ఎంసెట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. యాజమాన్య కోటా సీట్లను ఈ ఏడాది ఆన్లైన్లోనే భర్తీ చేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 66,67లను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే ఉన్నత విద్యా మండలిని ఆశ్రయించాలని న్యాయస్థానం సూచనలు చేసింది. గత ఏడాదే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించినా.... యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించిడం వల్ల అమలు కాలేదు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తుది తీర్పును ఇచ్చింది. తాజా తీర్పుతో యాజమాన్య కోట సీట్ల భర్తీలో పారదర్శత పెరగనుంది. గతంలో యాజమాన్యలు సీట్ల భర్తీలో ఇష్టరాజ్యంగా వ్యవహరించేవి. కాగా ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు బీ-కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదు. ఈ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు ఫారాలను కళాశాల వెబ్‌సైట్‌లో, నోటీసుబోర్డులో అందుబాటులో ఉంచడంతో పాటు ఉన్నత విద్యామండలి, అఫ్లియేషన్ ఉన్న యూనివర్సిటీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఆన్‌లైన్‌లో స్వీకరణ అంశం పక్కనబెడితే అసలు దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్న కళాశాలలే తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 224 కళాశాలలు మాత్రమే ఉన్నత విద్యామండలికి దరఖాస్తు ఫారాలను పంపించాయి. కన్వీనర్ కోటా అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి పేరున్న కళాశాలలతో పాటు వందలాది కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు జారీచేసినప్పటికీ.. దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచిన కళాశాలలు కేవలం 224 మాత్రమే కావడం విస్మయం కలిగిస్తోంది.
Published Tue, Aug 20 2013 4:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement