magnus carlsen
-
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్‌కు గుకేశ్
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్లో నాకౌట్‌కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్‌లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని భారత గ్రాండ్‌మాస్టర్... ఏడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్‌కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్‌కు చెందిన నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
ప్రేయసిని పెళ్లాడిన చదరంగ రారాజు.. ఫొటోలు చూశారా? (ఫోటోలు)
-
డ్రస్ మార్చుకొని ఆడు... కుదరదు!
నేను తగ్గేదేలే... అయితే మేము ఆడించేదేలే! ఇటు చెస్ దిగ్గజం కార్ల్సన్, అటు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో కార్ల్సన్ అర్ధాంతరంగా టోర్నీకి గుడ్‌బై చెప్పాడు. అలాగని అక్కడేదో పెద్ద ఘోరమేమీ జరగలేదు. కానీ అహం, ఆవేశం కలగలిపి చిన్న డ్రస్ కోడ్ అంశమే పెద్ద వివాదంగా మారింది. చెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. న్యూయార్క్: మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లసన్ చదరంగంలో ఎత్తులు పైఎత్తులు వేసే దిగ్గజ ఆటగాడు. ‘ఫిడే’ ప్రపంచ చెస్ వ్యవహారాలను చక్కబెట్టే సంస్థ. ఓ ఆటగాడు... ఓ సమాఖ్య... ఓ డ్రెస్ కోడ్... చిన్న అంశం సర్దుకుంటే పోటీల ఫలితాలు మీడియాలో వచ్చేవి. కానీ ఆ అంశం కాస్త వివాదంగా... చివరకు చినికి చినికి గాలివానలా మారి పెద్దవార్త అయ్యింది. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) పంతానికే పోయాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య మాత్రం ఎంతవారైనా ‘ఫిడే’ నియమావళినే సుప్రీమ్ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో ఆటగాడు, సమాఖ్య వైరిపక్షాలుగా మారాయి. ఫిడే క్రమశిక్షణ చర్యలు చేపట్టడంతో... మీరేంటి నాపై చర్యలు తీసుకునేది నేనే టోర్నీకి ఇప్పుడే ఇక్కడితోనే గుడ్‌బై చెబుతానని కార్ల్సన్ ఉన్నపళంగా నిష్క్రమించాడు. అసలేం జరిగింది? న్యూయార్క్‌లో ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. మన మేటి భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి తదితరులు సైతం ఆడుతున్నారు. శనివారం ర్యాపిడ్‌లో ఎనిమిదో రౌండ్ తర్వాత డిఫెండింగ్ చాంపియన్, నార్వే దిగ్గజం కార్ల్సన్ జీన్స్ వేసుకొని చెస్ బోర్డు దగ్గరకు ఆడేందుకు వచ్చాడు. టోర్నీ చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హొలొజాక్ ముందుగా డ్రస్కోడ్ విషయమై నార్వే స్టార్‌కు సున్నితంగా చెప్పారు. జీన్స్ ప్యాంట్ ధరించి ఆడటం ఫిడే నియమావళికి విరుద్ధమని దయచేసి ప్యాంట్ మార్చుకొని రావాల్సిందిగా ఆర్బిటర్ సూచించారు. తర్వాత 200 డాలర్లు (రూ.17,078) జరిమానా విధించారు. కానీ అప్పటికప్పుడు జీన్స్ మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని మాగ్నస్ ‘ఎలాగూ జీన్స్‌తో వచ్చాను కదా... ఈ రౌండ్ పూర్తయ్యాక మార్చుకుంటాలే’ అని చెప్పేశాడు. దీంతో ఆర్బిటర్ అలా అయితే ఆడించటం కుదరదని స్పష్టం చేశారు.అయినాసరే డ్రస్ మార్చుకునేందుకు కార్ల్సన్ ససేమిరా అనడంతోనే వివాదం మొదలైంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా అతనికి తొమ్మిదో రౌండ్ ప్రత్యర్థిని (పెయిరింగ్ ఇవ్వలేదు) కేటాయించలేదు. అంటే ఇది ఆ రౌండ్‌కు అనర్హత వేటు. ఈ క్రమశిక్షణ చర్యల్ని ఏమాత్రం సహించని కార్ల్సన్ ర్యాపిడ్ తొమ్మిదో రౌండే కాదు... బ్లిట్జ్ పోటీలు సహా మొత్తం టోర్నీనే బాయ్‌కాట్ చేస్తున్నానని అక్కడినుంచి నిష్క్రమించాడు. -
'వరల్డ్ టైటిల్స్ సర్కస్.. గుకేశ్‌తో పోటీ పడే ఆలోచనే లేదు'
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ నిలిచిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై 7.5 - 6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించిన గుకేశ్.. కేవలం 18ఏళ్ల వయస్సులోనే విశ్వవిజేతగా నిలిచాడు.తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న అతి పిన్న వయష్కుడిగా గుకేశ్ నిలిచాడు. కాగా చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్తో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడాలని అనుకుంటున్న గుకేశ్ కోరిక ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గుకేశ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కార్ల్సన్తో పోరు అన్నింటికంటే పెద్ద సవాల్ అని... అతడిని ఓడిస్తే అసలైన చాంపియన్ అవుతారని గుకేశ్ వ్యాఖ్యానించాడు. అయితే కార్ల్సన్ పరోక్షంగా దీనిపై స్పందించాడు. నేరుగా గుకేశ్ పేరు చెప్పకపోయినా తనకు ఆసక్తి లేదని వెల్లడించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించనంటూ గతంలో స్వచ్ఛందంగా కిరీటాన్ని వదిలేసుకున్న కార్ల్సన్... "వరల్డ్ ఛాంపియన్ షిప్లో గుకేశ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. గుకేశ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగాడు. కానీ ఈ చెస్ గేమ్‌లో గెలవడం అంత ఈజీ కాదు. గుకేశ్ విజేతగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమించాడు.గేమ్‌పై తన పట్టుకోల్పోకుండా గుకేశ్ మంచి పోరాటపటిమ చూపించాడు. డింగ్ లిరెన్ కూడా బాగా ఆడాడు. కానీ చివరికి గుకేశ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే వచ్చే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై అందరూ అడుగుతున్నారు. గుకేశ్‌తో పోటీ పడే ఆలోచనే లేదు.ఈ వరల్డ్ టైటిల్స్ సర్కస్‌లో నేను ఇకపై ఎక్కడా భాగం కాబోను" అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అని తాజాగా వ్యాఖ్యానించాడు. దాంతో మున్ముందు గుకేశ్, కార్ల్సన్ మధ్య పోరు దాదాపు అసాధ్యం కావచ్చు! -
కావాలనే ఓడిపోయాడా?.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే
క్రీడల్లో ఆటగాళ్లు పొరపాటు చేయడం సహజమని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ తెలిపారు. అంత మాత్రాన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పోటీతత్వం, తీవ్రత లేవనే విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. సింగపూర్ సిటీ వేదికగా గురువారం ముగిసిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చెస్ ఆట అంతమైందంటూభారత్కు చెందిన ఈ 18 ఏళ్ల టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ టోర్నీ పోటీలపై మాజీ ప్రపంచ చాంపియన్, రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ స్పందిస్తూ చెస్ ఆట అంతమైందని తీవ్ర పదజాలాన్ని వాడాడు. చెస్‌లో 14 రౌండ్ల పాటు జరిగిన గేముల్లో పోటాపోటీ కొరవడిందని, గట్టి పోటీ కనిపించనే లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.అతడివి పిల్లచేష్టలు.. ఏ ఆటలోనైనా సహజమేఅంతేకాదు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ వేసిన ఎత్తులు పిల్లచేష్టలుగా అభివర్ణించాడు. దీనిపై రష్యాకే చెందిన వొర్కొవిచ్ స్పందిస్తూ ‘క్రీడల్లో పొరపాట్లు చాలా సహజం. ఈ పొరపాట్లనేవి జరగకపోతే ఫుట్‌బాల్‌లో గోల్సే కావు. ప్రతీ ఆటగాడు పొరపాట్లు చేస్తాడు. ఆ తప్పుల కోసమే ప్రత్యర్థి కాచుకొని ఉంటాడు. సరైన అవకాశం రాగానే అందిపుచ్చుకుంటాడు. ఇదంతా ఏ ఆటలోనైనా సహజమే. ప్రపంచ చెస్ టైటిల్ కోసం తలపడిన లిరెన్, గుకేశ్‌లకు అభినందనలు, టైటిల్ గెలిచిన గుకేశ్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు.ఇక వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మాగ్నస్ కార్ల్సన్ కూడా కొన్ని రౌండ్లు చూస్తే ప్రపంచ చెస్ టైటిల్ కోసం జరిగినట్లుగా తనకు అనిపించలేదని... ఏదో ఓపెన్ టోర్నీలోని గేములుగా కనిపించాయని అన్నారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదుకానీ భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ అంతా అయ్యాక ఇలాంటి విమర్శలు రావడం ఎక్కడైనా జరుగుతాయని, వీటిని గుకేశ్ పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదని కొత్త చాంపియన్‌కు సూచించాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్ కొత్త చరిత్ర లిఖించాడని హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ సైతం వ్లాదిమిర్ క్రామ్నిక్, కార్ల్సన్ విమర్శలను కొట్టిపడేస్తూ గుకేశ్‌కు అండగా నిలవడం విశేషం.చదవండి: గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
గుకేశ్‌పై విమర్శలు: కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీ
తన గెలుపును విమర్శిస్తున్న వారికి ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు నన్నేమీ బాధపెట్టలేదు. కొన్ని గేమ్‌లు ఆశించిన స్థాయిలో దూకుడుగా సాగలేదనేది వాస్తవమే. అయితే చెస్ బోర్డుపై ఆటలో వేసే ఎత్తులు మాత్రం వరల్డ్ చాంపియన్‌ను నిర్ణయించవు. పట్టుదల, పోరాటతత్వం ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తే గెలుస్తాడు.కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీవీటిన్నింటిని నేను చూపించానని నమ్ముతున్నా. ఆట విషయానికి వస్తే ఇది అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కాకపోవచ్చు. ఎందుకంటే నేను తొలిసారి ఆడుతున్నాను. ఇతరులతో పోలిస్తే నాపై ఒత్తిడి కూడా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను పేలవంగా ఆడాననేది కూడా నిజం. అయితే కీలక సమయాల్లో నేను సత్తా చాటి స్థాయిని ప్రదర్శించగలిగాను. దాని పట్ల నేను సంతోషంగా ఉన్నా’ అని గుకేశ్ వివరించాడు. చదరంగం చచ్చిపోయింది అంటూ విమర్శలుకాగా.. ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్‌లు చూస్తే అసలు వరల్డ్ చాంపియన్షిప్లా లేదు... చదరంగం చచ్చిపోయింది... ఒక చిన్న తప్పు వరల్డ్ చాంపియన్‌ను నిర్ణయించడం ఏమిటి?’... గురువారం గుకేశ్ గెలుపు అనంతరం వచ్చిన విమర్శలివి! స్టార్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్తో పాటు మాజీ ఆటగాడు క్రామ్నిక్ తదితరులు గుకేశ్ ఘనతకు గౌరవం ఇవ్వకుండా ఆ విజయం స్థాయిని తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుకేశ్ పైవిధంగా స్పందించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానికి ఆటతో పాటు మరెన్నో కారణాలు ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు.విమర్శలను పట్టించుకోవద్దు: ఆనంద్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత గుకేశ్ ఆటపై వస్తున్న కొన్ని విమర్శలను భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తిప్పి కొట్టాడు. ఎవరో ఒకరు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అతను గుకేశ్‌కు సూచించాడు. ‘గుకేశ్ చరిత్ర సృష్టించడం నేను కళ్లారా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. విమర్శలు ప్రతీ మ్యాచ్‌కు వస్తూనే ఉంటాయి.విజయాలు సాధించినప్పుడు ఇలాంటివి సహజం. వరల్డ్ చాంపియన్ అయ్యాక ఎవరో అనే ఇలాంటి మాటలను లెక్క చేయవద్దు. లిరెన్ క్షణం పాటు ఉదాసీనత ప్రదర్శించాడు. ఇలాంటి క్షణాలు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్‌లో వస్తాయి. గుకేశ్ దానిని బాగా వాడుకున్న తీరును ప్రశంసించాలి’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు ‘‘గుకేశ్ విశ్వ విజేతగా నిలిచిన క్షణం మా జీవితంలోనే అత్యుత్తమమైనది. ఇన్నేళ్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. గుకేశ్ ప్రపంచ చాంపియన్ అయ్యాడనే వార్త విని నేను నమ్మలేకపోయా. పది నిమిషాల పాటు ఏడ్చేశా. చిన్నప్పటి నుంచి గుకేశ్ ఎంతో క్రమశిక్షణతో చాలా కష్టపడ్డాడు. తానూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ టైటిల్‌తో ఆ కష్టమంతా సంతోషంగా మారిపోయింది’’ అని గుకేశ్ తల్లి పద్మాకుమారి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
మాగ్నస్ కార్ల్సన్ ‘డబుల్’
ప్రపంచ నంబర్‌వన్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. రెండు రోజుల వ్యవధిలో 18 రౌండ్ల పాటు (9 చొప్పున) జరిగిన ఈ కేటగిరీ పోటీల్లో అతను మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న 33 ఏళ్ల నార్వే సూపర్‌స్టార్ బ్లిట్జ్‌లోనూ తిరుగులేదని నిరూపించుకున్నాడు. శనివారం ఎనిమిదో రౌండ్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చేతిలో కంగుతిన్న కార్ల్సన్ ఆదివారం జరిగిన ‘రిటర్న్’ ఎనిమిదో రౌండ్లో అర్జున్నే ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకోవడం విశేషం. అప్పటికే 12 పాయింట్లు ఉండటంతో టైటిల్ రేసులో అతనొక్కడే నిలిచాడు. చివరకు ఆఖరి రౌండ్ (9వ)లోనూ కార్ల్సన్... భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతిని ఓడించడంతో మొత్తం 13 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఫిలిపినో–అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 11.5 పాయింట్లతో రన్నరప్‌తో సంతృప్తి పడగా, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి(10.5)కి మూడో స్థానం దక్కింది. భారత ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద (9.5), విదిత్ (9) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. -
నార్వే చెస్ టోర్నీ విజేతగా కార్ల్సన్..
నార్వే చెస్ టోర్నీ-2024 ఛాంపియన్‌గా వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్ రౌండ్లో ఫాబియానో కారువానాపై కార్ల్సన్ విజయం సాధించాడు. తొలుత వీరిద్దిరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆర్మగెడాన్ ప్లేఆఫ్‌లో ఫాబియానో కరువానాను కార్ల్సన్ ఓడించాడు. మరొక ఆర్మగెడాన్ పోటీలో హికారు నకమురాను భారత గ్రాండ్‌మాస్టర్ ప్రగ్నానంద రమేష్‌బాబు.. హికారు నకమురాను ఓడించడంతో కార్ల్సెన్ విజయం లాంఛనమైంది.నకమురా ఓటమి పాలవ్వడంతో కార్ల్సెన్ స్టాండింగ్‌లో తన ఆధిక్యాన్ని నిలుపునకుని ఛాంపియన్‌గా అవతరించాడు. కార్ల్‌సన్‌కు ఆర్మగెడాన్ ఫార్మాట్ ఇది ఐదో విజయం కావడం విశేషం. ఇక ఈ టోర్నీలో కార్ల్సన్(17.5) తొలి స్ధానం సంపాదించగా.. నకమురా(15.5), ప్రగ్నానంద(14.5) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో జు వెన్షున్(చైనా) విజేతగా నిలిచింది. 🐐🐐🐐 @MagnusCarlsen pic.twitter.com/MUH73HWmNG— Chess.com (@chesscom) June 7, 2024 Magnus Carlsen beats Fabiano Caruana in Armageddon to earn at least a playoff for the #NorwayChess title! https://t.co/vj9WZbbkJq pic.twitter.com/fdWy4evo1K— chess24 (@chess24com) June 7, 2024 -
సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌కు షాక్
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై ఊహించని విజయం నమోదు చేశాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్‌సన్‌పై ఇదే తొలి విజయం. Magnus Carlsen resigns!@rpraggnachess overtakes Fabiano Caruana and jumps into sole first!https://t.co/wJtLtsYIDS#NorwayChess pic.twitter.com/6DGZDqQbrG— chess24 (@chess24com) May 29, 2024మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సన్ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు. -
13 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా.. ది మాగ్నస్ ఎఫెక్ట్
‘అబ్బబ్బా! ఇలా ఇన్నేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా ఉండటం బోర్ కొట్టేస్తోందమ్మా! నా వల్ల కాదు. అవే విజయాలు, అవే టైటిల్స్. ఎప్పుడూ నేనే అంటే ఎలా? ఎవరైనా కొత్తవాళ్లు విజేతగా వస్తే బాగుంటుంది. అయినా ఎవరూ నన్ను ఓడించడం లేదు. ఇలా అయితే నేనే ఆడకుండా తప్పుకుంటా’.. సరిగ్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థంలో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ దాదాపు ఏడాదిన్నర క్రితం చేసిన ఈ వ్యాఖ్య చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతూ 32 ఏళ్ల వయసులోనే ఇంతటి వైరాగ్యం వచ్చేసిందా అన్నట్లుగా అతని మాటలు వినిపించాయి. అయితే ఈ ఆల్‌టైమ్ చెస్ గ్రేట్ అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదు ఇది. ఎందుకంటే అసలు పోటీ అనేదే లేకుండా తిరుగులేకుండా సాగుతున్న చెస్ సామ్రాజ్యంలో అతను రారాజుగా ఉన్నాడు. పేరుకు నంబర్‌వన్ మాత్రమే కాదు, ఒకటి నుంచి పది వరకు అన్ని స్థానాలూ అతడివే! ఆ తర్వాతే మిగతావారి లెక్క మొదలవుతుంది. నిజంగానే అతని సమకాలికులు కావచ్చు, లేదా కొత్తగా వస్తున్న తరం కుర్రాళ్లు కావచ్చు కార్ల్‌సన్‌ను ఓడించలేక చేతులెత్తేస్తున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్ మాత్రమే కాకుండా ఇతర మెగా టోర్నీల్లో కూడా అగ్రస్థానానికి గురి పెట్టకుండా రెండోస్థానం లక్ష్యంగానే అంతా బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి సమయంలో తాను రాజుగా కంటే సామాన్యుడిగా ఉండటమే సరైనదని అతను భావించాడు. అందుకే క్లాసికల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా తప్పుకుంటున్నానని ప్రకటించడం అతనికే చెల్లింది. చదరంగంలో లెక్కలేనన్ని రికార్డులు, ఘనతలు తన పేరిట నమోదు చేసుకున్న నార్వేజియన్ కార్ల్సన్ ప్రస్థానం అసాధారణం. 2013, చెన్నై. స్థానిక హీరో, దేశంలో చెస్‌కు మార్గదర్శి అయిన విశ్వనాథన్ ఆనంద్ తన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎదురుగా చాలెంజర్ రూపంలో 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్సన్ ఉన్నాడు. ఆనంద్‌తో పోలిస్తే అతని ఘనతలు చాలా తక్కువ. పైగా అనుభవం కూడా లేదు. కాబట్టి అనూహ్యం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుతాన్ని ఎవరూ ఆపలేకపోయారు. సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కార్ల్సన్ అలవోకగా ఆనంద్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మొత్తం 12 రౌండ్ల పోరు కాగా 10వ రౌండ్‌కే చాంపియన్ ఖరారు కావడంతో తర్వాతి రెండు రౌండ్లు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. ఇందులో 3 విజయాలు సాధించి 7 గేమ్‌లు డ్రా చేసుకున్న మాగ్నస్.. ప్రత్యర్థి ఆనంద్‌కు ఒక్క గేమ్‌లోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలా మొదలైన విజయప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ టైటిల్‌ను అతను మరోసారి నాలుగు సార్లు నిలబెట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే స్వచ్ఛందంగా తాను వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నా, ఆటపై ఇష్టంతో ఇతర టోర్నీల్లో పాల్గొంటున్న మాగ్నస్‌ను ఓడించేందుకు అతని దరిదాపుల్లోకి కూడా కనీసం ఎవరూ రాలేకపోతున్నారు. చైల్డ్ ప్రాడజీగా మొదలై... చదరంగంలో శిఖరానికి చేరిన కార్ల్సన్లోని ప్రతిభ చిన్నతనంలోనే అందరికీ కనిపించింది. పుట్టుకతోనే వీడు మేధావిరా అనిపించేలా అతని చురుకుదనం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. రెండేళ్ల వయసులోనే 500 ముక్కల జిగ్సా పజిల్‌ను అతను సరిగ్గా పేర్చడం చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఇక చాలామంది పిల్లలు ఇష్టపడే ‘లెగోస్’లోనైతే అతని సామర్థ్యం అసాధారణం అనిపించింది. 10–14 ఏళ్ల పిల్లల కోసం ఉద్దేశించిన పజిల్స్‌ను కూడా అతను నాలుగేళ్ల వయసులోనే సాల్వ్ చేసి పడేసేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా కార్ల్సన్ సొంతం. ఐదేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, రాజధానులు, పటాలు, జనాభావంటి సమాచారాన్ని అలవోకగా గుర్తు పెట్టుకొని చెప్పేవాడు. దీనిని సరైన సమయంలో గుర్తించడం అతని తల్లిదండ్రుల తొలి విజయం. తమవాడికి చెస్ సరిగ్గా సరిపోతుందని భావించిన వారు ఆ దిశగా కార్ల్‌సన్‌ను ప్రోత్సహించడంతో చదరంగ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని చూడగలిగింది. ఆరంభంలో తన లోకంలో తాను ఉంటూ చెస్‌పై అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఇంట్లో తన అక్కపై గెలిచేందుకు కనబరచిన పట్టుదల ఆపై చెస్‌పై అతడికి ప్రేమను పెంచింది. చెస్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత దానిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆపై 8 ఏళ్ల వయసులోనే నార్వే జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సత్తా చాటడంతో అందరికీ అతని గురించి తెలిసింది. ఆపై చదరంగమే అతనికి లోకంగా మారింది. ఆ తర్వాత యూరోప్‌లోని వేర్వేరు వయో విభాగాల టోర్నీల్లో చెలరేగి వరుస విజయాలతో మాగ్నస్ దూసుకుపోయాడు. గ్రాండ్‌మాస్టర్‌గా మారి... 13 ఏళ్ల వయసు వచ్చేసరికి కార్ల్సన్ దూకుడైన ఆట గురించి అందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో అతను మరెన్నో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా అంచనా వేశారు. అది ఎంత తొందరగా జరగనుందని వేచిచూడటమే మిగిలింది. నిజంగానే కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మాగ్నస్ మూడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ నార్మ్‌లు సాధించడంలో సఫలమయ్యాడు. అతని ప్రతిభ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ కార్ల్‌సన్‌కు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ నార్వే కుర్రాడు ఎప్పుడూ వమ్ము చేయలేదు. 14 ఏళ్లు కూడా పూర్తికాకముందే గ్రాండ్‌మాస్టర్‌గా మారి కెరీర్లో మరో మెట్టు ఎక్కాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఫలితం సానుకూలంగా రాకపోయినా రాబోయే సంవత్సరాల్లో మాగ్నస్ సృష్టించబోయే సునామీకి ఇది సూచికగా కనిపించింది. శిఖరానికి చేరుతూ... సాధారణంగా చెస్‌లో గొప్ప ఆటగాళ్లందరూ భిన్నమైన ఓపెనింగ్స్‌ను ఇష్టపడతారు. ఓపెనింగ్ గేమ్‌తోనే చాలా వరకు ఆటపై పట్టు బిగించేస్తారు. కానీ మాగ్నస్ దీనిని పెద్దగా పట్టించుకోడు. మిడిల్ గేమ్‌లో మాత్రం అతనో అద్భుతం. దూకుడైన ఎత్తులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కోలుకోలేకుండా చేయడంలో అతను నేర్పరి. ప్రాక్టీస్ కోసం కంçప్యూటర్లలో ఉండే ప్రోగ్రామింగ్ కంటే సొంత మెదడుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అపరిమిత సంఖ్యలో తనతో తానే మ్యాచ్‌లు ఆడుతూ సుదీర్ఘ సాధనతో నేర్చుకోవడం అతనికి మాత్రమే సాధ్యమైన కళ. ఈ ప్రతిభ అతడిని వేగంగా పైకి ఎదిగేలా చేసింది. తనకెదురైన ప్రతి ఆటగాడినీ ఓడిస్తూ వచ్చిన మాగ్నస్ 19 ఏళ్ల వయసులో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని శిఖరానికి చేరాడు. అదే ఏడాది అతని కెరీర్లో మరో కీలక క్షణం మరో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను వ్యక్తిగత కోచ్‌గా నియమించుకోవడం. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు మరో యువ సంచలనానికి శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనేదానికి ఈ బంధం బలమైన ఉదాహరణ. కాస్పరోవ్‌తో కలసి ఎత్తుకు పైఎత్తులతో దూసుకుపోయిన ఈ యువ ఆటగాడు నాలుగేళ్ళలో తిరుగులేని ప్రదర్శనతో శిఖరానికి చేరుకున్నాడు. తర్వాతి రోజుల్లో కాస్పరోవ్ పేరిట ఉన్న ఘనతలన్నీ అతను చెరిపేయగలగడం విశేషం. అన్నీ అద్భుతాలే... 2013లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కార్ల్సన్ 2014లో దానిని నిలబెట్టుకున్నాడు. ఈసారి కూడా విశ్వనాథన్ ఆనంద్పైనే అతను అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఇక్కడ కూడా చివరి గేమ్ అవసరం లేకపోయింది. 2016 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మాత్రం సెర్జీ కర్యాకిన్ (రష్యా)తో అతనికి కాస్త పోటీ ఎదురైంది. 12 గేమ్‌ల తర్వాత ఇద్దరూ 6–6 పాయింట్లతో సమంగా నిలవగా, టైబ్రేక్‌లో విజయం అతని సొంతమైంది. నాలుగోసారి 2018లో ఫాబియానో కరువానా (అమెరికా)పై కూడా ఇదే తరహాలో 6–6తో స్కోరు సమం కాగా, టైబ్రేక్‌లో 3–0తో గెలిచి వరల్డ్ చాంపియన్‌గా కొనసాగాడు. 2021లోనైతే మాగ్నస్ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఇయాన్ నెపొమాచి (రష్యా)తో జరిగిన సమరం పూర్తి ఏకపక్షంగా సాగింది. 14 రౌండ్ల పోరు కాగా 11 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లు సాధించి తన జగజ్జేత హోదాను మళ్లీ నిలబెట్టుకున్నాడు. బహుశా ఇదే ఫలితం తర్వాతి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండేందుకు కారణమై ఉండవచ్చు. క్రికెట్లో మూడు ఫార్మాట్లలాగే చెస్లోనూ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లు ఉన్నాయి. కార్ల్సన్ మూడింటిలో సాగించిన ఆధిపత్యం చూస్తే అతను ఏ స్థాయి ఆటగాడో అర్థమవుతుంది. క్లాసిక్‌లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అతను 5 సార్లు ర్యాపిడ్‌లో, 7 సార్లు బ్లిట్జ్‌లో వరల్డ్ చాంపియన్‌గా (మొత్తం 17 టైటిల్స్) నిలవడం విశేషం. చెస్ చరిత్రలో గ్యారీ కాస్పరోవ్ (2851)ను అధిగమించి అతి ఎక్కువ యెల్లో రేటింగ్ (2882) సాధించిన ఆటగాడిగా కార్ల్‌సన్‌ను నిలిచాడు. వరుసగా పదేళ్ల పాటు విశ్వవిజేతగా నిలిచిన అతను వరుసగా 125 గేమ్‌లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. అతనిపై పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తకాలు, వీడియో డాక్యుమెంటరీలు కార్ల్సన్ ఆటలోని అద్భుతాన్ని మనకు చూపిస్తాయి. అధికారికంగా ప్రపంచ చాంపియన్ కాకపోయినా, అతను ఇంకా వరల్డ్ చెస్‌ను శాసిస్తూనే ఉన్నాడు. గత రెండేళ్లలో అతను సాధించిన విజయాలు, టైటిల్స్‌కు మరెవరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇదే జోరు కొనసాగిస్తూ మున్ముందూ చెస్‌లో మాగ్నస్ లెక్కలేనన్ని ఘనతలు సాధించడం ఖాయం. -
అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
గత మూడు రోజులుగా రెండు దేశాల క్రీడా ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్తో ప్రజ్ఞానంద ఫైనల్ పోరు.. టైబ్రేక్స్‌లో తేలిన ఫలితం.. ఎట్టకేలకు 18 ఏళ్ల కుర్రాడిపై అనుభవజ్ఞుడైన 32 ఏళ్ల కార్ల్సన్దే పైచేయి అయింది.. జగజ్జేతగా అవతరించిన అతడికే FIDE World Cup దక్కింది. దిగ్గజ ఆటగాడి చేతిలో ఓడితేనేమి.. చిన్న వయసులోనే ఇక్కడి దాకా చేరుకున్న మన ప్రజ్ఞానంద ఎప్పుడో అందరి మనసులు గెలిచేశాడు. పిట్టకొంచెం కూత ఘనం అనే మాటను నిజం చేస్తూ కార్ల్‌సన్‌ను ఢీకొట్టడమే గాక విజయం కోసం చెమటోడ్చేలా చేశాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గెలుపు కోసం నిరీక్షించేలా చేశాడు. ప్రపంచకప్ ఫైనల్లో పోటీ పడిన ఈ ఇద్దరిలోనూ ఓ సారూప్యత ఉంది. కార్ల్సన్ చెస్ లెజెండ్‌గా అవతరించడంలో అతడి తండ్రి పాత్ర ఉంటే.. చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద ప్రయాణం ఇక్కడిదాకా సాఫీగా సాగడానికి ముఖ్య కారణం అతడి తల్లి! PC: @photochess/FIDE Twitter) చెస్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజ్ఞానంద కళ్లు తన తల్లి నాగలక్ష్మి కోసం వెదుకుతాయి. లేనిపోని హంగూ ఆర్భాటాలతో సందడి చేసే వాళ్లలో ఒకరిగా గాకుండా తమ ఇంట్లోనే ఉన్నంత సాదాసీదాగా.. ఏ హడావుడీ లేకుండా ఓ పక్కన నిలబడి ఉంటారామె! నిండైన చీరకట్టులో అందరిలో ప్రత్యేకంగా ఉన్న ఆమె కనబడగానే ప్రజ్ఞానంద ముఖంలో ఎక్కడాలేని సంతోషం.. గెలిచినా.. ఓడినా సరే! పరిగెత్తుకు వెళ్లి తల్లిని హత్తుకోవడం అతడికి అలవాటు. అతడి కళ్లలో భావోద్వేగపు తాలూకు ఛాయలు.. ఆమె ఆప్యాయపు చూపుల ప్రేమతో అలా చెమ్మగిల్లుతాయి. మ్యాచ్ ఫలితం ఏమిటన్న అంశంతో ఆమెకు సంబంధం లేదు. అసలు ఆ విషయం గురించి కొడుకును ఒక్క మాటా అడగరు! గెలుపోటములతో ఆమెకు పని లేదు. చెస్ బోర్డులోని 64 గడులు, వాటితో వేసే క్లిష్టమైన ఎత్తులు, పైఎత్తులు కూడా ఆమెకు పెద్దగా తెలియదు. మేధావులతో ఢీకొట్టే తన చిన్నారి కుమారుడు ఎలా ఆడుతున్నాడు అన్న విషయమూ ఆమెకు పట్టదు. తన కొడుకుతో తను ఉండాలంతే! ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడికి అండగా నిలబడాలి. తనకు నచ్చినా నచ్చకపోయినా.. కొడుకుతో పాటే ప్రయాణాలు చేయాలి. అతడిని కంటికి రెప్పలా కాచుకోవాలి. ఆ తల్లి మనసుకు తెలిసింది ఇదే! గత దశాబ్దకాలంగా.. చిన్నపిల్లాడి నుంచి.. గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి చేరేదాకా ఆ మాతృమూర్తి కొడుకు కోసం తన సమయాన్నంతా కేటాయించింది. కుమారుడి విజయాలకు సాక్షిగా గర్వపడే క్షణాలను ఆస్వాదిస్తోంది. ఎక్కడున్నా సరే.. తన అమితమైన ప్రేమతో పాటు కొడుకుకు ఇష్టమైన సాంబార్, టొమాటో రైస్ వడ్డిస్తూ అతడికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఆ తల్లి తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు.. పరోక్షంగా విన్న వాళ్లకూ ‘‘నా విజయాలకు ముఖ్య కారణం మా అమ్మే’’ అన్న ప్రజ్ఞానంద మాటలు నూటికి నూరుపాళ్లు నిజమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు! అక్క చేసిన ఆ పని వల్లే.. చెస్ ప్రపంచంలో భారత్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రజ్ఞానందది సాధారణ కుటుంబం. తండ్రి రమేశ్‌బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి నాగలక్ష్మి ‘గృహిణి’. ప్రజ్ఞానందకు సోదరి వైశాలి ఉంది. ఆమె కూడా చెస్‌లో రాణిస్తోంది. చిన్నతనంలో వైశాలి టీవీకే అతుక్కుపోవడం గమనించిన నాగలక్ష్మి ఆమె ధ్యాసను మళ్లించేందుకు చెస్ బోర్డు కొనిచ్చింది. ఆ సమయంలో నాలుగేళ్లన్నరేళ్ల ప్రజ్ఞా కూడా ఆటపై ఆసక్తి కనబరచడంతో కోచింగ్ ఇప్పించారు ఆ తల్లిదండ్రులు. అలా బాల మేధావిగా పేరొందిన ప్రజ్ఞానంద అంచెలంచెలుగా ఎదుగుతూ పదేళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. కార్ల్‌సన్‌ను ఓడించి ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకుంటూ 16 ఏళ్ల వయసులో మహామహులకే సాధ్యం కాని రీతిలో కార్ల్‌సన్‌ను ఓడించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు అతడిపై మూడు సార్లు గెలుపొంది చెస్ ప్రపంచానికి కొత్త రారాజు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. ప్రతిష్టాత్మక టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచినా ర్యాంకింగ్స్‌లో టాప్-10 చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నమ్మకంగా చెబుతున్నాడు. PC: Amruta Mokal ఆ తల్లికి ‘భయం’.. అందుకే తండ్రి అలా ఇక నార్వే స్టార్ కార్ల్సన్ విషయానికొస్తే.. ప్రజ్ఞాకు తల్లి నాగలక్ష్మి ఎలాగో.. అతడికి తండ్రి హెన్రిక్ అలాగే! మేనేజర్‌గా, మార్గనిర్దేశకుడిగా కార్ల్‌సన్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఎల్లవేళలా కొడుకుతోనే ఉంటూ అతడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ తల్లి సిగ్రూన్ కెమికల్ ఇంజనీర్. ఆమెకు చెస్ ఆడటం తెలుసు. కానీ ఎప్పుడూ కొడుకు మ్యాచ్‌లు చూసేందుకు ఆవిడ రాదు. ఒత్తిడిని తట్టుకోవడం... భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సిగ్రూన్ బలహీనురాలు కాబట్టే తానే ఎప్పుడూ కార్ల్సన్ వెంట ఉంటానని ఐటీ కన్సల్టెంట్ అయిన హెన్రిక్ ఓ సందర్భంలో చెప్పాడు. అన్నట్లు ఈ దంపతులకు మాగ్నస్‌తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా పజిల్ ప్రపంచానికి పరిచయస్తులేనండోయ్! -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Minnu Mani: అమ్మానాన్న వద్దన్నారు! పట్టువీడలేదు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్‌కు ఆమె పేరు He said "Your photo on Twitter was huge!" I said, "It is because you ARE huge!" @rpragchess and his lovely mum are IN THE #FIDEWorldCup2023 FINAL ♥️ pic.twitter.com/2bJP21yBGN — PhotoChess (@photochess) August 21, 2023 -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్‌ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్‌ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్
FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో మహిళల ఈవెంట్లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవిత శ్రీ గ్రాండ్మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది. మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్‌గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది. నిరాశపరిచిన హారిక పదో రౌండ్లో క్వియాన్యున్ (సింగపూర్)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్ టై బ్రేక్ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది. విజేత కార్ల్సన్ ఓపెన్ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ కార్ల్సన్ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు. చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
వరల్డ్ చాంపియన్‌ను మట్టి కరిపించిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్
ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ డోనరుమ్మ గుకేష్ 9వ రౌండ్లో కార్ల్‌సన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు. కాగా గుఖేష్ తెల్ల పావులతో బరిలోకి దిగి సంచలన విజయం నమోదు చేశాడు. శనివారం 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగిసే కార్ల్‌సన్‌ను ఓడించిన ఒక్కరోజు వ్యవధిలోనే గుకేష్ కూడా ప్రపంచచాంపియన్ను చిత్తు చేయడం విశేషం. కాగా కార్ల్‌సన్‌ను ఓడించిన యంగ్ గ్రాండ్‌మాస్టర్‌గా గుఖేష్ నిలిచాడు. ఈ చెస్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 16 మంది ఆటగాళ్లు ఉండగా.. అందులో ఐదుగురు భారత్ నుంచే ఉన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్.. భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్సన్ భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో ఓడిపోవడం ఇది ఐదోసారి. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించగా, అర్జున్ ఇరగైసి కార్ల్‌సన్‌ను ఓడించగా.. తాజాగా వీరి సరసన గుఖేష్ చోటు సంపాదించాడు. -
వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత గ్రాండ్ మాస్టర్
ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. ప్రపంచ ఛాంపియన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించాడు. ఈ పోరులో అర్జున్ 54 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించి, గత నెలలో జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్లైన్ టోర్నీలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కాగా, ఇటీవలి కాలంలో వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్.. భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో తరుచూ ఓడిపోతున్నాడు. నెల రోజుల వ్యవధిలో కార్ల్సన్ నాలుగు సార్లు భారత గ్రాండ్‌మాస్టర్ల చేతిలో ఓడిపోయాడు. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. మూడు సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించగా.. తాజాగా అర్జున్ ఇరగైసి కార్ల్‌సన్‌కు చుక్కలు చూపించాడు. -
'చీటింగ్ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా'
వరల్డ్ చెస్ ఛాంపియన్.. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ ప్రత్యర్థి చెస్ ఆటగాడు నీమ్యాన్పై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి హన్స్ నీమ్యాన్ పదే పదే చీటింగ్‌కు పాల్పడినట్లు కార్ల్సన్ ఆరోపించాడు. విషయంలోకి వెళితే.. శనివారం జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో కార్లసన్ మరోసారి నీమ్యాన్తో తలపడ్డాడు. ఒక ఎత్తు వేసిన వెంటనే కార్ల్సన్ ఆట నుంచి తప్పుకున్నాడు. ఇది అక్కడున్న వారందరిని షాక్‌కు గురి చేసింది. అయితే తాను తప్పుకోవడంపై కార్ల్సన్ తన ట్విటర్లో స్పందించాడు. కార్ల్సన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఇటీవలే ముగిసిన సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి వైదొలడంపై కార్ల్సన్ వివరణ ఇచ్చాడు. ''సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి పక్కకు తప్పుకోడానికి ఒక కారణం ఉంది. నీమ్యాన్ ఆ మ్యాచ్‌లో చీటింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవలే ఒప్పుకున్నాడు. అలాంటి ప్లేయర్‌తో ఆడలేను.ఆన్లైన్లోనే కాదు.. బోర్డ్ ప్లేలో కూడా నీమ్యాన్ చీటింగ్ చేశాడు. జూలియస్ బేర్ జనరేషన్ కప్‌లో అతనితో మరోసారి ఎదురుపడాల్సి వచ్చింది. కానీ పదే పదే చీటింగ్ చేసే ఆటగాడితో నేను ఆడలేను అందుకే తప్పుకున్నా.'' అంటూ పేర్కొన్నాడు. ఇటీవల సెయింట్ లూయిస్‌లో జరిగిన ఓ టోర్నమెంట్లో నీమ్యాన్ చేతిలో కార్ల్సన్ ఓటమి పాలయ్యాడు. వరల్డ్ చాంపియన్ ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అయితే కేవలం తన కెరీర్‌ను దెబ్బ తీసేందుకు తనపై కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు నీమ్యాన్ ఆరోపించాడు. ఇక ఆదివారం జరిగిన జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా అవతరించాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిశేషి అర్జున్‌పై రెండు ఫైనల్స్‌లోనూ కార్ల్సన్ 2.5–0.5; 2–0 తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. My statement regarding the last few weeks. pic.twitter.com/KY34DbcjLo — Magnus Carlsen (@MagnusCarlsen) September 26, 2022 చదవండి: సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్ స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్..
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 2.5–0.5; 2–0తో అర్జున్‌పై గెలిచి విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన రెండో ఫైనల్ రెండు గేముల్లోనూ కార్ల్సన్ గెలిచాడు. కార్ల్‌సన్‌కు 33,500 డాలర్లు (రూ. 27 లక్షల 21 వేలు), అర్జున్‌కు 21,250 డాలర్లు (రూ. 17 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ -
కార్ల్‌సన్‌కు ‘చెక్’
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్‌లో రెండు టైబ్రేక్స్ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్‌ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి. -
FTX Crypto Cup: కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. కానీ విజేత మాత్రం అతడే!
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించాడు. సోమవారం నాటి బ్లిట్జ్ టై బ్రేకర్‌లో విజయం సాధించాడు. అయితే, ఓవరాల్‌గా టాప్ స్కోరు సాధించిన కార్ల్సన్ టోర్నీ విజేతగా నిలవగా.. ప్రజ్ఞానంద రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ జాన్ క్రిస్టాఫ్ డూడాతో జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2–4తో ఓడిపోయాడు. నిర్ణీత నాలుగు ర్యాపిడ్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు రెండు బ్లిట్జ్ గేమ్‌లను నిర్వహించగా... రెండింటిలోనూ డూడా గెలుపొందాడు. ఈ క్రమంలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 13 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) 15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచారు. అయితే, చివరిదైన ఏడో రౌండ్లో కార్ల్‌సన్‌ను ఓడించిప్పటికీ ఓవరాల్‌గా పాయింట్ల పరంగా వెనుకబడ్డ ప్రజ్ఞానందకు నిరాశ తప్పలేదు. కాగా గత ఆర్నెళ్ల కాలంలో ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను ఓడించడం ఇది మూడో సారి కావడం విశేషం. మరిన్ని క్రీడా వార్తలు మెద్వెదెవ్కు చుక్కెదురు సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ మెద్వెదెవ్ (రష్యా) పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్) 7–6 (8/6), 3–6, 6–3తో టాప్ సీడ్ మెద్వెదెవ్‌ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. టైటిల్ కోసం ప్రపంచ 152వ ర్యాంకర్ బోర్నా చొరిచ్ (క్రొయేషియా)తో సిట్సిపాస్ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో చొరిచ్ 6–3, 6–4తో తొమ్మిదో ర్యాంకర్ కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. కాంస్యం కోసం భారత్ పోరు టెహ్రాన్: ఆసియా అండర్–18 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకం కోసం పోరాడనుంది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 15–25, 19–25, 18–25తో ఆతిథ్య ఇరాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్ 37–39, 25–22, 25–21, 25–14తో కొరియాను ఓడించి నేడు ఇరాన్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. -
ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్’ విజయం.. దిగ్గజ ఆటగాడితో సంయుక్తంగా
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ‘హ్యాట్రిక్’ విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్లలోనూ మేటి ర్యాంకర్లకు చెక్ పెట్టిన ఈ టీనేజ్ సంచలనం గురువారం జరిగిన మూడో రౌండ్లో 2.5–1.5తో అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హాన్స్ నీమన్‌పై విజయం సాధించాడు. వరుస విజయాలతో 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ నాలుగు ర్యాపిడ్ గేమ్‌లు జరిగే ఈ టోర్నీలో గురువారం జరిగిన పోరులో మొదటి గేమ్‌లో ఓడినప్పటికీ భారత ఆటగాడు అద్భుత ప్రదర్శనతో పుంజుకున్నాడు. రెండు, నాలుగో గేముల్లో గెలిచాడు. మూడో గేమ్ డ్రా అయ్యింది. తాజా విజయంతో అతని ఖాతాలో మరో రూ. 5.94 లక్షలు (7500 డాలర్లు) ప్రైజ్‌మనీ జమ అయ్యింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ సంచలన నిర్ణయం
ప్రపంచ చెస్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (31) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది (2023) తన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను డిఫెండ్ చేసుకోబోనని ప్రకటించాడు. గత దశాబ్ద కాలంగా చెస్ ప్రపంచాన్ని మకుటం లేని మారాజులా ఏలుతున్న కార్ల్సన్.. గతేడాది (2021) ఛాంపియన్షిప్ సాధించిన అనంతరమే ఈ విషయమై క్లూ ఇచ్చాడు. తాజాగా తాను టైటిల్ డిఫెండ్ చేసుకోవట్లేదని ఇవాళ స్పష్టం చేశాడు. చెస్ ఛాంపియన్ హోదాపై తనకు ఆసక్తి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తన ఫ్రెండ్‌కు ఇచ్చిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కార్ల్సన్ గతేడాది ఇయాన్ నెపోమ్నియాచిపై ఐదో టైటిల్ నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, కార్ల్సన్ నిర్ణయంపై భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ స్పందించాడు. కార్ల్సన్ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. 1975లో బాబీ ఫిషర్ కూడా ఇలాగే ఆటను మధ్యలోనే వదిలేశాడని, ఇలా చేయడం వల్ల చదరంగం క్రీడకు నష్టం జరుగుతుందని అన్నాడు. చదవండి: బాంబుల మోత నుంచి తప్పించుకొని పతకం గెలిచి.. -
Norway Chess: ఆనంద్ అదరహో
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ గెలుపొందాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్‌సన్‌పై ఆనంద్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం సాధించాడు. క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్సన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్‌ను గెలిచినట్లు ప్రకటిస్తారు. రెగ్యులర్ గేమ్‌లో ఏ రంగు పావులతో ఆడారో అదే రంగును అర్మగెడాన్ గేమ్‌లోనూ కేటాయిస్తారు. దాంతో కార్ల్సన్తో అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో ఆడాల్సి వచ్చింది. ఈ గేమ్‌లో ఆనంద్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చకచకా ఎత్తులు వేస్తూ కార్ల్‌సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరకు ఆనంద్ 50 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఈ టోర్నీలో రెగ్యులర్ గేమ్‌లో విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తున్నారు. గేమ్ ‘డ్రా’ అయి అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 10 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 9.5 పాయింట్లతో కార్ల్సన్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు
చెస్ వరల్డ్ చాంపియన్.. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి షాక్ ఇచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద.. కార్ల్సన్తో తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కార్ల్సెన్ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు. ఇది ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో కార్ల్‌సన్‌కు చెక్ పెట్టిన ప్రజ్ఞా మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్‌సన్‌పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్ స్టేజ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్‌గా చెస్బుల్ మాస్టర్స్‌లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ప్రపంచ నం.1 ఆటగాడికి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు Magnus Carlsen blunders and Praggnanandhaa beats the World Champion again! https://t.co/J2cgFmhKbT #ChessChamps #ChessableMasters pic.twitter.com/mnvL1BbdVn — chess24.com (@chess24com) May 20, 2022 -
చదరంగపు బాలరాజు
టీవీ కార్టూన్ షోలు తెగ చూస్తున్న పాపను దాని నుంచి దూరం చేయడానికి తల్లితండ్రులు అనుకోకుండా చేసిన ఓ అలవాటు ఆ పాపతో పాటు మూడేళ్ళ వయసు ఆమె తమ్ముడి జీవితాన్నీ మార్చేసింది. కాలగతిలో చదరంగపు క్రీడలో అక్క గ్రాండ్ మాస్టర్ అయితే, తమ్ముడు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగాడు. ఏకంగా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌నే ఓడించి, అబ్బురపరిచాడు. సరైన సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే పిల్లలు ఏ స్థాయికి ఎదగగలరో, ఇంటిల్లపాదినే కాదు... ఇండియాను ఎంత గర్వించేలా చేస్తారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం – తమిళనాడుకు చెందిన టీనేజ్ అక్కాతమ్ముళ్ళు వైశాలి, ప్రజ్ఞానంద. ఇంటా, బయటా తెలిసినవాళ్ళంతా ప్రగ్గూ అని పిలుచుకొనే పదహారేళ్ళ ఆర్. ప్రజ్ఞానంద చదరంగంలో తన ఆరాధ్యదైవమైన వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్‌సన్‌ను సోమవారం తెల్లవారుజామున ఓడించి సంచలనం రేపాడు. క్లాసికల్, ర్యాపిడ్, ఎగ్జిబిషన్ – ఇలా ఏ ఫార్మట్ గేమ్‌లలోనైనా కలిపి మన విశ్వనాథన్ ఆనంద్, తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తరువాత కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత క్రీడాకారుడిగా ప్రగ్గూ చరిత్ర సృష్టించాడు. నార్వేకు చెందిన కార్ల్సన్ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్. కొంతకాలంగా ప్రపంచ చదరంగానికి మకుటం లేని మహారాజు. అలాంటి వ్యక్తిని ఓడించడం ఆషామాషీ కాదు. అరవై నాలుగు గడులు... మొత్తంగా చకచకా 39 ఎత్తులు... అంతే.... కార్ల్‌సన్‌కు చెక్ పెట్టి, ప్రగ్గూ నమ్మలేని విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన ప్రపంచ విజేతకు బ్రేకులు వేశాడు. ఆన్లైన్లో సాగే ర్యాపిడ్ చెస్ పోటీ ‘ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్’ ప్రారంభ విడతలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 31 ఏళ్ళ కార్ల్‌సన్‌పై గతంలో విశ్వనాథన్ ఆనంద్ 19 సార్లు, హరికృష్ణ 2 సార్లు గెలిచారు. వారి కన్నా అతి పిన్న వయసులోనే, కార్ల్సన్ వయసులో సగమున్న బుడతడైన ప్రగ్గూ ఈ ఘనత సాధించడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి, చదరంగంలో అగ్రశ్రేణి వరుసను అటుదిటు చేసిన ఈ బాలమేధావి అమాయకంగా అన్నమాట మరింత కాక రేపింది. ప్రపంచ ఛాంపియన్‌పై జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేకించి వ్యూహమేమీ అనుకోలేదనీ, ఆస్వాదిస్తూ ఆడానే తప్ప మరేమీ చేయలేదనీ ఈ టీనేజర్ అనడం విశేషం. ఆట మొదలుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లపావులతో ఆడేవారికి ఓ రకంగా సానుకూలత ఉంటుందని భావించే చెస్‌లో నల్ల పావులతో ఆరంభించి, ఈ కీలక మ్యాచ్‌లో నెగ్గాడీ బాలరాజు. మొత్తం 16 మంది ఆటగాళ్ళ మధ్య 15 రౌండ్ల పాటు జరిగే టోర్నీ ఇది. ఇందులో ఈ మ్యాచ్‌కు ముందు ప్రగ్గూ ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ళు పదిమందిలో నలుగురితో తలపడి, రెండు విజయాలు, ఒక డ్రా, ఒక పరాజయంతో తన ప్రతిభను క్రీడాలోకం ఆగి, చూసేలా చేశాడు. ఆత్మీయుల మొదలు విశ్వనాథన్ ఆనంద్, దిగ్గజ క్రికెటర్ సచిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దాకా విభిన్న రంగాల ప్రముఖుల ప్రశంసలు పొందాడు. కరోనా కాలంలో చెస్ పోటీల క్యాలెండర్ తారుమారై, నిరాశలో పడి, కాస్తంత వెనకపట్టు పట్టిన ఈ చిచ్చరపిడుగుకు ఇది సరైన సమయంలో దక్కిన భారీ విజయం. కోచ్ ఆర్బీ రమేశ్ చెప్పినట్టు ప్రతిభావంతుడైన ప్రగ్గూలో ఆత్మవిశ్వాసం పెంచి, సుదీర్ఘ ప్రస్థానానికి మార్గం సుగమం చేసే విజయం. శ్రీనాథ కవిసార్వభౌముడు అన్నట్టే ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడె...’ ప్రగ్గూ తన సత్తా చూపడం మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడేళ్ళకే అక్కను చూసి ఆడడం మొదలుపెట్టిన ఈ బుడతడు 2013లో వరల్డ్ అండర్–8 కిరీటధారి అయ్యాడు. పదేళ్ళ, పదినెలల, 19 రోజుల వయసుకే 2016లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టరయ్యాడు. అప్పటికి ఆ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. మొత్తం మీద ఇప్పుడు చరిత్రలో పిన్న వయసు గ్రాండ్ మాస్టర్లలో అయిదోవాడిగా నిలిచాడు. భారత కాలమానంలో బాగా పొద్దుపోయి, రాత్రి 10 దాటాకెప్పుడో మొదలయ్యే తాజా టోర్నీ కోసం నిద్ర వేళల్ని మార్చుకోవడం సహా పలురకాల సన్నాహాలు చేసుకున్నాడు ప్రగ్గూ. చెన్నై శివార్లలోని పాడి ప్రాంతంలో మధ్యతరగతి నుంచి వచ్చిన ఈ బాల మేధావికి చెస్, బ్యాంకు ఉద్యోగం చేసే పోలియో బాధిత తండ్రి, ప్రతి టోర్నీకీ సాయంగా వచ్చే తల్లి, చెస్‌లో ప్రవేశానికి కారణమైన 19 ఏళ్ళ అక్క, కోచ్ రమేశ్... ఇదే ప్రపంచం. గత ఏడాది ‘న్యూ ఇన్ చెస్ క్లాసిక్’ పోటీలో సైతం వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్‌పై పోటీని డ్రా చేసిన ఘనుడీ బాలుడు. భారత ఆటగాళ్ళలో 16వ ర్యాంకులో, ప్రపంచంలో 193వ ర్యాంకులో ఉన్న ఇతను చెస్‌లో భారత ఆశాకిరణం. ఒకప్పుడు తానూ ఇలాగే చిన్న వయసులోనే, ఇలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే కావడంతో విశ్వనాథన్ ఆనంద్ ఈ బాల మేధావిని అక్కున చేర్చుకొన్నారు. వరల్డ్ ఛాంపియన్‌పై గెలుపు లాంటివి భారత ఆటగాళ్ళకు అప్పుడప్పుడు కాకుండా, తరచూ సాధ్యం కావాలంటే ప్రగ్గూ లాంటి వారికి ఇలాంటి సీనియర్ల చేయూత అవసరం. 1988లో ఆనంద్ తొలి ఇండియన్ గ్రాండ్ మాస్టరయ్యారు. అప్పటి నుంచి చెస్ పట్ల పెరిగిన ఆసక్తితో, 73 మంది మన దేశంలో గ్రాండ్ మాస్టర్లు ఎదిగొచ్చారు. మూడు దశాబ్దాల పైగా దేశంలో చదరంగానికి ప్రతీకగా మారిన 51 ఏళ్ళ ఆనంద్ పరంపర ప్రగ్గూ మీదుగా అవిచ్ఛిన్నంగా సాగాలంటే... ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు, దాతల అండదండలు అతి కీలకం. ఇలాంటి మాణిక్యాలను ఏరి, సానబడితే, ప్రపంచ వేదికపై రెపరెపలాడేది మన భారత కీర్తి పతాకమే. -
ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సెన్కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు
ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నం.1, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి సంచలనం సృష్టించాడు. గేమ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సెన్కు ముచ్ఛెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీలో మార్పు.. ధనాధన్ లీగ్ ఎప్పటి నుంచి అంటే..? -
చరిత్ర సృష్టించిన కార్ల్సన్.. వరుసగా నాలుగోసారి
దుబాయ్: 64 గళ్లపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. రష్యాకు చెందిన ‘చాలెంజర్’ ఇయాన్ నిపోమ్‌నిషితో జరిగిన ప్రపంచ క్లాసికల్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మరో మూడు గేమ్‌లు మిగిలి ఉండగానే కార్ల్సన్ విశ్వ కిరీటాన్ని హస్తగతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన 11వ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 49 ఎత్తుల్లో గెలుపొందాడు. దాంతో నిర్ణీత 14 గేమ్‌ల ఈ చాంపియన్ షిప్ మ్యాచ్‌లో కార్ల్సన్ 7.5–3.5తో ఆధిక్యంలోకి వెళ్లి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. తదుపరి మూడు గేముల్లో నిపోమ్‌నిషి గెలిచినా కార్ల్సన్ స్కోరును సమం చేసే అవకాశం లేకపోవడం... కార్ల్‌సన్‌కు టైటిల్ ఖాయం కావడంతో మిగతా మూడు గేమ్‌లను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. 2014, 2016, 2018లలో కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 30 ఏళ్ల కార్ల్ సన్‌కు ఈసారీ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. వరుసగా మొదటి ఐదు గేమ్‌లు ‘డ్రా’గా ముగిసినా... 136 ఎత్తులు, 7 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఆరో గేమ్‌లో కార్ల్సన్ గెలిచి బోణీ కొట్టాడు. ఆ తర్వాత ఏడో గేమ్ ‘డ్రా’కాగా... ఎనిమిదో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో కార్ల్సన్ విజయం సాధించాడు. అనంతరం పదో గేమ్ ‘డ్రా’ అయింది. అయితే 11వ గేమ్‌లో మళ్లీ కార్ల్సన్ గెలిచి నిపోమ్‌నిషి కథను ముగించాడు. విజేత కార్ల్‌సన్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు)... రన్నరప్ నిపోమ్‌నిషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. క్లాసికల్ ఫార్మాట్లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలోనూ కార్ల్సన్ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు. -
World Chess Championship: కార్ల్సన్ మళ్లీ గెలిచాడు
దుబాయ్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ జోరు మీదున్నాడు. చాలెంజర్ నిపోమ్‌నిషి (రష్యా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో గేమ్‌లో కార్ల్సన్ నల్లపావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో గెలిచాడు. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్కిది మూడో విజయం. గత రెండు విజయాలు కార్ల్‌సన్‌కు తెల్లపావులతో ఆడినపుడు లభించాయి. తొమ్మిదో గేమ్‌ను ప్రారంభించే అవకాశం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దక్కింది. నిపోమ్‌నిషి తరఫున ప్రజ్ఞానంద తెల్లపావులతో తొలి ఎత్తును వేసి గేమ్‌ను ప్రారంభించాడు. మొత్తం 14 గేమ్‌లు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో తొమ్మి ది గేమ్‌ల తర్వాత కార్ల్సన్ 6–3తో ఆధిక్యంలో ఉన్నాడు. నేడు పదో గేమ్ జరగనుంది. -
World Championship Game 8: కార్ల్‌సన్‌కు రెండో విజయం
Magnus Carlsen: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) రెండో విజయం నమోదు చేశాడు. నిపోమ్‌నిషి (రష్యా)తో దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఎనిమిదో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ 46 ఎత్తుల్లో గెలుపొందాడు. ఎనిమిది గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 5–3 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. సోమవారం విశ్రాంతి దినం తర్వాత తొమ్మిదో గేమ్ మంగళవారం జరుగుతుంది. చదవండి: Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఫొటో అదిరింది! ఇదేదో సర్ఫ్ యాడ్‌లా ఉందే! -
World Chess Championship: కార్ల్సన్ ప్రత్యర్థి ఎవరంటే!
మాస్కో: ప్రపంచ పురుషుల చెస్ చాంపియన్‌షిప్ కిరీటం కోసం రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్నిషి బరిలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో నెపోమ్నిషి తలపడనున్నాడు. కార్ల్సన్ ప్రత్యర్థి ఎవరో నిర్ణయించేందుకు మాస్కోలో నిర్వహించిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 30 ఏళ్ల నెపోమ్నిషి విజేతగా నిలిచాడు. కాగా, ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించిన క్యాండిడేట్స్ టోర్నీలో నెపోమ్నిషి 8.5 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే 8.5 పాయింట్లతో సోమవారమే టైటిల్‌ను ఖాయం చేసుకున్న నెపోమ్నిషి మంగళవారం జరిగిన చివరిదైన 14వ రౌండ్ గేమ్‌లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో 35 ఎత్తుల్లో ఓడిపోయాడు. 8 పాయింట్లతో లాగ్రెవ్ (ఫ్రాన్స్) రెండో స్థానంలో, 7.5 పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) మూడో స్థానంలో నిలిచారు. చదవండి: ఒలింపిక్స్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం -
హరికృష్ణ సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముఖాముఖి అయినా... ఆన్లైన్లో అయినా... క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రస్తుతం ప్రపంచ చెస్ చాంపియన్‌గా ఉన్న మాగ్నస్ కార్ల్‌సన్‌పై ఓ గేమ్‌లో గెలవడమంటే విశేషమే. సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఆన్లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ సందర్భంగా భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ అద్భుతం చేసి చూపించాడు. బ్లిట్జ్ విభాగంలో భాగంగా ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌లో హరికృష్ణ తెల్ల పావులతో ఆడుతూ 63 ఎత్తుల్లో గెలుపొంది సంచలనం సృష్టించాడు. 15 ఏళ్ల తర్వాత.... అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం తన కెరీర్లో కార్ల్సన్తో 18 సార్లు తలపడిన హరికృష్ణ కేవలం రెండోసారి మాత్రమే గెలిచాడు. ఈ గేమ్కంటే ముందు ఏకైకసారి 2005లో జూనియర్ స్థాయిలో ఉన్నపుడు లుసానే యంగ్ మాస్టర్స్ టోర్నీలో కార్ల్‌సన్‌పై హరికృష్ణ 56 ఎత్తుల్లో గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి గేముల్లో కార్ల్సన్ 10 గేముల్లో... హరికృష్ణ 2 గేముల్లో నెగ్గారు. మిగతా ఆరు గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ఆరో స్థానంలో... సెయింట్ లూయిస్ ఓపెన్ టోర్నీలో భాగంగా బ్లిట్జ్ విభాగంలో తొమ్మిది గేమ్‌లు ముగిశాక హరికృష్ణ 12.5 పాయింట్లతో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. బ్లిట్జ్‌లో తొమ్మిది గేమ్‌లు ఆడిన హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడాడు. కార్ల్సన్ (నార్వే), జియోంగ్ (అమెరికా) లపై నెగ్గిన హరికృష్ణ... డొమింగెజ్, సో వెస్లీ (అమెరికా), గ్రిస్చుక్ (రష్యా), అలీరెజా (ఇరా న్) చేతిలో ఓటమి చవిచూశాడు. నకముర (అమె రికా), అరోనియన్ (అర్మేనియా), నెపోమ్నియాచి (రష్యా)లతో గేమ్‌లను‘డ్రా’గా ముగించాడు. -
‘ఈడెన్‌లో గంట ఎందుకు కొట్టానో తెలీదు’
కోల్‌కతా: గత కొంతకాలంగా నగరంలోని ఈడెన్ గార్డెన్లో గంట కొట్టిన తర్వాత మ్యాచ్‌ను ఆరంభించడం జరుగుతుంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు తొలి రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్ గార్డెన్స్‌లో గంటను మోగించి మ్యాచ్ ప్రారంభానికి తెరతీశారు. కాగా, రెండో రోజు ఆటలో ఈడెన్‌లో బెల్‌ను చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్‌తో కలిసి మాగ్నస్ కార్ల్సన్(నార్వే) మోగించాడు. అయితే తాను బెల్ ఎందుకు కొట్టానో తెలీదు అంటున్నాడు కార్లసన్. వరల్డ్ చాంపియన్ అయిన కార్ల్సన్ మాట్లాడుతూ.. తాను ఒక తెలివి తక్కువ వాడిలా ఆనంద్ పక్కన నిలబడి మాత్రమే గంటను కొట్టాననన్నాడు. తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని ఈ సందర్భంగా కార్ల్సన్ తెలిపాడు. టాటా స్టీల్ ర్యాపిడ్-బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా నగరంలో ఉన్న కార్ల్సన్.. ఆనంద్‌తో కలిసి గంటను కొట్టేందుకు బీసీసీఐ ఆహ్వానించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ వచ్చి రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు గంటను మోగించారు. ‘ ఆనంద్ గంట కొట్టేటప్పుడు తెలివి తక్కువ వాడిలా పక్కన నిలబడ్డాను. అదే జరిగింది. నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలీదు. నేను క్రికెట్ గురించి ఇంకా నేర్చుకోవాలి. అసలు మ్యాచ్ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా. మ్యాచ్ అయిపోయిందా.. ఇంకా జరుగుతుందా అని అడిగా. మ్యాచ్ అయిపోయిందనే సమాధానం వచ్చింది. ఇక ప్రత్యర్థి జట్టుకు చాన్స్ లేదని ఆనంద్ చెప్పాడు’ అని కార్ల్సన్ పేర్కొన్నాడు. -
ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్
లండన్: వరుసగా నాలుగోసారి పురుషుల ప్రపంచ చెస్ చాంపియన్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో లండన్‌లో బుధవారం ముగిసిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ 9–6 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. తొలుత క్లాసిక్ పద్ధతిలో నిర్ణీత 12 గేమ్‌లు వరుసగా ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరూ 6–6తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి బుధవారం ర్యాపిడ్ పద్ధతిలో నాలుగు గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో కార్ల్సన్ 55 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 28 ఎత్తుల్లో, మూడో గేమ్‌లో 51 ఎత్తుల్లో గెలిచి 3–0తో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. కార్ల్సన్ 2013, 2014, 2016లలో కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
‘ర్యాపిడ్ కింగ్’ కార్ల్సన్
బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 15 రౌండ్లపాటు జరిగిన ఈ మెగా ఈవెంట్లో కార్ల్సన్ 11.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కార్ల్సన్ బెర్లిన్‌లోనూ అదే జోరును కనబరిచాడు. 10.5 పాయింట్లతో ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా), తెమౌర్ రద్జబోవ్ (అజర్బైజాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లోనూ కార్ల్సన్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటే ఏకకాలంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ఈ ఘనత సాధించిన తొలి చెస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు విశ్వనాథన్ ఆనంద్ (9.5 పాయింట్లు) 25వ స్థానంలో, విదిత్ సంతోషి గుజరాతి (9 పాయింట్లు) 26వ స్థానంలో, ఆదిబన్ (9 పాయింట్లు) 28వ స్థానంలో నిలిచారు. కృష్ణన్ శశికిరణ్ (8 పాయింట్లు), సేతురామన్ (7.5 పాయింట్లు), సూర్యశేఖర గంగూలీ (7 పాయింట్లు) వరుసగా 59వ, 86వ, 96వ ర్యాంక్‌లతో సరిపెట్టుకున్నారు. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్ల్సన్
సొచి(రష్యా): ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో కార్ల్సన్ విజేతగా నిలిచారు. 11వ గేమ్‌లో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌పై కార్ల్సన్ విజయం సాధించారు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ వరుసగా రెండవసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ** -
విశ్వనాథన్ ఆనంద్‌కు పరీక్ష!
సోచి (రష్యా): పాయింట్ తేడాతో వెనుకంజ... అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి ముందంజ... మరో ఓటమి ఎదురైతే ఆశలు ఆవిరి... ఈ నేపథ్యంలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొమ్మిదో గేమ్‌కు సిద్ధమవుతున్నాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గురువారం జరిగే ఈ గేమ్ ఆనంద్‌కు కీలకం. తెల్లపావులతో ఆడనున్న కార్ల్సన్ దూకుడుకు ఆనంద్ పగ్గాలు వేయకపోతే ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను కోలుకోవడం సులభం కాదు. -
ఆనంద్, కార్ల్సన్ నాలుగో గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భాగంగా భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ మధ్య బుధవారం జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. నల్లపావులతో ఆడగా, కార్ల్సన్ తెల్లపావులతో పోటీ పడ్డాడు. నాలుగో గేమ్ ఫలితం తేలకపోవడంతో ఇరువురు క్రీడాకారులు రెండేసి పాయింట్లతో సముజ్జీలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మొదటి గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో కార్ల్సన్, మూడో గేమ్ లో ఆనంద్ విజయం సాధించారు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటా
డిఫెండింగ్ చాంప్ కార్ల్సన్ అంగీకారం చెన్నై: ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ పాల్గొనే విషయంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నవంబర్ 7 నుంచి 28 వరకు సోచి వేదికగా జరిగే ఈ పోటీలో పాల్గొనేందుకు నార్వే ఆటగాడు కార్ల్సన్ అంగీకారం తెలిపాడు. గత కొన్ని వారాలుగా ఈ 23 ఏళ్ల చెస్ మేధావి ఇక్కడ ఆడతాడా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది. ‘సెయింట్ లూయిస్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందం కలిగించింది. ఈ టోర్నీ తర్వాత ఇలాగే మరోసారి ఇస్తాను’ అని వరల్డ్ చాంపియన్‌షిప్ గురించి తెలుపుతూ కార్ల్సన్ ట్వీట్ చేశాడు. చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి కార్ల్‌సన్‌కు మొదట ఆగస్టు 31 వరకు గడువునివ్వగా గతవారం ఫిడే దీన్ని ఈనెల 7 వరకు పొడిగించింది. ఉక్రెయిన్‌లో సంక్షోభ వాతావరణం, ప్రైజ్‌మనీని తగ్గించడం, ఈవెంట్ స్పాన్సర్ గురించి తెలియకపోవడం తదితర కారణాలతో కార్ల్సన్ ఈ టోర్నీలో పాల్గొనడంపై వెనుకాడాడు. ఒకేవేళ కార్ల్సన్... ఆనంద్‌తో బరిలోకి దిగకపోతే అతడి నుంచి నష్టపరిహారాన్ని రాబట్టడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నమెంట్లో ద్వితీయ స్థానం సాధించిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ సెర్గీ కర్జాకిన్‌ను ఆడించాలని భావించారు. ‘నవంబర్‌లో ఆనంద్‌తో ఆడేందుకు కార్ల్సన్ అంగీకరించాడు. అతడు తన ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు. ఇది సరైన నిర్ణయం’ అని కార్ల్సన్ మేనేజర్ ఎస్పెన్ అగ్డెస్టెయిన్ చెప్పారు. -
ప్రతీకారం తీర్చుకుంటా
కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌పై ఆనంద్ న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ కిరీటాన్ని గత ఏడాది మాగ్నస్ కార్ల్‌సెన్‌తో చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. ఈ ఏడాది అతనిపై ప్రతీకారం తీర్చుకుంటానని, తిరిగి ప్రపంచ టైటిల్‌ను దక్కించుకుంటానని చెబుతున్నాడు. కార్ల్సెన్ చేతిలో ఓటమి తరువాత కొన్నాళ్లు చెస్‌కు దూరంగా ఉన్న ఆనంద్ ఇటీవల క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో విజయం తనకు ఆక్సిజన్ వంటిదని, ఈ ఉత్సాహంతో కార్ల్‌సెన్‌తో నవంబర్‌లో జరగనున్న పోరుకు సిద్ధమవుతున్నానని ఆనంద్ తెలిపాడు. ‘క్యాండిడేట్స్ టోర్నీలో విజయం నాలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత కల్పించడంతోపాటు పోటీకి అవసరమైన ఆక్సిజన్‌ను ఇచ్చింది. క్రితం సారి చేసిన పొరపాట్లకు తావివ్వకుండా ఈసారి భిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతా’ అని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆనంద్ అన్నాడు. -
కార్ల్సన్తో ఆనంద్ గేమ్ ‘డ్రా’
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో సోమవారం జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఐదో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు ఆదివారం ఆలస్యంగా ముగిసిన నాలుగో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్కిదే తొలి విజయం కావడం విశేషం. తొలి రెండు గేముల్లో ఓటమిపాలైన ఆనంద్ మూడో గేమ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆనంద్ ఈ టోర్నీలో మూడున్నర పాయింట్లు సంపాదించాడు. -
ఆనంద్‌కు మూడో స్థానం
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్‌కు మరోసారి ఓటమి ఎదురైంది. జ్యూరిచ్ చెస్ క్లాసిక్‌లో భాగంగా గురువారం ఐదు రౌండ్ల పాటు జరిగిన బ్లిట్జ్ టోర్నీలో ఆనంద్ రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఆర్మేనియాకు చెందిన లెవోన్ అరోనియన్‌తో జరిగిన తొలి రౌండ్లో ఆనంద్ ఓడిపోగా, అనంతరం కరువానాను ఓడించాడు. ఆ తర్వాత నకమురాతో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకోగా, కార్ల్సన్తో 21వ ఎత్తు దగ్గర ఓడిపోయాడు. ఐదో రౌండ్లో గెల్ఫాండ్‌పై గెలిచాడు. అటు ప్రపంచ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన కార్ల్‌సన్‌కు తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. ఇటలీకి చెందిన కరువానా నల్ల పావులతో అతడిని మట్టికరిపించాడు. ఈ ఫలితాలతో క్లాసికల్ టోర్నీకి డ్రా కూడా ఖరారైంది. దీంట్లో ఆనంద్ మరోసారి తొలి రౌండ్లో ఆరోనియన్నే ఎదుర్కోనున్నాడు. చివరి రౌండ్లో కార్ల్సన్తో ఆడతాడు. ప్రపంచ అగ్రశ్రేణి పది మంది ఆటగాళ్లలో ఆరుగురి మధ్య ఐదు రౌండ్ల పాటు గేమ్స్ జరుగుతాయి. -
మాగ్నస్ కార్ల్సన్.. ప్రపంచ చెస్ చాంపియన్
2013- క్రీడలు రంజీల్లో ఎదురులేని ముంబై.. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి నూతన సారథి.. క్రికెట్‌కు సచిన్ గుడ్‌బై.. చెస్ ప్రపంచానికి కొత్త చాంపియన్.. క్రీడ రంగాన్ని ప్రభావితం చేసిన అంశాలు శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20)లో కలిపి 400 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు అందజేసే ‘గోల్డెన్ బాల్’ (ఫిఫా-బాలాన్ డిఓర్) పురస్కారాన్ని వరుసగా నాలుగో సంవత్సరం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గెల్చుకున్నాడు. రంజీట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను ముంబై జట్టు 40వసారి గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే మ్యాచ్‌లో ముంబై ఆటగాడు వసీమ్ జాఫర్ రంజీచరిత్రలో అత్యధిక శతకాలు (32) చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. భారత్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ క్రికెట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ (187 పరుగులు) సాధించాడు. తద్వారా తొలి మ్యాచ్‌లోనే అత్యంతవేగంగా (85 బంతుల్లో) శతకాన్ని సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెలుచుకుంది. 81 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. ద్వైపాక్షిక సిరీస్‌లో నాలు గు టెస్ట్ మ్యాచ్‌లను గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. పిన్నవయసులో ఈ ఘనత సాధించిన భారతీయ క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వంద టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ తరహా టెన్నిస్ లీగ్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు మహేశ్ భూపతి శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట నిర్వహించనున్న ఈ టోర్నీకి ప్రపంచ నంబర్‌వన్ నోవక్ జోకోవిచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. పారిస్‌లో 2014 చివర్లో ఈ లీగ్ జరగనుంది. కోల్‌కతాలో మే 26న జరిగిన ఐపీఎల్-6 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఫ్రెంచ్ఓపెన్: పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్) సాధించాడు. పురుషుల విభాగంలో ఒక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మహిళల సింగిల్స్‌విజేత: సెరెనా విలియమ్స్ (అమెరికా). ఈ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా గుర్తింపు పొందింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ రెండో సారి గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి జూన్ 28న ముగిసిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. వింబుల్డన్ 2013 విజేతలు: పురుషుల సింగిల్స్ విజేతగా ఆండీముర్రే (బ్రిటన్), మహిళల సింగిల్స్‌ను మరియన్ బర్తోలీ (ఫ్రాన్స్) కైవసం చేసుకున్నారు. జూలై 10-14 తేదీల్లో జరిగిన యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్టన్ ఎగర్ (98 పరుగులు) రికార్డు సృష్టించాడు. గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 46వ బెయిల్(స్విట్జర్లాండ్) ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో మాస్టర్స్, ర్యాపిడ్ కేటగిరీ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. చైనాలోని గ్వాంగ్జులో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. టీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రీడాకారుడిగా ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 63 బంతుల్లో 156 పరుగులు చేసి ఫించ్ ఈ ఘనత సాధించాడు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి విజేతగా హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది. ఒలింపిక్స్ క్రీడలు-2020ను నిర్వహించే అవకాశం జపాన్‌కు దక్కింది. 2013 యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ై టెటిల్నురఫెల్నాదల్ (స్పెయిన్) టైటిల్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట కైవసం చేసుకుంది. 2012లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందున క్రికెట్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత్ చవాన్లపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వీరు ఫిక్సింగ్‌కు పాల్పడినందున ఈశిక్ష అమలుచేసింది. వీరితోపాటు రాజస్థాన్ జట్టు మాజీ సభ్యుడు అమిత్‌సింగ్‌పై ఐదేళ్లు, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ త్రివేదిపై ఏడాదిపాటు నిషేధం విధించింది. జాక్వస్ రోగే స్థానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త అధ్యక్షుడిగా జర్మనీకి చెందిన థామస్ బాచ్ ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీనివాసన్ తిరిగి 2014 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్ పత్రిక ‘2013 స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ అవార్డు లభించింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్ చంద్ (క్రికెట్), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లి (క్రికెట్) ఎంపికయ్యారు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. చాంపియన్స్‌లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 52 బంతుల్లో 100 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితానికి గుడ్‌బై చెప్పాడు. ముంబైలో వెస్టిండీస్‌తో ఆడిన 200వ టెస్టు ఆయన కెరీర్లో చివరి మ్యాచ్. తన ఆటతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన సచిన్ క్రికెట్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తన 40వ ఏట క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే సచిన్‌కు భారతరత్న పురస్కారం లభించడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి పుణె వారియర్స్‌ను తొలగించారు. ఈ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అక్టోబర్ 26న ప్రకటించింది. ఓవరాల్‌గా ఐపీఎల్ నుంచి తప్పుకున్న మూడో జట్టుగా పుణె పేరు తెచ్చుకుంది. గతంలో వివిధ కారణాల రీత్యా కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్‌పై కూడా వేటు పడింది. దీంతో ఐపీఎల్లో ఎనిమిది జట్లే మిగిలాయి. భారత షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ షూటింగ్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. జర్మనీలో మ్యూనిచ్‌లో నవంబర్ 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2003లో అంజలి భగవత్, 2008లో గగన్ నారంగ్ తర్వాత ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారత వ్యక్తిగా హీనా ఘనత సాధించింది. జమైకా స్ప్రింట్ క్రీడాకారులు ఉసేన్ బోల్ట్, షెల్లీ అన్ 2013 సంవత్సరానికి ఐఏఏఎఫ్ పురుషుల, మహిళల వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ (22) కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. చెన్నైలో నవంబర్ 21న ముగిసిన పోటీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించాడు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరానికి ఐసీసీకి చెందిన ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ (2010) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత క్రికెటర్ ధోనియే. ప్రపంచకప్ మహిళల కబడ్డీ టైటిల్‌ను భారత్ జట్టు గెలుచుకుంది. జలంధర్‌లో డిసెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2013 సంవత్సరానికి అవార్డులను దుబాయ్‌లో ప్రకటించింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా (సర్ సోబర్‌స ట్రోఫీ) టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు మైకేల్ క్లార్క (ఆస్ట్రేలియా) ను వరించాయి. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: చటేశ్వర్ పుజారా (భారత్). వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: కుమార సంగక్కర (శ్రీ లంక), ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)లను ఎంపికచేసింది. ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డను ఎంఎస్ ధోనికి ప్రకటించింది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ను 2013 సంవత్సరానికి సి.కె.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారంతో బీసీసీఐ గౌరవించింది. భారత్ తరఫున 50 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎంఎస్ ధోని రికార్డు నెలకొల్పాడు. ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ సచిన్ టెండ్కూలర్‌ను ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ గౌరవంతో సత్కరించింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హెడ్ నోమిని జనెట్ యెలెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
ఆనంద్‌కు అచ్చిరాలేదు!
భారత చదరంగ రారాజుగా వెలుగొందున్న విశ్వనాథన్ ఆనంద్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని దక్కించుకున్న విషీకి 2013 చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలన్న అతడి ఆశలు సఫలం కాలేదు. సొంతగడ్డపై వరల్డ్ విజేతగా నిలవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. చెన్నైలో నవంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ చెస్ పోటీలో ఆనంద్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఒత్తిడి లోనయి తన వయసులో సగం వయసున్న కార్ల్సెన్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకున్నాడు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత పట్టుసడలించాడు. ఈ బిగ్ ఈవెంట్ కోసం బాగా సన్నద్ధమయినప్పటికీ కార్ల్సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థి ఆటకట్టించే స్థాయిలో ఎత్తులు వేయకపోవడంతో ఆనంద్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకోలేకపోయాడు. ఇక డిసెంబర్లో జరిగిన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లోనూ విశ్వనాథన్ ఉస్సూరనిపించాడు. వరల్డ్ టైటిల్ ఓటమి నుంచి తేరుకోక ముందే మరో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థుల ముందు అతడి ఎత్తులు పారకపోవడంతో క్వార్టర్ ఫైనల్స్‌లోనే టోర్ని నుంచి నిష్క్రమించాడు. మే నెలలో జరిగిన నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్లో కూడా ఆనంద్‌కు కలిసి రాలేదు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో తడబడి టైటిల్ కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2013 మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తొందరగా బయటపడాలని విశ్వానాథన్ ఆనంద్ తపిస్తున్నాడు. విజయం కోసం తహతహ లాడుతున్నాడు. గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. అయితే వయసు తనకు అడ్డంకి కాదంటున్నాడు 44 ఏళ్ల ఈ చదరంగ మేధావి. టాప్‌టెన్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ తాను ఆ దిశగా ఆలోచించడం లేదంటున్నాడు. అయితే 50 ఏళ్లు వచ్చే వరకు చెస్ ఆడనని స్పష్టం చేశాడు. ఎన్నేళ్లకు రిటైర్ అవుతానన్నది మాత్రం చెప్పలేదు. 2014 తనకు కలిసొస్తుందని విషీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మార్చిలో జరగనున్న ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచేందుకు సన్నద్దమవుతున్నాడు. -
కార్ల్సెన్కు రూ. 9.90 కోట్లు
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవం సోమవారం జరిగింది. కొత్త చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)కు రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీని అందజేశారు. కేవలం 10 నిమిషాలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత కార్ల్సెన్కు ఆలివ్ ఆకులతో కూడిన దండను మెడలో వేసి... బంగారు పూతతో కూడిన ట్రోఫీని, రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీ చెక్నూ అందజేశారు. అనంతరం రన్నరప్ విశ్వనాథన్ ఆనంద్‌కు వెండి పళ్లెంతోపాటు రూ. 6 కోట్ల 3 లక్షల ప్రైజ్‌మనీని బహూకరించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యూమ్జినవ్ వరుసగా కార్ల్సెన్, ఆనంద్‌లకు స్వర్ణ, రజత పతకాలను అందజేశారు. ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్ల్సెన్ 6.5-3.5 పాయింట్ల తేడాతో నెగ్గి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వైఫల్యం చెందినప్పటికీ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను తమ బ్రాండ్అంబాసిడర్గా కొనసాగిస్తామని ఐటీ శిక్షణ సంస్థ ‘నిట్’ స్పష్టం చేసింది. -
కార్ల్సెన్కు ప్రపంచ చెస్ టైటిల్
-
ఎండ్ గేమ్‌లోనే తేడా
కార్ల్సెన్ ప్రపంచ చెస్ టైటిల్ సాధించిన 16వ క్రీడాకారుడిగా అవతరించడంతో పాటు రెండో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కాస్పరోవ్ ముందున్నాడు. యాదృచ్చికమేమిటంటే 2009 లో కొంతకాలం కాస్పరోవ్ దగ్గర కార్ల్సెన్ శిక్షణ తీసుకోవడం. టోర్నీ మొత్తం కార్ల్సెన్ చాలా పటిష్టంగా ఆడాడు. ‘డ్రా’ చేసుకోవడం మినహా అతనిపై గెలవ డం అసాధ్యంగా కనిపించింది. ప్రత్యర్థి అడిగితే తప్ప అతను ఎప్పుడూ ‘డ్రా’ వైపు మొగ్గలేదు. ఈ లక్షణమే కార్ల్సెన్ను ప్రత్యర్థులందరిలో ప్రత్యేకంగా నిలిపింది. టోర్నీ ఆరంభంలో ఆనంద్ వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. దీంతో మూడో గేమ్‌లో కార్ల్సెన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే నాలుగో గేమ్ నుంచి కార్ల్సెన్ ఆధిపత్యం కొనసాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న నార్వే ప్లేయర్... విషీ తప్పు చేసే వరకు ఓపికగా వేచి చూశాడు. కార్ల్సెన్ ఎండ్ గేమ్ టెక్నిక్ అద్భుతం. ఇది 12వ చాంపియన్‌గా నిలిచిన కార్పోవ్‌ను పోలి ఉంది. కార్ల్సెన్ వయసు 22 ఏళ్లే. ప్రపంచ రెండో ర్యాంకర్‌కు ఇతని మధ్య 70 పాయింట్ల తేడా ఉంది. కాబట్టి ఈ స్థానంలో అతను సుదీర్ఘ కాలం కొనసాగుతాడని నా నమ్మకం. 70వ దశకంలో బాబీ ఫిషర్ (అమెరికా) తెచ్చినట్లుగా చెస్‌కు మరింత ఆకర్షణ తీసుకొస్తాడని భావిస్తున్నాను. ఇద్దరి వ్యక్తిత్వాలు భిన్నమైనా చెస్‌లో రాజీ పడకుండా ఆడే తీరు మాత్రం అమోఘం. ప్రత్యర్థులపై చూపించే ఈ స్పష్టమైన ఆధిపత్యమే చెస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడుతుంది. ఈ టోర్నీ కోసం ఆనంద్ చాలా బాగా సన్నద్ధమయ్యాడు. అయితే కార్ల్సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించే స్థాయిలో ఆటతీరు లేకపోవడం కూడా భారత ప్లేయర్‌ను దెబ్బతీసింది. 9వ గేమ్‌లో మాత్రమే కాస్త దూకుడుగా ఆడాడు. రెండు పాయింట్లు వెనుకబడ్డాననే ఆత్రుతతో కచ్చితంగా గెలవాల్సిన ఈ గేమ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆనంద్ ఓటమికి ఈ రెండు కారణాలు ప్రధానమైనవి. కొత్త చెస్ చాంపియన్‌గా అవతరించిన కార్ల్సెన్కు నా శుభాకాంక్షలు. అలాగే మార్చిలో ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచి ప్రపంచ టైటిల్ కోసం కార్ల్‌సెన్‌తో ఆనంద్ మళ్లీ పోటీకి దిగాలని కోరుకుంటున్నాను. -
ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన నిజాలు
-
తండ్రి దిద్దిన చాంపియన్
పిల్లలకి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే... వారు జీవితంలో అత్యున్నతస్థాయికి చేరుకుంటారని తాజాగా మాగ్నస్ కార్ల్సెన్ నిరూపించాడు. తమ అబ్బాయి చెస్ మాత్రమే ఆడాలని ఏనాడూ కార్ల్సెన్ తల్లిదండ్రులు సిగ్రున్, హెన్రిక్ అల్బెర్ట్ ఒత్తిడి చేయలేదు. కుమారుడిలో ఉన్న అపార ప్రతిభను, సహజ నైపుణ్యాన్ని గుర్తించి తమవంతుగా ప్రోత్సహించారు. కార్ల్సెన్ విజయ నేపథ్యం గురించి తండ్రి హెన్రిక్ మాటల్లో... ‘మేము కొంతకాలం ఫిన్లాండ్లో ఉన్నాం. అక్కడ కార్ల్సెన్కు మిత్రులెవరూ లేకపోవడంతో లెగో (విడివిడిగా ఉండే బొమ్మలను ఒక క్రమంలో పేర్చి ఒక రూపం ఇవ్వడం) గేమ్స్ ఆడేవాడు. నాలుగేళ్ల వయస్సులోనే లెగో ద్వారా అతను కనీసం ఆరేడు గంటలు ఏకాగ్రతతో, ఎలాంటి అలసట లేకుండా ఉండేవాడని గ్రహించాను. ఈ లక్షణాలతో అతను చెస్ ప్లేయర్ కాగలడనే నిర్ణయానికి వచ్చాను. అతనికి చెస్ ఆటను పరిచయం చేయడంతోపాటు అపుడపుడూ గేమ్‌లు ఆడేవాడిని. కార్ల్సెన్కు ఏడేళ్ల వయసులో మా పెద్దమ్మాయి కూడా చెస్ ఆడటం ప్రారంభించింది. అక్క ఆటను చూసిన కార్ల్సెన్ ఆమెను ఓడించాలనే లక్ష్యంతో చెస్‌ను సీరియస్‌గా తీసుకొని తీవ్ర సాధన చేయడం ప్రారంభించాడు. మూడు నెలల తర్వాత అక్కను ఓడించాడు. నార్వే జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తొలిసారి 11వ స్థానం పొందాడు. కార్ల్సెన్కు పదేళ్లు వచ్చేసరికి గంటలకొద్దీ చెస్ బోర్డుకే అంకితమైపోయాడు. స్కూల్ హోంవర్క్ కూడా మేము గుర్తుచేసేవాళ్లం. 13 ఏళ్లకు గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించాడు. 16 ఏళ్లు వచ్చాక కూడా ఉన్నతవిద్య అభ్యసిస్తే బాగుంటుందని సూచించేవాళ్లం. కానీ చెస్ తప్ప మరో లోకం తెలియకుండా కార్ల్సెన్ ముందుకు దూసుకెళ్లాడు. మేము కూడా మా అబ్బాయి ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. ఆ ఫలితం మీరూ చూస్తున్నారు’. కుటుంబం అండ...: కార్ల్సెన్ కెరీర్‌కు మొదటి నుంచి తండ్రి అండగా ఉన్నారు. తన ఆర్థిక వ్యవహారాలు, స్పాన్సర్‌షిప్‌లు అన్నీ పర్యవేక్షిస్తారు. కార్ల్సెన్ అసలు వీటి గురించి పట్టించుకోడు. కేవలం గేమ్ విషయంలో మాత్రమే బయటివారి సలహాలు వింటాడు. తనకు ఒక అక్క, ఇద్దరు చెల్లెల్లు. చెస్ చాంపియన్‌షిప్ కోసం వీళ్లంతా కూడా చెన్నై వచ్చారు. - సాక్షి క్రీడావిభాగం -
ఆనంద్‌కు మళ్లీ అవకాశం
ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు వచ్చే ఏడాది మళ్లీ ఈ కిరీటాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ నవంబరు 5 నుంచి 25 వరకు (వేదిక ఎంపిక చేయలేదు) జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హోదాలో మాగ్నస్ కార్ల్సెన్ ఉంటాడు. ‘క్యాండిడేట్స్ టోర్నమెంట్’ ద్వారా కార్ల్సెన్ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 30 వరకు ఖాంటీ మాన్సిస్క్ (రష్యా)లో జరుగుతుంది. మొత్తం 8 మంది బరిలోకి దిగుతారు. విజేతగా నిలిచిన వారు కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడతారు. ఎవరు ఎలా అర్హత పొందారంటే... 2013 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ టోర్నీలో ఆడతాడు. 2013 ప్రపంచ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ‘ఫిడే’ 2012-2013 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షకిర్యార్ మమెద్యారోవ్ (అజర్బైజాన్) కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. 2013 ప్రపంచ కప్‌లో, గ్రాండ్‌ప్రి సిరీస్‌లో అత్యధిక రేటింగ్ కలిగిన ఇద్దరు క్రీడాకారులు లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా ‘వైల్డ్ కార్డు’ పొందిన స్విద్లెర్ (రష్యా) కూడా టోర్నమెంట్లో పోటీపడతాడు. - సాక్షి క్రీడావిభాగం -
కార్ల్సెన్కు ప్రపంచ చెస్ టైటిల్
ప్రపంచ చెస్‌లో కొత్త శకం మొదలైంది! ఇన్నాళ్లూ చెస్‌కు పర్యాయపదంలా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ స్థానంలో ఎట్టకేలకు కొత్త రాజు వచ్చాడు. 64 గడుల సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తిగా 22 ఏళ్ల నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ పుట్టుకొచ్చాడు. భిన్నమైన శైలి, ఆటలో దూకుడు, పదునైన వ్యూహాలు అంతుకుమించిన ఎత్తుగడలతో 43 ఏళ్ల అపర మేధావి ఆనంద్‌ను అలవోకగా కట్టడి చేసి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చెన్నై: కుర్రాడి దూకుడుతనం ముందు అపారమైన అనుభవం మూగబోయింది. ఒకటి, రెండు ఎత్తులకే చిత్తవుతాడనుకున్న యువకుడు 64 గడుల రారాజుగా అవతరించాడు. అసాధారణ నైపుణ్యానికి తోడు అద్భుతమైన ఎత్తుగడతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ ప్రపంచ చెస్ కొత్త చాంపియన్‌గా అవిర్భవించాడు. శుక్రవారం ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య జరిగిన పదో గేమ్ 65 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో రెండు మిగిలి ఉండగానే... 6.5 పాయింట్లతో కార్ల్సెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితం వచ్చినందున ఆఖరి రెండు గేమ్‌లు జరగవు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన విషీ... ఈ టోర్నీలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన అనుభవమంత వయసులేని కుర్రాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆనంద్... ప్రత్యర్థి వ్యూహాలకు బిత్తరపోయాడు. 4 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్‌లో డ్రా చేసుకునేందుకు చాలా అవకాశాలు వచ్చినా నార్వే కుర్రాడు మాత్రం విజయం కోసమే ప్రయత్నించాడు. చివరకు ఆనంద్ డ్రాకు ప్రతిపాదించడంతో తను కూడా ఆమోదం తెలిపాడు. ఇప్పటికి ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్.. సొంతగడ్డపై ఓడటం ఎదురుదెబ్బే. ఈసారి టోర్నీలో ఆనంద్ ఒక్క గేమ్ కూడా గెలవకపోవడం గమనార్హం. ఆరంభం నుంచే పట్టు ఓపెనింగ్‌తో గేమ్‌పై పట్టు బిగించడం... మిడిల్ గేమ్‌లో ఆధిపత్యం కనబర్చడం... అటాకింగ్‌తో ఎండ్‌గేమ్‌ను ఫినిష్ చేయడం... టోర్నీ మొత్తం ఇదే ఆటతీరుతో చెలరేగిన కార్ల్సెన్ పదో గేమ్‌లోనూ ఊపును కొనసాగించాడు. గేమ్ ప్రధాన లైన్లోకి తీసుకెళ్లినా.. ఏదో ఓ చోట కచ్చితమైన మలుపుతో తన వైపు తిప్పుకున్నాడు. తెల్లపావులతో కార్ల్సెన్ మాస్కో వేరియేషన్‌తో వస్తే... ఆనంద్ నల్లపావులతో సిసిలియన్ ఓపెనింగ్‌ను ఎంచుకున్నాడు. మూడో ఎత్తు వద్ద ప్రత్యర్థి నైట్ కోసం కార్ల్సెన్ లైట్ బిషప్తో చెక్ పెట్టడంతో బోర్డుపై మార్కోజి బ్లైండ్ గేమ్ కనిపించింది. 14వ ఎత్తు వద్ద లైట్ బిషప్‌ను మళ్లీ రంగంలోకి దించడంతో గేమ్‌లో కొన్ని పావులు చేతులు మారాయి. 21 వ ఎత్తు తర్వాత ఎత్తులు పునరావృతం అవుతాయని ఊహించినా ఇరువురు ఆటగాళ్లు దాన్ని కాకుండా చూశారు. 28వ ఎత్తు వద్ద కింగ్‌ను ఐదో ర్యాంక్‌కు జరుపుతూ కార్ల్సెన్ తన ప్రణాళికను అమలు చేశాడు. కానీ విషీ... కొన్ని చిన్న ఎత్తులతో కోలుకున్నాడు. ఫలితంగా నైట్, పాన్లతో ఎండ్‌గేమ్ మొదలైంది. తొలిసారి టైమ్ కంట్రోలు వచ్చేసరికి గేమ్‌లో 40 ఎత్తులు పూర్తయ్యాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆనంద్ గేమ్‌లో పూర్తిగా లీనంకాగా.. కార్ల్సెన్ కూడా ఫలితం కోసమే ప్రయత్నించాడు. అవకాశం కోసం ఓపికగా వేచి చూసిన అతను 46వ ఎత్తు వద్ద గేమ్‌ను మలుపు తిప్పాడు. సుదీర్ఘంగా ఆలోచించి ఓ పాన్‌ను త్యాగం చేశాడు. తర్వాతి కొన్ని ఎత్తులకే ఆనంద్ అన్ని పావులను కోల్పోయాడు. దీంతో ఇద్దరూ న్యూ క్వీన్స్‌ను ప్రమోట్ చేశారు. ఆనంద్‌కు ఎక్స్ట్రా నైట్ ఉంటే... కార్ల్సెన్ ఎక్స్ట్రా క్వీన్‌తో పాటు కొన్ని ప్రమాదకరమైన పాన్లు అందుబాటులో ఉంచుకున్నాడు. తర్వాత భారత ప్లేయర్ కొన్ని కచ్చితమైన ఎత్తులతో అలరించినా... చివరకు డ్రాతో సరిపెట్టుకున్నాడు. నార్వేలో ‘సీన్’మారింది ‘సాక్షి’కి ప్రత్యేకం చెస్‌కు శారీరక శ్రమ అవసరం లేదు... అసలు ఇది క్రీడే కాదు... దీనిని క్రీడల జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదు... నార్వేలో జాతీయ క్రీడా సమాఖ్య (నార్వే స్పోర్ట్స్ కమ్యూనిటీ) అభిప్రాయం ఇది. ఏడాదిన్నర క్రితం నార్వే చెస్ సంఘం... తమను గుర్తించాలంటూ చేసుకున్న దరఖాస్తు ఇప్పటికీ జాతీయ సమాఖ్య దగ్గర పెండింగ్‌లో ఉంది. నార్వేలో చెస్‌కు ఉండే ఆదరణ, ఆట పట్ల ఉండే అభిప్రాయం ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాంటి దేశం నుంచి వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చెస్ రారాజుగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. నిజానికి కార్ల్సెన్ నంబర్‌వన్ ఆటగాడైనా... ఆ దేశంలో చాలామందికి అతనెవరో తెలియదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆరో గేమ్ తర్వాత కార్ల్సెన్ 4-2 ఆధిక్యంలోకి రావడంతో ఒక్కసారిగా నార్వే అంతా ఆశ్చర్యపోయింది. తమ కుర్రాడు ప్రపంచ చాంపియన్ అవుతున్నాడనే సంబరం మొదలైంది. ఇక గెలిచాక సంబరాల సంగతి చెప్పక్కర్లేదు.సాధారణంగా నార్వేలో రెండే క్రీడలను పట్టించుకుంటారు. అందులో మొదటిది స్కీయింగ్. ఇందులో ప్రపంచ చాంపియన్స్ అంతా ఈ దేశం నుంచే ఉన్నారు. రెండో ఆట ఫుట్‌బాల్. కానీ ఇది అక్కడ క్లబ్ స్థాయికే పరిమితమైంది. జాతీయ జట్టు పెద్దగా ఆడేదీ, అద్భుతాలు చేసిందీ లేదు. అందుకే స్కీయింగ్ క్రీడాకారులే సూపర్‌స్టార్స్. ఇప్పుడు కార్ల్సెన్ నార్వేలో చెస్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎప్పుడైతే ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలైందో... నార్వేలో వేడి పెరిగింది. కార్ల్సెన్ స్కీయింగ్ స్టార్స్‌తో పాటు... దేశంలో టాప్-3 స్పోర్ట్స్ పర్సన్స్‌లో ఒకడిగా వెలుగులోకి వచ్చాడు. చెస్ గురించి ప్రతిరోజూ పత్రికల్లో మొదటి పేజీలో వార్తలు మొదలయ్యాయి. లోకల్ ట్రెయిన్స్, బస్‌లలో కార్ల్సెన్ ఫొటోలు, పోస్టర్లు వచ్చాయి. పలు కంపెనీలు కార్ల్సెన్కు అభినందనలు తెలుపుతూ తనని సూపర్ హీరోని చేశాయి. ఎంటర్కార్డ్ అనే క్రెడిట్‌కార్డ్ కంపెనీ ఇన్నాళ్లూ అనేకమంది క్రీడాకారులకు స్పాన్సర్ చేసినా చెస్‌ను పట్టించుకోలేదు. అలాంటి కంపెనీ ఇప్పుడు చెస్‌ను ప్రమోట్ చేయడానికి నడుం బిగించింది. అన్నింటికంటే చెప్పుకోదగ్గ విషయం... రాజధాని ఓస్లోకు సమీపంలోని డ్రమ్మెన్ ప్రాంతంలో చెస్‌కు సంబంధించిన బోర్డులు, పుస్తకాలు అమ్మే షాప్ ఉంది. దేశం మొత్తం మీద ఇదొక్కటే చెస్ షాప్. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలయ్యాక... కేవలం ఒక్క రోజులోనే ఈ షాప్‌లో స్టాక్ అంతా అయిపోవడం విశేషం. (ఇన్పుట్స్: ఓస్లోలో పని చేస్తున్న తెలుగువాసి మల్లేశ్వరరావు నందా) ‘కింగ్’ కార్ల్సెన్ పూర్తి పేరు: స్వెన్ మాగ్నస్ కార్ల్సెన్ పుట్టిన తేదీ: 30 నవంబరు, 1990 జన్మస్థలం: టాన్స్బర్గ్, వెస్ట్‌ఫోల్డ్ (నార్వే) టైటిల్: గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ ప్రస్తుత ‘ఫిడే’ రేటింగ్: 2870 పాయింట్లు అత్యుత్తమ రేటింగ్: 2872 పాయింట్లు (ఫిబ్రవరి, 2013లో) ప్రస్తుత ర్యాంక్: 1 అత్యుత్తమ ర్యాంక్: 1 (జనవరి, 2010లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2011 జులై నుంచి ఇప్పటివరకు నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు) ఘనతలు 2004లో ఏప్రిల్ 26న కార్ల్సెన్ 13 ఏళ్ల 148 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకున్నాడు. చెస్ చరిత్రలో పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. 2010లో జనవరి 1న కార్ల్సెన్ 19 ఏళ్ల 32 రోజుల వయస్సులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతను చెస్ చరిత్రలో టాప్ ర్యాంక్ దక్కించుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది జనవరిలో కార్ల్సెన్ 2861 ఎలో రేటింగ్‌తో చెస్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ తర్వాత ఫిబ్రవరిలో 2872 పాయింట్లతో తన ఎలో రేటింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. 2009లో బ్లిట్జ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 2 ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో పిన్న వయస్కుడిగా కార్ల్సెన్ గుర్తింపు పొందాడు. 1985లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... కార్ల్సెన్ 22 ఏళ్ల 11 నెలల 22 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. 16 ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన 16వ క్రీడాకారుడిగా కార్ల్సెన్ నిలిచాడు. రూ. 9.58 కోట్లు విజేతగా నిలిచిన కార్ల్సెన్కు రూ. 9 కోట్ల 58 లక్షలు.... రన్నరప్ ఆనంద్‌కు రూ. 4 కోట్ల 42 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ‘‘మ్యాచ్ ఆద్యంతం నాపై కార్ల్సెన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఈ పోటీ మొత్తంలో కీలక మలుపు ఐదో గేమ్. ఆ గేమ్‌లో ఓడిపోవడంతో కోలుకోలేకపోయాను. నా ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత ఈ పోటీలో నా ఆటతీరుపై సమీక్ష చేసుకుంటాను. వచ్చే మార్చిలో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతాను.’’ - ఆనంద్ -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్లసన్
అనుకున్నంతా అయ్యింది. ఐదు సార్లు వరుసగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి తలవంచాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్‌ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు. ఒకప్పుడు చెస్ అంటే రష్యన్లదేనని భావన ఉండేది. అప్పట్లో గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పోవ్ దిగ్గజాల్లా ఉండి, వాళ్లే చెస్ కిరీటాలు సాధిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో మన దేశం నుంచి వెళ్లిన విశ్వనాథన్ ఆనంద్ వాళ్లిద్దరినీ మట్టికరిపించి, ప్రపంచ చెస్ విజేతగా నిలిచాడు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు. తన ఆటతీరు పట్ల చాలా అసంతృప్తి చెందానని ఓటమి తర్వాత విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఆనంద్ ఎప్పటికీ చాలా గొప్ప ఆటగాడని, తనకు ఆయనంటే ఎంతో గౌరవమని కార్ల్సన్ అన్నాడు. అలాగే ఆయనపై విజయం సాధించడమంటే చాలా గౌరవప్రదంగాను, సంతోషంగాను భావిస్తున్నట్లు తెలిపాడు. -
28వ ఎత్తుతో భారీ తప్పిదం
చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఆనంద్ 1.డీ4తో ఓపెనింగ్‌ను మార్చాడు. దీంతో గేమ్ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. అతని బాడీ లాంగ్వేజిలోనూ అది స్పష్టంగా కనిపించింది. తన ఎత్తులన్నీ చాలా నమ్మకంతో వేగంగా వేశాడు. మరోవైపు కార్ల్సెన్ తన ప్రతి ఎత్తుకూ చాలా సమయం తీసుకున్నాడు. ఈ గేమ్‌లో 23వ ఎత్తు చాలా క్లిష్టమైంది. ఈ స్థితిలో తెల్లపావులతో ఆశ్చర్యకరమైన ఎత్తులు వేసే అవకాశం ఉండటంతో ఆనంద్ చాలా సమయాన్ని తీసుకున్నాడు. క్యూఎఫ్4తో ఆశ్చర్యకరమైన ఎత్తూ వేశాడు. ఇది మంచి ఆలోచన. తను వేసిన 28.ఎన్ఎఫ్1 ఎత్తుకు కార్ల్సెన్ ఇచ్చిన ప్రతి స్పందనను గుర్తించలేకపోవడం ఆనంద్ దురదృష్టం. 28వ ఎత్తు తర్వాత క్యూఈ1తో కార్ల్సెన్ గేమ్‌ను ముగించాడు. దీని తర్వాత తెల్లపావులతో ఆడేవారికి ఎక్కువ అవకాశం లేకుండా బ్లాక్స్‌తో కట్టిపడేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆనంద్ గేమ్ నుంచి తప్పుకున్నాడు. 9వ గేమ్‌లో విషీ గెలిచి ఉంటే టోర్నీలో అతని ఆశలు సజీవంగా ఉండేవి. 23వ ఎత్తు వద్ద సుదీర్ఘంగా ఆలోచించడం, 28వ ఎత్తు వద్ద తప్పిదం చేయడంతో పూర్తి పాయింట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. 9 గేమ్‌ల తర్వాత కార్ల్సెన్ 6-3 ఆధిక్యంలో ఉన్నాడు. ఇక మూడు గేమ్‌లు మిగిలి ఉన్నా.. మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కాబట్టి ఆనంద్‌కు అవకాశాలు తక్కువేనని స్పష్టమవుతోంది. మూడు గేమ్‌ల్లో కార్ల్సెన్ రెండుసార్లు తెల్లపావులతో ఆడతాడు. టైటిల్ గెలిచేందుకు అతను కేవలం అర పాయింట్ దూరంలోనే ఉన్నాడు. -
ఇక లాంఛనమే!
అత్యంత కీలకమైన విజయం కావాల్సిన దశలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ చేసిన తప్పిదం... ప్రపంచ టైటిల్‌ను దూరం చేయబోతోంది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న కార్ల్సెన్ కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు మరో అడుగు ముందుకేశాడు. ఇద్దరి మధ్య గురువారం జరిగిన 9వ గేమ్‌లో ఆనంద్ ఓడిపోయాడు. దీంతో విషీ టైటిల్ ఆశలు మరింత సన్నగిల్లగా... కార్ల్సెన్ కేవలం అర పాయింట్ దూరంలో నిలిచాడు. శుక్రవారం10వ గేమ్‌ను డ్రా చేసుకున్నా... కార్ల్సెన్ నేడే కొత్త చాంపియన్‌గా అవతరిస్తాడు. చెన్నై: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పూర్తిగా నిరాశపర్చాడు. కార్ల్సెన్ పెంచిన ఒత్తిడిని తట్టుకోలేక చేసిన చిన్న తప్పిదంతో పెద్ద మూల్యమే చెల్లించుకున్నాడు. దీంతో గురువారం కార్ల్‌సెన్‌తో జరిగిన 9వ గేమ్‌లో ఆనంద్ 28 ఎత్తుల వద్ద ఓడిపోయాడు. ఈ గేమ్ తర్వాత 6-3 ఆధిక్యంలో ఉన్న కార్ల్సెన్ టైటిల్‌కు కేవలం అర పాయింట్ దూరంలో నిలవగా, విషీ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. మిగిలిన మూడు గేమ్‌ల్లో కనీసం ఒక్క డ్రా చేసుకున్నా నార్వే ప్లేయర్ కొత్త చాంపియన్‌గా అవతరిస్తాడు. మరోవైపు టోర్నీలో నిలవాలంటే ఆనంద్ మిగిలిన మూడు గేమ్‌ల్లోనూ నెగ్గాలి. ఆరంభంలో ఆనంద్ మెరుగ్గా ఆడినా.. ఎండ్ గేమ్‌లో కాస్త పట్టు కోల్పోయాడు. విషీ తెల్లపావులతో సెమాసిచ్ ఓపెనింగ్‌ను ఎంచుకోగా... కార్ల్సెన్ నల్లపావులతో నిమ్జో ఇండియన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ప్రారంభించాడు. ఇంతకుముందు చెస్ చాంపియన్‌షిప్‌లో క్రామ్నిక్‌తో; తర్వాత వాంగ్ హో (చైనా)తో జరిగిన గేమ్‌ల్లో ఇదే వ్యూహాన్ని భారత ప్లేయర్ అమలుపర్చాడు. మిడిల్ గేమ్ ఆరంభంలో ప్రధాన లైన్‌కు కట్టుబడి ఆటడంతో కార్ల్సెన్ కాస్త నిరాశకు లోనైనట్లు కనిపించాడు. దీంతో ఆనంద్ కింగ్సైడ్ అటాక్‌ను మొదలుపెట్టినా... నార్వే ప్లేయర్ మాత్రం బలవంతంగా ఫ్లాంక్ మీద ఆడాల్సి వచ్చింది. గేమ్ మధ్యలో కార్ల్సెన్ ప్రమాదంలో పడినట్లే కనిపించినా... తన అద్భుతమైన ఎత్తుగడలతో మళ్లీ పుంజుకున్నాడు. ఎండ్‌గేమ్ చివర్లో కూడా అతని క్వీన్, ఓ బిషప్ బోర్డు ప్రారంభ గడుల్లోనే ఉండటం విశేషం. అందుబాటులో ఉన్న వనరులను అతను సమర్థంగా వినియోగించుకుంటూ గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 25 నిమిషాల పాటు ఆలోచించి వేసిన 22వ ఎత్తు ఫలితాన్ని ఇవ్వకపోవడం... ‘చెక్’ను ఎదుర్కొనేందుకు కార్ల్సెన్ కింగ్‌తో సిద్ధంగా ఉండటంతో ఆనంద్ కాస్త సందిగ్ధంలో పడ్డాడు. గేమ్‌లో అటాకింగ్నే కొనసాగించాలని నిర్ణయించుకోవడానికి 23వ ఎత్తు వద్ద విషీ మరో 40 నిమిషాల పాటు ఆలోచించాడు. అప్పటికీ గేమ్ తన అదుపులో ఉన్నా... ఫలితం రాబట్టడానికే ఎక్కువగా ప్రయత్నించాడు. ఈ దశలో కార్ల్సెన్ అద్భుతమైన ఎత్తుగడలతో ముందుకెళ్లాడు. దీంతో ఒత్తిడికి లోనైన ఆనంద్ 28వ ఎత్తు వద్ద తప్పిదం చేశాడు. ప్రత్యర్థి క్వీన్‌కు చెక్ పెట్టే దిశగా తన నైట్‌ను ముందుకు తెచ్చాడు. దీంతో కార్ల్సెన్ చకచకా పావులు కదిపి భారత ఆటగాడిని కట్టిపడేశాడు. ‘గేమ్‌లో నా శక్తి మేరకు పోరాడా. తెల్లపావులతో విజయం అందుకోవాలని భావించినా సాధ్యం కాలేదు. జరిగిన తప్పిదాన్ని నేను గుర్తించలేకపోయా.40 నిమిషాల సుదీర్ఘ ఆలోచన తర్వాత వేసిన ఎత్తుకు ప్రత్యర్థి తక్షణమే స్పందించాడు. చివరి మూడు గేమ్‌ల్లో పోరాడేందుకు ప్రయత్నిస్తా. అయితే పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ గేమ్‌లో ఓపెనింగ్‌ను మార్చినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు ’ -ఆనంద్ ‘ఓపెనింగ్ నుంచీ పదునైన ఎత్తుగడ లభించింది. పాన్లను ఉపయోగించడంలో ఏదో మిస్సయినట్లు అనిపించింది. ఇది చాలా కఠినమైన గేమ్. వీలైనంత మంచి వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించా’ -కార్ల్సెన్ -
ఓపెనింగ్‌ను మార్చాలి
పెంటేల హరికృష్ణ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు 8 గేమ్‌లు ముగిసినా.. ఆనంద్‌కు కీలకమైన విజయం మాత్రం లభించలేదు. రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న కార్ల్సెన్ టోర్నీలో మెరుగైన స్థితిలో ఉన్నాడు. అయితే 5, 6 గేమ్‌ల్లో ఓటమి తర్వాత చివరి రెండు గేమ్‌లు డ్రా చేసుకోవడం ఆనంద్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇక మిగిలింది 4 గేమ్‌లే. కాబట్టి 9వ గేమ్‌లో తెల్లపావులతో ఆడే ఆనంద్ చాలా రిస్క్ తీసుకోవాలి. బెర్లిన్ డిఫెన్స్‌లోకి వెళ్లకుండా ఓపెనింగ్ వ్యూహాన్ని పూర్తిగా మారుస్తాడని నా నమ్మకం. గత గేమ్‌ల్లో కార్ల్సెన్... బెర్లిన్ డిఫెన్స్‌ను పునరావృతం చేసినా మంచి ఫలితాల్నిచ్చింది. 7, 8 గేమ్‌లు చాలా బోరింగ్‌గా డ్రా అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనంద్ మరో డ్రా చేసుకోవడం సరైంది కాదు. 9వ గేమ్‌లో అతను కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఓపెనింగ్ దశ ముగిసిన తర్వాత ఆనంద్ అంత నమ్మకంగా కనిపించలేదు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ గేమ్‌లో పుంజుకోవాలంటే తనపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి. -
రిస్క్ తీసుకోవాల్సిందే!
ఎనిమిదో గేమ్ కూడా డ్రా అయినా... నా ఉద్దేశంలో ఇది చాలా బోరింగ్. ఆనంద్ ఆశ్చర్యకరంగా నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను మొదలుపెట్టాడు. చివరకు 33 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రాధాన్యమిచ్చారు. గేమ్ డ్రా అవుతుందని ప్రారంభలోనే స్పష్టమైంది. ప్రతి ఎత్తు వద్ద పావులు చేతులు మారాయి. చివరకు ఒక్కొక్కరి దగ్గర కింగ్, ఏడు పాన్లు మిగిలాయి. కాబట్టి గేమ్ ముందుకెళ్లినా ఎలాంటి పురోగతి కనిపించదు. కార్ల్సెన్ పరంగా ఆలోచిస్తే ఇది మంచి ఫలితమే. ఎందుకంటే అతను ఇప్పటికే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా... మరో నాలుగు గేమ్‌లు ఆడాల్సి ఉంది. ఈ గేమ్‌లో ఆనంద్ ఓపెనింగ్‌కు నేను ఆశ్చర్యపోయా. గెలిచేందుకు కావాల్సిన అవకాశాలను ఈ ఓపెనింగ్ సమకూరుస్తుంది. బెర్లిన్ డిఫెన్స్ పటిష్టమైన ఓపెనింగ్. ఒకవేళ తెల్లపావులతో ఆడితే అది రక్షణాత్మకం అవుతుంది. అప్పుడు డ్రా చేసుకోవడం తప్ప నల్లపావులతో ఇంకేమీ చేయలేం. ప్రస్తుతం కార్ల్సెన్ 5-3తో ఆధిక్యంలో ఉన్నాడు. తొమ్మిదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో విషీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. తెల్లపావులతో మరో డ్రా చేసుకోవడం సరైందికాదు. కార్ల్సెన్ను ఓడించాలంటే దూకుడుగా ఆడటంతో పాటు రిస్క్ కూడా తీసుకోవాల్సిందే. నేడు విశ్రాంతి దినం. తర్వాతి గేమ్‌లో ఆనంద్ వ్యూహాన్ని మార్చి గెలుపే లక్ష్యంగా ఆడతాడని నా నమ్మకం. -
ఏడో గేమ్‌లో డ్రాతో సరిపెట్టుకున్నఆనంద్
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఏడో గేమ్ ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధిస్తాడని భావించిన సగటు ప్రేక్షకుడికి మాత్రం ఆనంద్ నిరాశనే మిగిల్చాడు. ఏడో గేమ్‌లో తెల్ల పావులతో మాగ్నస్ కార్ల్సెన్ పోటీపడిన ఈ భారత యోధుడు ఎఫెన్స్ తో ఆటను ఆరంభించాడు. కాగా వరుస రెండు మ్యాచ్ లో విజయం సాధించిన కార్ల్సెన్ దూకుడుగానే ఆడటంతో ఆనంద్ కాస్త నెమ్మదించాడు. చివరకు ఇరువురూ డ్రాకు అంగీకరించారు. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం జరిగిన ఈ పోరు పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్న ఈ పోటీలో కార్ల్సెన్ రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి తొలిసారి విశ్వవిజేత అయ్యేందుకు పటిష్ట పునాదిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్ల్సెన్ 2-5 ఆధిక్యంలోకి దూసుకువెళ్లాడు. -
ఇక చావో రేవో
ప్రపంచ చాంపియన్‌షిప్ రెండో అర్ధభాగంలోకి కార్ల్సెన్ 4-2 ఆధిక్యంతో వెళుతున్నాడు. ఆనంద్ వరుసగా రెండు గేమ్‌లు ఓడిపోతాడని ఊహించలేదు. రెండు గేమ్‌ల్లోనూ ‘డ్రా’లకు అవకాశం ఉన్నా ఒత్తిడిలో పోగొట్టుకున్నాడు. ఒకరోజు విశ్రాంతి లభించింది కాబట్టి... ఆనంద్, తన సెకండ్స్ కలిసి ఈ ఓడిన రెండు గేమ్‌లను విశ్లేషిస్తారు. ముఖ్యంగా ఎండ్ గేమ్, మిడిల్ గేమ్‌ల మీద ఇక దృష్టి ఎక్కువగా పెట్టాలి. గత రెండు గేమ్‌ల్లోనూ కార్ల్సెన్ మిడిల్ గేమ్‌లో బాగా ఆడాడు. మరోసారి తెల్లపావులతో ఆడబోతున్న ఆనంద్‌కు ఇది చాలా కీలకమైన గేమ్. ఇక నుంచి ఆనంద్ మిడిల్ గేమ్‌లో అన్క్లియర్ పొజిషన్స్‌తో ఆడాలి. ఆనంద్ తన వ్యూహాన్ని మారుస్తాడా? లేక అలాగే కొనసాగిస్తాడా అనేది చూడాలి. మరోవైపు కార్ల్సెన్ వరుసగా రెండు విజయాలతో ఆనందంగా ఉండి ఉంటాడు. ‘డ్రా’లు కావలసిన గేమ్‌లను గెలవడం ఆటగాడి విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంతో కార్ల్సెన్ సరిపెట్టుకోడు. ఓడిపోయే రిస్క్ లేకుండా చూసుకుంటూ విజయాల కోసం ఆడతాడు. ఒకవేళ కార్ల్సెన్ గనక డిఫెన్సివ్‌గా ఆడితే, అప్పుడు ఆనంద్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఇక ఆనంద్‌కు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. -
60వ ఎత్తు దెబ్బ తీసింది
ఆరో గేమ్‌లో ఓడ టం ఆనంద్‌కు మరో బాధాకరమైన అంశం. ఎండ్‌గేమ్ ను రూక్, పాన్‌తో ఆడటం వల్ల ఓ దశలో గేమ్ డ్రా దిశగా వెళ్లింది. అయితే ఆనంద్ 60వ ఎత్తు ఆర్ఏ4 వేసి తప్పిదం చేశాడు. దీనికి బదులుగా బీ4ను వేస్తే గేమ్ డ్రా అయ్యేది. ఇప్పుడు కార్ల్సెన్ 4-2 ఆధిక్యంలో ఉన్నాడు. ఓపెనింగ్‌లో విషీ దూకుడైన ఎత్తులతో అలరించాడు. నైట్‌ను త్యాగం చేస్తూ ఈ గేమ్‌కు కూడా బాగానే సిద్ధమయ్యాడు. అయితే కార్ల్సెన్ మాత్రం ఆనంద్‌కు అనుమానం రాకుండా భిన్నమైన ఎత్తుగడతో బరిలోకి దిగాడు. మిడిల్ గేమ్‌లో ఆనంద్ కాస్త సానుకూల దృక్పథంతో ఆడాడు. రూక్ ఎండ్ గేమ్‌లో బలవంతంగా పాన్‌ను త్యాగం చేశాడు. గేమ్ ముందుకెళ్లే కొద్దీ సాంకేతికంగా గేమ్‌ను డ్రా చేసుకోవడానికి భారత గ్రాండ్‌మాస్టర్ మరో పాన్‌ను చేజార్చుకున్నాడు. ఈ అశ్చర్యకరమైన ఎత్తును కార్ల్సెన్ మిస్సయ్యాడు. అయితే 60వ ఎత్తులో ఆనంద్ చేసిన తప్పిదంతో మలుపు తీసుకుంది. -
ఆరో గేమ్‌లోనూ విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరోసారి ఓటమి పాలైయ్యాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లో భాగంగా శనివారం మాగ్నస్ కార్ల్సెన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆనంద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నాడు. ఫలితంగా టోర్నీలో క్లార్సెన్ 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తనదైన ఆటతీరతో ఆకట్టకున్న నార్వే గ్రాండ్ మాస్టర్ విజయపరంపర కొనసాగిస్తూ ఆనంద్‌కు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్ ల్లో నాలుగు గేమ్‌లు డ్రాగా ముగిసాయి. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటంతో ఆనంద్ విజయం సాధించినా చాంపియన్‌షిప్ ట్రోఫీని క్లార్సెన్కు అప్పగించక తప్పదు. శుక్రవారం జరిగిన ఐదో గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ 58 ఎత్తుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
తప్పిదాలకు మూల్యం
ఎట్టకేలకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ఫలితం వచ్చింది. అందరూ ఆశించినట్టుగా ఆనంద్‌కు బదులు... తెల్ల పావులతో ఆడిన మాగ్నస్ కార్ల్సెన్ ఐదో గేమ్‌లో విజయాన్ని అందుకున్నాడు. క్రితం గేమ్‌ల మాదిరిగా కాకుండా ఈసారి కార్ల్సెన్ సీ4 ఓపెనింగ్‌తో గేమ్‌ను ఆరంభించాడు. ఆనంద్ ఈ6తో జవాబు ఇచ్చి స్లావ్ డిఫెన్స్‌లోని మార్షల్ గాంబిట్ వ్యూహానికి సిద్ధమై వచ్చినట్లు సంకేతం ఇచ్చాడు. మరోవైపు కార్ల్సెన్ అంతుబట్టని వ్యూహంతో ఆనంద్‌ను తికమకపెట్టాడు. ఆరంభంలో ఇద్దరూ కావాల్సినంత సమయం తీసుకున్నారు. 13వ ఎత్తులో ఆనంద్ తన ఒంటెను సీ7లోకి పంపిచడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆనంద్ రక్షణాత్మకంగా ఆడతాడని ఊహించలేదు. ఆనంద్ చేసిన ఈ తప్పిదంతో కార్ల్సెన్ గేమ్‌పై పట్టు సంపాదించుకున్నాడు. మిడిల్ గేమ్‌లో ఆనంద్ దూకుడు పెంచి గేమ్‌ను ‘డ్రా’దిశగా సాగేందుకు ప్రయత్నించాడు. కార్ల్సెన్ మాత్రం తడబాటుకు లోనుకాకుండా తనకున్న అవకాశాలను సజీవంగా పెట్టుకొని ముందుకుసాగాడు. ఆనంద్ 45వ ఎత్తులో తన ఏనుగుని సీ1లోకి పంపించి కోలుకోలేని పొరపాటు చేశాడు. సీ1లోకి బదులు ఏ1లోకి ఏనుగుని పంపించి ఉంటే ఆనంద్ ‘డ్రా’తో గట్టెక్కేవాడు. ఆనంద్ చేసిన ఈ తప్పిదాన్ని కార్ల్సెన్ తనకు అనుకూలంగా మలచుకొని భారత గ్రాండ్‌మాస్టర్ ఆట కట్టించి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఏడు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో ఆనంద్ ఆరో గేమ్‌లో, ఏడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్నాడు. ఆరో గేమ్‌లో ఆనంద్ దూకుడుగా ఆడి విజయంపై దృష్టి పెట్టాలి. -
ఇరువురూ సమానమే
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రెండో గేమ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి వేసిన ఆశ్చర్యకరమైన ఓపెనింగ్ ఎత్తుగడను తన అనుభవాన్నంతా రంగరించి సమర్థంగా తిప్పికొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు కార్ల్సెన్ (నార్వే) వేగంగా భిన్నమైన ఎత్తులు వేసినా... విషీ మాత్రం నెమ్మదిగా ‘చెక్’ పెట్టాడు. చివరి దాకా ప్రతి ఎత్తుకు గేమ్‌ను మారుస్తూ పోయిన కార్ల్సెన్కు అవకాశం లేకపోవడంతో డ్రా వైపు మొగ్గాడు. దీంతో చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరువురు ఆటగాళ్ల మధ్య ఆదివారం జరిగిన రెండో గేమ్ 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. స్కోరు 1-1తో సమమైంది. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం మూడో గేమ్ జరుగుతుంది. నల్లపావులతో బరిలోకి దిగిన కార్ల్సెన్ ఓపెనింగ్ ఎత్తుగడతోనే ఆనంద్‌ను దాదాపుగా కట్టిపడేశాడు. దీని నుంచి తేరుకునేందుకు సమయం తీసుకున్న విషీ... గేమ్ క్లిష్టమైన కారోకాన్ డిఫెన్స్‌లోకి వెళ్లకుండా బయటకు తీసుకొచ్చాడు. గతంలో డింగ్ లారెన్ (చైనా)తో ఆడిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. సంక్లిష్టమైన ఎత్తులను అవలంభించేందుకు కొంత సమయం తీసుకున్నా... రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించాడు. నల్లపావులతో ఆడిన కార్ల్సెన్ సంక్లిష్టమైన ఎత్తులతో భిన్నంగా ఆడాడు. 17 ఎత్తుల వరకు ఇద్దరు ఆటగాళ్లు గేమ్‌ను సాదాసీదాగా కొనసాగించారు. క్వీన్‌ను మార్చుకుంటూ ఆనంద్ వేసిన 18వ ఎత్తుతో గేమ్ మలుపు తీసుకుంది. అప్పటికప్పుడు ఇలాంటి కొత్త ఆలోచన చేసిన భారత ఆటగాడికి గేమ్‌లో ముందుకెళ్లేందుకు అవకాశం లభించినా... ఎత్తులు మాత్రం పునరావృతమయ్యాయి. 21వ ఎత్తు వరకు ఇది కొనసాగింది. మరో నాలుగు ఎత్తుల తర్వాత కార్ల్సెన్ కూడా ఎత్తులను పునరావృతం చేసే అవకాశం ఉండటంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. గేమ్ మొత్తంలో కార్ల్సెన్ 25 నిమిషాలు తీసుకుంటే ఆనంద్ 42 నిమిషాల పాటు ఆలోచించాడు. 12వ ఎత్తు తర్వాత కార్ల్సెన్ కీలకమైన ఎత్తు వేశాడు. గతంలో దీన్ని పరిశీలించా. ఇది క్లిష్టమైన ఎత్తు. ఇలాంటిది ఎదురవుతుందని ఊహించలేదు. కార్ల్సెన్ వేసిన ఓపెనింగ్ ఎత్తుతోనే గేమ్‌లో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దీంతో గుడ్డిగా ఆడకుండా కాస్త పటిష్టమైన ఎత్తుతో ముందుకెళ్లా. నేను తీసుకున్న మెరుగైన నిర్ణయం ఇది. - ఆనంద్ ఓపెనింగ్ ఎత్తుగడ గురించి ఎక్కువగా మాట్లాడను. అయితే 18వ ఎత్తు తర్వాత క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. దీని తర్వాత విషీ చాలా ప్రయత్నించాడు. కానీ బ్లాక్‌తో ఆడినందుకు బయటపడ్డా. ఈ టోర్నీలో నేను ఎలా ఆడాలనుకున్నానో రెండో గేమ్ దానికి దగ్గరగా ఉంది. ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న వారిలో ఆనంద్ చాలా బలమైన ప్రత్యర్థి. - కార్ల్సెన్ రెండో గేమ్ మెరుగ్గా సాగింది ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య గంటలోనే ముగిసిన రెండో గేమ్ 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఎత్తుల పరంగా చూస్తే తొలి గేమ్ కంటే ఈ గేమ్ చాలా మెరుగైంది. అయితే 30 నిమిషాలు ముందుగానే గేమ్‌ను ముగించారు. ఈ గేమ్‌లో ఎవరు పైచేయి సాధించారనే అంశాన్ని అంచనా వేసే ముందు గేమ్‌ను పరిశీలిద్దాం. చెస్ టర్మ్స్ ప్రకారం కింగ్పాన్తో ఆనంద్ ఒకటవ ఎత్తుగా ఈ4 వేశాడు. దీనికి సమాధానంగా కార్ల్సెన్ సీ6తో ముందుకొచ్చాడు. ఇది కారోకాన్ డిఫెన్స్ అని తెలిసిపోయింది. చాలా మంది టాప్ ఆటగాళ్లు ఉపయోగించే పటిష్టమైన ఓపెనింగ్ ఇది. అయితే ఆనంద్ వేసిన ఈ4కు వ్యతిరేకంగా కార్ల్సెన్ చాలా రకాల ఓపెనింగ్స్‌ను ఎంచుకోవచ్చు. సాధారణంగా సీ5 లేదా ఈ5తో ఆడొచ్చు. కాబట్టి కార్ల్సెన్ కారోకాన్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం ఆనంద్‌కు ఆశ్చర్యకరమైన అంశమే. ఇంటి దగ్గర గేమ్ గురించి విశ్లేషించుకున్న అంశాలను ఆటగాళ్లు బాగా గుర్తుంచుకుంటారు కాబట్టి ఓపెనింగ్ ఎత్తులు వేగంగా వేస్తారు. అయితే ఈ గేమ్‌లో క్లిష్టమైన దశ ఏంటంటే ఆనంద్ ఎన్ఈ4తో 15వ ఎత్తు వేయడం. చాలా పావులను మార్చుకుంటూ (ఎక్ఛేంజ్) వరుసగా ఎత్తులు వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్వీన్స్‌ను ఎక్ఛేంజ్ చేసుకున్న తర్వాత గేమ్ సమానం కావడంతో 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. కానీ ఏ ఆటగాడికీ లాభం లేకపోయింది. ఈ గేమ్ కోసం ఆనంద్ బాగా సిద్ధమై ఉంటాడు. కానీ ఇలాంటి భిన్నమైన ఎత్తులను ఊహించి ఉండడు. ఆనంద్ ఎన్ఈ4తో వేసిన 15వ ఎత్తు రక్షణాత్మకం. ఇది ప్రాక్టికల్‌గా చాలా మంచి నిర్ణయం. ఈ రెండు గేమ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందో విశ్లేషిద్దాం. ఒకటో గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ కేవలం 16 ఎత్తుల్లోనే సులువైన డ్రా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో కార్ల్సెన్ ఆశ్చర్యకరమైన ఓపెనింగ్‌తో టాప్ ఆటగాడిగా మారిపోయాడు. అయితే రక్షణాత్మక ఎత్తుగడతో ఆనంద్ ఈ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నా ఉద్దేశం ప్రకారం ఈ గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం ఆశ్చర్యపర్చుకున్నారు. ఇద్దరూ ప్రాక్టికల్ ప్లేయర్లే. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా డ్రా చేసుకున్నారు. ఇందులో ఒకరిపై మరొకరికి మానసికంగా ఎలాంటి లాభం చేకూరిందో ఇప్పటికీ స్పష్టం కాలేదు. నేడు విశ్రాంతి దినం. ఆటగాళ్లు మంచి విశ్రాంతి తీసుకొని మూడో గేమ్‌నైనా రసవత్తరంగా మార్చుతారని ఆశిద్దాం! -
సాదాసీదా ఆరంభం
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ తొలి సమరాన్ని తనదైన శైలిలో ఆరంభించాడు. నిర్దిష్ట సమయంలో సరైన ఎత్తులు వేస్తూ వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ను (నార్వే) నిలువరించాడు. అనుభవానికి, దూకుడుకు మధ్య జరిగిన ఈ సమరంలో ఫలితం వస్తుందని ఊహించినా... చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య శనివారం జరిగిన తొలి గేమ్ సాదా సీదాగా 16 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. నల్లపావులతో గేమ్ ఆడిన ఆనంద్... ఓపెనింగ్‌తోనే తన సత్తాను చూపెట్టాడు. ఈ టోర్నీ కోసం తాను ఎంతలా సిద్ధమయ్యాడో చెస్ ప్రపంచానికి తెలియజేశాడు. తెల్లపావులతో ‘రెటీ’ ఓపెనింగ్‌తో బరిలోకి దిగిన కార్ల్సెన్కు విషీ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఓపెనింగ్ కోసం నార్వే గ్రాండ్‌మాస్టర్ చాలా సమయం తీసుకున్నా గేమ్ మధ్యలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అతను కొన్నిసార్లు పేలవమైన ఎత్తులు వేశాడు. ఆనంద్ వేసిన 10వ ఎత్తు తర్వాత కార్ల్సెన్కు గేమ్‌లో ముందుకు సాగేందుకు సరైన అవకాశం లభించలేదు. దీంతో బలవంతంగా కొన్ని ఎత్తులను పునరావృతం చేశాడు. ఆనంద్ నైట్‌తో; కార్ల్సెన్ క్వీన్‌తో వేసిన ఎత్తులు మూడుసార్లు పునరావృతం అయ్యాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రావైపు మొగ్గారు. గ్రున్ఫీల్డ్ వ్యూహానికి దగ్గరగా ఎత్తులు వేసిన ఆనంద్ లాక్డ్ స్ట్రక్చర్‌కు వెళ్లలేదు. భారత ఆటగాడు కోరుకున్నట్లే 9వ ఎత్తు తర్వాత గేమ్‌లో అసమతుల్యత వచ్చింది. దీంతో 10వ ఎత్తు తర్వాత కార్ల్సెన్కు అవకాశం లేకపోయింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో ఆనంద్.. తెల్లపావులతో ఆడతాడు. ఆనంద్‌ది అరుదైన ఎత్తు ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య జరిగిన తొలి గేమ్ కేవలం 16 ఎత్తుల్లోనే ఎందుకు డ్రా అయిందని చాలామంది అడుగుతున్నారు. మ్యాచ్ సమయంలో కనిపించినట్లు కార్ల్సెన్ ఆందోళనలో ఉన్నాడా? అని అడుగుతున్నారు. అయితే గేమ్‌ను పూర్తిగా పరిశీలించకుండా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆటగాళ్ల మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ముందుగా గేమ్‌లో ఏం జరిగిందో చూద్దాం. తర్వాత ఒక్కో ఆటగాడి మనస్తత్వాన్ని పరిశీలిద్దాం. కార్ల్సెన్ ఎన్ఎఫ్3తో గేమ్‌ను మొదలుపెట్టాడు. దీనికి సమాధానంగా ఆనంద్ డి5 ఎత్తు వేశాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. గత టోర్నీల్లో విషీ... నిమ్జో ఇండియన్ వ్యూహాలకు దగ్గరగా ఆడేవారు. అయితే డి5 ఎత్తుతో ఈ గేమ్‌లో అతను ఓపెనింగ్‌ను మార్చాడు. రెటీ ఓపెనింగ్‌తో కొనసాగిన గేమ్ తర్వాత ప్రఖ్యాత ఓపెనింగ్ అయిన నెగ్రూన్ఫీల్డ్ డిఫెన్స్‌లోకి మారిపోయింది. ఇలా మారేటప్పుడు ప్రధానమైన దశ ఏంటంటే... గేమ్‌లో అధ్వాన్న స్థితికి పడిపోకుండా ప్రతి ఆటగాడు తనకున్న ఇతర అవకాశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కార్ల్సెన్ 9వ ఎత్తు వేసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు సవాళ్ల కోసం సిద్ధమయ్యారు. నల్లపావులతో ఆనంద్ 9వ ఎత్తు తర్వాత డీసీ4తో ముందుకొచ్చాడు. చాలా అరుదుగా ఇలా ఆడతారు. టాప్‌లో ఉన్న ఏ ఒక్క ఆటగాడు కూడా ఇలాంటి ఎత్తు వేయరు. దీంతో కార్ల్సెన్ లోతైన ఆలోచనలో పడిపోయాడు. ఈ సమయంలో అతను నెర్వస్‌గా ఉన్నాడా అంటే? నా సమాధానం ‘కాదు’ అనే వస్తుంది. ఆనంద్ చేసిన కొత్త ఆలోచనకు కార్ల్సెన్ టీమ్ సరైన రీతిలో సిద్ధంకాలేదు. కాబట్టి ఎలాంటి ఎత్తును ఎంచుకోవాలన్న అంశంపై అతను కసరత్తులు మొదలుపెట్టాడు. 10వ ఎత్తు ఎన్బీ6, తర్వాత ఎన్సీ4... ఈ రెండు ఆనంద్ వేసిన ఆసక్తికరమైన ఎత్తులు. ఆనంద్ నైట్ సీ4 మీద ఉండటంతో బిషప్‌ను బీ2 మీద వదిలేసిన కార్ల్సెన్ బీసీ1తో 12వ ఎత్తును కొనసాగించాడు. అయితే దీన్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే బ్లాక్‌తో ఆడేవాళ్లకు డబుల్ బిషప్‌లు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. 13వ ఎత్తు క్యూబీ3 తర్వాత గేమ్ ‘డ్రా’ అవుతుందని స్పష్టంగా అర్థమైంది. కార్ల్సెన్ సుదీర్ఘంగా ఆలోచించడానికి ఇది కూడా ఓ కారణం. గేమ్‌ను కొనసాగించేందుకు కొన్ని దారులను వెతికాడు. గేమ్‌లో ముందుకుపోయి రిస్క్ తీసుకోవడం కంటే ప్రాక్టికల్‌గా ‘డ్రా’వైపు మొగ్గాడు. తన అంచనాలకు అనుగుణంగా గేమ్ జరగకపోవడంతో తెల్లపావులతో కార్ల్సెన్... ఆనంద్‌పై స్థిరంగా ఒత్తిడి కలిగించలేకపోయాడు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఫలితం అతనికి పెద్దగా సంతృప్తినివ్వకపోవచ్చు. మరోవైపు ఈ ఫలితంతో విషీ ఆనందపడి ఉంటాడు. నల్లపావులతో గేమ్‌ను డ్రా చేసుకోవడం సానుకూల అంశం. ఓపెనింగ్‌లో ఆనంద్‌దే పైచేయి అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. 2 లేదా 4 గేమ్‌లు జరిగితే ప్రత్యర్థి బలహీనతలు, వ్యూహాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటగాళ్లు పరస్పరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేడు ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. తొలి గేమ్ మాదిరిగానే కార్ల్సెన్పై ఒత్తిడి పెంచి ఫలితాన్ని సాధిస్తాడని ఆశిద్దాం! -
భారత్‌కు చేరిన ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్
చెన్నై: దేశమంతా సచిన్ టెండూల్కర్ ఫేర్వెల్ టెస్టు సిరీస్ ‘మేనియా’తో ఊగిపోతున్న సమయంలో.... చెస్‌లో అత్యున్నత సమరం కూడా మన దేశంలోనే జరుగబోతోంది. ఈనెల 9 నుంచి 28 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు చెన్నై వేదిక కానుంది. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య 12 రౌండ్ల పాటు ఈ పోరు జరుగనుంది. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ టోర్నీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తూ రికార్డు స్థాయిలో రూ.29 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పోరు కోసం సోమవారం కార్ల్సన్ చెన్నై చేరుకున్నాడు. అతడికి ఫిడే ఉపాధ్యక్షుడు డీవీ సుందర్, ఏఐసీఎఫ్ అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్, ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వాహక కార్యదర్శి వి.హరిహరన్ స్వాగతం పలికారు. 2012 మాస్కోలో జరిగిన చివరి చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆనంద్ 6-6, 2.5-1.5 (టైబ్రేక్) తేడాతో గెల్ఫాండ్ను ఓడించాడు. అయితే ఇప్పటిదాకా కార్ల్సన్, ఆనంద్ పలు గేమ్స్‌లో ముఖాముఖి తలపడినా నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడలేదు. 2005 నుంచి ఇప్పటిదాకా 62 గేమ్స్‌లో ఆనంద్ 15 సార్లు, కార్ల్సన్ 11 సార్లు గెలవగా 36 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. క్లాసికల్ చెస్‌లో ఆడిన 29 గేమ్‌ల్లో ఆనంద్ ఆరు సార్లు, కార్ల్సన్ మూడు సార్లు నెగ్గారు. 7న టోర్నీ ఆరంభం ఈనెల 7న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత టోర్నీని ఆరంభిస్తారు. 9న తొలి గేమ్ జరుగుతుంది. ఒక్కో ఆటగాడు ఆరు సార్లు తెల్ల పావులు, ఆరు సార్లు నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ గేమ్ ఆరు గంటలపాటు ఉంటుంది. ఏ ఆటగాడైతే ముందుగా 6.5 పాయింట్లు సాధిస్తే అతడినే విజేతగా ప్రకటిస్తారు. ఓవరాల్ ప్రైజ్ మనీ రూ.14 కోట్లు కాగా టైటిల్ నెగ్గిన ఆటగాడికి 60 శాతం, రన్నరప్‌కు 40 శాతం సొమ్ము దక్కుతుంది. టోర్నీ వేదిక హోటల్ హయత్ రెజెన్సీకి ఆనంద్‌తో పాటు అతడి భార్య, కుమారుడు శుక్రవారమే చేరుకున్నారు. అయితే కార్ల్సన్ మాత్రం బయటకు వెల్లడించని రిసార్ట్‌లో బస చేస్తాడని సమాచారమున్నా అధికారికరంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫిడే ఉపాధ్యక్షుడు సుందర్ చెప్పారు. తమకు తెలిసి అతడు కూడా హయత్‌లోనే ఉండే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కార్ల్సన్ వెంట అతడి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు, సహాయక సిబ్బంది వచ్చారు. ఈ టోర్నీ కారణంగా హోటళ్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు