సత్తా చాటిన విశాఖ; అన్నింటా స్టార్‌గా.. | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన విశాఖ; అన్నింటా స్టార్‌గా..

Published Fri, Nov 26 2021 2:01 PM

Visakhapatnam Ranks 18 in Sustainable Development Goals Urban Index: NITI Aayog - Sakshi

సువిశాల సాగరతీరం.. ఎటుచూసినా కనువిందు చేసే సోయగాలు.. అడుగడుగునా ఆహ్లాదం.. ఇవి కేవలం విశాఖకే సొంతం. అందుకే ఎంతోమంది అందమైన ఈ మహానగరంలో జీవించాలని కోరుకుంటారు. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన సుందరనగరి నీతి ఆయోగ్‌ ప్రకటించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్‌ను, జాతీయస్థాయిలో 18వ ర్యాంకును సాధించింది. మొత్తం 14 విభాగాల్లో పరిశీలించగా.. 12 విభాగాల్లో 60 శాతానికిపైగా మార్కులు సాధించి.. హైదరాబాద్‌ను సైతం వెనక్కు నెట్టింది.

సాక్షి, విశాఖపట్నం: నీతి ఆయోగ్‌ ఇటీవల వెల్లడించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచిక ర్యాంకుల్లో విశాఖ సత్తా చాటింది. దేశంలోని రాష్ట్రాల రాజధానులు, 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు కలిపి మొత్తం 56 నగరాలకు ర్యాంకులు ఇవ్వగా.. విశాఖ 18వ ర్యాంకు సొంతం చేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఎన్సీఆర్బీ, జిల్లాస్థాయి విద్యా సమాచారం, వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వాల నుంచి అందిన అధికారిక సమాచారం ఆధారంగా మొత్తం 14 విభాగాల్లో 77 కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్‌ ఈ ర్యాంకులు ప్రకటించింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించిన నగరాలకు పురోగతిని బట్టి 100 వరకు మార్కులు ఇచ్చారు. 100 మార్కులు సంపాదించిన నగరాలు ఇప్పటికే లక్ష్యాలను చేరుకున్నట్లుగా నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. 65–99 మార్కులు సాధించిన నగరాలు ఫ్రంట్‌ రన్నర్‌గా, 50–64 మార్కులు సాధించినవి కాస్త మంచి పనితీరు కనబరిచినట్లు, 0–49 మార్కులు సాధించిన నగరాలు వెనుకబడినట్లు పేర్కొంది. 68.14 మార్కులతో విశాఖపట్నం ఫ్రంట్‌ రన్నర్‌ జాబితాలో నిలిచింది. ప్రశాంతతకు పట్టుగొమ్మగా పేరొందిన నగరంలో విపత్కర పరిస్థితులు తలెత్తవనే నమ్మకమే విశాఖని దేశంలోని మెట్రో సిటీలతో పోటీపడేలా చేస్తోంది. టైర్‌–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. (చదవండి: ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు: సీఎం వైఎస్‌ జగన్‌)

అందరూ హాయిగా జీవించేలా..
విశాఖ నగరం సామాన్యుడికి స్వాగతం పలుకుతుంది.. బిలియనీర్‌కి రెడ్‌ కార్పెట్‌ వేస్తుంది. నెలకు రూ.3 వేల వేతనంతో జీవించే సగటు జీవి దర్జాగా బతకగల సౌకర్యాలున్నాయి. నెలకు రూ.3 లక్షల వేతనం తీసుకునే ఉద్యోగి విలాసంగా జీవించే ఆధునికతా విశాఖ నగరం సొంతం. అందుకే.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా భాసిల్లుతున్నట్లే విశాఖ మహానగరం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని సొంతం చేసుకుంది. ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలే కాదు.. తమిళనాడు నుంచి కాశ్మీరం వరకు, రాజస్థాన్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు.. అనేక ప్రాంతాలవారు ఇక్కడ నివసిస్తున్నారు. సిటీకి సలాం చేస్తున్నారు. ప్రతి 100 మందిలో 10 మంది వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్సే ఉన్నారంటే.. విశాఖ ఎలా విశాల నగరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం)

మహా నగరాలతో పోటీపడుతూ... 
ద్వితీయశ్రేణి నగరమే అయినా విశాఖ.. మహా నగరాలతో పోటీపడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలను సొంతం చేసుకుంది. నౌకా వాణిజ్యానికి, పర్యాటకరంగానికి కేంద్ర బిందువైంది. విస్తరిస్తున్న రియల్‌ రంగం, సినీ స్టూడియోల నిర్మాణంతో నగరం బ్రాండ్‌ విలువ క్రమంగా పెరుగుతోంది. కొలువుల విషయంలోనూ విశాఖ పోటీపడుతోంది. పారిశ్రామిక రంగాల్లోను, అరకు వ్యాలీ, సింహాచలం, రుషికొండ, రామకృష్ణ, భీమిలీ బీచ్‌లతో విశాఖ అందాలు, పర్యాటక, హోటల్‌ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌ తర్వాత ఐటీ రంగానికి అనువైన ప్రాంతంగా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీలు భావిస్తుండటం కూడా స్టార్టప్‌ కంపెనీల రాకకు ఊతమిస్తోంది.

ఆ రెండింటిలో మినహా.. అన్నింటా స్టార్‌గా..
నీతి ఆయోగ్‌ ప్రకటించిన ర్యాంకుల్లోని 14 విభాగాల్లో విశాఖ నగరం సత్తా చాటింది. రెండు విభాగాలు మినహాయిస్తే.. మిగిలిన అన్నింటిలోను వైజాగ్‌ తన ప్రత్యేకతని చాటుకుంది. క్లీన్‌వాటర్‌ అండ్‌ శానిటేషన్, మంచి జీవన ప్రమాణాల విభాగంలో ఏకంగా 80కి పైగా మార్కులు సొంతం చేసుకుంది. క్లీన్‌ ఎనర్జీ విషయంలో అత్యల్పంగా 40 మార్కులు సాధించింది. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల్లో వెనుకబడిన విశాఖ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అందుకే ఈ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో 46 మార్కులకే పరిమితమైంది. మెట్రో నగరమైన హైదరాబాద్‌తోపాటు విజయవాడ నగరంతో పోలిస్తే.. విశాఖ అన్ని విభాగాల్లోను పైచేయి సాధించింది. 100 మార్కులకుగాను  వైజాగ్‌కు 68.14 మార్కులు లభించాయి. 66.93 మార్కులతో హైదరాబాద్‌ 22వ ర్యాంకులో, 65.07 మార్కులతో విజయవాడ 30వ ర్యాంకులో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement