కార్పొరేట్‌ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట.. | Geo Tagging On Facilities In Corporate Colleges | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌పై ఈ- ఫోకస్‌

Published Sat, Sep 12 2020 8:24 AM | Last Updated on Sat, Sep 12 2020 8:24 AM

Geo Tagging On Facilities In Corporate Colleges - Sakshi

కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్‌ ప్రామాణికం కావడంతో కార్పొరేట్‌ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్‌ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్‌లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. 

నెల్లూరు (టౌన్‌): కార్పొరేట్, ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్‌ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్‌రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం 

కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్‌ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. 
జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్‌డబ్ల్యూఆర్‌కు చెందిన కళాశాలలు ఉన్నాయి.
వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. 
అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్‌ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. 
ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్‌ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. 
మెజార్టీ కళాశాలలు అపార్ట్‌మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, ఫైర్‌ అనుమతులు లేవు.
కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. 
అయితే క్వాలిఫైడ్‌ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. 
విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. 
ర్యాంక్‌ల కోసం ఓ పది మంది మెరిట్‌ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు.  

వసతులపై జియో ట్యాగింగ్‌
ఈ ఏడాది నుంచి కార్పొరేట్‌ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్‌లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉంది. 
వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్‌ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది.
ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్‌సైట్‌లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
వెబ్‌సైట్‌లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్‌ చేయాలని నిర్దేశించింది.
కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.  

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు  
ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్‌ బోర్డు సూచించిన వెబ్‌సైట్‌లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్‌గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్‌ ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్‌ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. 

వివరాలు పంపించాం  
వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్‌ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్‌ చేయాల్సిందే. సెక్షన్‌కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు.  
– మాల్యాద్రి చౌదరి, ఆర్‌ఐఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement