అనుమతులు, ప్రవేశాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే | Permissions and admissions are all in online | Sakshi
Sakshi News home page

అనుమతులు, ప్రవేశాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే

Published Mon, Apr 20 2020 4:42 AM | Last Updated on Mon, Apr 20 2020 4:42 AM

Permissions and admissions are all in online - Sakshi

సాక్షి, అమరావతి: నిబంధనలను గాలికొదిలేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. కాలేజీలకు అనుమతులు, కోర్సులు, సీట్లు, ప్రవేశాలు, ఫీజులు, బుక్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న కార్పొరేట్‌ యాజమాన్యాలకు చెక్‌ పెడుతూ.. అడ్మిషన్లు, అనుమతులను ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ప్రవేశాలు, ఫీజుల వివరాలను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ (ఏపీఎస్‌ఈఎంఆర్సీ) నిర్ణయిస్తుంది. ఇంటర్‌ బోర్డు కూడా పలు సంస్కరణలు చేపట్టింది. తాజాగా వచ్చే ఏడాది (2020–21 విద్యాసంవత్సరం) నుంచి కాలేజీలకు ఈ–ప్రవేశాలు (ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు) నిర్ణయించింది. ప్రయివేటు జూనియర్‌ కాలేజీలకు అనుమతులను కూడా ఆన్‌లైన్‌ చేసింది. 

► కాలేజీలు పలు రకాల ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ఇంటర్మీడియెట్‌బోర్డుకు అధికారాలు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. 
► అధిక ఫీజులపై క్రిమినల్‌ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి ఉంటుంది. 
► కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను కూడా పాఠశాల విద్య, పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ వెబ్‌సైట్లోనే పొందుపర్చనుంది.
► 2020–21 విద్యా సంవత్సరం నుండి ఈ–ప్రవేశాలు (ఆన్‌లైన్‌) అమలు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్లు కల్పించనున్నారు. 
► ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తరహాలోనే ఈ– ప్రవేశాల్లోనూ కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం. 
► వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు కోర్సుల వారీగా అనుమతులకు ఇంటర్మీడియెట్‌బోర్డు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ జాబితాను బోర్డ్‌ వెబ్‌సైట్లో కాలేజీలో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలతో అప్‌లోడ్‌ చేయనుంది.
► విద్యార్థులు ఆప్షన్ల ప్రకారం ఆన్‌లైన్లో అనుమతులు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు ఇస్తారు.
► కొత్త కాలేజీల ఏర్పాటుకు కూడా ఆన్‌లైన్‌ దరఖాస్తులనే ఆహ్వానించింది.
► ఏఏ ప్రాంతాల్లో జూనియర్‌ కాలేజీల అవసరముందో బోర్డ్‌ అధ్యయనం చేసింది. ఆయా మండలాలు, పట్టణాలకే కొత్త కాలేజీలకు అనుమతి. 
► విద్యార్థుల అన్ని ధ్రువీకరణ పత్రాలను బోర్డు ఆన్‌లైన్లోనే వెరిఫికేషన్‌ చేయనుంది. ఈ మేరకు టెన్త్‌ ఫలితాల వివరాలను ఎస్సెస్సీ బోర్డునుంచి, కుల, ఆదాయ, నివాస ప్రాంతాల ధ్రువీకరణకు సంబంధించి మీసేవ వివరాలను వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనుంది. 
► ఈ ఏడాది నుంచి ప్రాక్టికల్‌ పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ప్రత్యేక బృందాలతో తనిఖీ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement