కరోనా వైరస్ విపత్తు కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలతోపాటు, అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ యాజమాన్యాలు అడ్వాన్స్ దోపిడీకి తెరతీశాయి. పది పరీక్షలే జరగలేదు.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి ముందే అడ్వాన్స్ చెల్లిస్తే.. ఫీజు రాయితీలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క ఆయా కళాశాలల్లో చదివి ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్వాన్స్ మొత్తం చెల్లిస్తేనే.. ద్వితీయ సంవత్సరం క్లాస్‌లకు ఆన్‌లైన్ లింక్ ఇస్తామని ఝలక్ ఇస్తున్నాయి.
నెల్లూరు (టౌన్): కరోనా కష్టకాలంలోనూ జిల్లాలో ప్రైవేట్ కళాళాలలు అడ్వాన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై కమిటీని కూడా నియమించింది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇప్పటికే ఆన్‌లైన్లో తరగతులు ప్రారంభమయ్యాయని, వెంటనే 25 శాతం ఫీజు చెల్లించినట్లయితే సంబంధిత ఆన్‌లైన్ లింక్ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులతో ఫోన్లు చేయిస్తున్నాయి.
♦ జిల్లాలో 208 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో 173 ప్రైవేట్, 35 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు 60 వేల మందికి పైగా ఉంటారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 12 నుంచి 14 వేల మంది చదువుతున్నారు.
♦ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో జూలై వరకు తరగతులు నిర్వహించే పరిస్థితి లేదు. అప్పటికి కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే మరికొన్ని రోజులు తరగతుల నిర్వహణను వాయిదా వేసే అవకాశం ఉంది.
♦ అయితే ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్ కోర్సులకు సంబంధించి తరగతులు ప్రారంభించినట్లు తెలిసింది.
♦ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఫీజులో 25 శాతం చెల్లించాలని చెబుతున్నారు. ఫీజు చెల్లించకుంటే ఆన్‌లైన్ లింక్ ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. సిలబస్ మిస్ అయితే తమకు సంబంధం లేదని చెబుతున్నారు.
♦ ఫీజులు కూడా గతేడాదికి అదనంగా 10 నుంచి 20 శాతం ఫీజు పెంచేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు అడిగిన ఫీజులు చెల్లించకుంటే తమ పిల్లలు చదువులో ఎక్కడ వెనకబడతారోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే కొంత మంది ఫీజు చెల్లించి ఆన్‌లైన్ తరగతులకు హాజరువుతున్నట్లు తెలిసింది.
ఇంటర్‌లో చేరబోయే విద్యార్థులదీ అదే పరిస్థితి
పదో తరగతి పరీక్షలే ఇంకా జరగలేదు. అయితే వారి ఫోన్ నంబర్లను సేకరించిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కళాశాలలో చేరాలని అడుగుతున్నారు.
♦ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజులో 20 నుంచి 25 శాతం రాయితీ కల్పిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత అడ్మిషన్ తీసుకుంటే మొత్తం ఫీజు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.
♦ కార్పొరేట్ యాజమాన్యాల ఫోన్లతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఫీజు కట్టాలా లేకుంటే పది ఫలితాలు వచ్చిన తర్వాత చెల్లించాలన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది.
♦ మరో పక్క కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఆన్‌లైన్ తరగతులు కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని, ముందు అడ్మిషన్ పొందితే ఆన్‌లైన్ తరగతులకు లింక్ ఇస్తామంటున్నారు.
♦ అయితే ఇప్పటికీ పదో తరగతి పరీక్షలు జరగలేదు. ఇప్పుడే ఇంటర్ తరగతులపై దృష్టి పెడితే పదో తరగతి పరీక్షలకు సంసిద్ధంగా ఉన్న విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందని అంటున్నారు.
♦ ఈ పరిణామాలపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ముందస్తు ఇంటర్‌కు ప్రిపేర్ కావడానికి సిద్ధంగా కనిపించడం లేదు. ఇంకో పక్క క్లాసులు జరిగిపోతే ఎలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఫీజుపై ఒత్తిడి తెస్తే ఫిర్యాదు చేయొచ్చు
ఇంటర్ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. గతేడాది ఉన్న ఫీజులనే వసూలు చేయాలని, త్రైమాసిక ఫీజును 45 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకోవాలని ఆదేశించింది. ఫీజులపై ఏ యాజమాన్యమైనా ఒత్తిడి తీసుకువస్తే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. విద్యా సంవత్సర ప్రారంభం విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్ తరగతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అప్పటి వరకు ఇంటర్‌లో ఆన్‌లైన్ తరగతులకు అనుమతి లేదు.
ఆన్‌లైన్ తరగతులకు అనుమతి లేదు
ఇంటర్‌లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించకూడదు. ఇంటర్‌కు సంబంధించి విద్యా సంవత్సర ప్రారంభం కంటే ముందుగానే ఫీజు వసూలు చేయరాదు. ఎవరైనా ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తే 99486 63982 నంబరుకు ఫిర్యాదు చేయాలి. కోచింగ్ సెంటర్లకు సైతం అనుమతి లేదు. క్లాసు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్‌ఐఓ
Comments
Please login to add a commentAdd a comment