మొదటి అడుగు ముంబైదే! | Mumbai Indians beat Royal Challengers Bangalore by 5 wickets | Sakshi
Sakshi News home page

మొదటి అడుగు ముంబైదే!

Published Thu, Oct 29 2020 4:39 AM | Last Updated on Thu, Oct 29 2020 9:27 AM

Mumbai Indians beat Royal Challengers Bangalore by 5 wickets - Sakshi

మరోసారి అద్భుత ప్రదర్శన నమోదు చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌–2020లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. జోరుమీదున్న బెంగళూరుకు బుమ్రా బ్రేకులేయగా... సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో ముంబైని లక్ష్యఛేదనలో నిలబెట్టాడు. దాంతో ఎనిమిదో విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ 16 పాయింట్లతో ఒంటరిగా టాప్‌ ర్యాంక్‌లోకి వెళ్లింది.

అయితే మరో నాలుగు జట్లకూ 16 పాయింట్లు చేరుకునే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే అన్ని జట్లకంటే ఎంతో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన ముంబై జట్టుకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా ప్లే ఆఫ్‌ బెర్త్‌ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు.   

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఎనిమిదో గెలుపుతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. దేవ్‌దత్‌ (45 బంతుల్లో 74; 12 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కని పోరాటం చేశాడు. జోరుగా సాగే బెంగళూరు ఇన్నింగ్స్‌ను బుమ్రా (3/14) అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత ముంబై ఇండియన్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా అజేయంగా నిలిచాడు.  

దేవ్‌దత్‌ పోరాటం...
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దత్, జోష్‌ ఫిలిప్‌ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. బౌండరీతో ఖాతా తెరిచిన దేవ్‌దత్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కృనాల్‌ మూడో ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. తర్వాత ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లోనూ రెండు బౌండరీలు కొట్టాడు. మరో ఓపెనర్‌ ఫిలిప్‌... బౌల్ట్‌ ఓవర్లో భారీ సిక్స్, ఫోర్‌ కొట్టడంతో పవర్‌ ప్లేలో (54/0) ఓవర్‌కు 9 పరుగుల రన్‌రేట్‌ నమోదైంది. ఇలా ధాటిగా సాగిపోతున్న బెంగళూరు జోరుకు ఫిలిప్‌ను ఔట్‌ చేయడం ద్వారా రాహుల్‌ చహర్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కోహ్లి (9) సహా ఎవరూ నిలబడలేదు. పరుగులు జతచేయలేదు. దేవ్‌దత్‌ మాత్రం 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. డివిలియర్స్‌ (15), దూబే (2), మోరిస్‌ (4) విఫలమయ్యారు.  

కోహ్లి ఔట్‌... రన్‌రేట్‌ డౌన్‌
రాయల్‌ చాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌ చక్కగా మొదలైంది. పరుగులు చకచకా వచ్చాయి. బౌండరీలతో రన్‌రేట్‌ ఊపందుకుంది. సిక్సర్లు అరకొరే అయినా వేగం ఎక్కడా తగ్గలేదు. ఇలా దేవ్‌దత్, జోష్‌ ఫిలిప్‌ల ఓపెనింగ్‌ జోడి పటిష్టమైన పునాది వేసింది. దీంతో ఒకదశలో అద్భుతంగా బెంగళూరు ఇన్నింగ్స్‌ సాగిపోయింది. ఫిలిప్‌ ఔటయినపుడు జట్టు స్కోరు 71. కోహ్లి వెనుదిరిగినపుడు వందకు చేరువైంది. 11.2 ఓవర్లలో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు. కానీ అనూహ్యంగా కోహ్లి వికెట్‌తో పాటే బెంగళూరు ఇన్నింగ్స్‌ పతనమైంది. పరుగుల రాక కష్టమైంది. దాంతో బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 35 పరుగులే చేసింది. 

‘సూర్య’ కిరణాలు
బెంగళూరులాగే ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడారు. అక్కడ... ఇక్కడ... ఆడింది ఒక్కరే! సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై ఇన్నింగ్స్‌ అసాంతం నిలబడి... బెంగళూరు బౌలర్లతో తలపడి జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఓపెనర్లు డికాక్‌ (18), ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎంతో సేపు నిలువలేదు. పవర్‌ ప్లేలోనే డికాక్‌ ఔట్‌కాగా... కాసేపటికే ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ సమర్పించుకున్నాడు. తర్వాత వచ్చిన వారిలో సౌరభ్‌ తివారి (5), పాండ్యా బ్రదర్స్‌ కృనాల్‌ (10), హార్దిక్‌ (15) పెద్దగా స్కోర్లు చేయలేదు. కానీ వీళ్లు చేసిన ఈ కాసిన్ని పరుగులకు సూర్య         కుమార్‌ మెరుపులు జతకావడంతో లక్ష్యం ఏ దశలోనూ కష్టమవలేదు.

ఆద్యంతం ధాటిగా ఆడిన అతను 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చహల్‌ ఓవర్లలో సిక్స్‌లు బాదిన ప్రత్యర్థి జట్టుకు చెందిన ప్రతి బౌలర్‌ను సాధికారికంగా ఎదుర్కొన్నాడు.  చేయాల్సిన పరుగుల రన్‌రేట్‌ పెరిగిపోకుండా జాగ్రత్తపడ్డాడు. 17వ ఓవర్‌ వేసిన మోరిస్‌ 8 పరుగులు ఇవ్వడంతో ఆఖరి మూడు ఓవర్లలో 18 బంతుల్లో 27 పరుగులుగా సమీకరణం మారింది. అయితే స్టెయిన్‌ 18వ ఓవర్లో యాదవ్‌ సిక్స్‌ కొట్టడం ద్వారా 11 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్లో సిక్స్‌ కొట్టిన హార్దిక్‌ ఔటైనప్పటికీ పొలార్డ్‌ 4 బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో 6 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో సిరాజ్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతినే యాదవ్‌ బౌండరీకి తరలించడంతో ముంబై విజయం సాధించింది.  

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: జోష్‌ ఫిలిప్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 33; దేవదత్‌ పడిక్కల్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 74; కోహ్లి (సి) సౌరభ్‌ తివారీ (బి) బుమ్రా 9; డివిలియర్స్‌ (సి) రాహుల్‌ చహర్‌ (బి) పొలార్డ్‌ 15; శివమ్‌ దూబే (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 2; మోరిస్‌ (సి) ప్యాటిన్సన్‌ (బి) బౌల్ట్‌ 4; గురుకీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 14; వాషిం్టగ్టన్‌ సుందర్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. 
వికెట్ల పతనం: 1–71, 2–95, 3–131, 4–134, 5–134, 6–138. 
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–40–1, బుమ్రా 4–1–14–3, కృనాల్‌ 4–0–27–0, ప్యాటిన్సన్‌ 3–0–35–0, రాహుల్‌ చహర్‌ 4–0–43–1, పొలార్డ్‌ 1–0–5–1.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) గురుకీరత్‌ (బి) సిరాజ్‌ 18; ఇషాన్‌ కిషన్‌ (సి) మోరిస్‌ (బి) చహల్‌ 25; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 79; సౌరభ్‌ తివారీ (సి) పడిక్కల్‌ (బి) సిరాజ్‌ 5; కృనాల్‌ (సి) మోరిస్‌ (బి) చహల్‌ 10; హార్దిక్‌ (సి) సిరాజ్‌ (బి) మోరిస్‌ 17; పొలార్డ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 166. 
వికెట్ల పతనం: 1–37, 2–52, 3–72, 4–107, 5–158.
బౌలింగ్‌: మోరిస్‌ 4–0–36–1, స్టెయిన్‌ 4–0–43–0, సుందర్‌ 4–0–20–0, సిరాజ్‌ 3.1–0–28–2, చహల్‌ 4–0–37–2.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement