్పును ఇచ్చింది. తాజా తీర్పుతో యాజమాన్య కోట సీట్ల భర్తీలో పారదర్శత పెరగనుంది. గతంలో యాజమాన్యలు సీట్ల భర్తీలో ఇష్టరాజ్యంగా వ్యవహరించేవి. కాగా ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు బీ-కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదు. ఈ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు ఫారాలను కళాశాల వెబ్సైట్లో, నోటీసుబోర్డులో అందుబాటులో ఉంచడంతో పాటు ఉన్నత విద్యామండలి, అఫ్లియేషన్ ఉన్న యూనివర్సిటీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఆన్లైన్లో స్వీకరణ అంశం పక్కనబెడితే అసలు దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్న కళాశాలలే తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 224 కళాశాలలు మాత్రమే ఉన్నత విద్యామండలికి దరఖాస్తు ఫారాలను పంపించాయి. కన్వీనర్ కోటా అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి పేరున్న కళాశాలలతో పాటు వందలాది కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు జారీచేసినప్పటికీ.. దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచిన కళాశాలలు కేవలం 224 మాత్రమే కావడం విస్మయం కలిగిస్తోంది.