మాట్లాడుతున్న బోయినపల్లి వినోద్
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు.
రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు
వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment